అభిప్రాయాలు… ఆలోచనలు… అక్షరాలు…

ఎల్‌నినో: ఎక్కడో సముద్రానికి జ్వరం… ఇక్కడ మన ఊరికి నీరసం!

పసిఫిక్‌లో సముద్రం వేడెక్కితే తెలంగాణలో బోర్లు ఎందుకు ఎండుతున్నాయి? ఎల్‌నినో అంటే ఏంటి, లానినా, సూపర్ ఎల్‌నినో, ఐఓడీ వంటి పేర్ల అర్థాలేంటి, చరిత్ర ఏం చెబుతోంది, శాస్త్రవేత్తలు ఏమంటున్నారు, మనం ఏం చేయాలి — పూర్తి వివరణ.

చెర్మాల శ్రీనివాస్24 అక్టోబర్ 2026 · సవరణ: 27 అక్టోబర్ 2026 · 15 నిమిషాలు · English →

ఎండిన జలాశయం గుండా బతుకు ప్రయాణం (ఫోటో: నగర గోపాల్ / ది హిందూ)

తెలంగాణలో 30 లక్షల పంపుసెట్లు ఉన్నాయి. వాటిలో 15 లక్షలు ఇప్పటికే ఎండిపోయాయి. ఇది ఏ ప్రతిపక్ష నేత ఆరోపణా కాదు, అక్టోబర్ 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన లెక్క. దీనికి కారణంగా వినిపిస్తున్న పేరు ఒక్కటే — ఎల్‌నినో.

ఆ పేరు పుట్టింది భూమికి అవతలి వైపు. వందల ఏళ్ల కిందట దక్షిణ అమెరికాలోని పెరూ జాలర్లు ఒక వింత గమనించారు. కొన్నేళ్లకోసారి, సరిగ్గా క్రిస్మస్ రోజుల్లో, సముద్రం వెచ్చబడేది. వలలు ఖాళీగా తిరిగొచ్చేవి. ఆ వింతకు వాళ్లు బాల యేసు పేరు పెట్టారు. స్పానిష్‌లో “ఎల్‌నినో” అంటే “చిన్న బాలుడు”.

ఇప్పుడు అదే పేరు తెలంగాణలో టీవీ చర్చల నుంచి టీ కొట్టు దాకా ప్రతిచోటా వినిపిస్తోంది. కానీ దాని అర్థం ఏంటని అడిగితే చాలామంది దగ్గర జవాబు ఉండదు. తెలియనిదాన్ని చూసి భయపడతాం. అర్థమైతే అదే భయం జాగ్రత్తగా మారుతుంది.

అసలు ఎల్‌నినో అంటే ఏంటి?

ఒక్క మాటలో చెప్పాలంటే, ఎల్‌నినో అంటే పసిఫిక్ మహాసముద్రానికి వచ్చే జ్వరం. మనిషికి జ్వరం వస్తే ఒళ్లంతా నీరసించినట్టు, పసిఫిక్‌కు జ్వరం వస్తే ప్రపంచ వాతావరణమంతా అస్తవ్యస్తమవుతుంది.

ఎలా జరుగుతుందో తెలియాలంటే ఒక పెద్ద నీళ్ల తొట్టిని ఊహించుకోండి. ఒక చివర నుంచి టేబుల్ ఫ్యాన్ గాలి కొడుతోంది. పైనున్న వెచ్చని నీరు గాలికి కొట్టుకుపోయి రెండో చివరన పోగుపడుతుంది. ఫ్యాన్ ఉన్న చివర కింది నుంచి చల్లని నీరు పైకి తేలుతుంది.

పసిఫిక్‌లో మామూలుగా జరిగేది సరిగ్గా ఇదే. అక్కడ ఫ్యాన్ పేరు వాణిజ్య పవనాలు (ట్రేడ్ విండ్స్). అవి దక్షిణ అమెరికా వైపు నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా వైపు వీస్తూ వెచ్చని నీటిని పడమరకు నెడతాయి. వెచ్చని నీరు ఉన్న చోట ఆవిరి ఎక్కువ, మేఘాలు ఎక్కువ, వానలు ఎక్కువ. పెరూ వైపు చల్లని నీరు, చేపలు పుష్కలం.

ఇప్పుడు ఆ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందనుకోండి. పోగుపడిన వెచ్చని నీరు మెల్లగా వెనక్కి, పెరూ వైపు పాకుతుంది. మధ్య, తూర్పు పసిఫిక్ వేడెక్కుతుంది. వర్షపు మేఘాలు కూడా ఆ వెచ్చని నీటి వెంటే తూర్పుకు సాగిపోతాయి. గాలుల దారి మారుతుంది, వానల లెక్క తారుమారవుతుంది. ఇదే ఎల్‌నినో.

సాధారణ పసిఫిక్‌కు, ఎల్‌నినో పసిఫిక్‌కు తేడా చూపే చిత్రం
సాధారణ పసిఫిక్, ఎల్‌నినో పసిఫిక్

పెద్ద చీరను ఒక చివర లాగితే మరో చివర మడతలు మారినట్టు, పసిఫిక్‌లో మారిన గాలుల అమరిక వేల కిలోమీటర్ల దూరంలోని వాతావరణాన్నీ కదిలిస్తుంది.

ఇది ఎవరో తెచ్చిందీ కాదు, ఎవరో ఆపగలిగేదీ కాదు. వేల ఏళ్లుగా ప్రకృతిలో భ్రమిస్తున్న ఒక చక్రం. సాధారణంగా రెండు నుంచి ఏడేళ్లకోసారి వస్తుంది, తొమ్మిది నుంచి పన్నెండు నెలల పాటు ఉంటుంది.

