అభిప్రాయాలు… ఆలోచనలు… అక్షరాలు…

అతిథి మాటమరో మాట వేదికపై ఒక అతిథి గళం

పెళ్లికాని ప్రసాద్‌లు… కండిషన్ల కనకమహాలక్ష్ములు

కలెక్టర్ ఆఫీసులకు గుర్రాలెక్కిన పెళ్లికొడుకులు, కండిషన్ల లిస్టులతో మహాలక్ష్ములు, ‘సెటిల్డ్’ పార్థసారథుల కష్టాలు… పెళ్లి ప్రహసనంపై జమలాపురపు విఠల్ రావు వ్యంగ్య హాస్య రచన.

జమలాపురపు విఠల్ రావు
జమలాపురపు విఠల్ రావు11 అక్టోబర్ 2026 · సవరణ: 10 అక్టోబర్ 2026 · 6 నిమిషాలు
జమలాపురపు విఠల్ రావు
జమలాపురపు విఠల్ రావు
11 అక్టోబర్ 2026 · సవరణ: 10 అక్టోబర్ 2026 · 6 నిమిషాలు
గుర్రాలెక్కి వినతిపత్రాలతో కలెక్టర్ ఆఫీసుకు వచ్చిన పెళ్లికొడుకులు

కలెక్టర్ ఆఫీసు ముందు ‘మ్యారేజ్ మార్చ్’

పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించబడతాయో లేదో తెలీదు కానీ, ప్రస్తుతం భూలోకంలో మాత్రం అవి కలెక్టర్ ఆఫీసులు, ముఖ్యమంత్రి జనతా దర్శన్లు, వినాయకుడి గుళ్ల చుట్టూ తిరుగుతున్నాయి! కర్ణాటకలో ఒక రైతు నేరుగా ముఖ్యమంత్రికే ‘పెళ్లి చేయవయ్యా సామీ’ అని మొరపెట్టుకుంటే, ఉత్తరప్రదేశ్‌లో ఏకంగా యాభై మంది పెళ్లికొడుకు డ్రెస్సులు వేసుకుని గుర్రాలెక్కి కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా చేశారు. మోతీ దుంగ్రి గణేష్ మందిరానికి లక్షల మంది యువకులు మెహందీ కోసం క్యూ కడుతున్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న ఈ “బ్యాచిలర్ల సునామీ”ని, అలాగే మరోవైపు ఆల్రెడీ పెళ్లయి “సంసార సాగరంలో” ఈత రాక మునుగుతున్న వారి కష్టాలను కలిపి చూస్తే… ఈనాటి సమాజంలో పెళ్లి అనేది ఒక విచిత్రమైన ప్రహసనంగా మారిపోయిందనేది సుస్పష్టం!

పూర్వం రోజుల్లో పెళ్లి కావాలంటే దేవుళ్లకు మొక్కుకునేవారు, లేదా బంధువుల చుట్టూ తిరిగేవారు. కానీ ఈ తరం “పెళ్లికాని ప్రసాద్‌లు” రూట్ మార్చి, “మ్యారేజ్ మార్చ్”లతో ప్రభుత్వాన్నే నిలదీస్తున్నారు!

“అయ్యా సీఎం గారు! రోడ్లు వేస్తున్నారు, ఐటీ కంపెనీలు తెస్తున్నారు… అంతా బాగానే ఉంది కానీ, మాకు పిల్లను ఇచ్చే ఐటీ కాకుండా ‘డబ్ల్యూటీ’ (వైఫ్ టెక్నాలజీ) ఎప్పుడు తెస్తారు?” అని కర్ణాటక రైతు అడిగిన ప్రశ్న వినడానికి నవ్వు తెప్పించినా, అందులో ఒక సామాజిక వేదన ఉంది!

