అభిప్రాయాలు… ఆలోచనలు… అక్షరాలు…

భగినీ హస్త భోజనం: “అన్నయ్యా… రేపు మా ఇంటికి భోజనానికి రావాలి.”

రాఖీ అందరికీ తెలుసు. కానీ దీపావళి తర్వాత వచ్చే భగినీ హస్త భోజనం పేరు మనలో చాలామందికి తెలియదు. యముడే స్వయంగా చెల్లెలి ఇంటికి భోజనానికి వెళ్లిన రోజు ఇది. ఆ కథ, ఆ ఆచారం, ఈ కాలంలో దాని అవసరం.

చెర్మాల శ్రీనివాస్10 నవంబర్ 2026 · 7 నిమిషాలు · English →
యమునా దేవి తన అన్న యముడికి అరిటాకులో భోజనం వడ్డిస్తున్న చిత్రం

పండుగకు ముందు రోజు కొన్ని ఇళ్లలో ఒక ఫోన్ మోగుతుంది. అవతల అక్కో, చెల్లెలో.

ఆ పిలుపు చిన్నదే. కానీ దాని వెనక ఎన్నో ఏళ్ల జ్ఞాపకాలు దాగి ఉంటాయి. ఒకే కంచంలో పంచుకున్న ముద్దలు, చిన్న చిన్న అలకలు, అమ్మ తిట్టినప్పుడు ఒకరినొకరు వెనకేసుకొచ్చిన రోజులు. ఈ పిలుపే భగినీ హస్త భోజనం పండుగకు ప్రాణం.

ఈ ఏడాది ఈ పండుగ బుధవారం, నవంబర్ 11న. హైదరాబాద్ పంచాంగం ప్రకారం విదియ తిథి ఆ రోజు మధ్యాహ్నం 3:53 వరకు ఉంటుంది. అమెరికా, గల్ఫ్ దేశాల్లో ఉన్న మనవాళ్లకు మాత్రం ఒక రోజు ముందే, నవంబర్ 10నే వస్తుంది.

పేరులోనే ఉంది అర్థం

భగిని అంటే సోదరి. హస్తం అంటే చేయి. భగినీ హస్త భోజనం అంటే సోదరి చేతి భోజనం. కార్తీక శుద్ధ విదియ నాడు, అంటే దీపావళి అయిన రెండో రోజు, ఈ పండుగ వస్తుంది. దీన్నే యమ ద్వితీయ అనీ కూడా అంటారు. ఉత్తర భారతంలో దీని పేరు భాయ్ దూజ్.

ఆ రోజు అన్న అయినా తమ్ముడైనా తన సోదరి ఇంటికి వెళ్తాడు. ఆమె నుదుట బొట్టు పెట్టి, హారతి ఇచ్చి, తన చేత్తో వండి వడ్డిస్తుంది. అతను ఆమెకు కానుక ఇస్తాడు. భగిని అంటే చెల్లెలు మాత్రమే కాదు, అక్క కూడా. అందుకే ఇది అన్నాచెల్లెళ్ల పండుగ మాత్రమే కాదు, అక్కాతమ్ముళ్లదీ. మొత్తంగా తోబుట్టువుల పండుగ.

అరిటాకులో తమ్ముడికి భోజనం వడ్డిస్తున్న అక్క
అక్క చేతి ముద్ద… ఆ రుచే వేరు

యముడు చెల్లెలి ఇంటికి వెళ్లిన రోజు

ఈ పండుగ వెనక ఒక అందమైన కథ ఉంది. స్కాంద పురాణంలోని కార్తీక మాహాత్మ్యం దాన్ని వివరంగా చెబుతుంది.

సూర్యుడి పిల్లలు యముడు, యమున. ఇద్దరూ కవలలు. యమున రోజూ అన్న దగ్గరకు వచ్చి “అన్నయ్యా, మా ఇంటికి భోజనానికి రా” అని పిలిచేది. యముడు, ఇవాళ వస్తా… రేపు వస్తా… అంటూ వాయిదా వేస్తూ ఉండేవాడు. పనిలో మునిగిపోయిన వాళ్లకు తీరిక దొరకదని పురాణమే అంటుంది. వేల ఏళ్ల కిందటి ఆ మాట ఈ రోజు మనకూ అచ్చంగా సరిపోతుంది.

