అభిప్రాయాలు… ఆలోచనలు… అక్షరాలు…

UPI మోసానికి గురయ్యారా? గంటలోపు చేయాల్సిన పనులివే

డబ్బు పోయిందని తెలిసిన క్షణం నుంచే లెక్క మొదలవుతుంది. 1930కి ఫోన్, బ్యాంకుకు సమాచారం, పోర్టల్‌లో ఫిర్యాదు, FIR. ఈ నాలుగూ ఎంత త్వరగా జరిగితే డబ్బు ఆగే అవకాశం అంత ఎక్కువ.

చెర్మాల శ్రీనివాస్29 సెప్టెంబర్ 2026 · 4 నిమిషాలు · English →
‘UPI స్కామ్‌’ ముద్ర ఉన్న ఫోన్‌ నుంచి వచ్చిన గాలానికి చిక్కిన పర్సులోని నోటు — UPI మోసానికి ప్రతీక

ఎరకు చిక్కినా.. గంటలోపు స్పందిస్తే ఆశ ఉంటుంది

Read in English →

UPI ద్వారా మిమ్మల్ని మోసం చేసి డబ్బు పంపించుకోవడం, లేదా మీ అనుమతి లేకుండా డబ్బు బదిలీ చేయడాన్ని UPI మోసం అంటారు. దీనికి మీ ఖాతాను హ్యాక్ చేయాల్సిన అవసరం లేదు. “క్యాష్‌బ్యాక్ వచ్చింది”, “డబ్బు అందుకోవడానికి QR కోడ్ స్కాన్ చేసి PIN పెట్టండి” అని నమ్మించి మీ చేతే చెల్లింపు చేయించినా అది మోసమే. డబ్బు అందుకోవడానికి UPI PIN ఇవ్వాల్సిన అవసరం లేదు.

ఇలాంటి మోసం జరిగిందని గుర్తించిన వెంటనే 1930కి కాల్ చేయాలి. మీ బ్యాంకుకు చెప్పి, ఇంకా డబ్బు పోకుండా తక్షణం ఆపాలి. cybercrime.gov.inలో ఫిర్యాదు నమోదు చేయాలి. ఆ తర్వాత ఆధారాలతో పోలీసులను కలిసి FIR నమోదు చేయాలి. FIR కోసం ఎదురుచూస్తూ బ్యాంకుకు తెలియజేయడం ఆలస్యం చేయొద్దు.

మొదటి గంటలో మనం చేయాల్సినవి రెండే. ఇంకా డబ్బు పోకుండా ఆపగలగడం, పోయిన డబ్బు ఎక్కడ ఉందో పట్టుకుని ఆపేసేలా వీలైనంత త్వరగా సమాచారం ఇవ్వడం. అయితే గంట దాటిపోయినా ఫిర్యాదు చేయడం మాత్రం మానేయకండి. ఇది తప్పనిసరి.

1. వెంటనే 1930కి కాల్ చేయండి

ఫోన్‌లో 1930 నంబర్‌ డయల్‌ చేస్తున్న చేతులు — సైబర్‌ మోసాల హెల్ప్‌లైన్‌

ఆన్‌లైన్ ఆర్థిక మోసాలను తెలియజేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ 1930. ఇది ఉచితం, 24 గంటలూ పనిచేస్తుంది. ఎంత డబ్బు పోయింది, ఎప్పుడు పోయింది, ఏ బ్యాంకు ఖాతా నుంచి వెళ్లింది, లావాదేవీ నంబర్ ఏమిటి వంటి వివరాలు చెప్పాలి. ఫిర్యాదు తీసుకున్నాక వచ్చే రసీదు (acknowledgement) నంబర్‌ను జాగ్రత్తగా దాచుకోవాలి.

కాల్ కలవకపోతే దానికోసమే వేచి ఉండొద్దు. బ్యాంకుకు చెప్పడం, పోర్టల్‌లో ఫిర్యాదు చేయడం కొనసాగించాల్సిందే.

2. బ్యాంకుకు చెప్పి బ్లాక్ చేయించాలి

మీ బ్యాంకు అధికారిక యాప్, వెబ్‌సైట్ లేదా కార్డు వెనక ఉన్న కస్టమర్ కేర్ నంబర్‌కే ఫోన్ చేయాలి. గూగుల్‌లో వెతికితే దొరికిన నంబర్‌కు కాదు.

