తెలంగాణ కథకు తెలుగు తెరమీద చోటు దొరికింది. మనసుల్లో దొరికిందా?
ఈ ప్రశ్న అడగడం అంత తేలిక కాదు.
అడిగితే ప్రాంతీయవాదం అంటారు. రాష్ట్రం వచ్చినా ఇంకా ఈ గోల ఏంటంటారు. తెలంగాణ మళ్లీ ఆంధ్రను తిడుతోందంటారు. కానీ లెక్కలు చూశాక ఈ ప్రశ్న అడక్కుండా ఉండలేం. అడగకపోతే తెలంగాణ తనను తానే మోసం చేసుకున్నట్టు.
కాబట్టి అడగాలి. కోపంతో కాదు. బాధతో.
తెలంగాణ ఎప్పుడూ అడగలేదు
ముందు ఒక విషయం చెప్పాలి.
తెలంగాణలో సినిమా అంటే సినిమా. హీరో అంటే హీరో… అంతే!
అతను ఏ ఊరివాడు, ఏ జిల్లావాడు, ఏ కులం — ఈ మాటలు తెలంగాణ థియేటర్లలో ఎప్పుడూ వినిపించలేదు. సినిమా బాగుందా? హీరో నచ్చాడా? అభిమానమంతా నటన చుట్టూనే. అంతే.
అందుకే ఎన్టీఆర్ తెలంగాణలో కూడా రాముడు, కృష్ణుడే. చిరంజీవి ఇక్కడా మెగాస్టారే. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, పవన్‌కల్యాణ్, మహేశ్‌బాబు, ప్రభాస్, రామ్‌చరణ్, అల్లు అర్జున్… వీళ్లలో ఎవరూ తెలంగాణలో పుట్టినవాళ్లు కాదు. కానీ తెలంగాణ ఎప్పుడూ వాళ్లను పరాయి వాళ్లుగా చూడలేదు. వాళ్ల కటౌట్లకు పాలాభిషేకాలు చేసింది వరంగల్‌లో, కరీంనగర్లో, నిజామాబాద్‌లో.
ఇది ఎవరో చెబుతున్న మాట కాదు. పరిశ్రమకే బాగా తెలిసిన మాట. 2013లోనే Business Standard రాసింది — తెలుగు సినిమా మొత్తం వసూళ్లలో 45 శాతానికి పైగా నైజాం ఏరియా నుంచే వస్తున్నాయని. అప్పటి పెద్ద హీరోలందరి సినిమాలకూ అతిపెద్ద వసూళ్లు నైజాం నుంచే. ఆ హీరోల్లో ఒక్కరూ తెలంగాణ వాళ్లు కాదు.
అంటే హీరో ఎక్కడివాడన్నది తెలంగాణ ప్రేక్షకుడికి ఎప్పుడూ అడ్డం కాలేదు. ఇది అభిప్రాయం కాదు. వ్యాపార చరిత్ర.
“తెలంగాణ హీరో ఊరు అడగలేదు. కులం అడగలేదు. యాస అడగలేదు. సినిమా బాగుందా అని మాత్రమే అడిగింది.
మెగాస్టార్ పారితోషికం ఎక్కడి నుంచి వచ్చింది?
ఇంకో మాట. ఇది తెలంగాణ ప్రేమ గురించి కాదు. తెలంగాణ డబ్బు గురించి.
చిరంజీవి ఎన్నో ఏళ్లుగా పారితోషికం కింద నైజాం హక్కులు తీసుకునేవాడు. ఇది గుసగుస కాదు. పరిశ్రమలో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. అంటే ఏమిటి? చిరంజీవి సినిమా ఎక్కడ బాగా ఆడుతుందో ఆయనకు తెలుసు. ఆంధ్ర హీరో తన సంపాదనకు తెలంగాణను నమ్ముకున్నాడు. తెలంగాణ ఆ నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయలేదు.
