ప్రతీకాత్మక చిత్రం
ముప్పై ఏళ్లకు పైగా పత్రికల్లో పనిచేశాను. రోజూ ఎన్నో దారుణాలు నా టేబుల్ మీదుగా ప్రింటింగ్‌కు వెళ్లాయి. హత్యలు, అత్యాచారాలు, మోసాలు. వార్తను వార్తగా చూడటం అలవాటైపోయింది. కానీ ఈ వార్త చదివాక నా చేతులు వణికాయి. చాలా బాధ కలిగింది. అంతకంటే ఎక్కువ కోపం వచ్చింది. అసహ్యం వేసింది.
ఒక అమ్మాయి ఒక పాటలో నటించింది. కెమెరా ముందు, వందల మంది యూనిట్ సభ్యుల మధ్య, తన ఇష్టంతో, తాను గీసుకున్న హద్దుల్లో. రెండేళ్ల తర్వాత ఎక్కడో చీకటి గదిలో కూర్చున్న ఒకడు అదే పాటను తీసుకున్నాడు. ఆమె శరీరాన్ని తనకు నచ్చినట్టు మార్చాడు. ప్రపంచానికి పంచిపెట్టాడు. ఆమెకు తెలియదు. కానీ ఆ వీడియోలో ఉన్నది ఆమె ముఖం.
“ఇది మీమ్ కాదు. ఎడిటింగ్ కాదు. ఒక మహిళపై జరిగిన దాడి.
ఒక మహిళను అవమానించి, ఆమె ఆవేదనను వినోదంగా మార్చుకునే స్థాయికి మనం దిగజారిపోయామా? మనిషి గౌరవాన్ని ధ్వంసం చేయడానికి సాంకేతికతను వాడటం ఏ విధంగా గర్వకారణం? అరె.. మనం అడవుల్లో బతుకుతున్నామా? ఊళ్లల్లోనా? జంతువులు కూడా కొన్ని సందర్భాల్లో ‘మానవత్వా’న్ని ప్రదర్శిస్తాయే.. అంతకంటే హీనమైన బతుకెందుకు?
ఏం జరిగింది?
2024లో వచ్చిన ‘దేవర’ సినిమాలోని “చుట్టమల్లే..” పాట దృశ్యాలను వాడుకుని, ఎవరో ఏఐతో అసభ్యమైన నకిలీ వీడియో తయారుచేశారు. అక్టోబర్ మొదటి వారంలో అది X (ట్విట్టర్)లో వేగంగా పాకింది. పూర్తి వీడియో లింకులను డైరెక్ట్ మెసేజ్‌ల్లో ఒకరికొకరు పంపుకున్నారు. దీని వెనుక ఎవరున్నారో ఇప్పటికీ తెలియదు.
ఎన్టీఆర్ గట్టిగా స్పందించారు. తయారుచేసినవాళ్లను, వ్యాప్తి చేసినవాళ్లను ఒక్కరినీ వదలనని, చట్టపరంగా ఎంతవరకైనా వెళ్తానని ప్రకటించారు. చిరంజీవి తాను తీవ్రంగా కలత చెందానన్నారు. ఫిల్మ్ ఛాంబర్‌తో చర్చిస్తానన్నారు. విజయ్ దేవరకొండ, ఖుష్బూ గొంతు కలిపారు. చివరికి జాన్వీ మౌనం వీడారు. ఇలా అసభ్యంగా చిత్రించడం తన మనసును గాయపరిచిందని, ఇది లైంగిక దాడికి దగ్గరగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
పరిశ్రమ ఒక్కతాటిపై నిలవడం మంచిదే. కానీ ఒక ప్రశ్న నన్ను వెంటాడుతోంది. ప్రముఖులు స్పందిస్తేనే లేదా వారికి జరిగితేనే ఇది తీవ్రమైన నేరంగా కనిపిస్తుందా? జాన్వీకి అండగా ఎన్టీఆర్ ఉన్నారు, చిరంజీవి ఉన్నారు. మరి ఇదే అవమానం ఒక కాలేజీ అమ్మాయికి, ఒక ఉద్యోగినికి, ఒక గృహిణికి జరిగితే? ఆమె బాధ చిన్నదవుతుందా? ఆమె గొంతు ఎవరు వింటారు? ఆమెకు అండగా ఎవరు నిలుస్తారు?