మరి పెరూలో సముద్రం వేడెక్కితే వరంగల్‌లో బోరు ఎందుకు ఎండాలి? ఎందుకంటే మన నైరుతి రుతుపవనాలు కూడా ఇదే గాలుల వ్యవస్థలో భాగం. పసిఫిక్‌లో మేఘాల దారి మారితే, అరేబియా సముద్రం, బంగాళాఖాతం నుంచి మన వైపు రావాల్సిన తేమ బలహీనపడుతుంది. అందుకే ఎల్‌నినో ఏళ్లలో మనకు వానలు తగ్గే అవకాశం ఎక్కువ.

పేర్ల గోల: ఒక్కొక్కటిగా చూద్దాం

టీవీల్లో వినిపించే లానినా, సూపర్ ఎల్‌నినో, మోడోకి, ఐఓడీ — ఇవన్నీ ఒకే కుటుంబంలోని పేర్లు. భయపడాల్సినంత క్లిష్టమైనవి కావు.

లానినా — ఎల్‌నినోకు పూర్తి వ్యతిరేకం. ఫ్యాన్ మరింత వేగంగా తిరిగి పసిఫిక్ చల్లబడుతుంది. మనకు సాధారణంగా మంచి వానలు, కొన్నిసార్లు వరదలు.

సూపర్ ఎల్‌నినో — సముద్రం సాధారణం కంటే 2°C పైగా వేడెక్కినప్పుడు వాడే మాట. అధికారిక పదం కాదు, “చాలా బలమైన ఎల్‌నినో”కు పెట్టుకున్న ముద్దుపేరు. 1982–83, 1997–98, 2015–16 ఈ కోవలోవే. 2026 కూడా. ఈసారి అది రికార్డులనూ దాటుతుండటంతో వాతావరణ నిపుణుడు లియోన్ సైమన్స్ దీన్ని “సూపర్ డూపర్ ఎల్‌నినో” అని పిలిచారు. ఇదీ సరదా పేరే, శాస్త్రీయ వర్గీకరణ కాదు.

మోడోకి ఎల్‌నినో — జపనీస్‌లో “దాదాపు అదే, కాస్త వేరు”. వేడి తూర్పు చివర కాకుండా పసిఫిక్ మధ్యలో పోగుపడుతుంది. మనపై దెబ్బ కొన్నిసార్లు ఇంకా గట్టిగా ఉంటుంది. 2009 కరువు ఈ రకమే.

ఐఓడీ (IOD) — మన సొంత సముద్రంలో ఆట. హిందూ మహాసముద్రం పడమటి భాగం (ఆఫ్రికా వైపు) తూర్పు భాగం కంటే వేడిగా ఉంటే “పాజిటివ్ ఐఓడీ”. అది మనకు వానలు తెచ్చి, ఎల్‌నినో దెబ్బను కొంత తగ్గిస్తుంది.

నినో 3.4 — పసిఫిక్ మధ్యలో శాస్త్రవేత్తలు గీసుకున్న ఓ డబ్బా, సముద్రానికి థర్మామీటర్ పెట్టే చోటు. అక్కడ ఉష్ణోగ్రత సాధారణం కంటే 0.5°C పైగా ఉంటే ఎల్‌నినో.

ఇందులో గుర్తుంచుకోవాల్సింది రెండే. పసిఫిక్‌లో ఎల్‌నినో మనకు శత్రువైతే, మన హిందూ మహాసముద్రంలోని పాజిటివ్ ఐఓడీ మిత్రుడు. ఈ రెండింటి యుద్ధంలో ఎవరు గెలిస్తే మన వానాకాలం వాళ్లదే.

చరిత్ర ఏం చెబుతోంది?

ఎల్‌నినో మనకు కొత్త కాదు. దాదాపు 150 ఏళ్లుగా మన దేశంలో పెద్ద కరువుల వెనక దీని నీడ కనిపిస్తుంది. కానీ ప్రతిసారీ ఒకేలా లేదు.

ఎల్‌నినో ఏళ్లలో భారత నైరుతి రుతుపవన వర్షపాత లోటు చార్ట్
ఎల్‌నినో ఏళ్లలో దేశ వర్షపాత లోటు
ఏడాదిఎల్‌నినో బలంమన దేశంలో ఏం జరిగింది
2026చరిత్రలోనే అత్యంత బలమైనదిగా మారే దిశగారుతుపవన వర్షం 759 మి.మీ. — సాధారణం కంటే 12.6% తక్కువ. 2015 తర్వాత ఇదే మొదటి లోటు ఏడాది.
2023బలమైనదిదేశం మొత్తానికి వర్షం “సాధారణం” అంచున (94%) గట్టెక్కింది. కానీ ఆగస్టు రికార్డుల్లోనే అత్యంత పొడి నెల.
2015–16సూపర్2014, 2015 వరుసగా రెండు కరువులు. 2015లో వర్షం 12.7% లోటు. అదే డిసెంబర్‌లో చెన్నైని వరదలు ముంచాయి.
2009మధ్యస్థం (మోడోకి)దశాబ్దాల్లోనే తీవ్ర కరువు. వర్షం 23% లోటు (ఐఎండీ ‘మౌసమ్’ అధ్యయనం).
2002మధ్యస్థంవర్షం 20.9% లోటు. జూలైలో దేశమంతా 51.5% లోటు — రికార్డుల్లోనే అత్యంత పొడి జూలై. 133 ఏళ్లలో తొలిసారి వానాకాలమంతా ఒక్క అల్పపీడనమూ ఏర్పడలేదు.
1997–98సూపర్ఆశ్చర్యం — మనకు సాధారణ వానలే పడ్డాయి. పాజిటివ్ ఐఓడీ కాపాడింది. ఇండోనేషియాలో అడవులు తగలబడ్డాయి, పెరూను వరదలు ముంచాయి.
1987బలమైనదిదేశమంతా తీవ్ర కరువు. వర్షం 14.3% లోటు.
1982–83సూపర్కరువు, వర్షం 11.4% లోటు. అప్పట్లో దీనికి “శతాబ్దపు ఎల్‌నినో” అని పేరు.
1972బలమైనదివర్షం 22.3% లోటు. మహారాష్ట్ర సహా దేశమంతా తీవ్ర కరువు, ఆహార కొరత.
1876–78అత్యంత బలమైనదిదక్షిణ భారతంలో మహా కరువు. మద్రాస్ ప్రెసిడెన్సీ, హైదరాబాద్ సంస్థానం సహా లక్షలాది మంది ఆకలితో చనిపోయారు.

