అభిప్రాయాలు… ఆలోచనలు… అక్షరాలు…

నానా పటేకర్: ముసుగు లేని మహానటుడు

ఐదు దశాబ్దాలు ఆయన తెర మీద గర్జించారు, నవ్వించారు, ఏడిపించారు. తెర వెనక కరువు రైతుల కన్నీళ్లు తుడిచారు, సరిహద్దులో సైనికుల చెంత నిలబడ్డారు. ఇప్పుడు ఆ అద్భుతమైన ప్రదర్శనకు ఆఖరుసారి తెర పడింది. ఈ మహానటుడికి దేశమంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టాల్సిన సమయం ఇది.

చెర్మాల శ్రీనివాస్13 అక్టోబర్ 2026 · 8 నిమిషాలు · English →
నానా పటేకర్ – ముసుగు లేని మహానటుడు

నానా పటేకర్ (1951–2026)

  • రంగస్థలం నేర్పిన ఒట్టు: స్టార్ కాదు, పాత్ర గెలవాలి
  • కారు కొనే డబ్బుతో కరువు రైతుల ఇళ్లకు
  • కార్గిల్ నుంచి రాజౌరీ దాకా సైనికుల పక్కన
  • ముసుగు లేని జీవితం… ఆగని చప్పట్లు

ఆరడుగుల అందమైన విగ్రహం కాదు. సిక్స్‌ప్యాక్ లేదు. డాన్సులు చేయలేదు. హీరోయిన్ల చుట్టూ పాటలు పాడలేదు. అయినా ఆయన మహానటుడు. ఆయన ముఖంలో జీవితపు కాఠిన్యం కనిపించేది. కళ్లలో మనిషి అంతరంగం ప్రతిఫలించేది. గొంతులో ఆవేశం ఎంత బలంగా వినిపించేదో, మౌనంలో వేదన అంత లోతుగా వినిపించేది.

జీవితపు చివరి సన్నివేశం

రంగస్థలం మీద నాటకం ముగిసేటప్పుడు దీపాలు ఒక్కొక్కటిగా ఆరిపోతాయి. తెర మెల్లగా కిందికి దిగుతుంది. ప్రేక్షకులు మాత్రం వెంటనే లేవరు. చూసిన పాత్ర, విన్న మాట వాళ్లను కాసేపు అక్కడే కట్టిపడేస్తాయి. హాలంతా నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలోంచే చప్పట్లు పుడతాయి.

జనం మధ్య తెల్ల దుస్తుల్లో నానా పటేకర్
జనం మధ్యే ఆయన వేదిక

అక్టోబర్ 8 తెల్లవారుజామున గోవాలో అలాంటి తెరే పడింది. రెండున్నర గంటల సమయంలో నానా ఒక మిత్రుడికి ఒంట్లో బాగాలేదని సందేశం పంపారు. ఆస్పత్రిలో వైద్యులు నలభై ఐదు నిమిషాల పాటు ఆయన గుండెను మళ్లీ కొట్టుకునేలా చేయాలని పోరాడారు. ఉదయం 5.20కి ఆ గుండె శాశ్వతంగా ఆగిపోయింది.

నాలుగు రోజుల ముందే ఆయన ఒక వేదిక మీద నిలబడి కళలు బతకాలి, నాటకం బతకాలి అని మాట్లాడారు. ఆ చివరి ప్రసంగంలోనూ ఆయన మాట్లాడింది తన గురించి కాదు. తనకు జన్మనిచ్చిన రంగస్థలం గురించి.

ఆ ఉదయం వార్త వినగానే కోట్లాది ఇళ్లలో ఒకేసారి ఒక గొంతు గుర్తొచ్చింది. గర్జించే గొంతు. అన్యాయాన్ని నిలదీసిన గొంతు. ఎవరి ముందూ తలవంచని గొంతు. ఆ గొంతు ఇక కొత్తగా ఏమీ పలకదు. కానీ చెప్పాల్సింది ఇప్పటికే చెప్పేసింది.