ఇది మొదటిసారి కాదు. 2023 నవంబర్‌లో రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియోతో దేశం ఉలిక్కిపడింది. ప్రత్యేక చట్టం తేవాల్సిందేనని అప్పుడు అందరూ గొంతెత్తారు. ఆ తర్వాత కత్రినా కైఫ్, ఆలియా భట్, అనుపమ పరమేశ్వరన్. ఇప్పుడు జాన్వీ. మూడేళ్లు గడిచాయి. ఇప్పటికీ ఆ చట్టం రాలేదు. ఇంకెంతమంది ఆడబిడ్డల గౌరవం బలి కావాలి?
ఇది సెలబ్రిటీలకే పరిమితమనుకుంటే పెద్ద పొరపాటు. ఇటీవల కేరళలో కొచ్చి, ఆలప్పుళ, కోట్టయం, మలప్పురం, తిరువనంతపురం ప్రాంతాల్లోని కాలేజీల్లో విద్యార్థినులు, మహిళా అధ్యాపకుల ఫోటోలను మార్ఫ్ చేసిన కేసులు వరుసగా బయటపడ్డాయి. బాధితుల్లో మైనర్లూ ఉండటంతో పోలీసులు పోక్సో కేసులు కూడా పెట్టారు. ఒకప్పుడు చదువుకు, స్నేహాలకు నిలయమైన క్యాంపస్‌లో ఇప్పుడు ఆడపిల్లలను ఒకే ప్రశ్న వెంటాడుతోంది. “నా ఫోటోను ఎవరైనా మార్ఫ్ చేశారా?” అని.
నేను పైన అడిగిన సామాన్య మహిళ ఎక్కడో లేదు. మన పిల్లల క్లాస్‌రూముల్లోనే ఉంది.
సమ్మతి పాటకే, మార్ఫింగ్‌కు కాదు
ఒక పాటలో నటించడానికి ఇచ్చిన సమ్మతి, తన రూపాన్ని ఎవడో ఇష్టానుసారం అసభ్యంగా మార్చుకోవడానికి ఇచ్చిన అనుమతి కాదు. తెరపై కనిపించినంత మాత్రాన ఆమె శరీరంపై, వ్యక్తిత్వంపై, గౌరవంపై అందరికీ హక్కులు రాసిచ్చినట్లా? నటి అయినా, సాధారణ మహిళ అయినా, ఆమెను ఎలా చూపించాలో నిర్ణయించే అధికారం ఆమెదే.
“అది నిజమైన వీడియో కాదు కదా!” అని కొందరు తేలిగ్గా కొట్టిపారేస్తారు. వాళ్లను నేను ఒకటే అడుగుతాను.
“దృశ్యం కల్పితమైనంత మాత్రాన బాధ అబద్ధమవుతుందా?
ఆ వీడియో చూసినవాళ్లు తన గురించి ఏమనుకుంటారోననే భయం నిజం. తెలిసినవాళ్ల ముఖం ఎలా చూడాలనే ఆందోళన నిజం. ఆ కుటుంబం పడే వేదన నిజం. తాను చేయని తప్పును చేసినట్టు ప్రపంచం ముందు నిలబెట్టడం కంటే క్రూరమైన అవమానం ఇంకేముంటుంది?
ఇది నా ఆవేశం మాత్రమే కాదు. గోప్యత ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు పుట్టస్వామి కేసులో స్పష్టంగా తేల్చి చెప్పింది. ఒకరి ముఖాన్ని, రూపాన్ని వారి అనుమతి లేకుండా వాడుకోవడం ఆ హక్కుపై నేరుగా జరిగే దాడి.
ఆమె మనిషి కావడం సరిపోదా?
ఇలాంటి వీడియో చేసినవాడి కాలర్ పట్టుకుని “నీ ఇంట్లో తల్లీ, అక్కాచెల్లెళ్లు లేరా?” అని అడగాలనిపిస్తుంది. కానీ ఆ మాట అనబోయి ఆగిపోయాను. ఒక మహిళను గౌరవించడానికి ఆమె ఎవరికో తల్లో, అక్కో, చెల్లో కావాలా? ఆమె ఒక మనిషి కావడం సరిపోదా? ఆమెకూ మనసుంటుందని, అవమానిస్తే గాయపడుతుందని అర్థం చేసుకోవడానికి ఏ డిగ్రీ కావాలి?