లోటు శాతాలు జూన్–సెప్టెంబర్ దేశవ్యాప్త లెక్కలు; 2009 అంకె మౌసమ్ అధ్యయనం నుంచి. ఏడాదివారీ పూర్తి లెక్కలు ఐఎండీ ఎల్‌నినో–వర్షపాతం పట్టికలో.

ఈ పట్టిక చెప్పే పాఠం సింపుల్. 1951 నుంచి వచ్చిన ఎల్‌నినో ఏళ్లలో సుమారు 60 శాతం సందర్భాల్లో మనకు వర్షపాతం సాధారణం కంటే తగ్గింది. అంటే పదింట్లో ఆరుసార్లు దెబ్బ పడింది, నాలుగుసార్లు ఇతర అంశాలు కాపాడాయి. ఎల్‌నినో అంటే కరువుకు “గ్యారంటీ” కాదు, “ప్రమాద హెచ్చరిక”.

ఇంకో విషయం. 1876లో అంత మంది చనిపోవడానికి కారణం వాన లేకపోవడం ఒక్కటే కాదు. అప్పటి పాలకులు కరువులోనూ ధాన్యం ఎగుమతులు ఆపలేదు, సాయాన్ని కూలీ పనులకు ముడిపెట్టారు. వాన ప్రకృతి చేతిలో ఉంటుంది. కరువు ప్రాణాలు తీస్తుందా లేదా అన్నది మాత్రం పాలకుల చేతిలో ఉంటుంది.

ఈసారి ఎందుకింత భయం?

ఎందుకంటే 2026 ఎల్‌నినో మామూలుది కాదు. 1950 నుంచి నమోదైన అన్ని ఎల్‌నినోలనూ ఇది మించిపోయే దిశగా వెళ్తోంది.

అమెరికా వాతావరణ సంస్థ నోవా (NOAA) అక్టోబర్ 8 నివేదిక ప్రకారం, తూర్పు పసిఫిక్‌లో కొన్ని చోట్ల సముద్రం సాధారణం కంటే 4°C పైగా వేడెక్కింది. అక్టోబర్–డిసెంబర్ మధ్య ఇది 1950 తర్వాతి అన్ని ఎల్‌నినోల రికార్డును దాటే అవకాశం 83% అని ఆ సంస్థ అంచనా. 2027 మార్చి దాకా బలంగానే ఉంటుందని చెబుతోంది.

ఇక్కడ ఒక్క విషయం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆ 83% పసిఫిక్‌లో ఎల్‌నినో ఎంత బలంగా ఉంటుందన్న అంచనా మాత్రమే. అంటే.. మన జిల్లాల్లో కరువు వచ్చే అవకాశం 83% అని కాదు. మన దగ్గర ఏం జరుగుతుందన్నది మన సముద్రం, మన మేఘాలు, మన జలాశయాలపైనా ఆధారపడుతుంది.

అక్టోబర్‌లో ఆ అంకెలు ఇంకా పెరిగాయి. నినో 3.4 ప్రాంతంలో సముద్ర ఉష్ణోగ్రత సాధారణం కంటే 3.4°C పైకి చేరిందని, ఇది రికార్డుల్లో ఏ ఎల్‌నినోకూ లేనంత ఎత్తు అని వాతావరణ శాస్త్రవేత్త జీక్ హౌస్‌ఫాదర్ చెప్పారు. అక్టోబర్–డిసెంబర్ మధ్య అది 3.7°C రికార్డుకు చేరవచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ అంచనా.

నాసా ఉపగ్రహాలు అక్టోబర్ 23న విడుదల చేసిన సముద్ర మట్టం చిత్రాలు 1997 నాటి సూపర్ ఎల్‌నినోతో దాదాపు అచ్చుగుద్దినట్టు సరిపోతున్నాయి. ఈ ఎల్‌నినో డిసెంబర్‌లో శిఖరానికి చేరి ఫిబ్రవరి దాకా కొనసాగుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) అంచనా.

