అభిప్రాయాలు… ఆలోచనలు… అక్షరాలు…

ట్రంప్‌ ‘మధ్యంతర’ ఓటమి. భారత్‌కు లాభమా? నష్టమా?

జీవన వ్యయం, ఇరాన్‌ యుద్ధం, ప్రభుత్వ అవినీతిపై అసంతృప్తి అమెరికా ఓటును ప్రభావితం చేశాయి. కాంగ్రెస్‌లో మారిన అధికార సమీకరణం భారత్‌కు తన వాదన వినిపించే అవకాశం ఇస్తుందా? సుంకాలు, వీసాలు, భద్రత విషయంలో ఆ అవకాశం ఎంతవరకు ఫలిస్తుంది?

చెర్మాల శ్రీనివాస్9 నవంబర్ 2026 · 8 నిమిషాలు · English →
మధ్యంతర ఎన్నికల ఓటమి తర్వాత టోపీ సవరించుకుంటున్న డొనాల్డ్ ట్రంప్

జీవన వ్యయం, ఇరాన్‌ యుద్ధం, ప్రభుత్వ అవినీతిపై అసంతృప్తి అమెరికా ఓటును ప్రభావితం చేశాయి. కాంగ్రెస్‌లో మారిన అధికార సమీకరణం భారత్‌కు తన వాదన వినిపించే అవకాశం ఇస్తుందా? సుంకాలు, వీసాలు, భద్రత విషయంలో ఆ అవకాశం ఎంతవరకు ఫలిస్తుంది?

బ్యాలెట్‌పై తన పేరే ఉందనుకుని ఓటేయాలని డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో పదేపదే చెప్పారు. ఫలితాలు వచ్చాక, బ్యాలెట్‌పై తాను లేనని, ఉండి ఉంటే రిపబ్లికన్లు భారీ విజయం సాధించేవారని అన్నారు. ఈ రెండు వ్యాఖ్యల మధ్యే ఎన్నికల తీర్పు అర్థం కనిపిస్తుంది. ట్రంప్‌ స్వయంగా తన పాలనను ప్రచారంలో ముందుకు తెచ్చారు. ఓటర్లు ఆ పాలనకు తమ అనుభవంతో తీర్పిచ్చారు.

నవంబర్‌ 3 మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు ప్రతినిధుల సభనూ, సెనేట్‌నూ గెలుచుకున్నారు. కాన్సాస్‌, అయోవా, టెక్సాస్‌, ఒహాయో, మెయిన్‌, నార్త్‌ కరోలినా, సౌత్‌ కరోలినాల్లో రిపబ్లికన్ల చేతిలో ఉన్న సెనేట్‌ స్థానాలను కైవసం చేసుకున్నారు. కాన్సాస్‌లో దాదాపు శతాబ్దం తర్వాత ఒక డెమోక్రాట్‌ సెనేట్‌ ఎన్నిక గెలిచారు. అధ్యక్షుడి పార్టీ మధ్యంతర ఎన్నికల్లో సీట్లు కోల్పోవడం అమెరికాలో సాధారణమే. ఈసారి రెండు సభలూ చేజారడం, రిపబ్లికన్లకు పట్టున్న రాష్ట్రాల్లోనూ ఓటమి ఎదురవడం తీర్పు తీవ్రతను చూపిస్తున్నాయి.

ఓటరు ఎందుకు దూరమయ్యాడు?

Donald Trump pointing at a rally
ధరలు తగ్గిస్తానన్న హామీని ఓటరు నెలవారీ బిల్లుతో తూకం వేశాడు (ఫైల్‌ ఫొటో)