మరొకరిని బాధపెట్టి ఆనందించడం మనిషి లక్షణం కాదు. అది రాక్షసానందం. మోసపు డబ్బుతో చేసే జల్సాకు, కష్టపడి సంపాదించి ఇంటిల్లిపాదీ కలిసి అనుభవించే ఆనందానికి ఎక్కడైనా పోలిక ఉందా?
నా కోపం ఆ వీడియో తయారుచేసినవాడి మీదే కాదు. దాన్ని ఇష్టంగా చూసినవాళ్లు, “లింక్ పంపు బ్రో” అని అడిగి తెప్పించుకున్నవాళ్లు, నవ్వుకుంటూ పదిమందికి పంచినవాళ్లు. వీళ్లంతా ఆ నేరంలో భాగస్తులే. ప్రతి ఒక్క షేర్ ఆమె గౌరవంపై పడే మరో దెబ్బ. ఖండిస్తున్నామంటూనే అదే వీడియోను మళ్లీ పోస్ట్ చేసేవాళ్లూ ఉన్నారు. వాళ్లు చేస్తున్నదీ వ్యాప్తే. తప్పును ప్రశ్నించడానికి ఆ దృశ్యాన్ని మళ్లీ మళ్లీ ప్రదర్శించాల్సిన అవసరం లేదు.
దోషి సాంకేతిక పరిజ్ఞానం కాదు, సంస్కారం
నిజం చెప్పాలంటే, ఈ వార్త చదివిన క్షణంలో, మనకు టెక్నాలజీలే వద్దనిపించింది. అంత విరక్తి కలిగింది. ఎందుకంటే చుట్టమల్లే వీడియో ఒక్కటే కాదు. దుర్వినియోగం ఎన్ని రూపాల్లో తిరుగుతోందో చూడండి:
● ఆన్‌లైన్‌లో వెంటాడి వేధించే స్టాకింగ్
● ఓటీపీ అడిగి ఖాతా ఖాళీ చేసే యూపీఐ, సైబర్ మోసాలు
● పోలీసులమని బెదిరించి జీవితాంతం సంపాదించిన గౌరవాన్ని భయంగా మార్చే డిజిటల్ అరెస్టులు
● అందమైన ప్రొఫైల్‌తో వల వేసి, ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేసే హనీ ట్రాప్‌లు
● యువకుల జీవితాలు గుల్ల చేసే బెట్టింగ్ యాప్‌లు
ఒకడిది డబ్బు దురాశ. మరొకడిది వికృత కామం. ఇంకొకడిది ఎదుటివాడి భయాన్ని సొమ్ము చేసుకునే కుటిలత్వం. లోన్ యాప్ వేధింపులు, బెట్టింగ్ అప్పులు, మార్ఫింగ్ బెదిరింపులు తట్టుకోలేక మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతోమంది అమాయకులు ప్రాణాలు తీసుకున్నారు.
ఇప్పుడు ఇలాంటి వీడియో చేయడానికి ఏ నైపుణ్యమూ అక్కర్లేదు. ఒక్క ఫోటో, ఒక్క బాట్ చాలు. టెలిగ్రామ్‌లో కొన్ని బాట్లకు ఫోటో పంపితే మార్ఫ్ చేసిన చిత్రం తిరిగి వచ్చేస్తుంది. కాలేజీ ఫెస్ట్‌లు, స్పోర్ట్స్ డేల ఫోటోలు ఓపెన్ డ్రైవ్ ఫోల్డర్లలో కుప్పలు తెప్పలుగా దొరుకుతాయి. చేసేవాడు ఎక్కువగా పక్కనుండేవాడే, ఏదో పగ పెట్టుకున్నవాడే. ఆ చిత్రం బయటకు రాగానే బ్లాక్‌మెయిల్ ముఠాలు రంగంలోకి దిగుతాయి. ఒక దుర్మార్గం ఇంకో దుర్మార్గానికి తెర తీస్తుంది.

