ఫోన్ చేసినవారి పేరు కాల్ అందుకున్న చోటే ఆగిపోవాలి.
ఒక రాత్రి, ఒక గొడవ, ఒక ఫోన్ కాల్
రాత్రి పదకొండు దాటింది. ఒక కాలనీలో పక్కింటి వాళ్లకు, వీధి చివరి వాళ్లకు మధ్య గొడవ. మాటలు తిట్లుగా, తిట్లు తోపులాటగా మారుతున్నాయి. ఎవరో కర్ర తెచ్చారు. ఇలాగే సాగితే ఎవరో ఒకరు ఆసుపత్రికి వెళ్తారని ఒక పౌరుడికి అనిపించింది. అతను డయల్ 100కు ఫోన్ చేశాడు.
కాల్ తీసుకున్నవారు అతని పేరు, ప్రాంతం అడిగారు. కాసేపటికి పోలీస్‌స్టేషన్ నుంచి ఫోన్ — “సమస్యేంటి సార్?” చెప్పాడు. తర్వాత గస్తీ కానిస్టేబుల్ నుంచి ఫోన్ — “సమస్యేంటి సార్?” మూడోసారి చెప్పాడు.
కానిస్టేబుల్ వచ్చాడు. గుంపులో ఒకతన్ని పేరు పెట్టి పిలిచాడు: “రవీ… ఇంకా ఆపలేదా? ఇదిగో కంప్లెయింట్ కూడా వచ్చింది. అందరూ ఇళ్లకు వెళ్లండి…” గొడవ ఆగింది.
కానీ ఆ రవి అదే వీధిలో ఉంటాడు. అతనికి ఆ కానిస్టేబుల్ తెలుసు. కంప్లెయింట్ వచ్చిందన్న ఒక్క మాటతో ఫోన్ చేసేది ఎవరో కనుక్కోవడానికి ఎక్కువ సేపు పట్టలేదు. తెల్లారి ఆ పౌరుడి ఇంటి ముందుకొచ్చాడు: “ఏంటి సార్… మా గొడవతో మీకేం పని? పోలీసులకు ఫోన్ చేస్తారా?”
ఆ పౌరుడు ఇంకోసారి 100కు ఫోన్ చేస్తాడా?
ఇది పొరపాటు కాదు, పద్ధతే అలా ఉంది
ఇక్కడ ఆ పౌరుడి పేరు, నెంబర్ కాల్‌సెంటర్ దగ్గర ఆగలేదు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. అక్కడి నుంచి కానిస్టేబుల్ సొంత ఫోన్‌కు వెళ్లింది. ఇది ఎవరో చేసిన పొరపాటు కాదు. పాత డయల్ 100లో పద్ధతే ఇది — కాల్‌టేకర్ బాధితుడి వివరాలు రాసుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు పంపడం, బ్లూకోల్ట్స్ సిబ్బంది బాధితుడికి ఫోన్ చేసి రావడం. తెలంగాణ డీజీపీ స్వయంగా చెప్పిన మాట ఇది.
వీధి గొడవ ఒక ఉదాహరణ మాత్రమే. ఆ పౌరుడు ఫోన్ చేసింది డ్రగ్స్ దందా గురించైతే? అమ్మాయిని వెంబడిస్తున్న గుంపు గురించో, గృహహింసో, భూకబ్జా గూండాలో, అక్రమ ఆయుధాలు, తీవ్రవాదుల గురించైతే?..
ఫిర్యాదు చేసింది వీడే అని నిందితుడికి తెలిస్తే — పోలీసులకు సాయం చేసినందుకు ఆ మనిషి, అతని కుటుంబం ప్రమాదంలో పడతారు. పోలీసులకు చెబితే మనమే చిక్కుల్లో పడతామనే మాట ఊళ్లో పాకితే, ఇక పోలీసుల కళ్లు, చెవులు మూసుకుపోతాయి.
అమెరికాలో 911 ఏం చేస్తుంది?

