ఈరోజు దేశ అత్యున్నత న్యాయస్థానంలో జరిగిన ఒక దుస్సంఘటనకు న్యాయ, రాజకీయ వ్యవస్థలు నివ్వెరపోయాయి. ప్రధాన న్యాయమూర్తిపై ఒక న్యాయవాది కిషోర్ రాకేశ్ చెప్పు విసరడం – ‘సనాతనధర్మానికి అవమానం జరిగితే సహించను’(Sanatan ka apman nahi sahege) అని అరవడం–
ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యదేశంలో ఇది నిస్సందేహంగా ఘోరమైన నేరమే. కోర్టు ఏదైనా, న్యాయమూర్తి ఎవరైనా ఇలాంటి ఘటన జరగకూడదు. అందరూ ఖండించాల్సిందే. ఇది నిర్వివాదాంశం.
ఇక అసలు విషయానికి వద్దాం. అసలేం జరిగింది?

కొద్ది రోజుల కిందట ఇదే సుప్రీం కోర్టు ముందుకో కేసు వచ్చింది. పిటిషనర్ ఖజురహోలోని ఒక ఆలయంలో తల లేని విష్ణుమూర్తి విగ్రహాన్ని పునరుద్ధరించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసాడు. అది విచారణార్హం కాదని తిరస్కరిస్తూ, అదే బెంచ్‌లో ఉన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, పురావస్తు శాఖ ఆధీనంలోని విషయాల్లో కోర్టు జోక్యం చేసుకోదని కేసు కొట్టేసారు. ఇంత వరకు బాగానే ఉంది.
ఇక్కడే చీఫ్ జస్టిస్ ఓ రెండు ఉచిత సలహాలు ఇస్తూ, అసందర్భ వ్యాఖ్యలు చేసారు. ఏంటంటే,
1. “If you are a strong devotee of Lord Vishnu, then pray and do some meditation. Go and ask the deity himself to do something.”
(“మీరు విష్ణువుకు మహా భక్తుడని చెబుతున్నారు కాబట్టి, ప్రార్థించండి, తపస్సు చేయండి, వెళ్లి మీ దేవుడినే అడగండి ఏదైనా చేయమని”)
2. “In the meantime, if you are not averse to Shaivism, you can go and worship there… there is a very big linga of Shiva, one of the biggest in Khajuraho.”
(మీరు శైవం పట్ల వ్యతిరేకత లేనివారైతే, అక్కడే ఉన్న మహా శివలింగాన్ని దర్శించండి. అది ఖజురాహోలో ఉన్న అతిపెద్ద లింగం)
ఈ రెండు సలహాలు, సుప్రీం కోర్టులో “ఆన్ రికార్డెడ్”గా ఉన్నాయి. వీటిని విన్నవారెవరైనా ఏమని అర్థం చేసుకుంటారు? లేదా ఏమని అర్థం చేసుకోవాలి..? అదే సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. సనాతన ధర్మం లేదా హిందుత్వం పట్ల సీజేఐ అసహనం వ్యక్తం చేసినట్లుగా భావించారు. నిజానికి నిజం కూడా అదే. కాదూ అనుకుంటే.. జడ్జి గారు కేవలం పురావస్తుశాఖ విషయం వరకు చెప్పి కేసు ముగించవచ్చు. ఈ అనవసర, అసందర్భ వ్యాఖ్యలు నిస్సందేహంగా ఆయన మత అసహనాన్నే సూచిస్తున్నాయి. సోషల్ మీడియాలో తుంపర లేవగానే ఆత్మరక్షణకు దిగిన సదరు న్యాయమూర్తి ‘తప్పుగా చూపించారు..’ అని యథాలాపంగా ఓ మాటనేసి ఊరుకున్నారు. పైగా తననుతాను నిఖార్సైన లౌకికవాదిగా చెప్పుకున్నారు. వీరి “లౌకికవాదం” గురించి తర్వాత మాట్లాడుకుందాం.