చివరికి ఒక కార్తీక శుద్ధ విదియ నాడు చెల్లెలు పట్టుబట్టి పిలిచింది. ఈసారి యముడు కాదనలేకపోయాడు. బయలుదేరే ముందు ఆ రోజు నరకంలో ఉన్నవాళ్లందరినీ విడిచిపెట్టాడు. చెల్లెలి ఇంటికి వెళ్తున్న సంతోషాన్ని లోకమంతా పంచాడు.

అన్న రాకతో యమున ఆనందానికి అంతు లేదు. తలంటి స్నానం చేయించింది, చందనం పూసింది, పూలమాల వేసింది. రకరకాల వంటకాలు చేసి కొసరి కొసరి వడ్డించింది. భోజనం తర్వాత యముడు చెల్లెలికి వస్త్రాలు, ఆభరణాలు ఇచ్చి గౌరవించాడు. “ఏం కావాలో కోరుకో” అన్నాడు.

యమున తన కోసం సంపదను, అధికారాన్ని అడగలేదు. “ఏటా ఈ రోజు నువ్వు మా ఇంటికి రావాలి. ఈ రోజు సోదరి చేతి భోజనం చేసే ప్రతి ఒక్కరూ సుఖంగా ఉండాలి” అని అడిగింది. తన కోసం కాకుండా అందరి కోసం అడగడం మన ప్రార్థనల్లోనే ఉంది. గాయత్రి మంత్రం కూడా “మా బుద్ధిని ప్రేరేపించు” అని అందరి తరఫునా అడుగుతుంది. యముడు సంతోషంగా వరమిచ్చాడు: ఈ రోజు సోదరి ఇంట భోజనం చేసి, ఆమెను గౌరవించిన వాళ్లు నరకలోక ద్వారం ముఖం చూడరని.

ఈ కథలో మనసును తాకేది యమున వడ్డించిన వంటకాలు కాదు. తన పనులన్నీ పక్కన పెట్టి యముడు చెల్లెలి ఇంటికి రావడం. కొన్నిసార్లు మనవాళ్లకు కావాల్సింది పెద్ద బహుమతి కాదు. మన కోసం ఎవరో సమయం తీసుకుని, పక్కన కూర్చుని ఒక పూట భోజనం చేయడమే.

అక్క అయితే ఆశీర్వాదం

పురాణం ఇంకో విషయాన్ని ప్రత్యేకంగా చెబుతుంది. సోదరి వయసులో పెద్దదైతే తమ్ముడు ఆమెకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి. అక్క అంటే అమ్మ తర్వాత అమ్మ అని మనం ఊరికే అనలేదు. అమ్మ పనిలో ఉన్నప్పుడు అన్నం తినిపించింది అక్కే. బడికి తయారు చేసింది అక్కే. పెళ్లయి అత్తారింటికి వెళ్లాక కూడా తమ్ముడు వస్తున్నాడంటే వంటింట్లో ఆమె చేసే హడావుడే వేరు.

అక్క చేతి వంట తమ్ముడికి చిన్ననాటి ఇంటిని గుర్తుచేస్తుంది. చెల్లెలి పిలుపు అన్నకు బాధ్యతల మధ్య మరిచిపోయిన ప్రేమను గుర్తుచేస్తుంది. వయసు పెరిగినా, దూరాలు వచ్చినా కొన్ని బంధాలు మారవు.

కరీంనగర్‌లో అక్కయ్య పిలుపు

నేను కరీంనగర్ ఈనాడులో పనిచేసే రోజులు. అన్నయ్య వాళ్లింట్లో ఉండేవాడిని. దగ్గర్లోనే రెండో అక్కయ్య ఇల్లు. ఏటా ఒక రోజు అక్కయ్య నన్నూ, అన్నయ్యనూ భోజనానికి పిలిచేది.

