‘రణబాలి’గా విజయ్ దేవరకొండ
- ట్రైలర్ రాకముందే ‘రణబాలి’పై పెయిడ్ ప్రచారం
- చిరిగిన జీన్స్ వెటకారానికి విజయ్ జవాబు
- బతుకమ్మను నెత్తికెత్తుకున్న తెలంగాణ కోడలు రష్మిక
- కళకు ప్రాంతం లేదు: ఆనంది, విజయ్ సాక్ష్యం
సద్దుల బతుకమ్మ రోజు ట్యాంక్‌బండ్ వీడియో ఒకటి నా కంటపడింది. వేలాది మంది ఆడబిడ్డలు చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడుతున్నారు. ఆ వలయంలో పట్టుచీర కట్టుకుని, అందరితో కలిసి చప్పట్లు కొడుతూ ఆడుతోంది రష్మిక… రష్మిక దేవరకొండ. కొంచెం దూరంలో పసుపు కుర్తాలో నవ్వుతూ నిలబడ్డాడు విజయ్ దేవరకొండ. ఆ వీడియోను నేను మళ్లీ మళ్లీ చూశాను.
చూశాక సోషల్ మీడియాలో అందరూ అంటున్న మాటే నా నోటి నుంచీ వచ్చింది… నువ్వు మగాడివిరా బుజ్జీ..!
ఎందుకో చెబుతా. ఆ నవ్వు వెనక నెలల తరబడి ట్రోల్స్ ఉన్నాయని నాకు తెలుసు. దుస్తుల మీద వెటకారాలు ఉన్నాయి. సినిమా విడుదల కాకముందే దాన్ని తొక్కేయాలనే ప్రచారం ఉంది. అన్నిటినీ తట్టుకుని, ఎవరికీ తలవంచకుండా, తన మట్టి పండుగకు భార్యను వెంటబెట్టుకుని వచ్చి నిలబడ్డాడు. రష్మిక బతుకమ్మ ఆడితే చూడాలని ఎప్పటినుండో నా కోరిక అన్నాడు. నా దృష్టిలో ఇది ఒక హీరో కథ కాదు. ఒక తెలంగాణ బిడ్డ కథ.
బతుకమ్మ అంటే పూల పండుగ కాదు
తెలంగాణ ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన సద్దుల బతుకమ్మ సంబరాలకు గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క హాజరయ్యారు. ప్రభుత్వ ఆహ్వానంపై విజయ్, రష్మిక కూడా వచ్చారు. ఆ సాయంత్రం అందరి కళ్లూ వాళ్లిద్దరి మీదే ఉన్నాయి.
రష్మిక పుట్టింది కర్ణాటకలోని కొడగులో. కానీ పెళ్లయ్యాక వచ్చిన తొలి బతుకమ్మ పండుగకు తెలంగాణ కోడలిగా బతుకమ్మను నెత్తికెత్తుకుంది. మన ఆడబిడ్డల మధ్య మన ఆడబిడ్డలాగే కలిసిపోయింది. ఆ దృశ్యం చూస్తుంటే నా మనసు నిండిపోయింది. విజయ్ ఆ వీడియోను పంచుకుంటూ “సద్దుల బతుకమ్మా.. నా ముద్దుల జయమ్మా” అని రాశాడు. జయమ్మ అంటే ‘రణబాలి’లో రష్మిక పాత్ర పేరు.

నాకు బతుకమ్మ అంటే కేవలం పూల పండుగ కాదు. అది తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం. మా అమ్మల జ్ఞాపకం, మా అక్కాచెల్లెళ్ల సంబరం, మా ఊరి గుర్తు. అలాంటి పండుగలోకి భార్యను తీసుకురావడం నా దృష్టిలో మామూలు విషయం కాదు. దేశమంతా అభిమానులున్న రష్మిక ద్వారా మన బతుకమ్మ ఇంకా ఎంతో మంది కొత్తవాళ్ల కళ్లలో మెరిసింది.
