అభిప్రాయాలు… ఆలోచనలు… అక్షరాలు…

జీవితాంతం సంపాదించిన గౌరవం… ఒక్క ఫోన్‌కాల్‌తో భయం

డిజిటల్ అరెస్ట్‌కు చదువుకున్నవారు, ఉన్నతాధికారులు కూడా ఎందుకు లొంగిపోతున్నారు?

చెర్మాల శ్రీనివాస్8 అక్టోబర్ 2026 · సవరణ: 10 అక్టోబర్ 2026 · 6 నిమిషాలు · English →
ల్యాప్‌టాప్ స్క్రీన్‌లోంచి బయటికి వచ్చిన సంకెళ్లు వేసిన చేతులు

చట్టంలో లేని అరెస్ట్‌… మనసులో మాత్రం భయం

2025 సెప్టెంబరులో హైదరాబాద్‌లో 76 ఏళ్ల విశ్రాంత ప్రభుత్వ వైద్యురాలు సైబర్‌ మోసగాళ్ల బెదిరింపులకు గురయ్యారు. అధికారులమని చెప్పుకున్న నేరగాళ్లు సుమారు 70 గంటలపాటు ఆమెను వీడియో కాల్స్‌, నకిలీ పత్రాలతో భయపెట్టి రూ.6.6 లక్షలు బదిలీ చేయించుకున్నారు. ఈ వేధింపుల అనంతరం ఆమె గుండెపోటుతో మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇలాంటి వార్త చదవగానే మనకు ఒక ప్రశ్న వస్తుంది: “అరె.. అంత చదువుకున్నవాళ్లు ఎలా నమ్మారు?”

కానీ చదువు, అనుభవం, హోదా ఉన్నంత మాత్రాన భయం ఉండదని కాదు. కొన్నిసార్లు జీవితాంతం సంపాదించిన పేరు ప్రతిష్ఠలే మోసగాడి చేతిలో ఆయుధాలవుతాయి. వాటికి మచ్చ పడుతుందనే భయంతో మనిషి తడబడతాడు.

ఇది ఒక్కరి కథ కాదు. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల గణాంకాలను ఉటంకించిన వార్తా కథనం ప్రకారం, 2025 జనవరి నుంచి 2026 జులై 31 వరకు వృద్ధులు బాధితులుగా 69 డిజిటల్‌ అరెస్ట్‌ కేసులు నమోదయ్యాయి. నష్టపోయిన సొమ్ము రూ.31.93 కోట్లు. అంటే ఒక్కో కేసులో సగటున దాదాపు రూ.46 లక్షలు.

డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి? చట్టంలో లేని అరెస్ట్‌

భారత చట్టాల్లో ‘డిజిటల్‌ అరెస్ట్‌’ అనే ప్రక్రియ లేదు. వీడియో కాల్‌లో నిర్బంధించడం, దర్యాప్తు లేదా ఖాతా తనిఖీ పేరుతో డబ్బు బదిలీ చేయమనడం మోసానికి సంకేతాలని భారత సైబర్‌ నేరాల సమన్వయ కేంద్రం ఐ4సీ హెచ్చరిస్తోంది.

మోసం సాధారణంగా ఒక ఆరోపణతో మొదలవుతుంది. “మీ పార్సిల్‌లో మాదకద్రవ్యాలు ఉన్నాయి”, “మీ ఆధార్‌ను నేరానికి వాడారు”, “మీ ఖాతాకు మనీలాండరింగ్‌తో సంబంధం ఉంది” అంటూ ఫోన్‌ వస్తుంది. తర్వాత ‘దర్యాప్తు అధికారి’ మాట్లాడతాడు. యూనిఫాం, పోలీస్‌స్టేషన్‌లా కనిపించే నేపథ్యం, ముద్రలున్న పత్రాలు చూపిస్తాడు. కాల్‌ కట్‌ చేయొద్దంటాడు. చివరకు డబ్బు పంపమంటాడు. బయట నుంచి చూసేవారికి మోసం వెంటనే కనిపిస్తుంది. కానీ కాల్‌ అందుకున్న వ్యక్తి ఒక ఆరోపణ గురించి ఆలోచించేలోపే మరో బెదిరింపు వచ్చి పడుతుంది. ఆలోచించడానికి సమయం ఇవ్వకపోవడమే మోసగాడి పద్ధతి.