1997, 2026 అక్టోబర్‌లో పసిఫిక్ సముద్ర మట్టాన్ని పోల్చే నాసా ఉపగ్రహ చిత్రాలు
1997, 2026: ఒకేలా ఉన్న పసిఫిక్ (చిత్రాలు: NASA Earth Observatory)

ఈసారి మనల్ని కాపాడే మిత్రుడూ కనిపించడం లేదు. హిందూ మహాసముద్రంలో ఐఓడీ ప్రస్తుతం తటస్థంగా ఉందని, ఈశాన్య రుతుపవనాల కాలమంతా అలాగే ఉండొచ్చని ఐఎండీ అక్టోబర్ అంచనా చెబుతోంది. అక్టోబర్‌లోనూ దేశానికి సాధారణం కంటే తక్కువ వానలే పడతాయని అదే అంచనా. 1997లోలా పాజిటివ్ ఐఓడీ అండ ఈసారి లేదు.

శాస్త్రవేత్తలు అసలు ఏమంటున్నారు?

టీవీ చర్చల్లో వినిపించేది భయం. పరిశోధనా పత్రాల్లో కనిపించేది లెక్క. ఆ లెక్క ఆరు విషయాలు స్పష్టంగా చెబుతోంది.

ఒకటి: ఎల్‌నినో తనను తానే పెంచుకుంటుంది. వాణిజ్య పవనాలు కాస్త బలహీనపడగానే వెచ్చని నీరు తూర్పుకు జరుగుతుంది. దాంతో పసిఫిక్ తూర్పు, పడమరల మధ్య ఉష్ణోగ్రత తేడా తగ్గుతుంది. ఆ తేడా తగ్గితే గాలులు ఇంకా బలహీనపడతాయి, వెచ్చని నీరు ఇంకా తూర్పుకు వెళ్తుంది. సముద్రం, గాలి ఒకదాన్నొకటి నెట్టుకునే ఈ చక్రాన్ని శాస్త్రవేత్తలు “బ్యెర్క్‌నెస్ ఫీడ్‌బ్యాక్” అంటారు. అందుకే ఒకసారి మొదలైన ఎల్‌నినో నెలల తరబడి బలపడుతూ పోతుంది.

రెండు: దాని రాక నెలల ముందే కనిపిస్తుంది. సముద్రపు ఉపరితలం కింద తూర్పుకు ప్రయాణించే భారీ వెచ్చని నీటి అలలను “కెల్విన్ అలలు” అంటారు. 2026 జనవరిలోనే మైక్రోనేషియా దగ్గర మొదటి అల ఉపగ్రహాలకు చిక్కింది. ఏప్రిల్ నాటికి అవి తూర్పు పసిఫిక్ చేరి సముద్రాన్ని వేడెక్కించాయి. నాసా శాస్త్రవేత్త జోష్ విల్లిస్ మాటల్లో, కెల్విన్ అలలు “ఎల్‌నినో గుండె చప్పుడు”.

మూడు: ఎల్‌నినో ఎక్కడ వేడెక్కిందన్నది మనకు ముఖ్యం. 132 ఏళ్ల వర్షపాత రికార్డులను పరిశీలించిన కె. కృష్ణకుమార్ బృందం 2006లో “సైన్స్” పత్రికలో ఒక కీలక విషయం చెప్పింది. భారత్‌లో వచ్చిన తీవ్ర కరువులన్నీ ఎల్‌నినో ఏళ్లలోనే వచ్చాయి, కానీ ప్రతి ఎల్‌నినో కరువు తేలేదు. పసిఫిక్ మధ్యలో వేడి పేరుకుంటే (మోడోకి తరహా) మన దగ్గర కరువు వచ్చే అవకాశం, వేడి తూర్పు చివర ఉన్నప్పటి కంటే ఎక్కువ. ఈసారి వేడి ఎక్కువగా తూర్పు చివరే ఉంది — 1997 తరహా. అయినా 2026లో మనకు లోటు వచ్చింది. ఇంత బలమైన ఎల్‌నినోలో “రకం” తేడా కూడా మనల్ని కాపాడలేదా అన్నది శాస్త్రవేత్తలు ఇంకా విశ్లేషించాల్సిన ప్రశ్న.

నాలుగు: అంచనాలకు పరిమితులున్నాయి. ఏటా మార్చి–మే మధ్య ఎల్‌నినో అంచనాలు తడబడతాయి. దీన్ని “స్ప్రింగ్ ప్రెడిక్టబిలిటీ బారియర్” అంటారు. ఎల్‌నినో స్థిరపడ్డాక దాని బలం అంచనా నమ్మదగినదే. కానీ ప్రభావాలు ఖాయం కాదని నోవానే చెబుతోంది. నాసా శాస్త్రవేత్త సెవెరీన్ ఫోర్నియర్ అన్నట్టు, ప్రతి ఎల్‌నినో వేరు.

ఐదు: వాతావరణ మార్పు ప్రభావాన్ని పెంచుతోంది. భూమి వేడెక్కడం వల్ల ఎల్‌నినోలు తరచుగా వస్తాయా, మరింత బలంగా వస్తాయా అన్నదానిపై శాస్త్రవేత్తల్లో ఇంకా ఏకాభిప్రాయం లేదు. కానీ ఒక విషయంలో ఐక్యరాజ్యసమితి వాతావరణ నిపుణుల సంఘం (IPCC) ఆరో నివేదిక స్పష్టంగా ఉంది. ఈ శతాబ్దం రెండో అర్ధభాగానికి ఎల్‌నినో–లానినాల వల్ల వచ్చే వానల ఒడిదుడుకులు పెరగడం దాదాపు ఖాయం. అంటే రేపటి ఎల్‌నినోలు మరింత తీవ్రమైన కరువులను, వరదలను తెచ్చే ప్రమాదం ఉంది.

