అభిప్రాయాలు… ఆలోచనలు… అక్షరాలు…

రోడ్లపై గణేశ మండపాలు.. భక్తా? రౌడీయిజమా?

గణేశ నవరాత్రులు మళ్లీ వచ్చాయి. రోడ్ల మధ్యలో మండపాలు, పోలీసుల అనుమతులు, ఉచిత కరెంటు, చెవులు చిల్లులు పడే డీజేలు, లడ్డూ వేలం మోసాలు. ఇక్కడ అందరూ బాధితులే — కానీ ఎవరూ మాట్లాడరు. వీధుల్లో దేవతా విగ్రహాలేమిటన్న ప్రశ్న ఎవరూ వేయరు.

చెర్మాల శ్రీనివాస్10 సెప్టెంబర్ 2026 · సవరణ: 24 అక్టోబర్ 2026 · 2 నిమిషాలు
Ganesha agaman - dead badrnath

గణేశ నవరాత్రుల సంరంభాలు మళ్లీ మొదలు. సెప్టెంబర్ 14న మొదలయ్యే నవరాత్రులకు హడావుడి జంటనగరాలలో అప్పుడే మొదలయ్యింది. రోడ్ల మధ్యలో మండపాలు.. వాటికి పోలీసుల అనుమతులు, ప్రభుత్వం ఉచిత కరెంటు, చెవులు చిల్లులు పడే డీజేల మోతలు.. లడ్డూల వేలంపాటలు, ఆపై భక్తులను మోసం చేసి కోట్లతో ఉడాయింపులు..

ఇక్కడ అందరూ బాధితులే.. కానీ, ఎవరూ మాట్లాడరు. అసలు వీధుల్లో దేవతావిగ్రహాలేమిటనే ప్రశ్న ఎవరూ లేవనెత్తరు. ఆఖరికి రోజూ టీవీల్లో ప్రవచనాలు చెప్పే పండితులు కూడా.. ఇది ఆగమశాస్త్ర విరుద్ధమని చెప్పే నాథుడే లేడు.

మొన్న శనివారం.. సాయంత్రం 7.30 గంటలు.. విఎస్టీ నుండి రాంనగర్కు వెళ్లే దారులన్నీ అష్టదిగ్బంధం. పోలీసులు పోనివ్వరు… ‘ఇటు నుంచి కాదు, గణేశుడి విగ్రహం వెళ్తోంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి, మీరు అవతలి సందు నుండి వెళ్లండి’ అంటారు. అక్కడ మరో పోలీసు మళ్లీ అదే మాట. అన్ని రోడ్లనూ అలాగే బ్లాక్ చేసి ఎటువైపు నుండీ వెళ్లనివ్వరు. పోలీసులు కూడా ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తారంటే ఒకచోట బ్లాక్ చేసినప్పుడు ఇంకోచోట దారి వదలలానే కనీస జ్ఞానం కూడా ఉండదు. ఇంతా చేసి, అంతా తిరిగి చివరికి ఎలాగోలా రాంనగర్​కు చేరుకుంటే అక్కడా ఏకంగా బారికేడ్లు పెట్టి ట్రాఫిక్​ వదలరు. ఆఖరికి ఆర్టీసీ బస్సును కూడా.. దీనికి సదరు మండప నిర్వాహకులనబడే వీధి రౌడీలు, గూండాల దౌర్జన్యం. వీరే భవిష్యత్ రాజకీయ నాయకులు. అసహనంతో వీటిని తీయండంటే, ‘నువ్వు హిందువువేనా? నీ ఇళ్లెక్కడ? సొంతిల్లా, అద్దిల్లా? మాకు పోలీసు పర్మిషనుంది, వాళ్లనడుగుపో..’ అంటూ బెదిరింపులు. నా వెనుక వందలాది మంది నాలాంటి బాధితులే ఉన్నారు కానీ, ఒక్కడూ మాట్లాడటానికి రాలేదు. ఇంకో రెండు గంటలు లోపల తిట్టుకుంటూనైనా తిరుగుతుంటారు గానీ, ప్రశ్నించాలంటే మాత్రం.. భయం.