కానీ కాసేపు ఆలోచించాక అర్థమైంది. చౌక ఇంటర్నెట్, అందరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్, ఉచితంగా దొరికే ఏఐ టూల్స్ అవకాశాలను పెంచాయి. నేరాన్ని పుట్టించలేదు. ఇదే టెక్నాలజీతో కోట్ల మంది చదువుకుంటున్నారు, సంపాదిస్తున్నారు, ప్రాణాలు కాపాడుతున్నారు. దాన్ని అవమానానికి వాడాలనే నిర్ణయం మనిషిది.
“‘ఏఐ చేసింది’ అనే సాకు పనికిరాదు. వీడియోను యంత్రమే తయారుచేసింది కావచ్చు. కానీ ఆదేశం ఇచ్చింది మాత్రం మనిషే.
వాడు చదువుకున్నవాడు.. కంప్యూటర్ పరిజ్ఞానం తెలిసినవాడు… ఆ తెలివితో తన కెరీర్‌ను నిర్మించుకోవచ్చు, కుటుంబానికి అండగా నిలవొచ్చు, దేశానికి పనికిరావచ్చు. ఇవన్నీ వదిలేసి ఒక మహిళ గౌరవాన్ని ధ్వంసం చేయడానికి ఆ మేధను ఖర్చుపెట్టాడు. మార్కులు తెచ్చిన చదువు సంస్కారం నేర్పలేదు. చేతికి ఫోన్ ఇచ్చిన తల్లిదండ్రులు దాన్ని ఎలా వాడాలో నేర్పలేదు.
ఇది నా ఊహ కాదు. రష్మిక వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు పట్టుకున్నది మన గుంటూరు జిల్లాకు చెందిన 24 ఏళ్ల బీటెక్ పట్టభద్రుడిని. ఎందుకు చేశాడు? రష్మిక పేరుతో తాను నడుపుతున్న ఇన్‌స్టాగ్రామ్ ఫ్యాన్ పేజీకి ఫాలోవర్లను పెంచుకోవడానికి. రెండు వారాల్లో ఫాలోవర్లు 90 వేల నుంచి లక్షా ఎనిమిది వేలకు పెరిగాయట. కేవలం పద్దెనిమిది వేల ఫాలోవర్ల కోసం ఒక అమ్మాయి గౌరవాన్ని బజారుకీడ్చాడు. ఇంతకంటే దిగజారుడు ఉంటుందా?
ఇంకో నిజం మరింత కలవరపెడుతుంది. నటి అనుపమ పరమేశ్వరన్‌పై మార్ఫ్ చేసిన ఫోటోలు, అబద్ధపు ఆరోపణలతో నకిలీ ఖాతాలు నడిపింది ఎవరో కేరళ సైబర్ పోలీసులు తేల్చారు. తమిళనాడుకు చెందిన 20 ఏళ్ల అమ్మాయి. అంటే ఈ విషం మగవాళ్లకే పరిమితం కాలేదు. మరో మహిళ గౌరవాన్ని ముక్కలు చేయడానికి ఒక మహిళే వెనకాడలేదు.
ఇది మన దేశానికి మాత్రమే పట్టిన జబ్బు కాదు. టెక్నాలజీలో మనకంటే ముందున్న దక్షిణ కొరియాలో డీప్‌ఫేక్ కేసుల్లో పట్టుబడినవాళ్లలో 93 శాతం మంది టీనేజర్లు, ఇరవైల్లోని యువకులే. అంటే ఇది ఒక దేశం సమస్య కాదు. ఒక తరం సమస్య.
చట్టం ఉంది. న్యాయం ఎక్కడ?