జీవన వ్యయం, ఇరాన్‌ యుద్ధం ఒకదానితో మరొకటి ముడిపడ్డాయి. ధరలు తగ్గిస్తానని హామీ ఇచ్చిన ట్రంప్‌ హయాంలో కిరాణా, వైద్యం, ఇంధన ఖర్చులపై ఆందోళన కొనసాగింది. జీవన వ్యయం తమ ఓటుకు కీలకమైన లేదా ముఖ్యమైన అంశమని ఓటర్లు చెప్పారు. ఇరాన్‌ యుద్ధం, హార్ముజ్‌ జలసంధిలో రవాణాకు ఎదురైన ఆటంకాలు ఇంధన ధరలపై ఒత్తిడి పెంచాయి. దిగుమతి సుంకాలను విదేశాలపై ఒత్తిడి తెచ్చే మార్గంగా ట్రంప్‌ చూపించారు. కానీ వాటిని మొదట చెల్లించేది అమెరికా దిగుమతిదారే. ఆ ఖర్చులో కొంత వినియోగదారుల మీద పడుతుంది. ధరలు తగ్గిస్తానన్న హామీని ఓటర్లు తమ నెలవారీ ఖర్చుతో పోల్చి చూశారు.

అధ్యక్షుడిని కాంగ్రెస్‌ నిలదీయాలన్న అభిప్రాయమూ బలంగా కనిపించింది. ప్రభుత్వ అవినీతి తమ ఓటుకు కారణంగా మారిందని సగానికి పైగా ఓటర్లు ఏపీ సర్వేలో చెప్పారు. అధ్యక్షుడి అధికారంపై కాంగ్రెస్‌ తగినంత పర్యవేక్షణ చేయడం లేదన్నవారు పది మందిలో దాదాపు ఏడుగురు. వలస చట్టాల అమలులో ప్రభుత్వం హద్దు దాటిందని దాదాపు ఆరుగురు అన్నారు. 2024లో ట్రంప్‌కు కొంత మద్దతు ఇచ్చిన యువ, లాటినో ఓటర్లలో ఈసారి డెమోక్రాట్ల వైపు మొగ్గు కనిపించింది. ధరలపై అసంతృప్తితో మొదలైన తీర్పులో ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచాలన్న కోరిక కూడా ఉంది.

ఏఐ డేటా సెంటర్ల ప్రభావం దేశవ్యాప్తంగా పరిమితమే అయినా, అవి వచ్చే ప్రాంతాల్లో వ్యతిరేకత బలంగా కనిపించింది. దాదాపు నలుగురిలో ఒకరు ఈ అంశం తమ కాంగ్రెస్‌ ఓటుకు కీలకమని చెప్పారు. విద్యుత్‌ సరఫరాను విస్తరించే ఖర్చు ఎవరు భరిస్తారు? స్థానికంగా ఎంత నీరు వాడతారు? హైదరాబాద్‌, అమరావతి వంటి ప్రాంతాల్లో డేటా సెంటర్లను ఆకర్షించేందుకు పోటీ పడుతున్న మన ప్రభుత్వాలూ ఈ ప్రశ్నలకు ప్రాజెక్టుల అనుమతికి ముందే జవాబు చెప్పాలి. ఈ ప్రాజెక్టుల వెనుక దాగి ఉన్న నష్టం గురించి మరో మాట ఇంతకు ముందే హెచ్చరించింది.

“

ట్రంప్‌ మాటపై నమ్మకం ఎంత మిగిలిందో ఓటరు తన నెలవారీ బిల్లుతో తూకం వేశాడు.

పాకిస్థాన్‌కు ఇచ్చిన ప్రాధాన్యం

Narendra Modi and Donald Trump in conversation
మోదీ, ట్రంప్‌. కాల్పుల విరమణపై ట్రంప్‌ వాదనను భారత్‌ తోసిపుచ్చింది (ఫైల్‌ ఫొటో)

పహల్గామ్‌ దాడి తర్వాత 2025 మేలో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య నాలుగు రోజుల సైనిక ఘర్షణ జరిగింది. కాల్పుల విరమణకు తానే మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్‌ పదేపదే చెప్పారు. మూడో దేశం మధ్యవర్తిత్వం లేదని భారత్‌ స్పష్టం చేసినా, ట్రంప్‌ ఆ పాట మాత్రం ఆపలేదు. పాకిస్థాన్‌ మాత్రం ట్రంప్‌ పాత్రను ప్రశంసించింది. ఆ తర్వాత పాక్‌ సైన్యాధిపతి అసీం మునీర్‌కు ట్రంప్‌ వైట్‌హౌస్‌లో ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చారు. ఎన్నికలకు ముందు విడుదల చేసిన విజయాల జాబితాలోనూ కాల్పుల విరమణను వైట్‌హౌస్‌ ట్రంప్‌ ఘనతగా చూపించింది. భారత్‌ అభ్యంతరాన్ని తెలిసీ అదే వాదనను కొనసాగించడం, పాక్‌ సైనిక నాయకత్వానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం న్యూఢిల్లీ ఆందోళనకు కారణం.

