1. సర్వే భవంతు సుఖినః
సర్వే సంతు నిరామయాః |
సర్వే భద్రాణి పశ్యంతు
మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ ||
ఓం శాంతిః శాంతిః శాంతిః ||
కుల, మత, జాతి భేదాలు లేకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండుగాక. అందరూ ఎటువంటి రోగాలు, వ్యాధులు లేకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండుగాక. ప్రతి ఒక్కరూ జీవితంలో కేవలం మంగళకరమైన, శుభప్రదమైన విషయాలనే చూడుగాక (అందరికీ మంచే జరుగుగాక).
ఈ సృష్టిలో ఏ ఒక్కరూ కూడా ఎటువంటి బాధలకు, దుఃఖాలకు గురికాకుండా ఉండుగాక …
2. విద్యా దదాతి వినయం,
వినయాద్ యాతి పాత్రతామ్।
పాత్రత్వాద్ ధనమాప్నోతి,
ధనాద్ ధర్మం తతః సుఖమ్॥
విద్య వినయాన్ని ఇస్తుంది. వినయం అర్హతను తెస్తుంది. అర్హత సంపదను ఇస్తుంది. సంపద ధర్మాన్ని నిలబెడుతుంది. ధర్మం చివరికి నిజమైన సుఖాన్ని అందిస్తుంది.
3. ఓం సహ నావవతు ।
సహ నౌ భునక్తు ।
సహ వీర్యం కరవావహై ।
తేజస్వినావధీతమస్తు ।
మా విద్విషావహై ॥
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥
పరమాత్మ మన ఇద్దరినీ (గురువును, శిష్యుణ్ణి) రక్షించుగాక. మన ఇద్దరినీ పోషించుగాక; జ్ఞానఫలాన్ని ఇద్దరం కలిసి అనుభవించుగాక. మనం కలిసి శక్తితో, ఉత్సాహంతో జ్ఞానసాధన చేద్దాం. మన అధ్యయనం తేజోవంతంగా, ఫలవంతంగా ఉండుగాక; నేర్చుకున్న జ్ఞానం మన బుద్ధిని ప్రకాశింపజేయుగాక. మన మధ్య ద్వేషం, అసూయ, వైరం ఎన్నటికీ కలగకుండుగాక. అన్ని విధాలైన ఆటంకాలు తొలగి శాంతి నెలకొనుగాక.
4. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్
న బ్రూయాత్ సత్యమప్రియమ్ |
ప్రియం చ నానృతం బ్రూయాత్
ఏష ధర్మః సనాతనః ||
సత్యమే మాట్లాడాలి. కానీ ఆ సత్యాన్ని ప్రియంగా, ఎదుటివారి మనసు గాయపడకుండా చెప్పాలి. అప్రియంగా, బాధ కలిగించే విధంగా సత్యాన్ని పలకకూడదు. అలాగే ఎదుటివారికి నచ్చుతుందని అసత్యాన్ని కూడా చెప్పకూడదు. ఇదే సనాతన ధర్మం.
ఇదీ సనాతన ధర్మం… వేల ఏళ్ల క్రితం ప్రవచింపబడిన శ్లోకాలు..