ఇదే ఊరేగింపులో ఒక బద్రీనాథ్ అనే 18 ఏళ్ల యువకుడు తొక్కిసలాటలో చనిపోయాడు. ఇప్పుడు దీనికి ఎవరిది బాధ్యత? దేవుడిదా? “భక్తుల”దా? పోలీసులదా? తన తల్లిదండ్రులకు ఎవరు సమాధానం చెప్తారు?

అసలెందుకీ ప్రహసనం? ఈ నిర్వాహకులు ఎవరూ గుడికి వెళ్లే మొహాలు కాదు, దేవుడికి దండం పెట్టే రకం కూడా కాదు. లక్షల్లో చందాలు వసూలు చేసి, రోజూ మండపాల వద్దే తాగుతూ, డీజేల మోతకు పిచ్చికుక్కల్లా ఎగురుతూ అల్లకల్లోలం చేస్తుంటారు. పోనీ, నిమజ్జనం అయిపోయాక మండపం తీస్తారా అంటే అదీ ఉండదు. మరో పదిహేను రోజులకు మెల్లగ ఒక్కొక్కటిగా విప్పుతారు. ఇలా ఇది అయిపోయిందో లేదో, మళ్లీ దేవీ నవరాత్రులంటూ మళ్లీ ఒకటి షురూ.. ఇవన్నీ అయిపోయేదాకా రోడ్డుపై వెళ్లే వారికి నరకప్రాయం.

ఏ దేవుడూ, ఏ మతమూ ప్రజలను ఇబ్బంది పెట్టాలని చెప్పలేదు. ఇలా ఎవరిష్టమొచ్చినట్లు వారు మతం పేరు చెప్పి, దేవుడి పేరు చెప్పి ప్రజలను ఇక్కట్లపాలు చేసే అధికారం ఎవరిచ్చారు? దీన్ని నియంత్రించాల్సిన ప్రభుత్వం, పోలీసులు చోద్యం చూస్తుంటారు. ఒకరు ఓట్ల కోసమైతే, మరొకరు మామూళ్ల కోసం.. కోర్టులు కూడా వీరిని నియంత్రించవు.

ఇవనే కాదు, రోడ్ల మధ్యలో ఉండే దర్గాలు, గుళ్లు, శ్మశానాలు.. ఇవన్నీ రోడ్ల వెడల్పు చేయనివ్వవు. చేసే ధైర్యం ప్రభుత్వానికుండదు. అక్కడ ఇరికిరికి వాహనాలు వెళ్లాల్సిందే కానీ, చొరవ తీసుకుని మతపెద్దలతో మాట్లాడి దాన్ని అక్కన్నుంచి తరలించి పక్కన అనుకూలమైన ప్రదేశంలో పునర్మిస్తామని ప్రభుత్వానికుండదు.

ఇక మత ప్రదేశాల్లో మైకులు.. ఓ.. హోరెత్తిపోయే సౌండుతో ప్రార్థనలు, పాటలు.. విపరీతమైన శబ్దం చెవులకు హాని కలిగిస్తుంది. 85 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం వినికిడికి చేటు చేస్తుంది. 120 కంటే ఎక్కువైతే అది అత్యంత ప్రమాదకరం. కానీ, ఈ ఊరేగింపుల్లో, ప్రార్థనాస్థలాల్లో వాడే మైకులు, డీజేలు దాదాపు 200 డెసిబెల్స్ శబ్దాన్ని వదులుతుంటాయి. మరి ఇంత ప్రమాదకరమైన ‘భక్తి’ అవసరమా? అసలు దీన్ని భక్తి అని ఎలా అనాలి?

ఇక అంతా ‘దేవుడి’ దయ..అని ఊరుకోవాల్సిందేనా.?

తర్వాత చదవండిసమాజంఏఐ డేటా సెంటర్లు : కనిపించని జీవన విధ్వంసం

ఈ కథనంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం. ఏదైనా తప్పు కనిపిస్తే contact@maromaata.comకు రాయండి — సరిచేస్తాను. సంపాదకీయ విధానం →

చెర్మాల శ్రీనివాస్

రచయిత

నా గురించి →

మరిన్ని కథనాలు

షేర్