భార్యకు తన సంస్కృతిని పరిచయం చేయడం గొప్ప విషయం. ఆ సంస్కృతిని భార్యతో కలిసి గౌరవించడం అంతకంటే గొప్ప విషయం అని నేను నమ్ముతాను. తను కూడా భర్త సంప్రదాయాలను గౌరవించడం మనసు పులకరించిపోయే సందర్భం.
తెలంగాణ యాసకు హీరోయిజం తెచ్చినోడు
విజయ్ కుటుంబం మూలాలు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా తుమ్మన్‌పేట గ్రామంలో ఉన్నాయి. పెరిగింది హైదరాబాద్ సరూర్‌నగర్‌లో. తండ్రి టీవీ సీరియళ్ల దర్శకుడు. అక్కడ విజయం దక్కక ఆ పనే మానేశారు. సినిమా వారసత్వం లేదు, పెద్దల అండ లేదు. చిన్న పాత్రలతో మొదలుపెట్టాడు.
‘పెళ్లిచూపులు’తో హీరో అయ్యాడు. ‘అర్జున్ రెడ్డి’తో దేశమంతా మాట్లాడుకునేలా చేశాడు. ఆ దశాబ్దపు వంద గొప్ప నటనల్లో ఒకటిగా ‘ఫిల్మ్ కంపానియన్’ ఆ పాత్రను ఎంచుకుంది.
నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. తెలుగు సినిమాలో తెలంగాణ యాస అంటే కామెడీ పాత్రలకో, విలన్ పక్కనుండే రౌడీలకో పరిమితం. ఆ యాసను హీరో నోట స్టైల్‌గా, గర్వంగా వినిపించిన వాళ్లలో విజయ్ ఒకడు. బోనాలకు లాల్ దర్వాజా మహంకాళి గుడికి వెళ్తాడు. వినాయక చవితికి బాలాపూర్ గణపతి దగ్గరకు వెళ్తాడు. ఇప్పుడు సద్దుల బతుకమ్మకు భార్యతో వచ్చాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మర్చిపోలేదు. నాకు అదే నచ్చింది.
ట్రైలర్ రాకముందే ద్వేషం
‘రణబాలి’ ట్రైలర్ ఇంకా బయటికి రాలేదు. అప్పటికే సోషల్ మీడియాలో రీళ్లు వరదలా వచ్చాయి. అన్నీ ఒకే మాట: ‘రణబాలి’ వద్దు, ‘జైలర్ 2’ చూడండి. ఒకేసారి, ఒకే తీరులో, ఒకే అభిప్రాయం. ముప్పై అయిదేళ్లు మీడియాలో ఉన్నవాడిగా, ఇది కాకతాళీయంగా వచ్చిన అభిప్రాయం కాదని నాకు ఖచ్చితంగా తెలుసు.
అంతటితో ఆగలేదు. ‘రణబాలి’ షూటింగ్ కోసం విజయ్ ఐదారు కారవాన్లు అడిగాడంటూ వార్తా పోర్టళ్ల పేరుతో నకిలీ స్క్రీన్షాట్లు తిప్పారు. అవి పూర్తిగా అబద్ధమని విజయ్ బృందం అధికారికంగా ప్రకటించాల్సి వచ్చింది. ట్రైలర్ రాకముందే ద్వేషపు పోస్టులు చూశానని నిర్మాత రవిశంకర్ స్వయంగా చెప్పారు.
నేను ఒకటే అడుగుతున్నా. ఒక అబద్ధాన్ని వంద సార్లు షేర్ చేస్తే అది నిజమైపోతుందా? ఒక అవమానాన్ని పదేపదే అరిస్తే అది విశ్లేషణ అయిపోతుందా? సినిమా చూడకముందే తీర్పు రాసేసి ప్రేక్షకుడి మీద రుద్దడం నా దృష్టిలో విమర్శ కాదు, కుట్ర.
విజయ్ మౌనంగా ఉండలేదు. ట్రైలర్ లాంచ్‌లో సూటిగా అడిగాడు: “నా ప్రయాణాన్ని జీర్ణించుకోలేకపోతే నేను ఇంట్లో కూర్చోవాలా?” ఇది ద్వేషం కూడా కాదు, డబ్బులిచ్చి చేయిస్తున్న ప్రచారం అన్నాడు. “మారాల్సింది నేను కాదు, వాళ్లు” అన్నాడు. నాకు ఆ మాటల్లో పొగరు కనిపించలేదు, ఆత్మవిశ్వాసం కనిపించింది. ఏళ్ల తరబడి పదేపదే తనను తాను సమర్థించుకోవాల్సి వస్తున్న మనిషి ఆవేదన కనిపించింది.