ఇక యూపీలో గుర్రాలెక్కి వచ్చిన యాభై మంది పెళ్లికొడుకులను చూసి… కలెక్టర్ గారు కూడా కంగారు పడిపోయి ఉంటారు. “సార్! డిగ్రీలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, కానీ పిల్లనిచ్చే మామగారే లేరు. వెంటనే జీవో పాస్ చేసి మాకు పెళ్లిళ్లు చేయించండి” అని డిమాండ్ చేశారు. బహుశా త్వరలోనే ప్రభుత్వం “కల్యాణ లక్ష్మి”, “షాదీ ముబారక్” పథకాలతో పాటు, “పిల్ల వెతుకుడు పథకం” కూడా పెట్టాలేమో!

కారణాలు వెతికితే…

లింగ నిష్పత్తి పడిపోవడం ఒక కారణమైతే, అమ్మాయిల డిమాండ్లు ఆకాశాన్ని తాకడం మరో కారణం. “అబ్బాయికి సొంత ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, ఐదంకెల జీతం ఉండాలి, పైగా ఇంట్లో అత్తమామలు ఉండకూడదు” అనే కండిషన్ల మధ్య మన పెళ్లికాని ప్రసాద్‌లు మ్యాచ్ ఫిక్సింగ్ కాక, మ్యాచ్‌లు దొరక్క అల్లాడిపోతున్నారు. “స్వామీ! చేతికి గోరింటాకు పెడితే… పెళ్లి పీటల మీద కూర్చునే యోగం పడుతుందేమో చూడు” అంటూ మోతీ దుంగ్రి వినాయకుడికి లంచాలు (లడ్డూలు) సమర్పిస్తున్నారు.

ఈ పెళ్లికాని ప్రసాద్‌ల గోల ఇలా ఉంటే… ఆల్రెడీ పెళ్లయిపోయి సమాజంలో “సెటిల్డ్” అనిపించుకుంటున్న “పార్థసారథుల” కష్టాలు ఇంకో రేంజ్‌లో ఉన్నాయి. వీళ్లు మాత్రం “అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నామా?” అని తమలో తామే లబోదిబోమంటున్నారు.

పార్థసారథుల జీవితం ఇప్పుడు ఎలా ఉందంటే…

పెళ్లి కలలు కంటున్న బ్రహ్మచారి, సామాన్ల లిస్టుతో సతమతమవుతున్న భర్త
పెళ్లి ఒక వింత లడ్డూ!

ఆదివారం ఆఫీస్ సెలవు రోజు ప్రశాంతంగా నిద్రపోదామంటే కుదరదు. “ఏవండీ.. ఈరోజు సెలవే కదా: కిరాణా సామాన్లు, కూరగాయలు, డీమార్ట్ షాపింగ్” అంటూ భార్య ఇచ్చే లిస్ట్ చూస్తే కలెక్టర్ ఆఫీస్ దరఖాస్తు కంటే పెద్దగా ఉంటుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో భార్యతో కలిసి “హ్యాపీ కపుల్” అని రీల్స్ చేస్తూ నవ్వుతారు కానీ, బ్యాక్‌గ్రౌండ్‌లో క్రెడిట్ కార్డ్ బిల్లులు గుర్తొచ్చి లోపల ఏడుస్తుంటారు.

పెళ్లికాని ప్రసాద్‌లు రాత్రి పూట దోస్తులతో కలిసి బిర్యానీలు తింటూ తిరగొచ్చు. కానీ పార్థసారథులకు రాత్రి 9 దాటితే చాలు… ఫోన్‌లో భార్య నుంచి వచ్చే ‘మిస్డ్ కాల్స్’ కౌంట్ చూసి గుండె గుభేల్‌మంటుంది.

“పెళ్లి అనేది ఒక వింత లడ్డూ!! తినని వాడు (పెళ్లికాని ప్రసాద్) ఎలాగైనా తినాలని ఏడుస్తుంటాడు, తిన్నవాడు (పార్థసారథి) అరగక, నమలలేక లోపల బాధపడుతుంటాడు.