ల్యాప్‌టాప్ స్క్రీన్‌లోంచి సంకెళ్ల వైపు చేయి చాపుతున్న యూనిఫాం వ్యక్తి
స్క్రీన్‌లోంచి చొచ్చుకొచ్చే ‘అధికారం’

హరియాణాలోని అంబాలాకు చెందిన వృద్ధ దంపతులనూ ఇలాగే మోసం చేశారు. సుప్రీంకోర్టు, బాంబే హైకోర్టు, ఈడీ పేర్లతో నకిలీ పత్రాలు చూపించి రూ.1 కోటి 5 లక్షల 50 వేలు బదిలీ చేయించుకున్నట్లు 2025 అక్టోబరు 17 నాటి సుప్రీంకోర్టు ఉత్తర్వులో ఉంది. ఆ దంపతుల ఫిర్యాదుతోనే కోర్టు స్వయంగా విచారణ చేపట్టింది. పత్రంపై సీల్ ఉందన్న కారణంతో దాన్ని నమ్మలేమని ఈ ఘటన చెబుతోంది.

ఒక రంగంలో నిపుణుడు, అన్నింట్లో కాదు

వైద్యుడికి వైద్యం తెలుసు. ఇంజినీర్‌కు తన రంగం తెలుసు. అరెస్ట్‌ ఎలా జరుగుతుంది, ఏ సంస్థకు ఏ అధికారం ఉంది, నోటీసు అసలైనదో కాదో ఎలా తేల్చాలన్నవి అందరికీ తెలిసి ఉంటాయని అనుకోలేం. ప్రభుత్వంలో పనిచేసిన అధికారికి కూడా ప్రతి దర్యాప్తు సంస్థ పద్ధతులూ తెలియవు.

బ్యాంకింగ్‌ యాప్‌ వాడటం వేరు, మోసాన్ని గుర్తించడం వేరు. ఈ మోసంలో నేరగాడు ఖాతాను హ్యాక్‌ చేయాల్సిన అవసరం లేదు. బాధితుడినే భయపెట్టి, అతడి చేతులతోనే డబ్బు పంపిస్తాడు.

పేరు ప్రతిష్ఠలకు మచ్చ పడుతుందనే భయం

నేరారోపణ గురించి తన పేషెంట్లకు తెలిస్తే తన పరిస్థితి ఏంటని వైద్యుడు భయపడతాడు. బంధుమిత్రులు తన నిజాయితీని అనుమానిస్తారని విశ్రాంత అధికారి కుంగిపోతాడు. “నేను తప్పు చేయలేదు. కానీ వెంటనే నిరూపించుకోలేకపోతే..?” అనే ప్రశ్న వెంటాడుతుంది. పోలీస్‌స్టేషన్‌, కోర్టు ఖర్చులు, కుటుంబానికి తెలిసిపోవడం, పరువు పోవడం వంటి భయంకరమైన ఊహలు చుట్టుముడతాయి. తప్పు చేయలేదనే నమ్మకం ఉన్నా, తనకు న్యాయం జరుగుతుందనే భరోసా అందరికీ ఉండదు.

“

జీవితాంతం సంపాదించిన పేరు ప్రతిష్ఠలే మోసగాడి చేతిలో ఆయుధాలవుతాయి.