ఇరాన్‌తో చర్చలకు పాకిస్థాన్‌ సాయం చేసింది. ఇస్లామాబాద్‌తో సంబంధం కొనసాగించడానికి వాషింగ్టన్‌కు అదొక దౌత్య కారణం. మరోవైపు, ట్రంప్‌ కుటుంబంతో సంబంధమున్న వరల్డ్‌ లిబర్టీ ఫైనాన్షియల్‌ అనుబంధ సంస్థతో పాకిస్థాన్‌ క్రిప్టో రంగంలో అవగాహన ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వ నిర్ణయాలకూ కుటుంబ వ్యాపారాలకూ సంబంధం ఉందా అని కొత్త కాంగ్రెస్‌ విచారణ చేపడితే ఆ ఒప్పందంపైనా ప్రశ్నలు రావచ్చు. భారత్‌కు అసలు పరీక్ష పాక్‌కు ఎలాంటి రక్షణ సహకారం లభిస్తుందన్నదే కాక, మరోసారి ఉద్రిక్తత తలెత్తితే మన భద్రతా ఆందోళనలకు వాషింగ్టన్‌ ఎంత ప్రాధాన్యం ఇస్తుందన్నది.

రష్యా ఇంధనంపై ద్వంద్వ ప్రమాణాలు

రష్యా ముడిచమురు కొన్నందుకు 2025లో భారత వస్తువులపై ట్రంప్‌ ప్రభుత్వం 25 శాతం అదనపు సుంకం వేసింది. ఇతర సుంకాలతో కలిపి అనేక వస్తువులపై భారం 50 శాతం వరకు చేరింది. రష్యా చమురుతో ముడిపడిన ఆ అదనపు సుంకాన్ని 2026 ఫిబ్రవరిలో తొలగించారు. అక్టోబరులో అమెరికాలో డీజిల్‌ ధరలు పెరిగినప్పుడు ఉన్నట్టుండి ట్రంప్‌ పుతిన్‌తో సరఫరా ఒప్పందాన్ని ప్రకటించి, ప్రపంచానికి షాకిచ్చారు. రష్యా డీజిల్‌ దిగుమతికి తాత్కాలిక మినహాయింపు ఇచ్చారు. అదే నెలలో, రష్యా చమురు లేదా గ్యాస్‌ కొనుగోలు చేసే ప్రధాన దేశాలపై కొత్త చట్టం కింద అమల్లోకి రావాల్సిన సుంకాలకూ మినహాయింపు ఇచ్చారు. అమెరికాకు బయలుదేరిన రెండు డీజిల్‌ ట్యాంకర్లు తర్వాత దారి మళ్లాయి. అయినా విధానంలో వైరుధ్యం స్పష్టమే. తన ప్రజలకు ఇంధన ధరలు తగ్గించేందుకు రష్యా సరఫరాకు తలుపు తెరిచిన అమెరికా, అదే ఇంధన అవసరంతో భారత్‌ తీసుకున్న నిర్ణయానికి గతంలో సుంకంతో వెల కట్టింది.

Rosneft oil tanker passing under a bridge
రష్యా చమురు సంస్థ రాస్‌నెఫ్ట్‌ ట్యాంకర్‌ (ఫైల్‌ ఫొటో)
“

తన ప్రజలకు ఇంధన ధరలు తగ్గించేందుకు రష్యా సరఫరాకు తలుపు తెరిచిన అమెరికా, అదే ఇంధన అవసరంతో భారత్‌ తీసుకున్న నిర్ణయానికి గతంలో సుంకంతో వెల కట్టింది.

