అభిప్రాయాలు… ఆలోచనలు… అక్షరాలు…

నా “విజయ”దశమి

చిన్నప్పుడు నాన్న సైకిల్ మీద జమ్మిచెట్టు దగ్గరికి వెళ్లిన దసరా జ్ఞాపకాల నుంచి, 35 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఆత్మగౌరవం కోసం తీసుకున్న ఒక నిర్ణయం వరకు… ఈ ఏడాది నా విజయదశమి ఎందుకు ప్రత్యేకమో.

చెర్మాల శ్రీనివాస్20 అక్టోబర్ 2026 · 3 నిమిషాలు · English →
సూర్యోదయం వైపు ఎండిన కొమ్మ నుంచి రెక్కలు విప్పి ఎగురుతున్న పాలపిట్ట

దసరా పండుగ.

చిన్నప్పుడు మా నాన్న పొద్దున్నే లేచి, అప్పుడే తెంపి తెచ్చిన మామిడాకులు దర్వాజకు కడుతుండేవాడు. నన్ను మంచం మీద నుంచి లెమ్మని గదమాయించి, లేపి స్నానానికి పంపేవాడు. అమ్మ బాయిలర్‌లో నుంచి వేడినీళ్లు బకెట్లో పోసి బావి దగ్గర పెట్టేది.

నేనెళ్లి స్నానం చేసి, దేవుడికి దండం పెట్టుకుని ముందు గదిలోకి రాగానే నాన్న నాకోసం కొత్తగా కుట్టించిన అంగీ, నిక్కరు చేతిలో పెట్టేవాడు. నా మొహం వెలిగిపోయేది. ఏడాదికి రెండు డ్రెస్సులే కదా. ఒకటి పుట్టినరోజుకి, ఇంకోటి దసరాకి.

తర్వాత నాన్నతో పాటు మటన్ షాపుకు ప్రయాణం. మటన్ తెస్తే అమ్మ వండిపెట్టేది. పూరీలు చేసేది. ఇంతలో మా మేనత్త, మామయ్య వచ్చేవారు. ఇల్లు దగ్గరే. మామయ్య, నాన్న ఇద్దరూ ఆజంజాహీ మిల్లులోనే పనిచేసేవారు. ఇక ఇద్దరూ మందేసుకుంటూ ముచ్చట్లలో మునిగిపోయేవారు. వంటింట్లో నేను, అమ్మ, అత్త… జింజర్ సోడా తాగుతూ పూరీలు తినేవాళ్లం.

సాయంత్రం నాన్న నన్ను సైకిల్ మీద ఎక్కించుకుని జమ్మిచెట్టు దగ్గరికి తీసుకెళ్లేవాడు. అది వరంగల్ సెంట్రల్ జైలు ఆవరణలో ఉండేది. ప్రదక్షిణలు చేసి, ఆకులు తీసుకుని, కొంచెం ముందుకెళ్లి పాలపిట్టను చూసి ఇంటికి వచ్చేవాళ్లం. పాలపిట్టను చూస్తే ఏడాదంతా శుభం జరుగుతుందని నమ్మకం.

సాయంత్రపు వెలుగులో జమ్మిచెట్టు పక్కన నిలిపిన పాత నల్ల సైకిల్
నాన్న సైకిల్, జమ్మిచెట్టు… దసరా సాయంత్రాలు

అమ్మ చేతిలో బంగారం—జమ్మి ఆకులు—పెట్టి కాళ్లకు దండం పెట్టేవాడిని. అమ్మ నాకు ముద్దులు పెట్టేది.

అరచేతిలో జమ్మి ఆకులు, చేతికి ఆకుపచ్చ గాజులు
జమ్మి ఆకుల్లో బంగారం ఉండదు… ఆత్మీయత ఉంటుంది

కాసేపయ్యాక మళ్లీ బయలుదేరి రంగశాయిపేట రావణ దహనం చూడటానికి వెళ్లేవాళ్లం.

ఇదీ మా ఇంటి దసరా. బతుకమ్మ, దసరా వచ్చాయంటే మామూలు ఉత్సాహం కాదు. బతుకమ్మ నాడు అమ్మతో, దసరా నాడు నాన్నతో… అప్పుడు అదే విజయమనుకుంటా.

అవన్నీ ఎప్పుడు, ఎలా దూరమయ్యాయో ఇప్పుడు వెనక్కి చూసుకుంటే తెలియడంలేదు.

ఇప్పుడు దసరా అంటే వాట్సాప్‌లో వందల శుభాకాంక్షలు. ఒకే బొమ్మ, ఒకే వాక్యం, ఫార్వర్డ్ మీద ఫార్వర్డ్. జమ్మి ఆకులు చేతిలో పెట్టి “బంగారం తీసుకో” అని ఆలింగనం చేసుకునే అలయ్ బలయ్ కనిపించడం తగ్గిపోయింది. ఆ ఆకుల్లో బంగారం ఉండదు. కానీ ఆ ఆలింగనంలో ఉన్న ఆత్మీయత బంగారం కంటే విలువైనది.