ఇదేం పాత కథ కాదు. మొన్నటికి మొన్న రవితేజ ఇరుముడికి పారితోషికం బదులు వాటా తీసుకున్నాడని, అందులో తెలంగాణ హక్కులు కీలకమని ట్రేడ్ వర్గాల మాట. ఆ వాటా రూ.50 కోట్లు దాటుతుందని అంచనా.
అంటే తెలుగు స్టార్ల సంపాదనలో సింహ భాగం తెలంగాణ సొమ్మే. ఇక్కడే కలెక్షన్లు వస్తాయని వాళ్లకు తెలుసు. అందుకే ఇక్కడి హక్కులే అడుగుతారు. తెలంగాణ డబ్బు లేకపోతే చిరంజీవి ఈ స్థాయిలో ఉండేవాడు కాదు. చిరంజీవి ఒక్కడే కాదు — స్టార్లందరి కథా ఇదే.
తెలంగాణ డబ్బు ఆంధ్ర హీరోకు మెగాస్టార్ హోదా ఇచ్చింది. మరి తెలంగాణ కథకు ఆంధ్ర ఏమిచ్చింది?
ఆంధ్రలో కులం. తెలంగాణలో నటన.
ఇంకో అసౌకర్యమైన మాట. కానీ చెప్పాలి.
ఆంధ్రలో హీరో అభిమానులు కులాల వారీగా విడిపోతారన్నది ఎవరూ కాదనలేని బహిరంగ రహస్యం. అక్కడ చిరంజీవి కాపు కులం వాడు. ఎన్టీ రామారావు కృష్ణా జిల్లా కమ్మ. ప్రభాస్ రాజు. ఎవరి బొమ్మ వాళ్లది. ఎవరి తిట్లు వాళ్లవి.
తెలంగాణలో అలా లేదు.
తెలంగాణలో చిరంజీవి కాపు కాదు. మెగాస్టార్. ఎన్టీఆర్ కమ్మ కాదు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు. కరీంనగర్ కుర్రాడు చిరంజీవి కటౌట్‌కు అభిషేకం చేస్తున్నప్పుడు ఆయన కులం ఏమిటని అడగలేదు. వరంగల్‌లో ఎన్టీఆర్ సినిమాకు టికెట్ కొనేటప్పుడు ఆయన ఊరు ఏమిటని అడగలేదు. ఎన్టీఆర్ అయినా, చిరంజీవి అయినా, బాలకృష్ణ అయినా — ఒక్కటే. అందరికీ ఇక్కడ అభిమానులు ఉంటారు.
తెలంగాణ హీరోను హీరోగా చూసింది. కులం లేకుండా. ఊరు లేకుండా.
అదే తెలంగాణ కథ ఆంధ్రకు వెళ్లేసరికి ఎందుకు “వాళ్ల కథ” అయిపోతోంది?
ఉద్యమం రోజుల్లో సినిమా ఏ వైపు నిలబడింది?
ఇది కూడా మర్చిపోకూడదు.
తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజుల్లో సినిమా వాళ్లు ఎక్కడ నిలబడ్డారు?
2012లో పూరీ జగన్నాథ్ ‘కెమెరామన్ గంగతో రాంబాబు’ తీశాడు. అందులో ప్రకాశ్‌రాజ్ పోషించిన నాయకుడి పాత్ర కేసీఆర్‌ను వెక్కిరించేలా ఉందని తెలంగాణ మొత్తం భావించింది. థియేటర్ల ముందు నిరసనలు జరిగాయి. ఉద్యమం గురించి, ఉద్యమ నాయకుడి గురించి తెలంగాణ ఏమనుకుంటోందో ఆ సినిమాకు పట్టలేదు.
అదే రోజుల్లో నాని లాంటి యువ హీరో ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకంగా ట్విట్టర్లో పోస్ట్ చేసి వివాదంలో పడ్డాడు.