ఈ భయాన్నే మోసగాళ్లు వాడుకుంటున్నారని 2026 జూన్‌ 9న ఎన్‌హెచ్‌ఆర్‌సీ నిర్వహించిన చర్చలో ప్రస్తావించారు. వృద్ధులు, విశ్రాంత అధికారులు, వృత్తి నిపుణులు ఎదుర్కొంటున్న నష్టం డబ్బుకే పరిమితం కాదని, వారి గౌరవం, ఆత్మాభిమానం, మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. బాధితులను నిందించకుండా అండగా నిలవాల్సిన అవసరాన్నీ నొక్కిచెప్పారు.

అందుకే “తప్పు చేయకపోతే భయమెందుకు?” అనే ప్రశ్న బాధితుడి పరిస్థితిని అర్థం చేసుకోదు. భయపడటం ఎప్పుడూ నేరానికి సాక్ష్యం కాదు.

ఇంట్లోనే ఉన్నా ఒంటరి

మోసగాడికి బాధితుడి పేరు, చిరునామా, ఉద్యోగ వివరాలన్నీ తెలిసే ఉంటాయి. అసలైన అధికారి కాకపోతే ఇవన్నీ ఎలా తెలుసని అనిపిస్తుంది. కానీ వ్యక్తిగత వివరాలు తెలిసి ఉండటం అధికారానికి రుజువు కాదు. డేటా లీకులు, ఇతర మార్గాల ద్వారా వివరాలు సేకరించి బాధితులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఎన్‌హెచ్‌ఆర్‌సీ చర్చలో హెచ్చరించారు.

ఆ తర్వాత “కాల్‌ కట్‌ చేయొద్దు”, “ఎవరికీ చెప్పొద్దు”, “ఇది రహస్య దర్యాప్తు” అంటారు. పక్క గదిలో కుటుంబ సభ్యులు ఉన్నా, ఫోన్‌లో వందల నంబర్లు ఉన్నా ఆ క్షణంలో మనిషి ఒంటరివాడవుతాడు. ఇదేదో తేడాగా ఉందని చెప్పే ఒక్క గొంతు వినిపించకుండా మోసగాడు అడ్డుకుంటాడు.

వీడియో కాల్‌లో పోలీసు యూనిఫాంలో ఉన్న వ్యక్తిని ఆందోళనగా చూస్తున్న వృద్ధుడు
ఇంట్లోనే ఉన్నా… ఆ క్షణంలో ఒంటరే

ఇతరులకు సలహాలు ఇస్తూ వచ్చినవారికి సహాయం అడగడం కష్టంగా అనిపిస్తుంది. డబ్బు పోయాక, నువ్వెలా మోసపోయావనే ఎగతాళికి భయపడి ఫిర్యాదూ ఆలస్యమవుతుంది. బాధితులను వెక్కిరించడం మోసగాళ్లకే మేలు చేస్తుంది.

“

భయపడటం ఎప్పుడూ నేరానికి సాక్ష్యం కాదు.

విశ్రాంత జీవితం గడిపేవారికి పొదుపు చేసుకున్న సొమ్ము దశాబ్దాల కష్టం. అది పోతే తిరిగి సంపాదించడం కష్టం. అలాగని వృద్ధులందరూ అమాయకులని కాదు. వారి పరిస్థితిని గౌరవంతో అర్థం చేసుకోవాలి.

ఇలాంటి కాల్‌ వస్తే

కాల్‌ కట్‌ చేయండి. దర్యాప్తు, ఖాతా తనిఖీ లేదా నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే పేరుతో డబ్బు పంపొద్దు.

నమ్మకమైన వ్యక్తితో మాట్లాడండి. “ఎవరికీ చెప్పొద్దు” అనే ఒత్తిడికి లొంగొద్దు.

మీరే నిర్ధారించుకోండి. అధికారిక వెబ్‌సైట్‌లోని సంప్రదింపు వివరాలతోనే సరిచూసుకోండి. బెదిరించిన వ్యక్తి ఇచ్చిన నంబర్‌ లేదా లింకును ఆధారంగా తీసుకోవద్దు.

