థియేటర్లో సినిమా చూడటమే మర్చిపోయి చాలా కాలమైంది. ఆ మాటకొస్తే ఆఖరి థియేటర్ సినిమా ఏదో కూడా గుర్తుకురావడం లేదు.
కానీ, ఇన్నాళ్ల తర్వాత ఎందుకో ఈ సినిమా చూడాలనిపించింది. పోస్టరో, ట్రైలరో ఇందుకు ప్రేరేపించి ఉండవచ్చు. అదీకాక, నాకు ‘ఇది బాగుంటుంది’ అనిపించిన సినిమా ఇప్పటి వరకు నన్ను నిరాశపరచలేదు. పైగా నేనే రివ్యూలూ చదవలేదు కూడా..
అదే సూర్య నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’
సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చి చాలాసేపైనా… ఇంకా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనుభూతి నుంచి బయటకు రాలేకపోతున్నాను.
ఈ మధ్య సినిమాలంటే రక్తపాతం, హింస, అరుపులు, చంపుళ్లు, నరుకుళ్లు, అసహ్యకరమైన ఎక్స్పోజింగులు… ఇవే ఎక్కువగా కనిపిస్తున్న సమయంలో — కుటుంబ బంధాలు, ప్రేమ, అనుబంధాలు, మనుషుల మధ్య ఉండే సున్నితమైన భావోద్వేగాలతో కూడా ప్రేక్షకుడిని కట్టిపడేయవచ్చని మరోసారి నిరూపించిన సినిమా ఇది.
161 నిమిషాలు… దాదాపు మూడు గంటలు! అయినా ఒక్కచోట కూడా బోర్ కొట్టదు. సినిమా నిడివి మనకు గుర్తుకురాదు. పాత్రలతో పాటు మనమూ ప్రయాణిస్తూ… నవ్వుతూ… బాధపడుతూ… వాళ్ల సంతోషాన్ని, బాధను మనదిగా భావిస్తూ చూస్తూనేఉంటాం.
అదే దర్శకుడు వెంకీ అట్లూరి సాధించిన అతిపెద్ద విజయం.
నాకు మాత్రం ఇది ప్రధానంగా ఒక 3-Person Show .. సూర్య, మమితా బైజు, రాధిక!
సూర్య… హుందాతనానికి మరో పేరు!
సూర్యను చూస్తున్నంతసేపూ పదే పదే ‘గజినీ’లోని సంజయ్ రామస్వామి గుర్తుకొచ్చాడు.
అందులో సంజయ్ రామస్వామి…
ఇందులో సంజయ్ విశ్వనాథ్!
ధనవంతుడైన కథానాయకుడంటే ఖరీదైన కార్లు, ప్యాలెస్‌లు, మందీమార్బలం మాత్రమే కాదు… నడకలో, మాటలో, చిరునవ్వులో, ఎదుటివారితో వ్యవహరించే తీరులో హుందాతనం, సంస్కారం, స్థాయి కనిపించాలి. అలాంటి పాత్రను అంత సహజంగా పోషించడంలో సూర్యకు సూర్యనే సాటి అనిపించింది.
గజినీలోని సంజయ్ రామస్వామిలో కనిపించిన అమాయకత్వం, హుందాతనం, సున్నితత్వం… ఇన్నేళ్ల తర్వాత మరింత పరిణతితో సంజయ్ విశ్వనాథ్‌లో మళ్లీ కనిపించాయి. సూర్య ఆ పాత్రను పోషించినట్టు కాదు… సంజయ్ విశ్వనాథ్‌గా జీవించినట్టే అనిపించాడు. తన వయసుకు తగ్గ పాత్ర..
హీరోయిన్ మమితా బైజు… తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదనుకుంటా..ఎంత ఎనర్జీ! ఎంత సహజత్వం.. ముందు చిలిపి అమ్మాయిగా ఆమె తెరమీద కనిపించిన ప్రతిసారీ ఒక అద్భుతమైన ఎనర్జీ. ఆ అల్లరి, అమాయకత్వం, చలాకీతనం అన్నీ ఎంతో సహజంగా పలికించింది. అదే అమ్మాయి తర్వాత ప్రేమ కోసం తపించిపోయే వనితగా మారినప్పుడు… ఆ భావోద్వేగాల్లో కూడా ఎక్కడా అతిగా చేయకుండా అంతే సహజంగా నటించింది.