ఈ విషయంలో డెమోక్రాట్లు భారత్‌కు అండగా నిలుస్తారని కూడా ఇప్పుడే అనుకోలేం. హార్ముజ్‌లో రవాణా చిక్కుల సమయంలో అప్పటికే నౌకల్లో ఉన్న రష్యా చమురును భారత్‌కు అమ్మేందుకు అమెరికా మార్చిలో తాత్కాలిక అనుమతి ఇచ్చింది. డెమోక్రాట్‌ సెనేటర్‌ రూబెన్‌ గలెగో ఆ నిర్ణయాన్ని ప్రశ్నించారు. రష్యాకు చమురు ఆదాయం తగ్గాలన్నది ఆయన వాదన. సరఫరా ఆగకుండా, ధరలు అందుబాటులో ఉండటం మన అవసరం. ఆ అవసరాన్ని కొత్త కాంగ్రెస్‌కూ వివరించాల్సిందే. ఇరాన్‌ యుద్ధం చల్లారి హార్ముజ్‌ మీదుగా రవాణా సజావుగా సాగితే, భారత్‌కు తక్షణ ప్రయోజనం చమురు దిగుమతి ఖర్చుపై ఒత్తిడి తగ్గడం.

సుంకాలు, వీసాలు. ఏం మారవచ్చు?

Modi and Trump at a joint White House press conference, February 2025
2025 ఫిబ్రవరి 13న వైట్‌హౌస్‌లో మోదీ, ట్రంప్‌ సంయుక్త విలేకరుల సమావేశం

వాణిజ్యం. ఫిబ్రవరిలో రెండు దేశాలు ప్రకటించిన చట్రంలో కొన్ని భారతీయ వస్తువులపై 18 శాతం సుంకాన్ని ప్రతిపాదించారు. ఆ రేటు అమల్లోకి రాలేదు. విస్తృత సుంకాలకు ట్రంప్‌ వాడిన అత్యవసర అధికారాల చట్టం అందుకు వీలు కల్పించదని అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. జులై నుంచి వేరే చట్టంలోని సెక్షన్‌ 301 కింద చాలా భారతీయ వస్తువులపై 10 శాతం అదనపు సుంకం అమల్లోకి వచ్చింది. మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై ఇంకా సంతకాలు కాలేదు. రైతుల ప్రయోజనాలను కాపాడుతామని వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ చెబుతున్నారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు ఇక్కడ ఎంత మార్కెట్‌ ఇవ్వాలన్నది చర్చల్లో కీలకం. రాజకీయంగా బలహీనపడిన ట్రంప్‌కు త్వరగా ఒప్పందం కుదుర్చుకోవాలన్న ఆసక్తి ఉండవచ్చు. బేరసారాల్లో అది భారత్‌కు ఉపయోగపడితే, రైతులకు ఇచ్చే రక్షణల్లోనూ, ఎగుమతిదారులకు దక్కే సుంకాల స్పష్టతలోనూ కనిపించాలి.

US visa and American flag
లక్ష డాలర్ల రుసుము అమలును కోర్టులు అడ్డుకున్నాయి. మన నిపుణులకు కావాల్సింది స్థిరమైన నిబంధనలు

హెచ్‌–1బీ. ఈ వీసా ద్వారా అమెరికాలో పనిచేసేవారిలో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కొన్ని కొత్త దరఖాస్తులపై ట్రంప్‌ ప్రభుత్వం విధించిన లక్ష డాలర్ల రుసుము అమలును కోర్టులు అడ్డుకున్నాయి. కొత్త ఆంక్షలు చట్టంగా మారకుండా కాంగ్రెస్‌ అడ్డుకోగలదు. ఇప్పటికే ఉన్న నిబంధనలపై అధికారులను ప్రశ్నించగలదు. దరఖాస్తుదారులకు లభించే ఉపశమనం మాత్రం కోర్టు తీర్పులు, ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. మన నిపుణులకూ, వారిని నియమించే కంపెనీలకూ కావాల్సింది ఉద్యోగ నిర్ణయం తీసుకునే రోజున ఉన్న నిబంధనే, దరఖాస్తు చేసే రోజున కూడా వర్తిస్తుందన్న నమ్మకం.

రక్షణ. భారత్‌తో రక్షణ సహకారానికి అమెరికాలో రెండు పార్టీల మద్దతు ఉంది. చైనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఇండో–పసిఫిక్‌లో కలిసి పనిచేయడానికి రెండు దేశాలకూ కారణాలున్నాయి. ఆ సంబంధాన్ని ఉపయోగించుకుని పాకిస్థాన్‌పై మన భద్రతా ఆందోళనలను వైట్‌హౌస్‌తో పాటు కాంగ్రెస్‌లోనూ వినిపించే అవకాశం ఇప్పుడు దక్కుతుంది.