ఇలాంటి పండుగ ఒకటి ఉంటుందని నాకు అప్పట్లో తెలియదు. కానీ అన్నయ్య మాత్రం “అక్కయ్య భోజనానికి పిలిచింది కదా, ఈ రోజు తప్పకుండా వెళ్లాలి” అనేవాడు. మధ్యాహ్నానికల్లా ఆఫీసు నుంచి వచ్చేసేవాడు. వదిన, పిల్లలతో కలిసి అందరం అక్కయ్య ఇంటికి బయలుదేరేవాళ్లం. అప్పటికి నాకింకా పెళ్లి కాలేదు. పెళ్లయ్యాక కూడా ఆ అలవాటు అలాగే కొనసాగింది.

ఇక ఆ ఇంట్లో సందడే సందడి. బావగారు, మేనకోడళ్లు, మేనల్లుడు, అన్నయ్య, వదిన, వాళ్ల పిల్లలు. ఇల్లంతా పండుగ కళ. ఆ రోజు అన్నయ్య అక్కయ్యకు కొత్త బట్టలు, పసుపుకుంకుమలు, ఒక డబ్బుల కవరు కానుకగా ఇచ్చేవాడు. పురాణంలో యముడు యమునకు వస్త్రాలు ఇచ్చి గౌరవించినట్టే.

విచిత్రం ఏమిటంటే, అక్కయ్య ఇల్లు దగ్గరే కాబట్టి నేను మామూలు రోజుల్లోనూ తరచూ వెళ్లేవాడిని. అక్కడే తినేవాడిని కూడా. అదే ఇల్లు, అదే అక్కయ్య, అదే చేతి వంట. అయినా ఆ ఒక్క రోజు మాత్రం ఎందుకో ప్రత్యేకంగా అనిపించేది. ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతోంది.

“

ఆ రోజును ప్రత్యేకం చేసింది భోజనం కాదు, అందరం ఒకేచోట కలిసి కూర్చోవడం.

ఇలాంటి జ్ఞాపకాలు మనసులో ఎంత లోతుగా ఉండిపోతాయో నా విజయదశమిలోనూ రాసుకున్నాను.

కానుక చిన్నదైనా చాలు

యముడు భోజనం చేసి ఊరికే వెళ్లిపోలేదు. చెల్లెలిని గౌరవించి వెళ్లాడు. ఈ చిన్న వివరంలోనే పండుగ సందేశం ఉంది: ప్రేమను స్వీకరించడం ఎంత ముఖ్యమో, దాన్ని గౌరవంతో తిరిగి అందివ్వడమూ అంతే ముఖ్యం.

ఈ రోజు సోదరుడు సోదరికి కానుక ఇవ్వడం చాలా కుటుంబాల్లో ఆనవాయితీ. అది ఖరీదైనదే కానవసరం లేదు. ఆమెకు నచ్చిన చీర కావచ్చు, చిన్న వస్తువు కావచ్చు. అన్నిటికంటే గొప్ప కానుక ఒక మాట: “నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను.”

ఈ రోజు ఎవరూ ఒంటరిగా తినకూడదు

ఈ పండుగ అందరికీ ఒకేలా సాధ్యం కాదని పురాణానికి తెలుసు. అందుకే సోదరి లేనివాళ్లకూ దారి చూపింది. సొంత సోదరి లేకపోతే మేనత్త ఇంటికి వెళ్లి గౌరవంగా భోజనం చేయమంటుంది.

అక్కడితో ఆగదు. చెల్లెలు లేకపోతే అక్క. ఆమె కూడా లేకపోతే బాబాయి కూతురు, పిన్ని, మేనమామ కూతురు. ఎవరూ లేకపోతే ఏ ఆడపడుచునైనా సోదరిగా భావించమంటుంది. అదీ కుదరకపోతే ఒక గోవును, ఒక నదిని సోదరిగా భావించమంటుంది. ఆ రోజు మాత్రం సొంత ఇంట్లో భోజనం చేయవద్దంటుంది. చెరసాలలో ఉన్న ఖైదీలను కూడా ఆ రోజు వాళ్ల సోదరి ఇంటికి భోజనానికి పంపాలని రాజులకు ఆదేశిస్తుంది.