డబ్బు పంపేసి ఉంటే వెంటనే 1930కి ఫోన్‌ చేయండి. బ్యాంకుకు తెలియజేసి, cybercrime.gov.inలో ఫిర్యాదు చేయండి. సందేశాలు, ఫోన్‌ నంబర్లు, లావాదేవీ వివరాలు భద్రపరచండి. త్వరగా ఫిర్యాదు చేయడం సొమ్మును నిలిపివేయడానికి తోడ్పడవచ్చు; తిరిగి వస్తుందని హామీ లేదు. మొదటి గంటలో ఏం చేయాలో ఈ కథనంలో వివరంగా చూడండి.

ఇంట్లో పెద్దలకు ముందుగానే ఒక మాట చెప్పండి: “ఎలాంటి బెదిరింపు వచ్చినా మాతో చెప్పండి. మిమ్మల్ని తప్పుపట్టం. డబ్బు పంపే ముందు కలిసి చూద్దాం.” వారి అంగీకారంతో, అవసరాలకు సరిపోయే రోజువారీ బదిలీ పరిమితులను బ్యాంకుతో చర్చించుకోవచ్చు.

వ్యవస్థ బాధ్యత ఏమిటి?

దేశవ్యాప్తంగా డిజిటల్‌ అరెస్ట్‌ ఫిర్యాదులు తగ్గుతున్నట్లు 2026 ఆగస్టు 4 నాటి సుప్రీంకోర్టు ఉత్తర్వులో పేర్కొన్నారు. జాతీయ సైబర్‌ నేరాల ఫిర్యాదు పోర్టల్‌లో 2024లో 1,23,672, 2025లో 58,239 ఫిర్యాదులు నమోదయ్యాయి. 2026 జూన్‌ 30 వరకు 16,377 ఫిర్యాదులు వచ్చాయి. చివరి సంఖ్య ఆరు నెలలకే సంబంధించినది. తగ్గుదల ప్రోత్సాహకరమే అయినా, అవగాహన వల్లే ఇది జరిగిందని ఈ గణాంకాలతో మాత్రమే తేల్చలేం.

డిజిటల్‌ అరెస్ట్‌ మోసాన్ని ప్రత్యేక నేరంగా గుర్తించి కఠిన శిక్షలు విధించే అంశాన్ని కేంద్రం పరిశీలించాలని సుప్రీంకోర్టు 2026 జులై 28న సూచించినట్లు వార్తా కథనాలు తెలిపాయి. ఆగస్టు 4 ఉత్తర్వులో, మోసపు ఖాతాల నుంచి డబ్బు బయటకు వెళ్లకుండా తాత్కాలికంగా నిలిపివేసే విధానాన్ని నాలుగు వారాల్లో రూపొందించి జారీ చేయాలని ఆర్‌బీఐని ఆదేశించింది. రికవరీ అయిన సొమ్మును బాధితులకు త్వరగా అందించాలని సంబంధిత సంస్థలనూ ఆదేశించింది. అదే ఉత్తర్వు ప్రకారం, సైబర్‌ మోసాల బాధితులకు డబ్బు తిరిగి ఇచ్చే వ్యవస్థ ద్వారా ఇప్పటివరకు 36,290 కేసుల్లో రూ.18.05 కోట్లు తిరిగి అందాయి. ఇది పోయిన డబ్బంతా తిరిగి వస్తుందనే హామీ కాదు.

ఆర్‌బీఐ 2026 సెప్టెంబరు 11న కేవైసీ సవరణల ముసాయిదా విడుదల చేసింది. అనుమానాస్పద మోసపు లావాదేవీలు లేదా ఖాతాల నుంచి డబ్బు వెళ్లకుండా తాత్కాలికంగా నిలిపివేసే విధానాన్ని అందులో ప్రతిపాదించింది. ముసాయిదాపై వచ్చిన వివరాల ప్రకారం, అమలు తేదీగా 2027 ఏప్రిల్‌ 1ను ప్రతిపాదించారు; బ్యాంకులు ముందుగానే అమలు చేసే అవకాశమూ ఉంది. అంటే ఇది ఇంకా ప్రతిపాదన మాత్రమే.