స్టార్ కాదు… కేవలం నటుడు

1951 జనవరి 1న మురుడ్-జంజీరా అనే చిన్న ఊరిలో పుట్టిన విశ్వనాథ్ పటేకర్‌కు బాల్యం కష్టాలనే పాఠాలుగా నేర్పింది. ముంబై జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చిత్రకళ నేర్చుకున్నారు. మరాఠీ రంగస్థలం ఆయనకు క్రమశిక్షణ నేర్పింది. చిత్రకారుడి కన్ను, నాటకాల గుండె. ఈ రెండింటితోనే ఆయన వెండితెర మీద అడుగుపెట్టారు.

సినిమాల్లో పేరొచ్చాక ఒకసారి ఆయన నాటకం వేస్తున్నారు. కథలో గుండె పిండేసే విషాద ఘట్టం. కానీ హాల్లో జనం సినిమా స్టార్‌ను చూసిన సంబరంతో చప్పట్లు కొట్టారు, ఈలలు వేశారు. వారు స్టార్​ను చూస్తున్నారు గానీ, పాత్రను కాదని అర్థం చేసుకున్న నానా నాటకం మధ్యలోనే వేదిక దిగి వెళ్లిపోయారు. ఆ రోజు ఆయన మనసులో ఒక ఒట్టు పెట్టుకున్నారు: తనలోని స్టార్ ఎప్పుడూ తాను పోషించే పాత్రను మించిపోకూడదు. తనకు కాదు, తన పాత్రకే చప్పట్లు పడాలి.

ఆ ఒట్టును ఆయన జీవితాంతం నిలబెట్టుకున్నారు. ‘పరిందా’లో నిప్పు అంటే వణికిపోయే కిరాతక గ్యాంగ్‌స్టర్ అన్నా. ‘క్రాంతివీర్’లో అవినీతిపై, మతాల పేరుతో జరిగే విభజనపై గర్జించిన సామాన్యుడు. హిందువు రక్తం, ముస్లిం రక్తం వేరు కాదని ఆ సినిమాలో ఆయన చెప్పిన మాటలు మూడు దశాబ్దాలైనా జనం గుండెల్లో మోగుతూనే ఉన్నాయి. ‘ఖామోషీ’లో మాటలు రాని, వినబడని తండ్రిగా ఒక్క మాట లేకుండానే ఏడిపించారు. ‘అబ్ తక్ ఛప్పన్’లో చాలా ప్రశాంతంగా తుపాకి పేల్చే పోలీసు. మరాఠీ ‘నటసమ్రాట్’లో జీవిత చరమాంకంలో ఒంటరైన వృద్ధ నటుడు.

“

తనకు కాదు, తన పాత్రకే చప్పట్లు పడాలి.

హిందీ సినిమాల్లో ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ విలన్ – మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులూ అందుకున్న ఏకైక నటుడు నానా. ఒకే ఏడాదిలో ‘అగ్నిసాక్షి’లో మనీషా కొయిరాలాకు భర్తగా, ‘ఖామోషీ’లో ఆమెకే తండ్రిగా నటించారు. ఇమేజ్ గురించి భయపడే నటుడు ఆ సాహసం చేయలేడు. మూడు జాతీయ అవార్డులు, పద్మశ్రీ ఆ ప్రయాణానికి దక్కిన గుర్తింపులు.

ఆయనకు ఉన్నదల్లా ఒక గొంతు, రెండు కళ్లు. వాటితోనే ఆయన సినిమా తెరను గెలిచారు. ఆయన ఫ్రేమ్‌లోకి అడుగుపెట్టగానే సన్నివేశం ఆయనదైపోయేది.

తరాలను తడిమిన గొంతు

ఒక్కసారిగా ఆగడం, మెల్లగా మొదలుపెట్టి ఉన్నట్టుండి ఉరమడం, ఆ విరామాల్లోనే అర్థం మొత్తం చెప్పేయడం. అది నానా సొంత శైలి. ఆయన మాటలు చెవులకు కాదు, గుండెకు తగిలేవి.