ఆ మాట నాకు వ్యక్తిగతంగా ఎంతో నచ్చింది. ఆత్మగౌరవం కోసం నేనూ నిలబడ్డవాడినే. అందుకే చెబుతున్నా. ఆత్మవిశ్వాసానికి, అహంకారానికి తేడా తెలియని వాళ్ల కోసం మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవడో ఇంట్లో కూర్చుని నాలుగు కామెంట్లు పెడితే మన కష్టాన్ని, మన ఎదుగుదలను తక్కువ చేసుకోవాల్సిన పని లేదు.
చిరిగిన జీన్స్ కాదు.. చెరిగిపోని పట్టుదల!
ట్రోల్స్ బయటివాళ్లవే అనుకుంటే పొరపాటే. ఇండస్ట్రీ వేదికల మీద నుంచే వెటకారాలు వచ్చాయి. ఒక్క హిట్ రాగానే కొందరు హీరోలు చిరిగిన జీన్స్ వేసుకుని తిరుగుతారని, ‘వాట్సప్.. వాట్సప్’ అంటుంటారని ‘కె-ర్యాంప్’ సక్సెస్ మీట్లో నిర్మాత బండ్ల గణేష్ ఎద్దేవా చేశారు. విమర్శలు రావడంతో తాను విజయ్ పేరే ఎత్తలేదని వివరణ ఇచ్చారు, క్షమాపణ కూడా చెప్పారు. సరే, ఆ వివరణను నేను గౌరవిస్తాను. కానీ నాకో ప్రశ్న మిగిలే ఉంది: ఒక కళాకారుడి పని గురించి మాట్లాడాల్సిన వేదిక మీద బట్టల మీద వెటకారం ఎందుకు? ఒక నటుడి ప్రతిభను కొలవడానికి ఆయన వేసుకున్న ప్యాంటు కొలతలు అవసరమా?
విజయ్ ఏ బట్టలు వేసుకోవాలి, ఎలా మాట్లాడాలి అనేది ఆయన ఇష్టం. ఒకరి దుస్తులను ఎగతాళి చేసి చప్పట్లు కొట్టించుకోవడం సులభం. ప్రతిభతో ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించడం చాలా కష్టం.
విజయ్ సినిమాలపై భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఆయన్ను విమర్శించే హక్కు అందరికీ ఉంది. నేనూ ఆయన ప్రతీ సినిమాను మెచ్చుకోలేదు. కానీ నటుడిని ఆయన నటనతో, సినిమా ఫలితాలతో విమర్శించడం వేరు. రూపాన్ని, బట్టలను, మూలాలను ఎగతాళి చేయడం వేరు. తెలుగు సినిమాకు కావాల్సింది వెటకారం కాదు, పరస్పర గౌరవం.
విజయ్ మీద వచ్చే ప్రతి విమర్శకూ నేను ప్రాంతం రంగు పూయను. ఆయనకు ఆంధ్రాలోనూ లక్షలాది అభిమానులున్నారు. కానీ ఒకటి మాత్రం స్పష్టం. ఎవరి యాసనైనా, ఎవరి మూలాలనైనా కించపరిస్తే ప్రశ్నించి తీరాల్సిందే. సినిమాను విమర్శించడానికి ఆ నటుడు పుట్టిన నేలను అవమానించాల్సిన అవసరం ఏముంది?