మన దగ్గర చట్టాలు లేవని కాదు. కానీ “అనుమతి లేని లైంగిక డీప్‌ఫేక్” అనే పేరుతో ఒక్క నేరం కూడా మన చట్టాల్లో లేదు. పోలీసులు ప్రతి కేసులోనూ వేర్వేరు సెక్షన్లకు అతుకులు వేసి వాడుకోవాల్సి వస్తోంది. ఇప్పుడున్నవి ఇవి (అన్నీ గరిష్ఠ శిక్షలు):
| చట్టం / సెక్షన్ | నేరం | గరిష్ఠ శిక్ష |
|---|---|---|
| ఐటీ చట్టం 67A | లైంగిక చర్యను స్పష్టంగా చూపే కంటెంట్ ప్రచురణ, పంపడం | 5 ఏళ్లు; మళ్లీ చేస్తే 7 ఏళ్లు; ₹10 లక్షల జరిమానా |
| ఐటీ చట్టం 67 | అశ్లీల కంటెంట్ ప్రచురణ, పంపడం | 3 ఏళ్లు, ₹5 లక్షలు; మళ్లీ చేస్తే 5 ఏళ్లు, ₹10 లక్షలు |
| BNS 78 | వెంటాడటం, ఆన్‌లైన్ నిఘా | 3 ఏళ్లు; మళ్లీ చేస్తే 5 ఏళ్లు |
| BNS 79 | మహిళ గౌరవానికి భంగం, గోప్యతలోకి చొరబాటు | 3 ఏళ్ల సాధారణ జైలు |
| BNS 356(2) | పరువు నష్టం | 2 ఏళ్లు, లేదా జరిమానా, లేదా సమాజ సేవ |
ఇక్కడే అసలు చిక్కుంది. మహిళ వ్యక్తిగత క్షణాలను చాటుగా చిత్రీకరించి వ్యాప్తి చేసేవాడి కోసం BNS సెక్షన్ 77 (వోయరిజం) ఉంది. కానీ బహిరంగంగా విడుదలైన ఒక పాట దృశ్యంతో పూర్తిగా కల్పించిన వీడియోకు అది నేరుగా వర్తించదు. చట్టంలోని ఈ లొసుగే నేరస్తుడికి లాయరు.
ప్లాట్‌ఫామ్‌లపై మాత్రం ప్రభుత్వం ఈ ఏడాది గట్టి అడుగు వేసింది. ఫిబ్రవరి 2026 ఐటీ నిబంధనల ప్రకారం మార్ఫ్ చేసిన నగ్న, లైంగిక దృశ్యాలపై బాధితులు ఫిర్యాదు చేస్తే సోషల్ మీడియా సంస్థ రెండు గంటల్లో వాటిని తొలగించాలి. ఏఐ సేవలు అందించే సంస్థలు ఇలాంటి కంటెంట్ తయారవకుండా సాంకేతిక అడ్డుకట్టలు వేయాలి. నిబంధనలు బాగానే ఉన్నాయి. మరి చుట్టమల్లే వీడియో రోజుల తరబడి ఎలా తిరిగింది? ఈ రెండు గంటల నిబంధన ఎంతవరకు అమలవుతోందో ప్రభుత్వం, కంపెనీలు ప్రజలకు లెక్క చెప్పాలి.
లోపాలు ఇంకా ఉన్నాయి:
● సృష్టించడం నేరం కాదు: మన చట్టాలు ప్రచురణ, వ్యాప్తి మీదే దృష్టి పెట్టాయి. తయారుచేయడమనే అసలు నేరంపై మౌనంగా ఉన్నాయి.
● అరెస్టు కాదు, నోటీసు: చాలా శిక్షలు ఏడేళ్ల లోపే కాబట్టి పోలీసులు సాధారణంగా అరెస్టుకు బదులు నోటీసు ఇస్తారు. ఆ గ్యాప్‌లో ఫోన్లు మారిపోతాయి, ఖాతాలు మాయమవుతాయి, ఆధారాలు చెరిగిపోతాయి.
● చూసేవాడు నిర్దోషి: వీడియో దాచుకోవడం, చూడటం నేరం కాదు. కానీ చూసేవాళ్లు లేకపోతే తయారుచేసేవాడు ఎందుకు తయారుచేస్తాడు?
● శిక్ష పడటం అరుదు: నేరం సెకన్లలో జరుగుతుంది. విదేశీ సర్వర్లు, నకిలీ ఖాతాల వెనుక దాక్కున్నవాడిని పట్టుకోవడానికి మన దర్యాప్తు నెలలు తీసుకుంటుంది.
