అభిప్రాయాలు… ఆలోచనలు… అక్షరాలు…

తెలుగు మాట్లాడటమే అవమానమా?

మన తర్వాతి తరంలో చాలామంది తెలుగు మాట్లాడగలుగుతున్నారు. కానీ చదవడం, రాయడం దగ్గరకు వచ్చేసరికి తడబడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరో తరం తర్వాత తెలుగు పరిస్థితి ఏమిటి? “మా తాతయ్య, నానమ్మ మాట్లాడే భాష తెలుగు” అని పిల్లలు చెప్పుకునే రోజు వస్తే అంతకంటే అవమానం ఇంకేముంటుంది?

చెర్మాల శ్రీనివాస్10 సెప్టెంబర్ 2026 · సవరణ: 12 అక్టోబర్ 2026 · 2 నిమిషాలు
symbloic alphabets of telugu language
ఈరోజు తెలుగు భాషా దినోత్సవం(ఆగస్టు 29).
ఉదయం తెలుగు దినపత్రికలు తిరగేస్తుంటే ఒకింత బాధ కలిగింది. తెలుగు అక్షరాన్నే నమ్ముకుని, తెలుగు పాఠకుడి ఆదరణతో మనుగడ సాగిస్తున్న పత్రికల్లోనే తెలుగు భాషా దినోత్సవానికి సరైన ప్రస్తావన కనిపించలేదు.
ఇంతకంటే విషాదం ఏముంటుంది?
రాజకీయ నాయకుల పుట్టినరోజులు గుర్తుంటాయి. సినిమా తారల పుట్టినరోజులు గుర్తుంటాయి. ప్రపంచంలో ఎక్కడెక్కడో జరుపుకొనే రకరకాల ‘డే’లు గుర్తుంటాయి. వాటిపై ప్రత్యేక కథనాలూ వస్తాయి. కానీ మన భాషకు సంబంధించిన రోజు మాత్రం మనకే గుర్తుండదు!
ఇది పత్రికల తప్పు మాత్రమే కాదు. మనందరి తప్పు.
తమిళుడిని చూడండి. తన తమిళం అంటే ఎంత గర్వమో. కన్నడిగుడిని చూడండి. తన భాషకు ఎంత ప్రాధాన్యం ఇస్తాడో. వాళ్ల డబ్బింగ్ సినిమాలకు కూడా ఆ బాష పేర్లే ఉంటాయి.
మరి మనం?
ఇద్దరు తెలుగువాళ్లు కలిసినా ఇంగ్లీషులో మాట్లాడుకోవడమే హుందాతనంగా భావించే స్థితికి వచ్చేశాం. పిల్లవాడు నాలుగు ఇంగ్లీషు వాక్యాలు మాట్లాడితే మురిసిపోతాం. కానీ అదే పిల్లవాడికి నాలుగు తెలుగు ముక్కలు చదవడం రాకపోయినా పరవాలేదు. ‘అమ్మానాన్న’లంటే అసహ్యం.. ‘మమ్మీడాడీ’లంటే సంబరం.. ఇంకా దారుణమేంటంటే, తెలుగు నేల మీదే కొన్ని బడుల్లో తెలుగు మాట్లాడకూడదట! తెలుగు మాట్లాడితే మందలింపులు… శిక్షలు… తెలుగు రాష్ట్రంలో తెలుగు పిల్లవాడు తెలుగు మాట్లాడినందుకు శిక్ష అనుభవించాల్సి రావడమేంటి?

ఇదేనా మనం చెప్పుకుంటున్న అభివృద్ధి?