పెళ్లికాని ప్రసాద్‌లను చూసి పార్థసారథులు మనసులో అనుకునేది ఇదే: “ఒరేయ్ తమ్ముళ్లూ! గుర్రాలెక్కి కలెక్టర్ ఆఫీసులకి వెళ్తున్నారు కదా… పెళ్లయ్యాక ఆ గుర్రం మీ నెత్తినెక్కుతుంది జాగ్రత్త! దేవుడు మిమ్మల్ని రక్షిస్తుంటే… మీరు వెళ్లి సింహం నోట్లో తలకాయ పెడతామంటున్నారు!”

ఏది ఏమైనా… పెళ్లి అనేది ఒక వింత లడ్డూ!! తినని వాడు (పెళ్లికాని ప్రసాద్) ఎలాగైనా తినాలని ఏడుస్తుంటాడు, తిన్నవాడు (పార్థసారథి) అరగక, నమలలేక లోపల బాధపడుతుంటాడు. కర్ణాటక రైతు సమస్య, యూపీ యువకుల గుర్రపు ర్యాలీలు మనకు నవ్వు తెప్పించినా, యువతకు సరైన ఉపాధి, సమాజంలో లింగ సమానత్వం ఎంత ముఖ్యమో గుర్తుచేస్తున్నాయి.

అప్పటివరకు… “సింగిల్స్ రాజులమ్మా.. మాకూ రోజు వస్తుందమ్మా” అని పెళ్లికాని ప్రసాద్‌లు, “మగజాతి ఆణిముత్యాలం.. భరిస్తున్నాం” అని పెళ్లయిన పార్థసారథులు తమ జీవితాలను కామెడీగా సాగించాల్సిందే!

‘సింగిల్స్ సైన్యం’

మధ్యయుగాల్లో ఒక రాజు ఇంకో రాజు మీదకు యుద్ధానికి వెళ్తే… అక్కడ పురుషుల సంఖ్య తగ్గి, ఇక్కడ బహుభార్యాత్వం పెరిగేది. కానీ ఈనాడు యుద్ధాలు లేవు, కత్తులు లేవు, అయినా సరే మన దేశంలో ‘సింగిల్స్ సైన్యం’ శరవేగంగా పెరిగిపోతోంది.

ఒకప్పుడు ‘పెళ్లికాని ప్రసాదుల’ గురించే వినేవాళ్లం, కానీ ఇప్పుడు మార్కెట్లోకి ‘పెళ్లికాని శ్రీమహాలక్ష్ములు’ కూడా భారీగా ఎంట్రీ ఇచ్చారు.

ఇటు ప్రసాద్‌లు గుర్రాలెక్కుతుంటే, అటు మహాలక్ష్ములు “నా స్టాండర్డ్స్‌కు తగ్గ మొగుడు దొరకట్లేదు” అని ల్యాప్‌టాప్‌ల ముందర తపస్సు చేస్తున్నారు. దీంతో కుటుంబ వ్యవస్థ ధ్వంసమై దేశంలో జననాల రేటు పాతాళాన్ని తాకుతోంది. దీనివల్ల భవిష్యత్తులో దేశమంతా “ముసలివాళ్ల సామ్రాజ్యం”గా మారిపోయే ప్రమాదం కనిపిస్తోంది.

సమస్యకు పరిష్కారం ఎలా?

బడ్జెట్‌లో ‘సింగిల్స్ టాక్స్’ ప్రవేశపెట్టాలి!

ప్రభుత్వం అన్నింటిపై పన్నులు వేస్తోంది కదా, ‘పెళ్లి చేసుకోకుండా తిరుగుతున్నందుకు’ కూడా ఒక టాక్స్ వేయాలి, యువతీ యువకులకు సమానంగా!

28 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకపోతే జీతంలో 10% కట్, 35 ఏళ్లు దాటితే 20% కట్.

అదే పెళ్లి చేసుకుని ఒక పిల్లోడిని కంటే టాక్స్ ఫ్రీ, ఇద్దరిని కంటే సబ్సిడీలు ఇవ్వాలి.