అయితే మన పోలీసులు చేతకానివాళ్లని నేను అనను. రష్మిక కేసులో ఢిల్లీ పోలీసులు గుంటూరు దాకా వచ్చి నిందితుడిని పట్టుకున్నారు. అనుపమ ఫిర్యాదులో కేరళ పోలీసులు నకిలీ ఖాతాల వెనుక ఉన్నవాళ్లను బయటపెట్టారు. కేరళ సైబర్ నిపుణుడు నందకిశోర్ హరికుమార్ చెప్పినట్టు, చట్టం సరిపోతుంది, లోపమంతా అమలులోనే ఉంది. కావలసింది ప్రతి సామాన్య బాధితురాలి ఫిర్యాదుకూ అదే వేగం, అదే పట్టుదల.
“చట్టం పుస్తకంలో ఎంత కఠినంగా ఉన్నా, తప్పించుకోవచ్చనే ధైర్యం నేరస్తుడికి ఉంటే ఆ చట్టానికి విలువేమిటి?
ప్రపంచం ఏం చేసింది?
ఈ సమస్యతో మనకంటే ముందే దెబ్బతిన్న దేశాలు చేతులు ముడుచుకుని కూర్చోలేదు:
● దక్షిణ కొరియా: అలాంటి వీడియో దగ్గర ఉంచుకున్నా, కొన్నా, చూసినా నేరమే. తయారుచేసినవాడికి ఏడేళ్ల వరకు జైలు.
● బ్రిటన్: తయారుచేయడమే నేరం, షేర్ చేయకపోయినా సరే. ఇంకొకరిని చేయమని అడిగినా నేరమే.
● అమెరికా: అనుమతి లేని అంతరంగిక చిత్రాలు, కృత్రిమమైనవైనా, ప్రచురిస్తే జైలు. ఫిర్యాదు అందిన 48 గంటల్లో ప్లాట్‌ఫామ్ వాటిని తొలగించాలి.
ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ కూడా ఇదే దారిలో కఠిన చట్టాలు తెచ్చాయి. నేరాలు పూర్తిగా ఆగలేదు. కానీ పట్టుబడతామనే భయం నేరస్తుడి వెన్నులో వణుకు పుట్టించినప్పుడే చట్టం పనిచేస్తుందని ఈ దేశాల అనుభవం చెబుతోంది. మనకు కావలసింది అదే పట్టుదల.
ఆయుధం అమ్మేవాడినీ వదలొద్దు
పెద్ద ఏఐ కంపెనీల టూల్స్ ఇలాంటి అభ్యర్థనలను ఇప్పటికే తిరస్కరిస్తున్నాయి. కానీ ఎవరైనా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని, ఇంటర్నెట్ కూడా లేకుండా నడుపుకోగలిగే ఓపెన్-సోర్స్ మోడల్స్‌ను ఒకసారి బయటకు వచ్చాక వెనక్కి తీసుకోలేం.
మరి చేతులెత్తేయాలా? ముమ్మాటికీ కాదు. జీవితమంతా ప్రింటింగ్ ప్రెస్‌ల మధ్య గడిపినవాడిగా నేను నేర్చుకున్న ఒక పాఠం చెబుతాను. ముద్రణా యంత్రాన్ని ఎవరూ నిషేధించలేదు. కానీ అశ్లీల కరపత్రాలు అచ్చేసి పంచేవాడు మాత్రం దొరికిపోయేవాడు. ఎందుకంటే అచ్చు చాటుగా జరగొచ్చు. పంపిణీ మాత్రం బహిరంగంగానే జరగాలి.
“డీప్‌ఫేక్ చీకటి గదిలో పుడుతుంది. కానీ హాని చేయాలంటే వెలుగులోకి రావాల్సిందే. కట్టడి చేయాల్సింది అక్కడే.
అందుకే న్యూడిఫికేషన్ యాప్‌లను అమ్మే దారి, వాటికి డబ్బు వెళ్లే దారి మూసేయాలి. తొలగించిన వీడియో మళ్లీ అప్‌లోడ్ కాకుండా డిజిటల్ సంతకంతో అడ్డుకోవాలి. నిందితుడిని పట్టించే ఆధారాలను మాత్రం చెరిపేయకూడదు. “మేము సాధనం మాత్రమే ఇచ్చాం” అనే మాటతో కంపెనీలు చేతులు దులుపుకుంటే ఒప్పుకోలేం.