“నా ఖాతా నుంచి UPI మోసం ద్వారా డబ్బు పోయింది. ఈ లావాదేవీపై ఫ్రాడ్ కంప్లయింట్ నమోదు చేయండి. ఇంకా డబ్బు పోకుండా అవసరమైన సేవలను బ్లాక్ చేయండి. ఫిర్యాదు నంబర్ ఇవ్వండి.” ఇదీ వారికి చెప్పాల్సింది.

UPI, మొబైల్ బ్యాంకింగ్, కార్డు వీటిలో దేన్ని బ్లాక్ చేయాలో బ్యాంకును అడిగి తెలుసుకోవాలి. అనధికార లావాదేవీ గురించి సమాచారం అందగానే, ఇంకా అలాంటివి జరగకుండా బ్యాంకులు వెంటనే చర్య తీసుకోవాలని RBI చెబుతోంది.

మీ ఖాతాను బ్లాక్ చేసినంత మాత్రాన ఇప్పటికే పోయిన డబ్బు దానంతట అదే వెనక్కి రాదు. డబ్బు జమ అయిన ఖాతాలో కూడా ఆ మొత్తాన్ని ఆపమని అడగాలి. ఈ పనిలో బ్యాంకులు, చెల్లింపు సంస్థలు, పోలీసులు కలిసి పనిచేస్తారు.

మీరు వాడిన UPI యాప్‌లో ఆ లావాదేవీని ఎంచుకుని ఫిర్యాదు చేసే వీలుంటే, అక్కడ కూడా నమోదు చేయాలి.

3. ఆన్‌లైన్ ఫిర్యాదును కూడా నమోదు చేయాలి

అధికారిక సైబర్‌క్రైమ్ పోర్టల్‌లో “ఆర్థిక మోసం” కింద వివరాలు నమోదు చేయాలి. 1930 ద్వారా ఫిర్యాదు చేసి రసీదు నంబర్ పొందితే, ఆ నంబర్‌తో 24 గంటల్లోపు పూర్తి వివరాలతో పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలి. వీలైతే వెంటనే చేసేయండి.

సిద్ధంగా పెట్టుకోవాల్సిన వివరాలు:
• డబ్బు పోయిన తేదీ, సమయం, మొత్తం.
• బ్యాంకు పేరు, సంబంధిత ఖాతా వివరాలు.
• UPI Transaction ID / UTR / RRN, అంటే యాప్‌లో కనిపించే లావాదేవీ నంబర్.
• డబ్బు అందుకున్న వ్యక్తి UPI ID, పేరు లేదా ఫోన్ నంబర్, తెలిసినంత వరకు.
• చెల్లింపు స్క్రీన్‌షాట్లు, బ్యాంకు SMSలు, మోసానికి సంబంధించిన చాట్లు, లింకులు.

తెలియని వివరాలను ఊహించి రాయొద్దు. మీ దగ్గర ఉన్న ఖచ్చితమైన సమాచారాన్నే ఇవ్వాలి. ఫిర్యాదు నంబర్‌తో పోర్టల్‌లో మీ ఫిర్యాదు ఏ స్థాయిలో ఉందో చూసుకోవచ్చు.

4. ఆధారాలు దాచండి – పోలీసులను కలవండి

చాట్లు, మెసేజ్‌లు, కాల్ వివరాలు, చెల్లింపు ఆధారాలను డిలీట్ చేయొద్దు. వాటి కాపీలు దాచుకోవాలి. జరిగిన విషయాన్ని సమయాల వారీగా ఒక కాగితంపై రాసుకోవాలి.

దగ్గర్లోని పోలీస్ స్టేషన్ లేదా సైబర్‌క్రైమ్ పోలీసులను కలిసి రాతపూర్వక ఫిర్యాదు ఇవ్వాలి. 1930/పోర్టల్ రసీదు నంబర్, బ్యాంకు ఫిర్యాదు నంబర్, ఆధారాలు జతచేసి FIR నమోదు చేయమని అడగాలి. దగ్గర్లో సైబర్‌క్రైమ్ స్టేషన్ లేకపోతే, ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా జీరో FIR అడగవచ్చు. ఫిర్యాదు అందినట్లు రసీదు తీసుకోండి. FIR నమోదైతే దాని నంబర్, కాపీ తీసుకోవాలి. పోలీసులకు ఫిర్యాదు చేసేవారి వివరాలు ఎంత భద్రంగా ఉంటాయన్నదానిపై డయల్‌ 100 కథనంలో ఇదివరకే చర్చించాం.

పోర్టల్ రసీదు నంబర్ వచ్చినంత మాత్రాన FIR నమోదైనట్లు కాదు. పోర్టల్ ఫిర్యాదు, FIR రెండూ వేర్వేరు దశలు.