అదే నాని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దసరా తీశాడు. సింగరేణి బొగ్గు గనుల కథ. తెలంగాణ యాస. తెలంగాణ పాటలు. ఆ సినిమాతో ఆయన కెరీర్లోనే అతిపెద్ద వసూళ్లు చూశాడు — అందులో మూడొంతులు నైజాం నుంచే. తెలంగాణ రాష్ట్రం వద్దన్న హీరో, తెలంగాణ కథతో డబ్బు సంపాదించాడు.
ఇప్పుడు ఆయన కొత్త సినిమా పారడైజ్. అదే దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో. అందులో “యేషనగుల” అనే పాట తెలంగాణ జానపద బాణీ. కాసర్ల శ్యామ్ మాటలు, జంగిరెడ్డి గొంతు. హీరో పరిచయ పాటకు కూడా తెలంగాణ జానపద గాయకుల గొంతులే. అమెరికాలో డల్లాస్ కచేరీలో నాని ఆ పాటకు స్టెప్పులేశాడు. తెలంగాణ జానపదాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నానని చెప్పాడు.
తెలంగాణ రాష్ట్రమే వద్దన్న హీరో, ఇప్పుడు తెలంగాణ మాట, తెలంగాణ పాట, తెలంగాణ దర్శకుడు — ఈ మూడింటినీ నమ్ముకున్నాడు.
కానీ, తెలంగాణ ఆ పాత ట్వీట్ గుర్తు పెట్టుకోలేదు. దసరా బాగుంది. చూసింది. హిట్ చేసింది.
ఉద్యమం రోజుల్లో తెలంగాణ దినపత్రిక ఇంటర్వ్యూ అడిగితే సినిమా వాళ్లలో ఒక్కరూ ఇవ్వలేదు. భయం — తెలంగాణ పత్రికకు మాట్లాడితే మళ్లీ సినిమా అవకాశాలు రావని. ఆ రోజుల్లో పత్రికల్లో పనిచేసిన వాళ్లకు ఇది బాగా తెలుసు.
ఇలాంటివి ఒకటి రెండు కాదు. తెలంగాణ ఏర్పడటం సినిమా పరిశ్రమలో చాలామందికి ఇష్టం లేదు. ఆ మాట బహిరంగంగానే వినిపించింది.
కానీ తెలంగాణ ఏం చేసింది?
రాష్ట్రం వచ్చాక కూడా అదే పూరీ సినిమాలు చూసింది. బాగుంటే హిట్ చేసింది. బాగోకపోతే వదిలేసింది. ఉద్యమం రోజుల్లో ఎవరు ఏ వైపు నిలబడ్డారన్న జ్ఞాపకాలను థియేటర్ల వద్దకు తీసుకెళ్లలేదు.
ఎందుకంటే తెలంగాణలో సినిమా అంటే సినిమా. హీరో అంటే హీరో. అంతే.
తెలంగాణ అంత పెద్ద మనసు చూపిస్తే — తెలంగాణ కథకు ఆంధ్ర అంత చిన్న మనసు ఎందుకు?
“ఉద్యమాన్ని వెక్కిరించిన వాళ్ల సినిమాలనూ తెలంగాణ చూసింది. బాగుంటే హిట్ చేసింది.
ఇప్పుడు ఈ ప్రశ్నను తిప్పి అడుగుదాం
తెలంగాణ ఆంధ్ర హీరోను తన హీరో అనుకుంది. ఆంధ్ర కథను తన కథ అనుకుంది. తెలంగాణ కథను ఆంధ్ర తన కథ అనుకుంటోందా?
ఇక్కడ మాటలు వద్దు. లెక్కలు చూద్దాం.
లెక్కలు చెబుతున్న మాట
ఒకే రకమైన లెక్క తీసుకుందాం — డిస్ట్రిబ్యూటర్ షేర్. నైజాం ఒకవైపు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు — కోస్తా గుండె లాంటి ఈ నాలుగు ఏరియాలు ఒకవైపు.