ఈ తతంగ పర్యవసానమే ఈనాటి సంఘటన. చెప్పు తనను తాకలేదు కాబట్టి, జడ్జి దాన్ని సీరియస్‌గా తీసుకోకుండా, ఇటువంటివి నన్ను ప్రభావితం చేయలేవని గాంభీర్య వచనాలు పలికారు. బాగుంది. ఆ మాత్రం ఆత్మ నిబ్బరం ఉండాలి.
పేరొందిన న్యాయవాదులు, ఇందిరా జైసింగ్, కపిల్ సిబల్‌లు జరిగిన సంఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. ఇక ఇందిరా జైసింగ్ అనే ఆవిడ ఇంకో అడుగు ముందుకేసి, ఇది కులతత్వం కారణంగా జరిగిందని నేను భావిస్తున్నానని సెలవిచ్చారు(I do consider it to be a casteist remark against the Chief Justice…). జరిగిన సంఘటనకు, కులానికి సంబంధం ఏంటో ఆ మహాతల్లికే అర్థం కావాలి.
“సనాతనధర్మానికి అవమానం జరిగితే సహించను” అన్న వ్యాఖ్య కులతత్వంతో కూడుకున్నదైతే, Gustakh-e-Rasool ki ek hi saza, Sar Tan Se Juda, Sar Tan Se Juda(ప్రవక్తను అవమానించిన వ్యక్తి తల నరకాలి) అనే నినాదం మతతత్వం అవ్వాలి కదా. మరెందుకు దీన్ని ప్రతీరోజూ ఉచ్చరిస్తున్నవారు స్వేచ్ఛగా ఈ దేశంలో తిరగగలుగుతున్నారు.? వారినెందుకో అరెస్టు చేయరూ..
ఈ పెను విషాదానికి కారణమేమిటంటే, సనాతన ధర్మం లేదా హిందూమతాన్ని అవహేళన చేయడం చాలామంది మేధావులు “భావప్రకటనా స్వేచ్ఛ”గా పరిగణిస్తున్నారు. అందుకే ఇందిరా జైసింగ్ లాంటి వాళ్లు మితిమీరిన ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తూ, సంబంధం లేని కామెంట్లు చేస్తుంటారు. అన్నట్లు వీటిని ‘లైక్’ చేసినవారిని కూడా కులమతాలకు అతీతులుగానే చూడాలని ప్రార్థన.
ఇక్కడ కిషోర్ రాకేశ్ అనే వృద్ధుడు చేసింది వ్యవస్థ మీద దాడిగా ఎందుకు పరిగణించాలి? అది అతను నిరసన తెలియజేసిన విధానమని అనుకోవచ్చు కదా. ఎందుకంటే, న్యాయమూర్తులు ప్రమాణం చేసినప్పుడు, “కుల,మత, వర్గ, భావోద్వేగాలకు అతీతంగా..” అని చేస్తారు. అంటే, సదరు న్యాయమూర్తి తన ప్రమాణం తప్పి వ్యాఖ్యలు చేసినందుకు తను కూడా శిక్షార్హుడే కావాలి కదా.! ఒక జడ్జి ఇంట్లో నోట్లకట్టలు దొరికితే నేరస్థుడైనప్పుడు, పరిధి దాటి, ప్రమాణం తప్పి మాట్లాడిన జడ్జి కూడా నేరస్థుడే.
లౌకికవాదం అంటే కులమతాలకు అతీతమనే కాదు, ఎవరి కుల,మత విశ్వాసాలనైనా గౌరవించగలగడం. అదీ ముఖ్యంగా ఇలాంటి రాజ్యాంగ ఉన్నత పదవుల్లో ఉన్నవారు. నిజానికి న్యాయమూర్తులు మానవసహజ భావోద్వేగాలకు అతీతులేంకారు. అయివుంటే, సెషన్స్ జడ్జి ఇచ్చిన తీర్పే సుప్రీంకోర్టులో కూడా తుదితీర్పు కావాలి.