మోసగాడు గంటల్లో డబ్బు సరిహద్దులు దాటిస్తాడు. ఆ డబ్బును ఆపే నిబంధన అమల్లోకి రావడానికి మాత్రం ఇంకా దాదాపు ఆరు నెలలు ఆగాలి. అప్పటిదాకా ఎవరి సొమ్ముకు ఎవరు జవాబుదారీ?

పెద్ద మొత్తాల బదిలీలకు కొంత విరామం, ఖాతాదారుడు ఎంపిక చేసుకున్న నమ్మకమైన వ్యక్తి ద్వారా అదనపు ధృవీకరణ, అసాధారణంగా ఎక్కువసేపు సాగే కాల్స్‌పై హెచ్చరికలు, ప్రభుత్వ నోటీసులను సరిచూసుకునేందుకు ఒకే వేదిక వంటి సూచనలు ఎన్‌హెచ్‌ఆర్‌సీ చర్చలో వచ్చాయి. నిర్ణీత సమయం దాటిన ఆడియో, వీడియో కాల్స్‌ను ఆపేసే ‘కిల్‌ స్విచ్‌’ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆగస్టు 4 ఉత్తర్వులో సుప్రీంకోర్టు కేంద్ర ఐటీ శాఖ, టెలికాం విభాగం, ఐ4సీని కోరింది. ఇవన్నీ ఇంకా ప్రతిపాదనలే. ఖాతాదారుల స్వేచ్ఛకు, వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా వీటిని రూపొందించాలి. ఆలోచనలు బాగానే ఉన్నాయి కానీ, అమలు పకడ్బందీగా కావాలి.

మోసపు సొమ్ము వెళ్లే ఖాతాలను ఎవరు పర్యవేక్షిస్తున్నారు? బెదిరింపు కాల్స్‌కు వాడే సిమ్‌లు ఎలా అందుతున్నాయి? తన సాధారణ లావాదేవీలకు భిన్నంగా ఒక వృద్ధుడు భారీ మొత్తం బదిలీ చేస్తుంటే, బ్యాంకు దాన్ని గుర్తించి హెచ్చరించగలదా? బాధ్యత బాధితుడి దగ్గరే ఆగిపోకూడదు.

అవగాహన కూడా “ఓటీపీ చెప్పొద్దు” దగ్గరే ఆగకూడదు. మోసగాడు ఎలా భయపెడతాడు, ఎవరితోనూ మాట్లాడనివ్వకుండా ఎలా అడ్డుకుంటాడు, ఆలోచించే సమయం ఇవ్వకుండా ఎలా తొందరపెడతాడు అనే విషయాలు కూడా వివరించాలి.

బాధితులను అవమానించడం వల్ల మోసం ఆగదు. అధికారాన్ని ఎలా నిర్ధారించుకోవాలో చెప్పాలి. ఆలోచించే సమయం ఇవ్వాలి. సహాయం అడగడం సిగ్గు కాదని భరోసా కల్పించాలి.

జీవితాంతం సంపాదించిన గౌరవాన్ని కాపాడుకోవడానికి ఒక అపరిచితుడి ఆదేశాలకు లొంగిపోవాల్సిన అగత్యం లేదు. భయపెట్టే ఫోన్‌కాల్‌ను ఒంటరిగా ఎదుర్కోవాల్సిన అవసరమూ లేదు.

తర్వాత చదవండిసమాజంఏఐ డేటా సెంటర్లు : కనిపించని జీవన విధ్వంసం

ఈ కథనంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం. ఏదైనా తప్పు కనిపిస్తే contact@maromaata.comకు రాయండి — సరిచేస్తాను. సంపాదకీయ విధానం →

చెర్మాల శ్రీనివాస్

రచయిత

నా గురించి →

మరిన్ని కథనాలు

షేర్