ఉపేక్షకు చోటు లేదు. నా డిమాండ్లు ఇవి
డీప్‌ఫేక్‌లకు, డిజిటల్ అరెస్ట్ మోసాలకు స్పష్టమైన శిక్షలతో కొత్త చట్టం తెస్తామని కేంద్రం జూలైలోనే ప్రకటించింది. దోషుల ఆస్తులు, ఖాతాలు స్తంభింపజేసే నిబంధన కూడా ఉంటుందని వార్తలొచ్చాయి. ఇక ప్రకటనలు చాలు. చుట్టమల్లే.. తర్వాత కూడా ఎదురుచూడాలా? ఆ చట్టం వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే రావాలి. అందులో కనీసం ఇవి ఉండాలి:
● అనుమతి లేని లైంగిక డీప్‌ఫేక్‌ను తయారుచేయడం, తయారుచేయించడం, ప్రచురించడం, బెదిరింపులకు వాడటం, దానితో వ్యాపారం చేయడం ప్రత్యేక నేరాలుగా చట్టంలో చేరాలి. కఠిన శిక్ష నిర్ణయించాలి.
● ఈ నేరం నాన్-బెయిలబుల్ కావాలి. నోటీసు కాదు, వెంటనే అరెస్టు.
● బాధితులు మైనర్లు అయితే, అవమానం భరించలేక ప్రాణం తీసుకుంటే, శిక్ష మరింత తీవ్రంగా ఉండాలి.
● తెలిసి దాచుకున్నవాడు, “లింక్ పంపు” అని అడిగినవాడు, ఫార్వర్డ్ చేసినవాడు కూడా శిక్షార్హుడే.
● ఈ కేసులు ఫాస్ట్-ట్రాక్ కోర్టుల్లో ఆరు నెలల్లో తేలాలి. ప్రతి జిల్లాలో డీప్‌ఫేక్ ఫోరెన్సిక్ సామర్థ్యమున్న సైబర్ యూనిట్ ఉండాలి. ప్రతి కాలేజీ, ప్రతి ఆఫీసులో ఇలాంటి ఘటన జరిగిన మొదటి 48 గంటల్లో ఏం చేయాలో స్పష్టమైన విధానం ఉండాలి. అనుమానితుడి ఫోన్‌ను సిబ్బంది తమకు తోచినట్టు తిరగేసి ఆధారాలు పాడుచేయకూడదు.
● బాధితులకు ఉచిత న్యాయ సహాయం, మానసిక సహాయం, పరిహారం అందాలి. వాళ్ల పేర్లు ఎక్కడా బయటకు రాకూడదు.
● ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, ఎన్ని వీడియోలు రెండు గంటల్లో తొలగించారు, ఎంతమందిని పట్టుకున్నారు, ఎన్ని కేసుల్లో శిక్ష పడింది. ఈ లెక్కలు ప్రతి మూడు నెలలకోసారి ప్రజల ముందుంచాలి.
“కఠినంగా వ్యవహరిస్తాం” అనే చుట్టపుచూపు ప్రకటనలు బాధితులకు ఊరట ఇవ్వవు. ఫలితాలు కనిపించాలి. దోషి ఎంతటివాడైనా సరే, ఎవరి కొడుకైనా సరే, ఏ పార్టీవాడైనా సరే. పేరు, డబ్బు, పలుకుబడి.. ఏదీ తప్పించుకునే దారి కాకూడదు.
“ఈ రోజు ఒక్కడిని వదిలేస్తే, రేపు పదిమంది పుట్టుకొస్తారు.
మన బాధ్యత ఎంత?
ప్రభుత్వం, పోలీసులు, కంపెనీలు చేయాల్సింది వాళ్లు చేయాలి. కానీ చుట్టమల్లే.. వీడియో ఇంత వేగంగా పాకిందంటే అది ఒక్క నేరస్తుడి వల్ల కాదు. మనలో చాలామంది వల్ల. అందుకే మనమూ మారాలి:
● అలాంటి వీడియో లింక్ అడగొద్దు. మీ ఫోన్‌కు వస్తే తెరవొద్దు. ఫార్వర్డ్ చేయొద్దు. ఫార్వర్డ్ చేయడమూ ఐటీ చట్టం కింద నేరమే.