ముందు ఒక ఆంధ్ర కథ చూద్దాం.
రంగస్థలం. అచ్చమైన గోదావరి కథ. ఆ ఊరు, ఆ భాష, ఆ రాజకీయం, ఆ మట్టి — అన్నీ కోస్తావే. ఫుల్‌రన్‌లో ఈ నాలుగు కోస్తా ఏరియాల్లో రూ.30.30 కోట్లు. నైజాంలో రూ.27.70 కోట్లు.
అంటే గోదావరి కథను తెలంగాణ దాదాపు గోదావరి స్థాయిలోనే ఆదరించింది. “ఇది మా కథ కాదు” అని పక్కన పెట్టలేదు. ఇదే కొలమానం. ఒక కథకు రెండు వైపులా సమానంగా మనసు తెరిస్తే లెక్క ఇలా ఉంటుంది — దాదాపు ఒకటికి ఒకటి.
ఇప్పుడు తెలంగాణ కథలు చూద్దాం.
ఫిదా. బాన్సువాడ పల్లె. తెలంగాణ అమ్మాయి. తెలంగాణ మాట. ఫుల్‌రన్‌లో నైజాం రూ.18.05 కోట్లు. నాలుగు కోస్తా ఏరియాలు కలిపి రూ.9 కోట్లు. సరిగ్గా సగం.
దసరా. సింగరేణి కథ. రెండు వారాల్లో నైజాం రూ.24.47 కోట్లు. నాలుగు కోస్తా ఏరియాలు రూ.7.95 కోట్లు. మూడో వంతు కూడా లేదు.
బలగం. దీని గురించి తర్వాత విడిగా మాట్లాడుకుందాం. కానీ లెక్క మాత్రం ఇప్పుడు చూద్దాం — నిర్మాత దిల్ రాజు స్వయంగా Cinema Expressకు చెప్పారు: థియేటర్ వసూళ్లలో 75 శాతం తెలంగాణ, 25 శాతం ఆంధ్ర.
అర్జున్‌రెడ్డి, టిల్లు స్క్వేర్ కూడా ఇదే దారిలో ఉన్నాయి — నైజాంలో రెండున్నర రెట్లు, రెండు రెట్లకు పైగా. అయితే అవి హైదరాబాద్ యూత్ సినిమాలు, మల్టీప్లెక్స్ ఎఫెక్ట్ ఎక్కువ అనుకోవచ్చు. కాబట్టి వాటిని పక్కన పెడదాం. ఫిదా, దసరా, బలగం చాలు.
ఒక్క విషయం నిజాయితీగా చెప్పాలి. ఇవన్నీ ట్రేడ్ అంచనాలు. నిర్మాతల ఆడిట్ ఖాతాలు కావు. థియేటర్ల సంఖ్య, టికెట్ రేట్లు, హీరో మార్కెట్, రిలీజ్ టైమ్ — ఇవన్నీ వసూళ్లపై ప్రభావం చూపిస్తాయి. ఒక్క సినిమా చూసి తీర్పు చెప్పకూడదు.
కానీ రంగస్థలం ఒకటికి ఒకటి. ఫిదా ఒకటికి రెండు. దసరా ఒకటికి మూడు. ఇదే తేడా మళ్లీ మళ్లీ కనిపిస్తుంటే… కళ్లు మూసుకుని ఎలా ఉండాలి?
‘గోదావరి’ తీసిన చేతులే ‘ఫిదా’ తీశాయి
ఈ కథనం శేఖర్ కమ్ముల లేకుండా పూర్తి కాదు.

శేఖర్ కమ్ముల తెలంగాణ వాడు. ఆయనే ‘గోదావరి’ తీశాడు. ఆ నదిని, ఆ లాంచీని, ఆ నేలను, ఆ మనుషుల్ని ఎంత ప్రేమగా చూపించాడో ఇప్పటికీ చూస్తే తెలుస్తుంది. ఆ సినిమాలో గోదావరి ఒక పాత్ర. గోదావరి జిల్లాల వాళ్లే.. ఇంత అందంగా మా గోదావరిని ఎవరూ చూపించలేదన్నారు. చూపించింది మరి తెలంగాణ దర్శకుడు.