ఆ గొంతు ఎంత బలమైనదంటే, ఆయన పాత సినిమాలు చూడని ఈ తరం పిల్లలు కూడా దాన్ని గుర్తుపడతారు. ‘గోల్‌మాల్’లో మూగ పాత్రకు ఆత్మ ఆవహించగానే నానా గొంతుతో మాట్లాడే సన్నివేశానికి చిన్నారులు పగలబడి నవ్వుతారు. ‘వెల్కమ్’లోని ఉదయ్ శెట్టి ఈ రోజుకీ సోషల్ మీడియా మీమ్స్‌లో బతికే ఉన్నాడు. ‘క్రాంతివీర్’లో ఆయన కోపాన్ని చూసి పెరిగిన తరం ఒకటి. ఉదయ్ శెట్టి నవ్వుతో పెరిగిన తరం మరొకటి. ప్రతీ తరానికి ఒక సొంత నానా ఉన్నాడు.

అంత గొప్ప నటుడు తన గురించి మాత్రం చాలా తక్కువ చేసుకుని మాట్లాడేవారు. నసీరుద్దీన్ షా నటనలో పది శాతం తనకుంటే చాలని ఒకసారి నిండు మనసుతో అన్నారు. ఆ నిరాడంబరతే ఆయన్ని ఇంకా ఎత్తున నిలబెట్టింది.

షారుఖ్ ఖాన్ కుర్రాడిగా తొలిసారి నానాను కలిసినప్పుడు కంగారుతో జుట్టు సరిదిద్దుకున్నాడట. నానా ఆ చేతిని విదిలించి, హీరోలా జుట్టు సర్దుకోకు, నువ్వు నటుడివి అన్నారట. ఆ రోజు నుంచీ నానాను గురువుగా, ఆత్మీయుడిగా గుర్తుంచుకున్నానని షారుఖ్ ఇప్పుడు భావోద్వేగంతో రాసుకున్నారు. ఒక్క మాటతో ఒక మనిషి దిశను మార్చడం అంటే అదే.

కారు కంటే కారుణ్యమే గొప్ప

కష్టంలో ఉన్నవాళ్ల కోసం నానా చేయి చాచడం ఒక్కరోజులో మొదలైంది కాదు. బిహార్ వరదల్లో మునిగిన గ్రామాలకు విరాళం ఇచ్చారు. 2013లో రాజ్ కపూర్ పురస్కారం కింద వచ్చిన పది లక్షల రూపాయలను పైసా కూడా ఉంచుకోకుండా మహారాష్ట్ర కరువు సహాయానికి ఇచ్చేశారు.

అది 2015. మరాఠ్వాడా దశాబ్దాల్లో ఎరుగని కరువులో కాలిపోతోంది. బీటలు వారిన పొలాలు. ఎండిన బావులు. అప్పుల భారం మోయలేక రైతులు ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు తీసుకుంటున్నారు. అదే సమయంలో నానా దాదాపు కోటిన్నర రూపాయల విలాసవంతమైన కారు కొనాలనుకున్నారని చెబుతారు. ఆ ఆలోచనను పక్కనపెట్టి, ఆ డబ్బుతో భర్తను, తండ్రిని కోల్పోయిన ఇళ్ల తలుపులు తట్టారు. విదర్భలో 62, మరాఠ్వాడాలో 113 కుటుంబాలకు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున తన చేతులతోనే అందించారు. ఆ డబ్బు కన్నా, తమ బాధను ఎవరో గుర్తించారన్న భావనే ఆ ఇళ్లకు పెద్ద ఊరట.