ఆరు: ఎల్‌నినో ఎండల్నీ పెంచుతుంది. గాలి ఒక చక్రంలా తిరుగుతుంది. ఎల్‌నినోలో పసిఫిక్ మధ్య, తూర్పు భాగాల మీద గాలి పైకి లేస్తే, ఆ చక్రం పూర్తి కావడానికి మన వైపు కిందకు దిగుతుంది. కిందకు దిగే గాలి వేడెక్కి, పొడిబారి, మేఘాలను పుట్టనివ్వదు. మబ్బుల నీడ లేక ఎండ నేరుగా నేలను కాలుస్తుంది. పైగా ఎల్‌నినో వేడి తీవ్రంగా కనిపించేది అది శిఖరానికి చేరిన తర్వాతి వేసవిలోనే. 2016, 2024 అలాంటి ఏళ్లే. ఈసారి ఆ వేసవి 2027.

సైన్స్ సారాంశం ఇదే: ఎల్‌నినోను నెలల ముందే చూడగలం, దాని బలాన్ని కొలవగలం. కానీ మన ఊరికి ఎంత విఘాతం అనేది ఒక్క పసిఫిక్ నిర్ణయించదు.

తెలంగాణకు ఏం జరగబోతోంది?

ఈ భాగంలోని అంకెలు 2026 అక్టోబర్ 24 నాటివి.

దేశం కంటే మన రాష్ట్రానికి దెబ్బ గట్టిగానే తగిలింది. ఈ వానాకాలంలో తెలంగాణకు రావాల్సిన 740.6 మి.మీ. వానలో 615.5 మి.మీ. మాత్రమే పడింది. అంటే దాదాపు 17% లోటు. అక్టోబర్‌లోనూ వాన మొహం చాటేయడంతో ఆ లోటు ఇంకా పెరుగుతోంది.

జలాశయాల లెక్క ఇంకా భయపెడుతుంది. గత ఏడాది ఇదే సమయానికి రాష్ట్ర జలాశయాల్లో సుమారు 460 టీఎంసీల నీరుంటే, ఇప్పుడు 200 టీఎంసీలే ఉంది. సగానికి పైగా ఖాళీ. విచిత్రం ఏంటంటే, జూన్ 1 నాటికి కృష్ణా జలాశయాల్లో పదేళ్ల సగటు కంటే ఎక్కువ నీరే ఉంది. ఎండాకాలం మనల్ని దెబ్బతీయలేదు, వానాకాలమే దెబ్బతీసింది.

తెలంగాణ జలాశయాల్లో 2025, 2026 నీటి నిల్వల పోలిక
తెలంగాణ జలాశయాలు: 460 నుంచి 200 టీఎంసీలకు

అక్టోబర్ 23న ప్రజాభవన్‌లో జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి ఇంకా స్పష్టంగా చెప్పారు. తాగునీటి కష్టం వచ్చే ఏడాది జూలై దాకా ఉండొచ్చు. యాసంగిలో సాగునీరు ఇవ్వలేకపోవచ్చు, కాబట్టి రైతులు వరి వేయొద్దని కోరారు.

హైదరాబాద్‌కూ ముప్పు తప్పదు. మంజీరా, సింగూరు జలాశయాలు అడుగంటుతున్నాయని జలమండలి ఇప్పటికే హెచ్చరించింది. సాధారణంగా మార్చి నుంచి జూలై దాకా ఉండే ట్యాంకర్ల గిరాకీ ఈసారి నెలల ముందే మొదలైంది. వచ్చే ఫిబ్రవరి నుంచే వేసవి లాంటి ఎండలు మొదలవ్వొచ్చని క్లైమేట్ ట్రెండ్స్ అధ్యయనం చెబుతోంది.

అంటే మనముందున్నది ఒక్క ఎండాకాలం కాదు. ఎనిమిది నుంచి పది నెలల సుదీర్ఘ పరీక్ష.

ఎల్‌నినో: డాలా? కత్తా?

ఇప్పుడు రాజకీయాల్లో ఎల్‌నినో రెండు రకాలుగా వాడుకలో ఉంది. అధికారపక్షం చేతిలో డాలు. ప్రతిపక్షం చేతిలో కత్తి.

ప్రతిపక్షాలు “ఈ ప్రభుత్వమే కరువు తెచ్చింది” అంటున్నాయని ముఖ్యమంత్రే స్వయంగా చెప్పారు. వాన పడకపోవడానికి ఏ ప్రభుత్వాన్నీ బాధ్యుల్ని చేయలేం. పసిఫిక్ సముద్రాన్ని హైదరాబాద్ నుంచి ఎవరూ వేడి చేయలేదు. ప్రకృతి చేసిన పనిని ప్రత్యర్థి ఖాతాలో వేయడం ప్రజల భయంతో ఆడుకోవడమే. అయితే కాళేశ్వరం ప్రాజెక్టును వాడకపోవడం వల్లనే ఈ కరువు అని ప్రతిపక్షాల అసలు ఆరోపణ. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడాన్ని చూపుతూ ప్రభుత్వం ఆ ఆరోపణను తిప్పికొడుతోంది.

అలాగని ప్రభుత్వం కూడా ప్రతి కష్టాన్నీ ఎల్‌నినో ఖాతాలో వేసి తప్పించుకోలేదు. ఈ ఎల్‌నినో ఆకస్మికంగా ఊడిపడలేదు. ఏప్రిల్ 13నే ఐఎండీ తక్కువ వానల హెచ్చరిక ఇచ్చింది. జూన్‌లోనే నోవా ఎల్‌నినోను అధికారికంగా ప్రకటించింది. ఆరు నెలలుగా హెచ్చరిస్తూనే ఉన్నామని ప్రభుత్వమే చెబుతోంది. మరి ఆ ఆరు నెలల్లో ఏం చేసింది? ఏ ఊరికి ఎన్ని ట్యాంకర్లు, ఏ జలాశయం నుంచి ఎంత నీరు, పశువులకు గ్రాసం ఎక్కడి నుంచి, వరి వద్దంటే మరి రైతుకు ప్రత్యామ్నాయం ఏంటి — ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేదు కదా.