అదే మనిషి ‘ఫిదా’ తీశాడు. ఈసారి కోనసీమకు వెళ్లలేదు. బాన్సువాడకు వచ్చాడు. తెలంగాణ ఇల్లు, పొలం, పండగ, పెళ్లి, ఆడపిల్ల నోటి మాట — అన్నీ అంతే ప్రేమగా చూపించాడు. ఫిదా రిలీజ్ ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనే చెప్పాడు — తెలుగు సినిమాలో పల్లె అంటే కోనసీమే అనే మూస వచ్చేసిందని, దాన్ని మార్చాలని తెలంగాణ పల్లెను ఎంచుకున్నానని. ఫిదా తెలంగాణ గ్రామాలకు తన నివాళి అన్నాడు.
ఈ రెండు సినిమాలు చాలు. తెలంగాణ దర్శకుడికి ప్రాంతం పట్టింపు లేదని చెప్పడానికి. గోదావరిని ప్రేమించిన మనసే తెలంగాణను ప్రేమించింది.
కళాకారుడికి ప్రాంతం అడ్డం కాలేదు. మరి ప్రేక్షకుడికి ఎందుకు అడ్డం అవుతోంది?
ఒకప్పుడు తెలంగాణ భాష వెకిలి నవ్వు కోసమే
ఈ బాధకు వెనుక ఒక కథ ఉంది. అది చెప్పకపోతే ఈ ప్రశ్న అర్థం కాదు.
తెలుగు సినిమాలో తెలంగాణ మాటకు ఎప్పుడూ గౌరవం లేదు. ముఖ్యంగా తొంభైల తర్వాత. తెలంగాణ యాస వినిపిస్తే ఆ పాత్ర కమెడియన్. లేదా రౌడీ. లేదా చదువులేని వాడు. లేదా విలన్ పక్కన నిలబడే వాడు. హీరో మాట్లాడే భాష తెలంగాణది కాదు. హీరోయిన్ ప్రేమించే భాష తెలంగాణది కాదు. అమ్మ ఏడ్చే భాష కూడా తెలంగాణది కాదు.
తెలంగాణ కూడా ఆ సినిమాలు చూసింది. తన భాషకు తానే నవ్వుకుంది. ఆ నవ్వు వెనుక ఎంత బాధ దాగి ఉందో ఆ తరం వాళ్లకే తెలుసు.
The News Minute 2019లో ఒక విశ్లేషణ రాసింది — ఒకప్పుడు తెలంగాణ యాసను హాస్యానికి, మొరటుతనానికి, విలనీకి వాడిన అదే పరిశ్రమలో, తర్వాత తెలంగాణ దర్శకులు, రచయితలు, నటులు వచ్చి ఆ భాషకు ప్రధాన స్రవంతిలో కొత్త చోటు కల్పించారని.
ఆ మార్పు తెలంగాణ ఉద్యమం తెచ్చింది. రాష్ట్రం వచ్చాక తెరమీద కూడా కనిపించింది.
పెళ్లిచూపులు. ఫిదా. అర్జున్‌రెడ్డి. బలగం. దసరా. టిల్లు.
ఇప్పుడు తెలంగాణ భాష హీరో మాట్లాడే భాష అయింది. హీరోయిన్ ప్రేమించే భాష అయింది. అమ్మ ఏడ్చే భాష అయింది.
తెలంగాణ తన కథను తానే చెప్పుకోవడం మొదలుపెట్టింది. తెరమీద చోటు దొరికింది. కానీ మనసుల్లో దొరికిందా? అదే ప్రశ్న.