911కు ఫోన్ చేస్తే అక్కడ కూడా కాలర్ నెంబర్ దాగదు. కాల్ అందుకోగానే కాలర్ చిరునామా, ఫోన్ నెంబర్ ఆపరేటర్ తెర మీద కనిపిస్తాయి. అవి నేరుగా CAD (Computer Aided Dispatch) అనే కేంద్ర కంప్యూటర్ వ్యవస్థలోకి వెళ్తాయి. న్యూయార్క్ పోలీసుల శిక్షణ పత్రం ప్రకారం ఆ వ్యవస్థ కాలర్ పేరు, నెంబర్‌తో పాటు ఆపరేటర్‌తో జరిగిన మాటలన్నీ నమోదు చేస్తుంది. పెట్రోల్ కారు కంప్యూటర్‌కు సాధారణంగా చోటు, ఘటన రకం, కావాల్సిన కొన్ని వివరాలు మాత్రమే వెళ్తాయి.
మరి తేడా ఎక్కడ? టెక్నాలజీలో కాదు. విధానంలో.. ఆ నెంబర్ మనుషుల నోటి ద్వారా ప్రయాణించదు — కంప్యూటర్ ద్వారానే. ఎవరూ రాసుకోరు, వాట్సాప్‌లో పంపరు, సొంత ఫోన్ నుంచి కాల్ చేయరు. ఎవరు ఎప్పుడు ఏం చూశారో రికార్డు అవుతుంది. చాలా రాష్ట్రాల్లో ఇది చట్టం కూడా — ఫ్లోరిడాలో 911కు ఫోన్ చేసిన వ్యక్తి పేరు, చిరునామా, నెంబర్ ఆ సంస్థ దగ్గరే గోప్యంగా ఉండాలి; అధికారి చూడగలడు, బయటివాడికి చెబితే తప్పు చేసినట్టే. లండన్ పోలీసుల మార్గదర్శకాల్లో ఇంకో మాట ఉంది: పేరు చెప్పకుండా ఫోన్ చేయడం కాలర్ హక్కు; ఆపరేటర్ దాన్ని ముందుగా ఆఫర్ చేయనక్కర్లేదు, కాలర్ అడిగితే ఇవ్వాలి.
ఇప్పుడు అమెరికా ఈ వ్యవస్థను Next Generation 911 పేరుతో పూర్తిగా ఇంటర్నెట్ మీదకు మారుస్తోంది — వాయిస్‌తో పాటు టెక్స్ట్, వీడియో, ఫోన్ లొకేషన్ అన్నీ ఒకే డిజిటల్ రికార్డుగా. దాంతో పాటే “ఈ డేటా ఎవరు చూడవచ్చు” అనే వివరాలు కూడా. సమాచారం చేరుకునే చోట, దాన్ని కాపాడే నిబంధనలు కూడా అంతే దృఢంగా ఉండాలి.
మన డయల్ 100 ఇప్పుడు ఎక్కడుంది?

ఒక శుభవార్త — మన వ్యవస్థ పాత 100 స్థాయిలో లేదు. తెలంగాణ దశాబ్దాల నాటి 100, 101, 108లకు వీడ్కోలు చెప్పి, 112 అనే ఒకే నెంబర్ కింద 18 అత్యవసర సేవలను తెచ్చింది. అలవాటుగా 100 నొక్కినా కాల్ చేరేది అదే బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కే.
2026 ఆగస్టులో ప్రారంభించిన కొత్త TG-ERSS 112 వ్యవస్థ రోజుకు దాదాపు 18 వేల అత్యవసర కాల్స్‌ను నిర్వహిస్తున్నట్లు అధికారిక ప్రారంభ కార్యక్రమంపై వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. వాటిలో సుమారు 7,500 ఘటనలను క్షేత్రస్థాయి బృందాలకు పంపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,860 పెట్రోలింగ్ వాహనాలను డిజిటల్‌గా అనుసంధానించారు. దగ్గరలో అందుబాటులో ఉన్న వాహనాన్ని వ్యవస్థే గుర్తించి సూచించే సదుపాయం కూడా ఉంది.
ఏఐ ద్వారా కాల్ తీవ్రతను గుర్తించడం, అనవసర కాల్స్‌ను వడపోయడం, కాలర్ ప్రదేశాన్ని గుర్తించడం, మాటలను అక్షరాలుగా మార్చడం, దగ్గరలోని వాహనాన్ని గుర్తించడం వంటి కొత్త సదుపాయాలు వచ్చాయి.