భారతీయ అమెరికన్లు ఎటు మొగ్గారు?

ఎన్నికలకు ముందు కార్నెగీ–యూగవ్‌ సర్వేలో భారతీయ మూలాలున్న అమెరికన్‌ పౌరుల్లో 62 శాతం మంది డెమోక్రాట్‌ ప్రతినిధుల సభ అభ్యర్థికి ఓటేస్తామని చెప్పారు. రిపబ్లికన్‌ అభ్యర్థికి మద్దతు తెలిపింది 19 శాతం. ఫ్లోరిడాలో పియా దండియా, అరిజోనాలో అమిష్‌ షా గెలిచారు. రో ఖన్నా, ప్రమీలా జయపాల్‌, సుహాస్‌ సుబ్రమణ్యం తిరిగి ఎన్నికయ్యారు. ఒహాయో గవర్నర్‌ పోటీలో రిపబ్లికన్‌ వివేక్‌ రామస్వామి ఓడిపోయారు. కాలిఫోర్నియాలో రో ఖన్నాపై పోటీ చేసిన రిపబ్లికన్‌ రితేష్‌ టాండన్‌ కూడా భారతీయ మూలాలున్న అభ్యర్థే. సర్వే ఒక వర్గం ఎన్నికల ముందరి మొగ్గును చూపించింది. అభ్యర్థుల గెలుపోటముల్లో ఆయా రాష్ట్రాలు, నియోజకవర్గాల రాజకీయాలకూ పాత్ర ఉంది.

2028లో ఎవరి లెక్క ఎలా ఉంది?

ఇరాన్‌ యుద్ధమే రిపబ్లికన్ల ఓటమికి ప్రధాన కారణమని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ అన్నారు. యుద్ధం వల్ల ఇంధన ధరలు పెరగడం ఎన్నికలపై ప్రభావం చూపిందని ట్రంప్‌ అంగీకరించారు. అయినా మళ్లీ అదే పరిస్థితి వస్తే అదే నిర్ణయం తీసుకుంటానన్నారు. 2028 రిపబ్లికన్‌ అభ్యర్థిత్వానికి వాన్స్‌ పేరు ముందువరుసలో ఉంది. విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేరూ వినిపిస్తోంది. వాన్స్‌ పోటీ చేస్తే ట్రంప్‌ మద్దతుదారులను వెంట ఉంచుకుంటూనే, ఈసారి దూరమైన ఓటర్లను తిరిగి ఆకట్టుకోవాలి. అప్పుడాయనకు ఎదురయ్యే ప్రశ్న సూటిగానే ఉంటుంది. ఓటమి తర్వాత యుద్ధాన్ని కారణమన్నారు గానీ, నిర్ణయం తీసుకునేటప్పుడు ఉపాధ్యక్షుడిగా మీరేం చేశారు?

డెమోక్రాట్లకు వైట్‌హౌస్‌ను తిరిగి గెలుచుకునే అవకాశం ఉంది. గావిన్‌ న్యూసమ్‌, కమలా హారిస్‌, జోష్‌ షాపిరో, ఆండీ బెషియర్‌, అలెగ్జాండ్రియా ఒకాసియో–కార్టెజ్‌ వంటి పేర్లు చర్చలో ఉన్నాయి. జార్జియాలో తిరిగి గెలిచిన జాన్‌ ఓసాఫ్‌పైనా చర్చ పెరిగింది. అయితే తాను 2028లో అధ్యక్ష పదవికి పోటీ చేయడం లేదని ఆయన చెప్పారు. మధ్యంతర విజయాన్ని అధ్యక్ష ఎన్నికల్లోనూ నిలబెట్టుకోవాలంటే, కాంగ్రెస్‌లో దక్కిన అధికారంతో వైద్యం, జీవన వ్యయం వంటి సమస్యలపై ఏం చేశారో డెమోక్రాట్లు చూపించాలి.