అదే ఏడాది సెప్టెంబర్‌లో మిత్రుడు, మరాఠీ నటుడు మకరంద్ అనాస్పురేతో కలిసి ‘నామ్ ఫౌండేషన్’ ప్రారంభించారు. కన్నీళ్లు తుడవడం మాత్రమే సరిపోదని ఆయనకు తెలుసు. కరువుకు అసలు జవాబు నీరు. అందుకే చెరువుల పూడికతీత, వాగుల లోతు పెంపు, నీటి సంరక్షణ పనులు గ్రామాలకు గ్రామాల్లో మొదలయ్యాయి. ఎండిన నేలలో మళ్లీ పచ్చబడింది.

“

ఆ డబ్బు కన్నా, తమ బాధను ఎవరో గుర్తించారన్న భావనే ఆ ఇళ్లకు పెద్ద ఊరట.

బీడ్ జిల్లా ఆర్వీ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల పిల్లల కోసం ఒక గురుకుల పాఠశాల కట్టించారు. నాన్నను కోల్పోయిన ఆ పిల్లలకు అక్కడ చదువుతో పాటు భవిష్యత్తు మీద భరోసా లభించింది.

ఇదంతా ఆయన ఎప్పుడూ ప్రచారం కోసం చేయలేదు. తన పేరుప్రతిష్టలను నిధుల సేకరణకు వాడుకున్నారు, కానీ తనను తాను నాయకుడిగా ఎప్పుడూ చూపించుకోలేదు. ఫొటోల కోసం కాదు, ఫలితం కోసం పనిచేశారు. ఏ సినిమా అవార్డూ ఇవ్వలేని సంతృప్తి ఆ రైతు కుటుంబాల కృతజ్ఞత. నానా సంపాదించుకున్న అతి పెద్ద బిరుదు అదే.

తెర మీదినుండి దిగివచ్చిన సైనికుడు

సైనికులతో కరచాలనం చేస్తున్న నానా పటేకర్
జవాన్ల మధ్య నానా

సైన్యం అంటే నానాకు సినిమా కథ కాదు, గుండెలో మోసే బాధ్యత. 1991లో ఆయన స్వయంగా దర్శకత్వం వహించిన ‘ప్రహార్’లో కఠినమైన శిక్షణే మనిషిని తయారుచేస్తుందని నమ్మే మేజర్ చౌహాన్ పాత్రను ఆయనే పోషించారు. ఆ పాత్రకు నిజాయితీ కావాలని మరాఠా లైట్ ఇన్‌ఫాంట్రీతో కలిసి మూడేళ్ల పాటు కఠోర సైనిక శిక్షణ తీసుకున్నారు. ఆ సినిమాలో మాటల కన్నా నమ్మకమే ఎక్కువగా వినిపించింది.

ఎనిమిదేళ్ల తర్వాత కార్గిల్ యుద్ధం వచ్చింది. దేశం మొత్తం టీవీల ముందు కూర్చుంటే, నానా షూటింగ్‌లు పక్కనపెట్టి సరిహద్దుకు వెళ్లారు. ఒక పోస్ట్ నుంచి మరో పోస్ట్‌కు తిరుగుతూ, జవాన్లతో కలిసి తింటూ, వాళ్ల పక్కనే ఉంటూ, వాళ్లలో ధైర్యం నింపారు. ప్రహార్ కోసం నేర్చుకున్న శిక్షణ అప్పుడు దేశానికి పనికొచ్చింది.

ఆ బంధం చివరి శ్వాస వరకు తెగలేదు. గత ఏడాది ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ కాల్పుల్లో దెబ్బతిన్న రాజౌరీ, పూంఛ్ సరిహద్దు గ్రామాలకు వెళ్లారు. 117 కుటుంబాలకు రూ.42 లక్షల సాయం స్వయంగా అందజేశారు. అక్కడ ఆయన చెప్పిన మాట ప్రతి భారతీయుడూ గుర్తుంచుకోవాలి: ప్రతిదానికీ ప్రభుత్వం మీదే ఆధారపడకూడదు, మనలో ప్రతి ఒక్కరం కనీసం ఒక కుటుంబాన్నైనా దత్తత తీసుకోవాలి.