“తెలంగాణ భాషకు తెరమీద చోటు దొరికింది. ప్రేక్షకుల మనసుల్లో దొరికిందా?
బలగం — ఈ ప్రశ్న నుంచి తప్పించుకోలేం

ఈ మొత్తం చర్చలో అన్నిటికంటే ఎక్కువ కదిలించే సినిమా ‘బలగం’. అది స్టార్ సినిమా కాదు. పెద్ద బడ్జెట్ కాదు. రాజకీయం లేదు. తెలంగాణ గొప్పది అనే ప్రచారం అసలే లేదు.
ఒక ముసలాయన చనిపోతాడు. కుటుంబం చేరుకుంటుంది. అన్నదమ్ముల మధ్య పాత గొడవలు బయటపడతాయి. అహం, బాధ, ప్రేమ, పశ్చాత్తాపం. చివరికి మనుషులు కలుస్తారు. ఇందులో ఏ బాధ తెలంగాణకు మాత్రమే సొంతం? తండ్రి చనిపోతే ఆంధ్రలో ఏడవరా? అన్నదమ్ములు గోదావరి జిల్లాల్లో గొడవపడరా? కృష్ణా, గుంటూరులో కుటుంబాలు లేవా?
భావోద్వేగం అందరిదీ అయినప్పుడు, స్పందన మాత్రం 75–25 ఎందుకైంది? దిల్ రాజు ఇంకో మాట కూడా అన్నారు — ఆంధ్రలో చాలామంది బలగంను తర్వాత OTTలో గుర్తించారని. అంటే సినిమా నచ్చలేదని కాదు. థియేటర్‌కు వెళ్లేంత దగ్గరగా అనిపించలేదు. ఆ ‘దూరమే’ ప్రశ్న.
ఇది కేవలం నేటివిటీనా?
కొంత నిజమే.
ఏ ఊరి కథ ఆ ఊళ్లో కొంచెం ఎక్కువ ఆడుతుంది. గోదావరి కథకు గోదావరిలో అదనపు ప్రేమ ఉంటుంది. సింగరేణి కథకు తెలంగాణలో ఉంటుంది. అది వివక్ష కాదు. సహజం. నైజాంలో హైదరాబాద్ అనే పెద్ద నగరం ఉంది. మల్టీప్లెక్సులు ఎక్కువ. షోలు ఎక్కువ. టికెట్ రేటు ఎక్కువ. ఇదీ నిజమే.
కానీ ఈ కారణాలతో మొత్తం తేడా వివరించగలమా?
అదే హైదరాబాద్, అవే మల్టీప్లెక్సులు రంగస్థలానికి కూడా ఉన్నాయి. అప్పుడు లెక్క ఒకటికి ఒకటిగా ఎందుకు వచ్చింది? ఫిదాకు రెండు, దసరాకు మూడు ఎందుకైంది? అంటే హైదరాబాద్ వల్ల తెలంగాణ సినిమా ఎక్కువ ఆడటం లేదు. ఆంధ్రలో తెలంగాణ సినిమా తక్కువ ఆడుతోంది. తేడా అక్కడే ఉంది.
వివక్ష అనే మాట
ఇక్కడ ఒక అసౌకర్యమైన మాట వస్తుంది. వివక్ష.
ఆంధ్ర ప్రేక్షకులంతా కావాలని తెలంగాణ సినిమాలను తిప్పికొడుతున్నారని చెప్పడానికి ఆధారం లేదు. అలా చెప్పడం తప్పు కూడా.
కానీ ఒకే రకమైన తేడా మళ్లీ మళ్లీ కనిపిస్తున్నప్పుడు “ఇక్కడ ఒక కనిపించని దూరం ఉందా?” అని అడగడానికి మాత్రం ఆధారం ఉంది. ఆ దూరానికి కారణమేంటి? తెలంగాణ యాస పట్ల ఇంకా మిగిలిన అవహేళనా? తెలంగాణ జీవితంతో పరిచయం తక్కువ కావడమా? సహజమైన ప్రాంతీయ అనుబంధమా? లేక ముప్ఫై ఏళ్లు తెలంగాణ భాషను వెకిలితనం కోసం వాడిన అలవాటు — ప్రేక్షకుడి మనసులోంచి ఇంకా పూర్తిగా పోలేదా?