అప్పుడు టాక్స్ కట్టలేక, కండిషన్ల కనకమహాలక్ష్ములు దిగొచ్చి, మన పెళ్లికాని ప్రసాద్‌ల సమస్యకు పరిష్కారం దొరకొచ్చు!

మ్యారేజ్ బ్యూరోలను ‘ప్రభుత్వ రంగ సంస్థలు’గా మార్చాలి!

ప్రభుత్వ కార్యాలయంలో ముఖాముఖి మాట్లాడుకుంటున్న యువతీయువకులు, సర్టిఫికెట్‌కు స్టాంప్ వేస్తున్న అధికారి
భారత్ మ్యారేజ్ కార్పొరేషన్: స్పాట్‌లోనే తాళి!

మ్యాట్రిమోనీ సైట్లు సబ్‌స్క్రిప్షన్ ఫీజులు దండుకుంటున్నాయి తప్ప పెళ్లిళ్లు చేయడం లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వమే నేరుగా “భారత్ మ్యారేజ్ కార్పొరేషన్” (బీఎంసీ) స్థాపించాలి.

ఆధార్ కార్డ్, పాన్ కార్డ్‌తో పాటు ‘బ్యాచిలర్ కార్డ్’ లింక్ చేయాలి.

ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, కలెక్టర్ల ఆధ్వర్యంలో ‘టాస్క్ ఫోర్స్’లను ఏర్పాటు చేసి, పెళ్లికాని ప్రసాద్‌లను, శ్రీమహాలక్ష్ములను ఒకే చోట కూర్చోబెట్టి ‘స్పీడ్ డేటింగ్’ లాంటి ముఖాముఖి కార్యక్రమాలు పెట్టాలి.

“ఇరుపక్షాలు ఒకే అనుకుంటే… స్పాట్ లోనే తాళి కట్టించి, మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చే ఏర్పాట్లు చేయాలి!”

“భవిష్యత్తులో పార్కుల్లో లవర్స్ కంటే… వాకింగ్​ స్టిక్స్ పట్టుకుని తిరిగే ముసలివాళ్లే ఎక్కువగా కనిపిస్తారు!

శ్రీమహాలక్ష్ముల కండిషన్లపై ‘క్యాపింగ్’ (పరిమితి) విధించాలి!

మన పెళ్లికాని శ్రీమహాలక్ష్ములు చదువుల్లో, ఉద్యోగాల్లో దూసుకుపోతున్నారు (చాలా సంతోషం).

కానీ మొగుడి అర్హతల లిస్ట్‌లో మాత్రం హాలీవుడ్ హీరో రేంజ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు:

“అబ్బాయి అందంగా ఉండాలి, ఐటీ జాబ్ ఉండాలి, నెలకు ఐదు లక్షల జీతం ఉండాలి, వంట వచ్చి ఉండాలి, అత్తమామలు మనతో ఉండొద్దు, పైగా వీకెండ్స్‌లో నన్ను విదేశాలకు తిప్పాలి!”

దీనిపై ప్రభుత్వం ఒక జీవో తేవాలి: “లిస్ట్‌లో గరిష్టంగా మూడు కండిషన్లకే అనుమతి. అత్తమామల కండిషన్​ తప్పనిసరి. మిగతావన్నీ పెళ్లయ్యాక అడ్జస్ట్ చేసుకోవాలి!”

రియాలిటీకి దగ్గరగా ఉండే మొగుళ్లను సెలెక్ట్ చేసుకునేలా వీరికి ప్రత్యేక కౌన్సిలింగ్ సెషన్లు పెట్టాలి.

ఈ ఐటీ ఉద్యోగాల వల్ల యువతీ యువకులు ల్యాప్‌టాప్‌లకే అంకితమైపోయి, పక్కన మనుషులు ఉన్నారనే సంగతే మర్చిపోతున్నారు. అందువల్ల ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ రద్దు చేసి ‘వర్క్ ఫ్రమ్ మ్యారేజ్ ఆఫీస్’ అమలు చేయాలి!