ఎల్‌నినో ఒక ప్రకృతి వైపరీత్యం. కానీ దాని నష్టం ఎంత అన్నది నిర్ణయించేది మనిషి. భయపెట్టే ప్రసంగాలు కాదు, అంకెలతో కూడిన ప్రణాళిక కావాలి. అది అధికారపక్షమైనా, ప్రతిపక్షమైనా.

అపోహలు – నిజాలు

“ఎల్‌నినో ఉంటే ఒక్క చినుకూ పడదు.” కాదు. భారీ వానలు, వరదలూ రావచ్చు. 1901–97 మధ్య 22 ఎల్‌నినో ఏళ్లలో 18 సార్లు దక్షిణాదికి ఈశాన్య రుతుపవనాల్లో సాధారణం కంటే ఎక్కువ వానలు పడ్డాయని ఐఎండీ ‘మౌసమ్’ పత్రికలోని అధ్యయనం చెబుతోంది. పంటకు అసలు సమస్య వాన తగ్గడం ఒక్కటే కాదు, నాటే సమయంలో పడకపోవడం, పూత దశలో వారాల తరబడి విరామం రావడం.

“ఎల్‌నినో పోగానే కష్టాలు పోతాయి.” కాదు. పసిఫిక్ చల్లబడినా మన జలాశయాలు, భూగర్భ జలాలు నిండేది వచ్చే వానాకాలంలోనే. అప్పటిదాకా ఉన్న నీటితోనే బతకాలి.

ఇతర దేశాలు ఏం చేస్తున్నాయి?

పెరూ: ఎల్‌నినో పేరు పుట్టిన దేశం. గత ఎల్‌నినోల వరదల అనుభవంతో ఈసారి దేశంలో 40% ప్రాంతంలో అత్యవసర పరిస్థితి ప్రకటించింది.

ఫిలిప్పీన్స్: మే నుంచే మంత్రివర్గ స్థాయి ఎల్‌నినో ప్రణాళిక అమలవుతోంది. వ్యవసాయ శాఖ ప్రత్యేక బృందం కరువు ముప్పున్న ప్రాంతాలను గుర్తిస్తోంది. రైతులకు వేరుశనగ, అల్లం, వంకాయ వంటి తక్కువ నీటి పంటలతో పాటు సోలార్ పంపులూ ఇస్తోంది. “వరి వేయొద్దు” అని చెప్పడమే కాదు, “ఇది వేయండి, ఇదిగో సాయం” అని కూడా చెబుతోంది.

ఇండోనేషియా: అక్కడ ఇప్పటికే సుమారు తొమ్మిది లక్షల హెక్టార్ల భూమి కాలిపోయింది — 2015 తర్వాత ఇదే అత్యంత దారుణమైన కార్చిచ్చుల కాలం. మంటల నియంత్రణకు కృత్రిమ వర్షం బృందాలను సిద్ధంగా ఉంచింది. విష పొగ వల్ల సుమారు 1.75 లక్షల మంది శ్వాసకోశ వ్యాధుల పాలయ్యారు, వారిలో 40 వేల మందికి పైగా చిన్నపిల్లలు.

ఐక్యరాజ్యసమితి: ముందే సిద్ధమయ్యే స్తోమత లేని 22 దేశాల కోసం ఐరాస ఆహార కార్యక్రమం 202 మిలియన్ డాలర్ల “ముందస్తు చర్యల” నిధికి పిలుపునిచ్చింది. ఎందుకంటే 2023–24 ఎల్‌నినోలో ఫిలిప్పీన్స్‌లో ముందుగా పెట్టిన ప్రతి డాలర్ సుమారు ఏడు డాలర్ల నష్టాన్ని ఆపింది అని ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) అంచనా.

ఈ దేశాల నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు మూడు. ఒకటి, ఎల్‌నినో కోసం ఒక ప్రత్యేక బృందం, ఒక ప్రత్యేక ప్రణాళిక ఉండాలి. రెండు, రైతుకు “వరి వద్దు” అని చెప్పడంతో పాటు ప్రత్యామ్నాయ విత్తనం, సాయం కూడా చేతికి అందాలి. మూడు, ముందుగా పెట్టే ఒక్క రూపాయి, తర్వాత పెట్టాల్సిన ఏడు రూపాయలను ఆదా చేస్తుంది.

మనం ఏం చేయాలి?

ఎల్‌నినోను మనం ఆపలేం. కానీ దాని ప్రభావాన్ని తగ్గించుకోవడం మన చేతుల్లోనే ఉంది. వచ్చే ఎనిమిది నెలలు ప్రతి బొట్టూ విలువైనదే.

ఇంట్లో

కారే కుళాయిలు, లీకయ్యే ఫ్లష్ ట్యాంకులు ఇప్పుడే బాగు చేయించండి. రోజంతా కారే చుక్కలు నెలకు వందల లీటర్లవుతాయి.

షవర్‌కు బదులు బకెట్ స్నానం. బైకులు, కార్లను పైపుతో కాకుండా బకెట్‌తో కడగండి.