ఇంగ్లీషు వద్దని ఎవరు అన్నారు? ఇంగ్లీషు నేర్చుకోవాలి. బాగా నేర్చుకోవాలి. ప్రపంచంతో పోటీపడాలి. అవసరమైతే మరో నాలుగు భాషలూ నేర్చుకోవాలి.
కానీ ఇంగ్లీషు రావాలంటే తెలుగు పోవాలా? ఇంగ్లీషు మీద ప్రేమ పెంచడానికి తెలుగు మీద చిన్నచూపు ఎందుకు? మన కళ్లముందే ఒక ప్రమాదకరమైన మార్పు జరుగుతోంది.
మన తరం తెలుగు మాట్లాడగలదు… చదవగలదు… రాయగలదు.
తర్వాతి తరంలో చాలామంది తెలుగు మాట్లాడగలుగుతున్నారు. కానీ చదవడం, రాయడం దగ్గరకు వచ్చేసరికి తడబడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరో తరం తర్వాత తెలుగు పరిస్థితి ఏమిటి? “మా తాతయ్య, నానమ్మ మాట్లాడే భాష తెలుగు” అని పిల్లలు చెప్పుకునే రోజు వస్తే అంతకంటే అవమానం ఇంకేముంటుంది?
భాష ఒక్కరోజులో అంతరించిపోదు. ముందు రాయడం తగ్గుతుంది. తర్వాత చదవడం తగ్గుతుంది. ఆ తర్వాత మాట్లాడటం తగ్గుతుంది. చివరకు ఆ భాషతో ఉన్న అనుబంధమే తెగిపోతుంది. ఓ పక్క మాతృభాషలోనే విద్యాభ్యాసం ఉంటే పిల్లల మేధోవికాసం చాలా బాగుంటుందని శాస్త్రవేత్తల నిర్థారణ. మరోపక్క పరాయి భాషపై ఎడతెగని మక్కువ.
ప్రభుత్వాలను నిందిస్తాం. పాఠశాలలను నిందిస్తాం. వ్యవస్థను నిందిస్తాం. కానీ ఒక్కసారి మనల్ని మనం కూడా ప్రశ్నించుకుందాం. మన ఇంట్లో పిల్లలతో తెలుగులో మాట్లాడుతున్నామా? వాళ్ల చేత తెలుగు పుస్తకం చదివిస్తున్నామా?
తెలుగులో నాలుగు వాక్యాలు తప్పుల్లేకుండా రాయగలరా అని ఎప్పుడైనా అడిగామా? ఇంగ్లీషులో చిన్న వ్యాకరణ దోషం వస్తే కంగారుపడే మనం… తెలుగు చదవడమే రాకపోతే ఎందుకు పట్టించుకోవడం లేదు?
భాషను ప్రభుత్వం ఒక్కటే బతికించలేదు. దాన్ని మాట్లాడే ప్రజలే బతికించాలి.
అందుకే ఈ తెలుగు భాషా దినోత్సవం రోజున గిడుగు రామమూర్తి పంతులు గారి చిత్రానికి పూలమాల వేసి, రెండు గొప్ప మాటలు చెప్పడంతో మన బాధ్యత తీరిపోదు. మన పిల్లలకు తెలుగు నేర్పాలి. తెలుగులో మాట్లాడించాలి. తెలుగు చదివించాలి. తెలుగు రాయించాలి.
ఆంగ్ల భాష.. వాళ్లకు ప్రపంచపు తలుపులు తెరవాలి.
తెలుగు .. వాళ్ల మూలాలను గుర్తుచేయాలి.
ఎందుకంటే…
ఇంగ్లీషు ఒక నైపుణ్యం మాత్రమే.. కానీ, తెలుగు మన పుట్టుక. మన అమ్మ. ఇంగ్లీషు నేర్చుకుని ప్రపంచాన్ని గెలుద్దాం… తెలుగును మరిచి మనల్ని మనమే ఓడించుకోవద్దు!
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు కాదు…
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మనందరికీ ఇదొక ఆత్మపరిశీలన.
తర్వాత చదవండిసమాజంఏఐ డేటా సెంటర్లు : కనిపించని జీవన విధ్వంసం

ఈ కథనంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం. ఏదైనా తప్పు కనిపిస్తే contact@maromaata.comకు రాయండి — సరిచేస్తాను. సంపాదకీయ విధానం →

చెర్మాల శ్రీనివాస్

రచయిత

నా గురించి →

మరిన్ని కథనాలు

షేర్