ఈమధ్య నాతో ఒక ఆలోచనాపరుడి వ్యాఖ్య.. ‘వాస్తవానికి సనాతన ధర్మం అనే పదానికి విస్తృతార్థం ఉంది. ఆచరణలోనూ అది విశ్వమానవాళికి ఆదర్శంగా ఉండేది. ఈనాటి బీజేపి వాళ్లు హిందూమతంగా శుష్కింపజేసి, దాని పరిధిని కుదించి ఒక సాధారణ మతంగా మార్చేసారు..’ అని. నాకు ఈ వాదన నచ్చింది. ఇవ్వాళ్టి సంఘటన జరిగిన తర్వాత సనాతనధర్మపరిరక్షకుడిగా, దానికి బ్రాండ్ అంబాసిడర్‌గా చెప్పుకునే ఏపీ డిసీఎం ఆ ఘటనను తీవ్రంగా ఖండించారు. బాగుంది. ఖండించాలి కూడా. మరి అంతకుముందు అదే సనాతనధర్మానికి జరిగిన అవమానం గురించి ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడరు..ఎందుకంటే సనాతనధర్మం కంటే అవకాశవాదం ఎక్కువ ముఖ్యం కాబట్టి.
ఇక సదరు న్యాయమూర్తి.. ది గ్రేట్ సీజేఐ, భూషణ్ రామకృష్ణ గవాయ్, సన్నాఫ్ లేట్ రామకృష్ణ సూర్యభాన్ గవాయ్, మాజీ ఎంపీ, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా చీలికవర్గం ఆర్పీఐ(గవాయ్) వ్యవస్థాపకుడు, బీహార్, సిక్కిం, కేరళ రాష్ట్రాల మాజీ గవర్నర్. సోదరుడు రాజేంద్ర గవాయ్ కూడా ఆర్పీఐ(గవాయ్) అధ్యక్షుడిగా పనిచేసారు. ఈ మహారాష్ట్ర పార్టీ యూపీఏ భాగస్వామి కూడా. రామకృష్ణ గవాయ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సహవాసి. కలిసి పనిచేసారు కూడా. మొత్తం గవాయ్ కుటుంబమంతా బౌద్ధమతాన్ని అనుసరిస్తారు. ఆ విధంగా భూషణ్ గవాయ్ కూడా బౌద్ధుడే.

మొన్నటి ‘అసహనాని’కి పై వివరాలు చాలనుకుంటాను. కానీ, గౌతమ బుద్ధుడైన సిద్ధార్థుడు ఎవరు? వారి సిద్ధాంతమేంటి? కర్మ, పునర్జన్మ, ధర్మం, నిర్వాణం.. ఇవన్నీ సనాతనధర్మంలో చెప్పబడ్డవే. విగ్రహారాధన కూడా బౌద్ధంలో తప్పు కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నోవేల అద్భుతమైన బుద్ధ విగ్రహాలు ఉన్నాయి. అఫ్ఘనిస్తాన్‌లో ఆకాశమంత ఎత్తున్న బుద్ధ విగ్రహాలను మిలిటరీ ట్యాంకులతో పేల్చేసినప్పుడు శ్రీ గవాయ్ గారు కించిత్తు బాధ కూడా పడలేదా? బుద్ధిజం లేదా బౌద్ధం అనేది కూడా సనాతన ధర్మమనే వృక్షానికి చెందిన శాఖే. ఆ రకంగా కూడా గవాయ్ పరిపక్వత లేనివాడి కిందే లెక్క.
పరమత సహనం భారత రాజ్యాంగం ప్రవచించిన ఉన్నత ధర్మం. మంచితనమో లేక చేతకానితనమో తెలియదు కానీ, దాన్ని సమున్నతంగా పాటిస్తున్నవారు హిందువులు మాత్రమే. ఒకవిధంగా చెప్పాలంటే, ఈ దేశంలో నైతిక బలహీనవర్గం హిందువులే. హిందుత్వాన్ని లేదా సనాతనధర్మాన్ని విమర్శించే, అవహేళన చేసే, అవమానించే ప్రతీవాడూ మేధావే. వాళ్లకు అయాచితంగా లభించిన వరం, భారత ప్రజాస్వామ్యం ప్రసాదించిన భావప్రకటనాస్వేచ్ఛ.
భారత ప్రజాస్వామ్యమా.. పరిఢవిల్లు..