ఆర్వో ఫిల్టర్ నుంచి పోయే నీటిని బకెట్‌లో పట్టి ఇల్లు తుడవడానికి, మొక్కలకు వాడండి.

అపార్ట్‌మెంట్ అయితే సంప్, ట్యాంకు స్థాయిని రోజూ చూసే బాధ్యత ఒకరికి అప్పగించండి. వచ్చే వానాకాలానికి ముందే ఇంకుడు గుంత సిద్ధం చేసుకోండి.

ఆరోగ్యం

ఫిబ్రవరి నుంచే ఎండలు ముదరవచ్చు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయట పనులు తగ్గించండి. పెద్దలు, పిల్లలు, బయట పనిచేసేవాళ్లు ఓఆర్ఎస్, మజ్జిగ దగ్గర ఉంచుకోండి.

నిల్వ చేసిన నీటి డ్రమ్ములపై తప్పనిసరిగా మూత పెట్టండి. డెంగీ దోమ పుట్టేది నిల్వ ఉన్న మంచినీటిలోనే.

ట్యాంకర్ నీరు, బోరు నీరు కాచి చల్లార్చి తాగండి. నీటి కొరత కాలంలోనే కామెర్లు, టైఫాయిడ్ పెరుగుతాయి.

ఒళ్లు బాగా కాలుతూ, మాట తడబడుతూ, గందరగోళంగా ఉంటే అది వడదెబ్బ కావచ్చు. వెంటనే 108కి ఫోన్ చేయండి. సాయం వచ్చేలోగా నీడకు తరలించి, తడి బట్టతో శరీరాన్ని చల్లబరచండి. స్పృహ లేని వ్యక్తి నోట్లో నీళ్లు పోయొద్దు.

వడదెబ్బ లక్షణాలు, తక్షణ ప్రథమ చికిత్స
వడదెబ్బ: లక్షణాలు, తక్షణ సాయం

రైతులు

ఎల్‌నినో వార్త చూసి హఠాత్తుగా పంట మార్చేయొద్దు. ముందు మీ మండల వర్ష సూచన, నేలలో తేమ, మీకు అందే సాగునీరు ఎంతో తెలుసుకోండి. వానాధార రైతుకు, కాలువ నీటి రైతుకు ఒకే సలహా సరిపోదు.

నీటి భరోసా లేకపోతే యాసంగిలో వరి వేసే సాహసం వద్దు. శనగ, పెసర, మినుము, జొన్న వంటి తక్కువ నీటి పంటలపై స్థానిక వ్యవసాయాధికారి సలహా తీసుకోండి.

కొత్త బోరు కోసం అప్పు చేసే ముందు పదిసార్లు ఆలోచించండి. కరువులో లోతుకు తవ్విన బోరు నీళ్లకంటే అప్పులే ఎక్కువ తెస్తుంది.

పంట బీమా నమోదు గడువు దాటకుండా చూసుకోండి.

పశువుల గ్రాసం ఇప్పటినుంచే నిల్వ చేసుకోండి. వేసవిలో అదే బంగారం అవుతుంది.

ధరలు, కరెంటు

పప్పులు, కూరగాయల ధరలు పెరగవచ్చు. భయంతో కొని దాచుకుంటే ధరలు ఇంకా పెరుగుతాయి. ఎండాకాలంలో కరెంటు డిమాండ్ రికార్డు స్థాయికి చేరవచ్చు. అవసరం లేని లైట్లు, ఏసీలు ఆపండి.

ప్రభుత్వాన్ని ఏం అడగాలి?

పౌరులుగా మనం అడగాల్సినవి అయిదు: ప్రతి జలాశయంలో ఎంత నీరుందో రోజూ బహిరంగంగా ప్రకటించాలి; ప్రతి వార్డుకు, ప్రతి ఊరికి తాగునీటి ప్రణాళిక, ట్యాంకర్ల షెడ్యూల్ ప్రజల ముందుంచాలి; వరి వద్దన్న రైతుకు ప్రత్యామ్నాయ విత్తనాలు, సాయం అందాలి; ఉపాధి హామీ పనులు, పశుగ్రాస కేంద్రాలు ఎండాకాలానికి ముందే మొదలవ్వాలి; ఎండలో పనిచేసే కూలీలు, భవన కార్మికులు, వీధి వ్యాపారులకు మధ్యాహ్నం విరామం, నీడ, తాగునీరు ఉండేలా పని వేళలు మారాలి.

చివరిగా ఒక్క మాట

పెరూ జాలర్లు శతాబ్దాల కిందట ఎల్‌నినోను చూసి భయపడలేదు. సముద్రం వేడెక్కితే చేపలు తగ్గుతాయని తెలుసుకుని, ముందే సిద్ధమయ్యారు. మనకు కావాల్సిందీ అదే.

పసిఫిక్‌కు వచ్చిన జ్వరాన్ని మనం తగ్గించలేం. కానీ అది మన ఊరికి కరువుగా మారుతుందా, జాగ్రత్తగా మారుతుందా అన్నది మన చేతుల్లోనే ఉంది. ఎల్‌నినోను తిట్టడం సులువు. ప్రతి బొట్టునూ కాపాడటమే అసలు పని.

🎬 ఈ కథనం ఒక్క నిమిషంలోఎల్‌నినో అంటే ఏమిటి, మనపై దాని ప్రభావం — చెర్మాల శ్రీనివాస్ మాటల్లో వీడియో.▶ YouTubeలో చూడండిమరో మాట ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి →

తరచుగా అడిగే ప్రశ్నలు

ఎల్‌నినో అంటే ఏంటి?