డెబ్బై నాలుగేళ్ల వయసులో, కాల్పుల గాయాలు ఇంకా మానని సరిహద్దు గ్రామాల్లో తిరుగుతూ, బాధిత తల్లుల చేతుల్లో సాయం పెట్టిన ఆ దృశ్యం, ఏ సినిమా క్లైమాక్స్‌కూ తీసిపోదు.

ముసుగు లేని మనిషి

డబ్బుకు లోటు లేకపోయినా ముంబైలో ఒక చిన్న సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్. పుణె దగ్గర డోంజే గ్రామంలో ఒక వ్యవసాయ క్షేత్రం. ఇదీ నానా ప్రపంచం. సినీ పార్టీలు, ఎర్ర తివాచీలు, బ్రాండ్ ప్రచారాలు, అవార్డు వేడుకల్లో డాన్సులు – ఇవేవీ ఆయన జీవితంలో లేవు. షూటింగ్ అయిపోగానే మట్టి దగ్గరికి వెళ్లిపోయేవారు.

ఆయనతో పనిచేసినవాళ్లు ఇప్పుడు పంచుకుంటున్న జ్ఞాపకాలు సినిమాల గురించి తక్కువ, మనిషి గురించి ఎక్కువ. ప్రకాశ్ రాజ్‌కి గుర్తున్నది ఆయనతో జరిగిన చర్చలు, వాదనలు, నానా స్వయంగా వండి వడ్డించిన భోజనాలు. పెద్దా చిన్నా తేడా లేకుండా అందరినీ ‘తూ’ అని ఆత్మీయంగా పిలిచేవారు.

నానా ముక్కుసూటి మనిషి. ఆ తీరు అందరికీ ఒకేలా నచ్చకపోవచ్చు, కానీ అందులో కల్మషం లేదు. మనసులో ఒకటి, బయట ఒకటి ఉండేది కాదు. మెప్పు కోసం ఎవరినీ పొగడలేదు. హిట్ల కోసం పాత్రల వెంట పరిగెత్తలేదు. డబ్బు తన జీవిత లక్ష్యం కాదని, మనసు పెట్టి చేసిన పనికి జనం తప్పకుండా స్పందిస్తారని నమ్మారు. ఆ నమ్మకాన్ని ఐదు దశాబ్దాల పాటు నిజం చేసి చూపించారు.

ఇమేజ్ కోసమే బతికే ఈ కాలంలో, ఇమేజ్‌ను ఏమాత్రం పట్టించుకోని ఒక స్టార్ ఉండేవాడంటే రేపటి తరం నమ్మకపోవచ్చు. కానీ నానా అలాగే బతికారు. స్టార్‌గా ఉంటూనే స్టార్‌డమ్‌కు మైళ్ల దూరంలో నిలిచారు. మట్టిలో పుట్టి, మట్టినే ప్రేమించి, మట్టి మనిషిగానే మిగిలారు.

ఈ చప్పట్లు ఎప్పటికీ ఆగవు

టోపీ, కళ్లద్దాలతో వృద్ధ నటుడిగా నానా పటేకర్
చివరి వరకూ నటుడే

అక్టోబర్ 8 అర్ధరాత్రి, పుణె సమీపంలోని డోంజేలో తాను ఎంతో ప్రేమించిన వ్యవసాయ క్షేత్రంలోనే, పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో, తుపాకుల వందనంతో నానాకు దేశం వీడ్కోలు పలికింది. ఏ సైనికుల కోసం ఆయన సరిహద్దులో తిరిగారో, అదే గౌరవ వందనం చివరిసారి ఆయనకు దక్కింది. తండ్రి మొదలుపెట్టిన మరాఠ్వాడా పనులను ముందుకు తీసుకెళ్తానని కొడుకు మల్హార్ మాటిచ్చారు.