ఇంత ఉన్నా.. ఒక సన్నివేశం ఊహించండి. గస్తీ అధికారి సంఘటన జరిగిన చోటుకు వెళ్తున్నాడు. చిరునామా స్పష్టంగా లేదు. ఫిర్యాదు చేసిన వ్యక్తితో మాట్లాడాలి. తప్పకుండా మాట్లాడాలి — కానీ అందుకు అతని అసలు మొబైల్ నెంబర్ అధికారి చేతికి వెళ్లాలా?
క్యాబ్ బుక్ చేస్తే డ్రైవర్ మనతో మాట్లాడతాడు, మన నెంబర్ అతనికి కనిపించదు. స్విగ్గీ, జొమాటో, అమెజాన్ డెలివరీ వాళ్లూ మనతో మాట్లాడతారు, మన నెంబర్ చూడకుండానే. కాల్ కంపెనీ కంప్యూటర్ ద్వారా వెళ్తుంది; డెలివరీ అయ్యాక ఆ లింక్ కనబడదు. ఒక ఫుడ్ ఆర్డర్‌కు ఉన్న ఈ గోప్యత, పోలీసులకు డ్రగ్స్ దందా గురించి చెప్పిన మనిషికి వర్తించడం లేదు.
ఇలా పనిచేయాలి

112 వ్యవస్థలో గోప్యత సులభమే. గస్తీ అధికారి తెర మీద “కాలర్‌తో మాట్లాడు” అనే ఒక బటన్ ఉంటే చాలు.
★ అధికారిని ఆ కాల్‌కు జత చేస్తుంది. ఇద్దరూ మాట్లాడుకుంటారు.
★ అధికారికి పౌరుడి నెంబర్ కనిపించదు; పౌరుడికి అధికారి నెంబర్ కనిపించదు.
★ కాల్ రికార్డు అవుతుంది — ఏ కేసు, ఎవరు, ఎప్పుడు, ఎంతసేపు.
★ పోలీస్‌స్టేషన్‌కు, పెట్రోల్ వాహనానికి వెళ్లేది ఘటన ఐడీ నెంబర్, ఘటన ఏమిటి, ఎక్కడ, ఎంత తీవ్రం — పేరు, ఫోన్ నెంబర్ కాదు…
★ కాలర్ ఒక్కసారి చెప్పిన సారాంశమే అందరికీ చేరుతుంది; మూడుసార్లు కథ చెప్పనక్కర్లేదు.
★ ఎవరైనా అధికారి కాలర్ అసలు నెంబర్ తెరిచి చూస్తే — ఎవరు, ఎప్పుడు, ఎందుకు — అదీ నమోదవుతుంది.
ఇక డ్రగ్స్, ఆయుధాలు, తీవ్రవాదులు, ముఠాల గురించి సమాచారం ఇచ్చేవారికి ఇంకా గట్టి రక్షణ ఉండాలి.
ఇందులో కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఏం లేదు. ఇప్పటికే ఉన్న వ్యవస్థ మీదే ఇంకో పొర. ఏఐతో గొంతులోని భావోద్వేగాలను విశ్లేషించగలిగిన బృందానికి కొన్నిరోజుల పని. కానీ వేగం గురించి, ఏఐ గురించి వచ్చిన ఇన్ని ప్రకటనల్లో “ఫిర్యాదు చేసినవారి నెంబర్ ఎక్కడి దాకా వెళ్తుంది” అనే మాట ఒక్కటీ లేదు. ఎవరూ అడగలేదు, కాబట్టి ఎవరూ చేయలేదు.
ఈ రోజుల్లో ప్రతి వీధిలో జరుగుతున్నదే

ఈ వినాయక చవితి రోజుల్లో హైదరాబాద్‌లో ప్రతి వీధిలో ఒకే కథ. నియమాలు స్పష్టం: డీజే లేదు, లౌడ్‌స్పీకర్లు సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకే. హైకోర్టు ఆదేశాల ప్రకారం స్పీకర్లు ఇళ్లు, ఆసుపత్రులు, పాఠశాలల వైపు తిప్పకూడదు. వాటి శబ్దాన్ని పోలీసులు డెసిబెల్ మీటర్లతో కొలిచి వెంటనే చర్య తీసుకోవాలి.