కళకు ప్రాంతం లేదు అనడానికి ఇవాళ నా ముందు రెండు సినిమాలే సాక్ష్యం. ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితాన్ని తెర మీదకు తెస్తే, ఆ పాత్రకు ప్రాణం పోసింది మా వరంగల్ అమ్మాయి ఆనంది. ఉత్తరాంధ్ర యాసను కష్టపడి నేర్చుకుంది, గౌరవించింది. ఉత్తరాంధ్ర ప్రేక్షకులు ఆమెను గుండెలకు హత్తుకున్నారు. ఇటు రాయలసీమ కరువు కథ ‘రణబాలి’ని తెలంగాణ బిడ్డ విజయ్ మోశాడు, కర్ణాటక అమ్మాయి రష్మిక జయమ్మగా నిలబెట్టింది. రాయలసీమ వాసులు రణబాలి మా సినిమా అని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మీరే చెప్పండి, ఇవి ఏ ప్రాంతపు సినిమాలు? రెండూ తెలుగు సినిమాలే. మన సినిమాలే. మనల్ని కలిపేది కళ. విడదీసేది కేవలం సంకుచిత మనస్తత్వం.
‘రణబాలి’ – కళ్లకు కాదు, మనసుకు విందు
“అన్నం పరబ్రహ్మ స్వరూపం” అనే మాటతో సినిమా మొదలవుతుంది. అక్కడే నాకు ఈ సినిమా మీద నమ్మకం కుదిరింది. పందొమ్మిదో శతాబ్దంలో బ్రిటిష్ పాలనలో రాయలసీమను కాల్చేసిన కరువు నేపథ్యంలో, నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా రణబాలి అనే పాత్రను సృష్టించాడు దర్శకుడు రాహుల్ సంకృత్యాన్. కరువు రాక్షసుడు, పాలెగాడు, జయమ్మ, కోబలి అంటూ అంకాలుగా కథను తెరకెక్కించాడు. గుప్పెడు మెతుకుల కోసం మన పూర్వీకులు పడ్డ పాట్లు చూశాక నాకు అన్నం మీద గౌరవం పెరిగింది. ఒక్క మెతుకు కూడా వృథా చేయాలనిపించడంలేదు.
విజయ్ ఈ పాత్రలో రౌద్ర రసం కురిపించాడు. స్క్రీన్ ప్రెజెన్స్ అమోఘం. ఫలితం ఏదైనా, ఆయన కెరీర్లో ఇది మర్చిపోలేని పాత్ర అని నేను నమ్ముతున్నా. “సినిమాను విజయ్ తన భుజాల మీద మోశాడు” అని ఒక పంపిణీదారుడే అన్నాడు.
జయమ్మగా రష్మిక సినిమాకు ప్రాణం పోసింది. పెళ్లి తర్వాతి సన్నివేశంలో, రణబాలి పోరాటానికి అండగా నిలిచే చోట, మరణ సన్నివేశంలో ఆమె నటన నా కంట నీరు తెప్పించింది. కొన్నిచోట్ల హీరోనే డామినేట్ చేసింది. నిజ జీవిత జంట తెర మీద కలిస్తే ఆ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూపించారు. బ్రిటిష్ కమిషనర్‌గా హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ మెప్పించాడు.

నిజాయితీగా చెప్పాలంటే సెకండ్ హాఫ్‌లో స్క్రీన్‌ప్లే తడబడింది. రివ్యూలు మిశ్రమంగా వచ్చాయి. ఒకరోజు ముందే వచ్చిన ‘జైలర్ 2’ థియేటర్లను పంచుకుంది. ట్రోల్స్ ముందే సమాధి కట్టేశాయి. అయినా మొదటి వారంలోనే సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.63 కోట్లు దాటింది. ఆ వసూళ్లలో సింహభాగం తెలుగు రాష్ట్రాల నుంచే. సోషల్ మీడియా ఏం అరిచినా, మన ప్రేక్షకులే ఈ సినిమాను భుజాన మోస్తున్నారు.
‘జైలర్ 2’తో పోలుస్తారా? నా దృష్టిలో అది వేరు, ఇది వేరు. అది కళ్లకు విందు. ఇది మనసుకు విందు. ఎలివేషన్ల కోసమే సినిమా చూసేవాళ్లకు ఇది నచ్చకపోవచ్చు. మనసుతో చూస్తే మాత్రం తప్పకుండా నచ్చుతుంది. గరివిడి లక్ష్మి కూడా అంతే.