డెబ్బై ఐదేళ్ల వయసులోనూ ఆయన విశ్రాంతి తీసుకోలేదు. ‘హౌస్‌ఫుల్ 5’, ‘ఓ రోమియో’ వంటి సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. ఆయన చివరి సినిమా ఇంకా విడుదల కావాల్సి ఉంది. అంటే ఆ గొంతు మనకు ఇంకోసారి వినిపిస్తుంది. ఆ రోజు థియేటర్లో చీకటి పడ్డాక చాలా కళ్లు తడుస్తాయి.

నిజాయితీగల అధికారిగా పేరున్న ఐఏఎస్ అధికారి తుకారాం ముండే నానాకు ఆత్మీయ మిత్రుడు. చనిపోవడానికి ఎనిమిది రోజుల ముందు ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఆ సంభాషణ చివర్లో నానా అన్నది ఒక్కటే మాట: ‘లవ్ యూ, బాలా’. అదే చివరి మాట అవుతుందని ముండే ఊహించలేదు. కొందరు జ్ఞాపకాలను మాత్రమే వదిలి వెళ్తారు, కొందరు మాత్రం తమలోని ఒక భాగాన్నే మన జీవితాల్లో వదిలి వెళ్తారు, నానా ఆ రెండో రకం మనిషి అని ఆయన రాసుకున్నారు.

‘నటసమ్రాట్’లో నానా ఒక వృద్ధ నటుడి పాత్ర పోషించారు. వేదిక మీద రాజులా వెలిగి, జీవిత చరమాంకంలో ఎవరూ లేక ఒంటరిగా మిగిలిపోయే వృద్ధుడు. నిజ జీవితంలో నానా కథ అలా ముగియలేదు. రైతుల పిల్లలు, సైనికుల కుటుంబాలు, ఆయనతో పనిచేసిన తరాల నటులు, ఆయన గొంతును అనుకరించే చిన్నారులు… ఆయన చుట్టూ ఎప్పుడూ మనుషులే.. మనసులే..

నానా పటేకర్ ఎన్నో పాత్రలు పోషించారు. గ్యాంగ్‌స్టర్, పోలీసు, సైనికుడు, తండ్రి, రాజకీయ నాయకుడు. కానీ వాటన్నింటి కన్నా గొప్ప పాత్ర ఒకటుంది. నిజాయితీగా, నిరాడంబరంగా, తనకు తానుగా బతికిన ఒక మట్టి మనిషి పాత్ర. ఆ పాత్రకు స్క్రిప్ట్ లేదు, రీటేక్ లేదు. డెబ్బై ఐదేళ్లు సింగిల్​ టేక్‌లో నటించారు.

చాలా ఏళ్ల క్రితం, తనకు కాదు తన పాత్రకే చప్పట్లు పడాలని ఆయన వేదిక దిగి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ పాత్రలకు, ఆ మనిషికి కూడా దేశం మొత్తం లేచి నిలబడి జయజయ ధ్వానాలు చేస్తోంది. పాత్రల మధ్య కూడా మనిషిగా మిగిలిన ఓ నటుడి ప్రస్థానం దాని పూర్తిగా అర్హత కలిగిఉంది.

నానా.., మీరు వెళ్లిపోయారు. తెర పడింది. మీ నటనకు మా అభినందనలు. మీ మానవత్వానికి మా అభివందనాలు. మా హాల్లో చప్పట్లు ఇంకా ఆగలేదు. అవి ఎప్పటికీ ఆగవు.

తర్వాత చదవండి'రణబాలి' సినిమాలో మీసం మెలేస్తున్న విజయ్ దేవరకొండసినిమాలుతలవంచని తెలంగాణ బిడ్డ: ‘ది’ విజయ్ దేవరకొండ

ఈ కథనంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం. ఏదైనా తప్పు కనిపిస్తే contact@maromaata.comకు రాయండి — సరిచేస్తాను. సంపాదకీయ విధానం →

చెర్మాల శ్రీనివాస్

రచయిత

నా గురించి →

మరిన్ని కథనాలు

షేర్