కానీ వీధుల్లో జరుగుతున్నది వేరు. మండపం నుంచి కేబుల్ లాగి మెయిన్ రోడ్డు మీద కరెంటు స్తంభాలకు, టెలిఫోన్ స్తంభాలకు హార్న్ స్పీకర్లు పెట్టారు. చెవులు చిల్లులు పడే మోత, రాత్రి రెండు దాకా. మండపం దగ్గరున్న కానిస్టేబుల్ పట్టించుకోడు — ఆ మండపం వాళ్లు అతనికి తెలుసు.
మండపం చుట్టుపక్కల ఇళ్లలో ఎవరో ఒకరు 100కు ఫోన్ చేయవచ్చు కదా? చేయరు. ఫోన్ చేస్తే పేరు బయటకొస్తుంది. వీడే ఫిర్యాదు చేశాడనే ముద్ర ఆ వీధిలో పదేళ్లు పోదు. కాబట్టి అందరూ దిండు చెవుల మీద ఒత్తిపెట్టుకుని పది రోజులు గడిపేస్తారు.
శబ్దం గురించి ఎవరూ ఫోన్ చేయడం లేదంటే — శబ్దం లేదని కాదు. వ్యవస్థ మీద నమ్మకం లేదని.
“112కు రాని కాల్ అంటే జరగని సంఘటన కాదు… చెప్పడానికి భయపడిన మనిషి.
అదే భయం స్పీకర్ల దగ్గరే ఆగదు. అదే వీధిలో మామూళ్ల వసూలు, వెంబడింపు, గృహహింస, అనుమానాస్పద కదలికలు… చూసినవాళ్లు ఉంటారు. కానీ ఆ సమాచారం 112 దాకా రాదు. రోజూ 18 వేల కాల్స్ వస్తున్నాయని గర్వంగా చెబుతున్నారు. కానీ రాని కాల్స్ ఎన్ని? వాటిలో ఒక దొంగతనం ముందే ఆగే సమాచారం ఉందేమో. ఒక అమ్మాయి ప్రాణం ఉందేమో. దేశ భద్రత ఉందేమో.
మీ పేరు, నెంబర్ మా కాల్‌సెంటర్ దాటి బయటకు రావనే ఒక్క మాట పోలీసులు ఇస్తే చాలు. ఆ మాటను వ్యవస్థతో నిలబెట్టి, 112కు ఫోన్ చేస్తే మీ నెంబర్ ఎక్కడి దాకా వెళ్తుందనేది వాళ్ల వెబ్‌సైట్లో ఒక పేజీగా పెడితే చాలు. మూసుకున్న తలుపుల వెనుక ఉన్న సమాచారం అంతా పోలీసుల దాకా వస్తుంది. ఖర్చు లేని విలువైన సమాచారం ఇది. ఎన్నో ప్రమాదాలు, పరిస్థితుల నుండి ప్రజలను కాపాడే సువర్ణావకాశం పోలీసులకు దక్కుతుంది.
ఫిర్యాదు చేసిన వాడిని కాపాడటమే పోలీసింగ్
కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది. జీపీఎస్‌తో వెయ్యికి పైగా వాహనాలు స్క్రీన్ మీద తిరుగుతున్నాయి. గొంతు వినగానే ఆపదను గుర్తించే ఏఐ ఉంది. ఇంత ఉన్నప్పుడు — ఫిర్యాదు చేసిన మనిషి నెంబర్ చేతులు మారుతూ ఆఖరి కానిస్టేబుల్ సొంత మొబైల్ దాకా వెళ్లాల్సిన అవసరం ఇంకా ఎందుకు?
ఇది పోలీసుల మీద విమర్శ కాదు. ఈ వ్యవస్థను ఇంత దూరం తీసుకొచ్చిన వాళ్లే దీన్ని పూర్తి చేయగలరనే నమ్మకంతో చెబుతున్న మాట.
పౌరుడు, నేను సమాచారం ఇస్తే పోలీసులు నన్ను కాపాడతారనుకోవాలి తప్ప నేను చెప్పానని వాళ్లకు తెలిసిపోతుందేమోనని అనుకోకూడదు. ఈ రెండు వాక్యాల మధ్య తేడాయే — విలువైన సమాచారం.
అది కొన్ని సందర్భాల్లో ఒక మనిషి ప్రాణం కూడా కావచ్చు.