దీనికి జవాబు బాక్సాఫీస్ చెప్పదు. కానీ ప్రశ్న మాత్రం వేస్తోంది. అదే ముఖ్యం.
తెలుగు సినిమా ఎవరిది?
తెలంగాణ చిరంజీవిని తన హీరో చేసుకుంది. ఎన్టీఆర్‌ను తన హీరో చేసుకుంది. ఎవరి సినిమా బాగుంటే వాళ్ల సినిమా చూసింది. వాళ్ల ఊరు అడగలేదు. వాళ్ల కులం అడగలేదు. వాళ్ల యాస అడగలేదు. ఉద్యమం రోజుల్లో వాళ్లు ఏ వైపు నిలబడ్డారని కూడా అడగలేదు.
ఇప్పుడు తెలంగాణ అడుగుతున్నది అంతకంటే ఎక్కువేం కాదు.
తెలంగాణ కథ బాగుంటే — దాన్ని కూడా అంతే సహజంగా “మన తెలుగు కథ” అనుకోలేమా?
గోదావరి కథ తెలంగాణది కావాలి.. సింగరేణి కథ ఆంధ్రది కావాలి.. కోనసీమ కథ వరంగల్ వాడిది కావాలి.. వరంగల్ కథ విజయవాడ వాడిది కావాలి.
రాష్ట్రాలు విడిపోయాయి కానీ భాష విడిపోలేదు. బాధ విడిపోలేదు. సినిమా విడిపోవాల్సిన అవసరం లేదు.
కథ ఎక్కడ పుట్టిందన్నది కాదు. మనసును తాకిందా అన్నదే కొలమానం. అందుకే చివరికి మిగిలే ప్రశ్న — తెలంగాణ బాధతో అడుగుతున్న ప్రశ్న —
తెలంగాణ సినిమా ఆంధ్రావాళ్లకు ఎందుకు నచ్చదు?
లెక్కల్లో ఒక్కసారి
- రంగస్థలం (ఫుల్‌రన్) — నైజాం రూ.27.70 కోట్లు; తూ.గో.+ప.గో.+కృష్ణా+గుంటూరు రూ.30.30 కోట్లు — దాదాపు 1:1
- ఫిదా (ఫుల్‌రన్) — నైజాం రూ.18.05 కోట్లు; నాలుగు కోస్తా ఏరియాలు రూ.9.00 కోట్లు — 2 రెట్లు
- దసరా (రెండు వారాలు) — నైజాం రూ.24.47 కోట్లు; నాలుగు కోస్తా ఏరియాలు రూ.7.95 కోట్లు — 3 రెట్లు
- అర్జున్‌రెడ్డి (11 రోజులు) — నైజాం రూ.7.61 కోట్లు; నాలుగు కోస్తా ఏరియాలు రూ.3.15 కోట్లు — 2.4 రెట్లు
- టిల్లు స్క్వేర్ (రెండు వారాలు) — నైజాం రూ.19.91 కోట్లు; నాలుగు కోస్తా ఏరియాలు రూ.7.45 కోట్లు — 2.7 రెట్లు
- బలగం — నిర్మాత దిల్ రాజు చెప్పిన థియేటర్ వసూళ్ల వాటా: తెలంగాణ 75%, ఆంధ్ర 25%
గమనిక: ఇవి ట్రేడ్ వెబ్సైట్ల అంచనాలు, నిర్మాతల ఆడిట్ ఖాతాలు కావు. పోలిక కోసం ఒకే రకమైన డిస్ట్రిబ్యూటర్ షేర్ లెక్కలు వాడాం.