పండుగలు మారలేదు. మనమే మారాం.

“ఈ దసరా మాత్రం కొంచెం కొత్తగా ఉంది. ఎక్కడో చూసినట్లనిపించింది. ఆలోచిస్తే… చిన్నప్పటిదే… అదే ఆనందం… అదే సంతోషం.

పాండవులు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలను తిరిగి తీసుకున్న కథ గుర్తొస్తోంది. ఇప్పుడు ఆ కథలో నాకు మరో అర్థం కనిపిస్తోంది. పక్కన పెట్టిన ధైర్యాన్ని అవసరమైన వేళ తిరిగి అందుకోవచ్చని.

విజయదశమి అంటే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు. రాముడు రావణుడిని గెలిచాడు. దుర్గ మహిషుడిని గెలిచింది.

మరి నేను…?

ప్రతి మనిషి మనసులో తనదైన ఓ యుద్ధం ఉంటుంది. సర్దుకుపోతే మనసుకు కష్టం. లేకపోతే మనిషికి కష్టం.

ఈ రెండింటి మధ్య నలిగిపోతూ ఒక నిర్ణయం తీసుకోవడం చిన్న విషయం కాదు. జీవితం, జీవిక, పేరు, ప్రతిష్ఠ, ఆత్మగౌరవం… అన్నీ ముడిపడి ఉంటాయి.

“సర్దుకుపోతే మనసుకు కష్టం. లేకపోతే మనిషికి కష్టం.

ఈ విజయదశమికి నాకూ అదే ఎదురైంది. 35 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఒక రోజు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. జీతం, హోదా ఒకవైపు. ఆత్మగౌరవం మరోవైపు.

యుద్ధం పెద్దదే. కానీ గంటలో ముగిసిపోయింది.

బయటకు అది ఒక గంట నిర్ణయమే కావచ్చు. కానీ ఆ గంటలో మనసులో ఎన్నో ప్రశ్నలు.

ఇన్నేళ్ల అనుబంధం ఏమవుతుంది? రేపు ఏం చేయాలి?

ప్రతి ప్రశ్నకూ “సర్దుకుపో” అనేదే సులువైన జవాబు. కానీ ఒక్క ప్రశ్నకు మాత్రం ఆ జవాబు సరిపోలేదు.

“రేపు అద్దంలో నన్ను నేను చూసుకోగలనా?”

నిర్ణయమే గెలిచింది.

జీతం, జీవిక, హోదా, పదవి కంటే ఆత్మగౌరవమే మిన్న అని నా అంతరాత్మ చెప్పింది. నా కుటుంబం ఆ నిర్ణయాన్ని గౌరవించింది.

ఉద్యోగం ఒక్కరిదే కావచ్చు, కానీ దాని ఫలితం కుటుంబమంతటిది. అలాంటప్పుడు “నువ్వు చేసిందే రైట్” అనే భరోసా చిన్నది కాదు.

నా విజయంలో సగం వాళ్లదే.

ఆ రోజు నేను గెలిచింది ఎవరినో కాదు. నాలోని భయాన్ని. “సర్దుకుపో” అని లోపల గుసగుసలాడే గొంతును.

ఆ సమయంలో నా పక్కన నిలబడిన మనుషుల విలువ మరింత తెలిసింది. వాళ్లు ఇచ్చిన ధైర్యాన్ని మర్చిపోలేను.

ఈ వ్యాసం చదువుతున్న మీలో ఎంతోమంది ఆఫీసుల్లో, ఇళ్లలో, సమాజంలో ఏదో ఒకచోట ఏదో ఒకదాన్ని మౌనంగా భరిస్తూ ఉండొచ్చు.

ప్రతి ఒక్కరి పరిస్థితీ వేరు. నిర్ణయానికి కావాల్సిన సమయమూ, అవకాశమూ వేరు. మౌనంగా భరిస్తున్నంత మాత్రాన ఎవరూ బలహీనులు కారు. అయితే ఆ మౌనంలో మన విలువను మనమే మర్చిపోకూడదు.

ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. ఎంతో ఆనందంగా ఉంది. చిన్నప్పుడు నాన్న సైకిల్ మీద కూర్చుని జమ్మిచెట్టు దగ్గరకు వెళ్తున్నప్పుడు కలిగిన ఆ సంతోషం మళ్లీ తిరిగి వచ్చినట్టుంది.

అందుకే ఈ విజయదశమి నాకెంతో ప్రత్యేకం.

అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. 🙏

తర్వాత చదవండిచీరలో, ఒట్టికాళ్లతో 1,600 మీటర్ల ట్రయల్ పరుగులో కవితఆలోచనలుకాళ్లకు బూట్లు లేవు… కలలకు హద్దులు లేవు!

ఈ కథనంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం. ఏదైనా తప్పు కనిపిస్తే contact@maromaata.comకు రాయండి — సరిచేస్తాను. సంపాదకీయ విధానం →

చెర్మాల శ్రీనివాస్

రచయిత

నా గురించి →

మరిన్ని కథనాలు

షేర్