● వెంటనే ఆ ప్లాట్‌ఫామ్‌లో రిపోర్ట్ చేయండి. 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయండి, లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి. మహిళలు, పిల్లలపై జరిగిన నేరాల కోసం ఆ పోర్టల్‌లో ప్రత్యేక విభాగం ఉంది. ఫిర్యాదు చేసే ముందే స్క్రీన్‌షాట్లు, లింకులు, ఖాతాల పేర్లు భద్రపరచుకోండి. వీడియో తొలగించినా నేరస్తుడిని పట్టించేది ఆ ఆధారాలే. ప్లాట్‌ఫామ్‌కు ఫిర్యాదు చేసేటప్పుడు ఐటీ నిబంధనల్లోని రూల్ 3(2)(b) ప్రస్తావించండి. రెండు గంటల గడువు అక్కడే ఉంది.
● బాధితురాలి దుస్తులనో, ఆమె చేసిన పాత్రనో కారణంగా చూపొద్దు. సిగ్గుపడాల్సింది ఆమె కాదు, నేరస్తుడు.
● ఇంట్లో కొడుకు చేతికి ఫోన్ ఇచ్చేటప్పుడు దానితో పాటు బాధ్యత కూడా ఇవ్వండి. తెర మీద కనిపించే ప్రతి అమ్మాయికీ ఒక మనసుంటుంది.
బాధితులకు నేను చెప్పేది ఒక్కటే. మీరు ఒంటరి కాదు. బెదిరించి డబ్బు అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దు. పాస్‌వర్డ్‌లు మార్చండి, ఖాతాలను ప్రైవేట్ చేయండి. 18 ఏళ్లు దాటినవాళ్లు StopNCII.org ద్వారా, మైనర్లు Take It Down ద్వారా ఆ చిత్రాలు మళ్లీ అప్‌లోడ్ కాకుండా అడ్డుకోవచ్చు. ఒకప్పుడు ఇలాంటి అవమానం ఆడపిల్లలను ఒంటరితనంలోకి, ఆత్మహత్యలోకి నెట్టేది. ఇప్పుడు ఎక్కువమంది ధైర్యంగా ఎదురు నిలుస్తున్నారు. ఆ ధైర్యమే నేరస్తుడికి అసలు శిక్ష.
కాలేజీలు, స్కూళ్లకూ ఒక మాట… ఫెస్ట్‌లు, ఫంక్షన్ల ఫోటోలను ఓపెన్ డ్రైవ్ ఫోల్డర్లలో, పబ్లిక్ పేజీల్లో అందరికీ అందుబాటులో పెట్టడం ఆపండి. మీ పిల్లల ఆ ఫోటోలే మార్ఫింగ్‌కు ముడిసరుకు.
ఇలాంటి దారుణాలు చూస్తుంటే ఓ యాభై ఏళ్ల క్రితపు జీవితమే బాగుండేదేమో అనిపిస్తోంది. అప్పుడు అన్యాయాలు లేవని కాదు. కానీ తప్పు చేస్తే ఏమవుతుందోననే భయం ఉండేది. ఎదుటివాళ్లను బాధపెట్టకూడదనే విలువ ఉండేది. ఒకరి అవమానాన్ని క్షణాల్లో వేల మందికి చేరవేసి, దానితో పేరు, డబ్బు సంపాదించే రోజులు లేవు. వెనక్కి వెళ్లాలనిపించేది సౌకర్యాల కోసం కాదు. మనిషికి మనిషి విలువనిచ్చే జీవితం కోసం.
మన చేతుల్లోని ఫోన్లు తెలివైనవయ్యాయి. మన ప్రవర్తనలో మానవత్వం పెరగాలి కదా? ఆడవాళ్లను అవమానించినవాడు చరిత్రలో ఎన్నడూ మంచిగా మిగల్లేదు. రామాయణ, మహాభారతాల నుంచి మనం విన్న పాఠం ఇదే. అయినా ఈ బుద్ధి మారడం లేదు.
“మనిషి రూపాన్ని మార్చగలిగే మేధను సంపాదించాం. ఎదుటి మనిషి గౌరవాన్ని కాపాడే సంస్కారాన్ని మాత్రం ఎందుకు కోల్పోతున్నాం?