పసిఫిక్ మహాసముద్రం మధ్య, తూర్పు భాగాల్లో సముద్ర ఉపరితలం సాధారణం కంటే 0.5°C పైగా నెలల తరబడి వేడెక్కే సహజ వాతావరణ ప్రక్రియ. సాధారణంగా రెండు నుంచి ఏడేళ్లకోసారి వస్తుంది, తొమ్మిది నుంచి పన్నెండు నెలలు ఉంటుంది.

ఎల్‌నినోకు, లానినాకు తేడా ఏంటి?

ఎల్‌నినోలో పసిఫిక్ వేడెక్కుతుంది, లానినాలో చల్లబడుతుంది. ఎల్‌నినో ఏళ్లలో భారత్‌కు వానలు తగ్గే అవకాశం ఎక్కువ. లానినా ఏళ్లలో సాధారణంగా మంచి వానలు పడతాయి.

ఎల్‌నినో వస్తే భారత్‌లో కరువు ఖాయమా?

కాదు. 1951 నుంచి వచ్చిన ఎల్‌నినో ఏళ్లలో సుమారు 60 శాతం సందర్భాల్లోనే వానలు సాధారణం కంటే తగ్గాయి. 1997లో సూపర్ ఎల్‌నినో వచ్చినా, పాజిటివ్ ఐఓడీ వల్ల మనకు సాధారణ వానలే పడ్డాయి.

సూపర్ ఎల్‌నినో అంటే ఏంటి?

పసిఫిక్‌లోని నినో 3.4 ప్రాంతంలో సముద్రం సాధారణం కంటే 2°C పైగా వేడెక్కినప్పుడు వాడే అనధికారిక పదం. 1982–83, 1997–98, 2015–16 ఈ కోవలోవి. 2026 ఎల్‌నినో వాటన్నింటినీ దాటే దిశగా వెళ్తోంది.

“సూపర్ డూపర్ ఎల్‌నినో” అంటే ఏంటి?

2026 ఎల్‌నినో “సూపర్” స్థాయిని కూడా దాటి రికార్డులు బద్దలు కొడుతుండటంతో వాతావరణ నిపుణుడు లియోన్ సైమన్స్ దీనికి పెట్టిన సరదా పేరు. అక్టోబర్‌లో నినో 3.4 ప్రాంతం సాధారణం కంటే 3.4°C వేడెక్కింది, ఇది రికార్డుల్లోనే అత్యధికం. ఇది శాస్త్రీయ వర్గీకరణ కాదు, కానీ ఈ ఎల్‌నినో ఎంత అసాధారణమైనదో చెప్పే మాట.

2026 ఎల్‌నినో ఎప్పటి దాకా ఉంటుంది?

ఇది డిసెంబర్‌లో శిఖరానికి చేరి, 2027 ఫిబ్రవరి–మార్చి దాకా కొనసాగుతుందని నోవా, ప్రపంచ వాతావరణ సంస్థ అంచనా. దాని ప్రభావం మాత్రం 2027 వేసవి దాకా కనిపించవచ్చు.

తెలంగాణపై ఎల్‌నినో ప్రభావం ఏంటి?

2026 వానాకాలంలో తెలంగాణకు సుమారు 17% వర్షలోటు వచ్చింది. జలాశయాల్లో నీరు గత ఏడాది 460 టీఎంసీలు ఉంటే ఇప్పుడు 200 టీఎంసీలే ఉంది. తాగునీటి కష్టం 2027 జూలై దాకా ఉండొచ్చని ప్రభుత్వం హెచ్చరించింది. ఫిబ్రవరి నుంచే ఎండలు ముదరవచ్చు.

ఎల్‌నినో వల్ల ఎండలు ఎందుకు పెరుగుతాయి?

ఎల్‌నినోలో పసిఫిక్ మీద పైకి లేచిన గాలి మన వైపు కిందకు దిగుతుంది. కిందకు దిగే గాలి వేడెక్కి, పొడిబారి, మేఘాలను పుట్టనివ్వదు. దాంతో ఎండ నేరుగా నేలను తాకి వడగాలులు వస్తాయి.

ఎల్‌నినోకు, వాతావరణ మార్పుకు సంబంధం ఉందా?

ఎల్‌నినో వేల ఏళ్లుగా ఉన్న సహజ చక్రం. వాతావరణ మార్పు దాన్ని సృష్టించలేదు, కానీ ఇప్పటికే వేడెక్కిన భూమిపై వచ్చే ఎల్‌నినో ఎండలను, కరువులను, వరదలను మరింత తీవ్రం చేస్తుంది.

ఎల్‌నినో కాలంలో ప్రజలు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

నీటిని పొదుపుగా వాడాలి, నిల్వ నీటి డ్రమ్ములపై మూత పెట్టాలి, ట్యాంకర్ నీటిని కాచి తాగాలి. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయటి పనులు తగ్గించాలి. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే 108కి ఫోన్ చేయాలి. రైతులు పంట మార్చే ముందు స్థానిక వ్యవసాయాధికారి సలహా తీసుకోవాలి.

తర్వాత చదవండిసమాజంఏఐ డేటా సెంటర్లు : కనిపించని జీవన విధ్వంసం

ఈ కథనంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం. ఏదైనా తప్పు కనిపిస్తే contact@maromaata.comకు రాయండి — సరిచేస్తాను. సంపాదకీయ విధానం →

చెర్మాల శ్రీనివాస్

రచయిత

నా గురించి →

మరిన్ని కథనాలు

షేర్