ప్రయాణంలో ఉండో, అనారోగ్యంతోనో సోదరి ఇంటికి వెళ్లలేని వాళ్లను కూడా పురాణం మరిచిపోలేదు. వాళ్లు ఈ కథ విన్నా చాలు, ఆ భోజనం చేసినంత ఫలం వస్తుందని చెబుతుంది.

ఇంత పట్టుదల ఎందుకు? ఏ ఒక్కరూ తోబుట్టువుల ఆప్యాయతకు దూరం కాకూడదని. ఆ ఒక్క రోజైనా ప్రతి మనిషికి “నా కోసం భోజనం సిద్ధం చేసి, ఎదురుచూసే సోదరి ఉంది” అనే భరోసా దక్కాలని.

ఊరికో పేరు, అదే ప్రేమ

దేశంలో చాలా చోట్ల ఈ రోజు ఘనంగా జరుగుతుంది. పేర్లు, పద్ధతులు ప్రాంతాన్ని బట్టి మారుతాయి.

పూజా పళ్లెంతో సోదరుడి నుదుట బొట్టు పెడుతున్న సోదరి
సోదరుడి నుదుట సోదరి బొట్టు
  • ఉత్తర భారతం (భాయ్ దూజ్): అక్కాచెల్లెళ్లు సోదరుడి నుదుట తిలకం దిద్ది, తీపి తినిపించి, అతని ఆయుష్షు కోసం ప్రార్థిస్తారు.
  • బెంగాల్ (భాయ్ ఫోంటా): చందనం బొట్టు పెడుతూ, యముడి ద్వారానికి ముళ్లు అడ్డం పడాలని ఒక జానపద పాట పాడతారు. అంటే తమ సోదరుడి దగ్గరికి మృత్యువు రాకూడదని.
  • మహారాష్ట్ర (భావ్ బీజ్): సోదరుడికి హారతి ఇచ్చి, తీపి వంటకాలతో భోజనం పెడతారు.
  • నేపాల్ (భాయ్ టికా): తిహార్ పండుగలో చివరి రోజు, ఆ దేశంలో అతిపెద్ద పండుగల్లో ఒకటి. ఏడు రంగుల తిలకం దిద్ది, త్వరగా వాడని పూలమాల వేస్తారు.

ఇవే కాక హిందీలో భయ్యా దూజ్, గుజరాత్‌లో భాయ్ బీజ్, బిహార్ మిథిల ప్రాంతంలో భరదుతియా, నేపాల్ నెవార్ సమాజంలో కిజా పూజ అని కూడా పిలుస్తారు. సంస్కృత గ్రంథాల్లో దీని పేరు భ్రాతృ ద్వితీయ.

ఎక్కడ చూసినా తిలకం, హారతి ముందుంటాయి. మన తెలుగు పేరులో మాత్రం సోదరి చేతి భోజనానికే పెద్దపీట. ప్రేమను వడ్డించడం మనకు బాగా తెలుసు.

మనకెందుకు తెలియకుండా పోయింది?

రాఖీ పౌర్ణమి వస్తోందంటే వారం ముందే దుకాణాలు రాఖీలతో నిండిపోతాయి. టీవీ ప్రకటనలు, సినిమా పాటలు, బడుల్లో హడావుడి. కట్టడానికి ఒక దారం ఉంది, అమ్మడానికి ఒక సరుకు ఉంది. భోజనానికి అమ్మే సరుకు లేదు, అందుకే ప్రచారమూ లేదు.

పైగా దీపావళి మరుసటి రోజే కార్తీక మాసం మొదలవుతుంది. దీపాలు, నదీ స్నానాలు, సోమవారాల హడావుడిలో విదియ నాటి ఈ పండుగ పంచాంగానికే పరిమితమై, కొన్ని కుటుంబాల ఆచారంగా మాత్రమే మిగిలిపోయింది.