భారత్‌కు అభ్యర్థుల కంటే వారి వైఖరి ముఖ్యం. వాన్స్‌ మోదీతో వాణిజ్య చర్చలు జరిపారు. రక్షణ, ఇంధన సహకారం పెరగాలని చెప్పారు. అమెరికా కంపెనీలకు భారత మార్కెట్‌లో మరింత ప్రవేశం కూడా కోరారు. ఓసాఫ్‌ భారత్‌కు వచ్చిన ఆర్థిక ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు. అదే సమయంలో తన రాష్ట్ర రైతుల కోసం పెకాన్‌ గింజలపై భారత సుంకాలు తగ్గించాలని కోరారు. రో ఖన్నా భారత్‌పై ట్రంప్‌ వేసిన సుంకాలను తొలగించాలని ముందుకొచ్చారు. హెచ్‌–1బీలో మాత్రం అమెరికన్‌ ఉద్యోగులకు రక్షణ పెంచేలా నిబంధనలు మార్చాలన్నది ఆయన వైఖరి. భారత్‌తో సత్సంబంధాలు కోరే నాయకులకూ, తమ దేశంలో కాపాడుకోవాల్సిన ప్రయోజనాలు ఉంటాయి.

మరోమాట

2027 జనవరి 3 నుంచి కాంగ్రెస్‌లో డెమోక్రాట్లకు విచారణలు జరిపే, అధికారులను పిలిచి ప్రశ్నించే, ప్రభుత్వ ఖర్చుపై షరతులు పెట్టే అవకాశం ఉంటుంది. ఇరాన్‌ యుద్ధానికి కొత్త నిధుల విషయంలో ఆ అధికారం ఉపయోగపడవచ్చు. ట్రంప్‌ మాత్రం 2029 జనవరి 20 వరకు అధ్యక్షుడిగా ఉంటారు. ఆయన వీటోను అధిగమించడానికి రెండు సభల్లోనూ మూడింట రెండొంతుల మద్దతు కావాలి. కొత్త కాంగ్రెస్‌ అధ్యక్షుడికి రాజకీయంగా అడ్డుకట్ట వేయగలదు గానీ, తన ప్రతి నిర్ణయాన్ని వెంటనే మార్చగలిగే బలం దానికి లేదు.

“

భారత్‌కు ఇప్పటికి లభించింది కొంత బేరసారాల వెసులుబాటు.

ఆ వెసులుబాటును ఉపయోగించుకోవాలంటే వైట్‌హౌస్‌తో పాటు కాంగ్రెస్‌తోనూ, అమెరికా రాష్ట్రాలతోనూ, అక్కడి భారతీయ సమాజంతోనూ ఉన్న సత్సంబంధాలు బలోపేతం చేసుకోవాలి. వాణిజ్య ఒప్పందంలో సంతకం చేసే తేదీ కంటే రైతుకు దక్కే రక్షణ, ఎగుమతిదారుకు కావాల్సిన స్పష్టత ముఖ్యం. ఇంధనం ఎక్కడ కొనాలో మన సరఫరా అవసరాలు, ధరలు నిర్ణయించాలి. పాకిస్థాన్‌తో అమెరికా సంబంధాలు ఎలా ఉన్నా, మన భద్రతా వాదనకు వాషింగ్టన్‌లో రెండు పార్టీల్లోనూ మద్దతు ఉండాలి.

అమెరికా ఓటరు ట్రంప్‌ను తన ఇంటి బిల్లుతో కొలిచాడు. భారత్‌ ఈ తీర్పును తన ఎగుమతిదారుకు పడే సుంకంతో, తన నిపుణుడికి వర్తించే వీసా నిబంధనతో, తన భద్రతా ఆందోళనలకు అమెరికా ఇచ్చే ప్రాధాన్యంతో కొలవాలి.

తర్వాత చదవండిరాజకీయాలుబిలాంగింగ్ – ఎ జర్నీ ఆఫ్ లవ్: సోనియా ఏం రాసింది?

ఈ కథనంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం. ఏదైనా తప్పు కనిపిస్తే contact@maromaata.comకు రాయండి — సరిచేస్తాను. సంపాదకీయ విధానం →

చెర్మాల శ్రీనివాస్

రచయిత

నా గురించి →

షేర్