వెన్నంటి నిలిచిన రష్మిక
‘కాఫీ విత్ కరణ్’ ప్రోమో రాగానే మళ్లీ ట్రోల్స్ మొదలయ్యాయి. పెళ్లి చేసుకుందామని రష్మికే ఏడాది పాటు అడిగిందట. “సరే, వందసార్లు అడిగావు కదా” అని విజయ్ సరదాగా అన్నాడు. అంతే, ఆమెను అవమానించాడంటూ కామెంట్లు వెల్లువెత్తాయి.

కానీ నేను పూర్తి కథ విన్నాను. పెళ్లి అనేది ఆవేశంలో తీసుకునే నిర్ణయం కాదని విజయ్ అన్నాడు. బాధపడతానేమోననే భయం ఉండేదని ఒప్పుకున్నాడు. కష్టసుఖాల్లో ఆ బంధాన్ని పరీక్షించుకున్నాడు. తర్వాత ఉదయ్‌పూర్‌లో సంగీత్ రాత్రి స్నేహితుల ముందు మోకాళ్ల మీద కూర్చుని రష్మికకు ప్రపోజ్ చేశాడు. తన ప్రపోజల్ మనసులో ఎప్పటికీ సజీవంగా ఉండాలని. ఈ ఏడాది ఫిబ్రవరి 26న వాళ్ల పెళ్లి జరిగింది. ఇందులో అవమానం ఎక్కడుందో నాకు అర్థం కాలేదు.

రష్మిక ఇవాళ దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరు. ఆమె భర్త కోసం నిలబడింది. “విజయ్ పనితీరుకు నేను ఎప్పటికీ అభిమానినే” అని బహిరంగంగా చెప్పింది. ట్రోల్స్ ఎంత గోల చేసినా, ఆ ఇద్దరి మధ్య నమ్మకం చెక్కుచెదరలేదు. బతుకమ్మ చక్రంలో ఆమె చప్పట్లే దానికి సాక్ష్యం.
నువ్వు మగాడివిరా బుజ్జీ..!
నా దృష్టిలో విజయ్‌కు ఉన్న అసలైన బలం ఆయన్ను ఎవరూ వెటకారం చేయలేరన్నది కాదు. ఎంత వెటకారం ఎదురైనా తనదైన గుర్తింపుతో ముందుకు సాగగలగడం. హేళనకు గురవుతున్నా, తన వ్యక్తిత్వాన్ని మార్చుకోకుండా, తన పని ద్వారా జవాబు చెప్పడం.
“అపజయం ఒక సినిమా ఫలితం మాత్రమే. ఒక నటుడి భవిష్యత్తుపై తీర్పు కాదు.
నాకు తెలంగాణ అంటే ఒక భౌగోళిక ప్రాంతం కాదు. అది ఒక భావోద్వేగం, ఒక పోరాటం, ఒక ఆత్మగౌరవం. ఆ ఆత్మగౌరవాన్ని తెర మీదా, తెర బయటా మోసుకెళ్తున్నాడు విజయ్. ట్రోల్స్ రావచ్చు, పోవచ్చు. సినిమాలు ఆడొచ్చు, ఆడకపోవచ్చు. కానీ ట్యాంక్‌బండ్‌పై ఆ సాయంత్రం ఆయన నిలబడిన తీరు మాత్రం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
విజయ్ పని మీద తీర్పు చెప్పే హక్కు ప్రేక్షకులకు ఉంది. ఆయన ఆత్మగౌరవాన్ని కాలరాసే హక్కు మాత్రం ఎవరికీ లేదు.
హ్యాట్సాఫ్ విజయ్ దేవరకొండా..! థాంక్యూ రష్మిక దేవరకొండా..! మన బతుకమ్మను గౌరవించినందుకు, మన పండుగకు మరింత అందం తెచ్చినందుకు నా మనస్ఫూర్తిగా అభినందనలు.
విజయ్… నువ్వు కేవలం సినిమా హీరోవు కాదు. తెలంగాణ బిడ్డవని మరోసారి నిరూపించావు. అందరూ అంటున్నట్టే… నువ్వు మగాడివిరా బుజ్జీ..! కాదు కాదు… నువ్వు మగాడివిరా విజ్జీ..!