డబ్బు తప్పకుండా తిరిగి వస్తుందా?

బల్లపై రూ.0 బ్యాలెన్స్‌ చూపిస్తున్న ఫోన్‌, పక్కన పర్సు, గడియారం — మోసంతో ఖాళీ అయిన ఖాతాకు ప్రతీక

ఖచ్చితంగా చెప్పలేం. ఇదంతా ఎంత త్వరగా చెప్పారు, డబ్బు ఇంకా ఆ ఖాతాల్లోనే ఉందా, మోసం ఎలా జరిగింది వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. డబ్బును ఆపడం (ఫ్రీజ్), అది మీ ఖాతాలో తిరిగి పడటం కూడా వేర్వేరు దశలు.

ఆపిన డబ్బు తిరిగి రావాలంటే సాధారణంగా మేజిస్ట్రేట్ ఆదేశం కావాలి. లోక్ అదాలత్‌లలో ఇలాంటి కేసులు ఒకేసారి వేల సంఖ్యలో పరిష్కారమవుతున్నాయి. కేంద్ర హోం శాఖ మే 2026లో “మనీ రిస్టోరేషన్ మాడ్యూల్” తెచ్చింది. దీని ద్వారా కోర్టు ఆదేశం లేకుండానే డబ్బు తిరిగి ఇచ్చే వీలుంది. తెలంగాణలో జూన్ నుంచి ఇది అమల్లో ఉంది. ఈ ఏడాది ఇప్పటిదాకా తెలంగాణ పోలీసులు 24,189 మంది బాధితులకు రూ. 139.68 కోట్లు తిరిగి ఇప్పించారు. తర్వాతి నేషనల్ లోక్ అదాలత్ డిసెంబర్ 12, 2026న జరుగనుంది. మీ కేసును అందులో చేర్చమని దర్యాప్తు అధికారిని అడగొచ్చు.

“మూడు రోజుల్లో ఫిర్యాదు చేస్తే ఏ UPI మోసానికైనా పూర్తి రీఫండ్ వస్తుంది” అనే ప్రచారాన్ని నమ్మొద్దు. అనధికార లావాదేవీలపై RBI నిబంధనల్లో షరతులు ఉన్నాయి. అది మీరు చేయని లావాదేవీనా, లేక మోసగాడి మాటలు నమ్మి మీరే చెల్లించారా అన్నది ఫిర్యాదులో స్పష్టంగా చెప్పాలి.

జనవరి 1, 2027 నుంచి (వాణిజ్య బ్యాంకుల ఖాతాదారులకు) ఈ నిబంధనలు కూడా మారుతున్నాయి. మోసగాడి ఒత్తిడికో, బెదిరింపుకో లొంగి మీరే చెల్లింపు చేసినా కూడా మోసంగానే పరిగణిస్తారు. 50,000 రూపాయల వరకు నష్టపోయినవారికి, నష్టంలో 85% లేదా రూ. 25,000.. రెండింటిలో ఏది తక్కువైతే అది, జీవితంలో ఒక్కసారి మాత్రమే పరిహారంగా వస్తుంది. కాకపోతే ఒక షరతు – ఐదు రోజుల్లోపు 1930 లేదా పోర్టల్‌కూ, బ్యాంకుకూ రెండు చోట్లా ఫిర్యాదు చేసి ఉండాలి.

డబ్బు వెనక్కి తెప్పిస్తామంటూ డబ్బు అడిగేవారు కూడా ఉన్నారు – జాగ్రత్త. రెండో మోసం అక్కడే మొదలవుతుంది. OTP, UPI PIN ఎవరికీ చెప్పకండి. ఫిర్యాదు నంబర్లు, మీరు ఎవరిని ఎప్పుడు సంప్రదించారో జాగ్రత్తగా రాసుకుని, బ్యాంకు దగ్గరా పోలీసుల దగ్గరా ఫాలోఅప్ చేస్తూ ఉండాలి.

తర్వాత చదవండిఎలక్ట్రిక్‌ కార్లు, స్కూటర్లు – సోలార్‌ చార్జింగ్‌ స్టేషన్‌ వద్దబిజినెస్ఈవీ: మనం కొనడానికి సిద్ధం… దేశం సిద్ధమా?

ఈ కథనంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం. ఏదైనా తప్పు కనిపిస్తే contact@maromaata.comకు రాయండి — సరిచేస్తాను. సంపాదకీయ విధానం →

చెర్మాల శ్రీనివాస్

రచయిత

నా గురించి →

మరిన్ని కథనాలు

షేర్