ఇక రాధిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అందుకే నాకు ఇది నిజంగా సూర్య–మమితా–రాధికల 3-Person Show.
ఈ ముగ్గురి మధ్య భావోద్వేగాలను పేర్చుకుంటూ, కుటుంబ బంధాలను, ప్రేమను, సంఘర్షణలను కమర్షియల్ సినిమా వలయంలోనే ఇంత హృద్యంగా చెప్పిన వెంకీ అట్లూరిని ప్రత్యేకంగా అభినందించాలి.
మన హీరోలైతే ఏం చేసేవారో..!
అయితే… సూర్యను చూస్తున్నంతసేపూ నన్ను ఒక ప్రశ్న వెంటాడింది.
ఈ కథ మన తెలుగు అగ్రహీరోల దగ్గరకు వెళితే… ఎంతమంది ఒప్పుకుంటారు? ‘నా ఇమేజ్‌కు సరిపోతుందా?’.. ‘నా ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?’అనే ప్రశ్నలు ముందే వచ్చేస్తాయేమో!
కానీ, సూర్యలాంటి స్టార్‌ను చూసినప్పుడు ఒక విషయం అర్థమవుతుంది.
స్టార్డమ్ అంటే ప్రతి సినిమాలో తనను తాను ఆకాశంలో చూడ్డం కాదు… అవసరమైనప్పుడు ఆ ‘స్టార్’ను కిందకు దించి, ‘నటుడి’గా ముందుకు తీసుకురాగలగడం కూడా!

మన తెలుగు సినిమాల దరిద్రం ఏంటంటే, ఏదైనా ఒక సినిమా హిట్టయితే, అదేదో ‘ఫార్ములా’ అనుకుని అందరూ అదే బావిలో దూకుతుంటారు. దీనికి హీరోలు, నిర్మాతలు, దర్శకులు అతీతులు కారు. ప్రేక్షకులకు యానిమళ్లు, టాక్సిక్లు, బాహుబలులే కాదు, ఫిదాలు, గీతగోవిందాలు, నిన్నే పెళ్లాడతాలు, బలగాలు, సత్యం–సుందరాలు కూడా నచ్చుతాయి. అంటే ఇక్కడ కూడా తరాల అంతరాలు ఉన్నాయోమో మరి..
అయితే ఒక మంచి కథ, మంచి పాత్ర, మనుషుల మధ్య ప్రేమ, కుటుంబ బంధాలు ఎప్పుడూ మనసును కదిలిస్తాయి. అప్పుడు అది మూడు గంటలైనా, నాలుగు గంటలైనా ప్రేక్షకుడికి తెలియదు. 161 నిమిషాల ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అందుకు నిదర్శనం.
తెలుగు అగ్రహీరోలు కూడా అప్పుడప్పుడూ తమ ‘ఇమేజ్’ అనే చట్రం నుంచి బయటకు వచ్చి, రొటీన్ అభిమానులను మరిచిపోయి ఇలాంటి కథలకు తమను తాము అప్పగిస్తే వాళ్ల స్టార్డమ్ ఏమీ తగ్గకపోగా, నటులుగా వాళ్ల స్థాయి మరింత పెరుగుతుంది!
చాలాకాలం తర్వాత కుటుంబమంతా కలిసి చూసి… నవ్వుకుని, కదిలిపోయి.. మనసు నిండా ఒక ఆహ్లాదంతో థియేటర్ నుంచి బయటకు వచ్చిన సినిమా ఇది.
కొన్ని సినిమాలు థియేటర్లోనే ఆగిపోతాయి… కొన్ని మాత్రం మనతో పాటు ఇంటికొస్తాయి.
‘విశ్వనాథ్ అండ్ సన్స్’… ఇప్పుడు కూడా నాతోనే ఉంది..