ఇదే సమయంలో ఐటీ కంపెనీలకు కొత్త రూల్స్ పెట్టాలి…

ఆఫీసుల్లో కేవలం కోడింగ్ మాత్రమే కాదు, ‘కో-వర్కింగ్’ వాతావరణాన్ని పెంచాలి.

టీమ్ బిల్డింగ్ యాక్టివిటీల పేరుతో ‘మ్యాచ్ మేకింగ్’ ఈవెంట్స్ నిర్వహించాలి.

ఎక్కువ మంది ఉద్యోగులకు పెళ్లిళ్లు చేయించిన కంపెనీకి ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ’ కింద పన్ను మినహాయింపులు ఇవ్వాలి.

కంపెనీలు ఉద్యోగులకు బోనస్ ఇస్తే, ప్రతిగా ఉద్యోగులు కంపెనీకి, దేశానికి ‘బేబీ బోనస్’ ఇవ్వాలి!

జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాలు పెళ్లిళ్లు చేసుకోక, పిల్లల్ని కనక ఇప్పుడు ముసలివాళ్లతో నిండిపోయి తలపట్టుకుంటున్నాయి. భారతదేశానికి ఆ గతి పట్టకూడదంటే… చైనా లాంటి దేశాల ‘వన్ చైల్డ్ పాలసీ’ని రివర్స్ చేసి ‘మినిమమ్ టూ చిల్డ్రన్ పాలసీ’ తేవాలి.

ఒక పిల్లోడిని కంటే ఉచిత రేషన్, రెండో పిల్లోడిని కంటే ఉచిత విద్య, మూడో పిల్లోడిని కంటే ప్రమోషన్! ఇలాంటి ఆఫర్లు పెడితే మనవాళ్లు దేశభక్తితో పాటు ‘సంతాన శక్తి’ని కూడా చూపిస్తారు.

సమస్య తీవ్రమైనదే అయినా… పరిష్కారం మన చేతుల్లోనే ఉంది. పెళ్లికాని ప్రసాద్‌లు తమ ‘ఈగోలను’, శ్రీమహాలక్ష్ములు తమ ‘ఎక్స్‌పెక్టేషన్లను’ కొద్దిగా తగ్గించుకుంటే… దేశంలో మళ్లీ పెళ్లి బాజాలు మోగుతాయి, జననాల రేటు పరుగులు పెడుతుంది. లేకపోతే భవిష్యత్తులో పార్కుల్లో లవర్స్ కంటే… వాకింగ్​ స్టిక్స్ పట్టుకుని తిరిగే ముసలివాళ్లే ఎక్కువగా కనిపిస్తారు!

అతిథి రచయిత
జమలాపురపు విఠల్ రావు
జమలాపురపు విఠల్ రావు
సీనియర్ పాత్రికేయులు

వార్త, ఆంధ్రభూమి దినపత్రికల్లో దాదాపు 35 ఏళ్లు వివిధ హోదాల్లో పనిచేసి, 2016లో పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం ‘జాగృతి’ వారపత్రికకు రెగ్యులర్ కాలమిస్టుగా రాస్తున్నారు.

తర్వాత చదవండి'Election Commission of India' నేమ్‌ప్లేట్ ఉన్న పగిలిన టేబుల్, వెనక మూడు ఖాళీ కుర్చీలు, ఫైళ్లు, బ్యాలెట్ బాక్స్ (ప్రతీకాత్మక చిత్రం)అతిథి మాటసీఈసీ రగడ: వ్యవస్థ వైఫల్యమా? రాజకీయ రణరంగమా?

ఈ కథనంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం. ఏదైనా తప్పు కనిపిస్తే contact@maromaata.comకు రాయండి — సరిచేస్తాను. సంపాదకీయ విధానం →

మరిన్ని కథనాలు

షేర్