ఇంకో కారణమూ ఉంది. మన దగ్గర ఆడబిడ్డ పుట్టింటికి రావడమే ఆనవాయితీ. బతుకమ్మకు, దసరాకు, సంక్రాంతికి కూతుళ్లు, అక్కాచెల్లెళ్లు పుట్టింటికి వస్తారు. ఈ పండుగలో దిశ మారుతుంది. సోదరుడే ఆమె ఇంటికి వెళ్లాలి. ఆ “వెళ్లడాన్నే” మనం మరిచిపోయాం.

నా అనుభవమే దానికి సాక్ష్యం. పండుగ పేరు నాకు తెలియదు. కానీ అక్కయ్యకు తెలుసు, అన్నయ్యకు తెలుసు. మన ఇళ్లలో ఈ పండుగ ఏ ప్రచారం లేకుండా, పేరు కూడా చెప్పకుండా నిశ్శబ్దంగా బతుకుతూనే ఉంది. ఆ ఇళ్ల గడప దాటి బయటికి రాలేదు, అంతే.

ఒక ఫోన్ కాల్, ఒక పూట భోజనం

ఈ రోజుల్లో తోబుట్టువులు ఒకే ఊర్లో ఉండటం అరుదు. ఒకరు బెంగళూరులో, ఒకరు అమెరికాలో, ఒకరు గల్ఫ్‌లో. పండుగ రోజు అక్క ఇంటికి వెళ్లి కూర్చోవడం అందరికీ కుదరదు.

కుదరకపోతే ఒక ఫోన్ చేయండి. వీడియో కాల్‌లో ఆమె వంటింట్లో ఏం చేస్తోందో చూస్తూ మాట్లాడినా అదే భోజనం. ఒకే ఊర్లో ఉంటే మాత్రం సాకులు వెతకొద్దు. వెళ్లి ఒక ముద్ద తినండి. వెళ్లడమే పెద్ద కానుక.

ఇంకా ఒక మాట. చిన్న పట్టింపులతో, ఆస్తి గొడవలతో, “ముందు ఎవరు ఫోన్ చేయాలి” అనే బింకంతో మాటలు ఆగిపోయిన తోబుట్టువులు ఎందరో ఉన్నారు. ఆ బింకాన్ని వదిలేయడానికి ఈ పండుగ మంచి సాకు. “ఎలా ఉన్నావు?” అనే ఒక్క ప్రశ్నతో ఏళ్ల మౌనం కరిగిపోవచ్చు. సర్వే భవంతు సుఖినః అని మన పెద్దలు కోరుకున్న సుఖం మొదలయ్యేది ఇంటి నుంచే.

చివరగా

రాఖీ దారం చేతికి ఉంటుంది. అక్క చేతి ముద్ద రుచి మనసులో ఉంటుంది.

భగినీ హస్త భోజనం అంటే సోదరి చేతి వంట మాత్రమే కాదు. “నా జీవితంలో నీకు ఇంకా చోటుంది” అని ఒకరు మరొకరికి చెప్పే ప్రేమ. అక్క, చెల్లెలు, అన్న, తమ్ముడు, ఎవరైనా సరే, ఆ పిలుపుకు స్పందించి కలిసి కూర్చునే క్షణమే ఈ పండుగలోని అసలైన తీపి.

యముడికే తీరిక దొరికింది. మనకు దొరకదా?

▶️ ఈ కథనాన్ని వీడియోలో చూడండి: పూర్తి వీడియో | యూట్యూబ్ షార్ట్

తర్వాత చదవండిసమయం లేదా? మనకోసం కూడా…! — మరో మాటజీవనశైలిసమయం లేదా? మనకోసం కూడా…!

ఈ కథనంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం. ఏదైనా తప్పు కనిపిస్తే contact@maromaata.comకు రాయండి — సరిచేస్తాను. సంపాదకీయ విధానం →

చెర్మాల శ్రీనివాస్

రచయిత

నా గురించి →

మరిన్ని కథనాలు

షేర్