అది 2003… ఆంధ్రజ్యోతి టెక్నికల్ విభాగంలో మేనేజర్‌గా పనిచేస్తున్న రోజులు..
సినిమాల్లో ఫిల్ము విపరీతంగా వాడుతున్న కాలం. కెమెరాలో నెగటివ్ ఫిల్మ్ ఎక్కించి షూటింగ్ చేసేవారు. నటుల ప్రదర్శన సరిగా లేకపోతే దర్శకుడు ‘మరో టేక్’ అనేవాడు. ఇంకో టేక్ అంటే మరికొన్ని మీటర్ల నెగటివ్ ఫిల్మ్ వృథా. నిర్మాతకు బీపీ పైకి తన్నేది!
యాక్టర్లు టేకులు తింటుంటే… నిర్మాత బీపీ టాబ్లెట్లు తింటుండేవాడు.
షూటింగ్ పూర్తయ్యాక ఆ నెగటివ్ నుంచి పాజిటివ్ ప్రింట్లు తీసి థియేటర్లకు పంపేవారు. అప్పట్లో ‘మా హీరో సినిమా ఇన్ని ప్రింట్లతో విడుదలవుతోంది’ అని అభిమానులు గొప్పగా చెప్పుకునేవారు.
ఆ ఫిల్మ్ రీళ్లను అల్యూమినియం బాక్సుల్లో పెట్టి థియేటర్లకు పంపేవారు. అందుకే కొత్త సినిమా విడుదల రోజు థియేటర్ల దగ్గర…
“బాక్స్ వచ్చిందా?”
“ఇంకా బాక్స్ రాలేదా?”
అనే మాటలు సర్వసాధారణం.
ఆ బాక్స్‌లోని ఫిల్మ్ రీళ్లను ప్రొజెక్టర్‌లో ఎక్కిస్తేనే తెరపై బొమ్మ పడేది.
సరిగ్గా అలాంటి సమయంలోనే సినిమా రంగంలోకి డిజిటల్ సాంకేతికత అడుగుపెడుతోంది. ఫిల్మ్ స్థానంలో డిజిటల్ చిత్రీకరణ మొదలవుతోంది. అయితే సినిమా తీయడం ఒక్కటే కాదు… దాన్ని డిజిటల్ రూపంలో సిద్ధం చేయడం, థియేటర్లకు పంపడం, అక్కడ ప్రదర్శించడం—ఇవన్నీ కలిసిన వ్యవస్థ కావాలి.
ఆ మార్పునకు దారులు వేస్తూ అప్పుడే Qube Digital Cinema వంటి కొత్త డిజిటల్ సినిమా వ్యవస్థలు అందుబాటులోకి వస్తున్నాయి.
ఆ కొత్త పరిణామంపై అప్పటి ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం కోసం నేను ఒక కవర్‌పేజీ కథనం రాశాను. 2003 నవంబరు 30న ప్రచురితమైన ఆ కథనంలో ‘డిజిటల్‌కు తెరతీసిన క్యూబ్ సినిమా’ పేరుతో ప్రత్యేక బాక్స్ ఐటమ్‌లో అప్పుడప్పుడే అందుబాటులోకి వస్తున్న Qube సాంకేతికత గురించి కూడా వివరించాను.
ఆ కవర్‌పేజీ కథనానికి పెట్టిన హెడ్డింగ్…
“ఇక బాక్స్ రాదు”
ఆ హెడ్డింగ్ పెట్టింది మిత్రుడు, సండే మ్యాగజైన్ చూసే సాంబు.
థియేటర్ల దగ్గర అందరికీ పరిచయమైన ‘బాక్స్’ అనే ఒక్క మాటను పట్టుకుని, రాబోతున్న సాంకేతిక మార్పునంతా హెడ్డింగ్‌లో చెప్పేశాడు. ఆ కథనం బాగా పాపులర్ కావడంలో ఆ హెడ్డింగ్ పాత్ర కూడా ఎంతో ఉంది.
ఇప్పుడు 23 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఆ హెడ్డింగ్ మరింత ఆసక్తికరంగా అనిపిస్తుంది.
“ఇక బాక్స్ రాదు” ఆనాడు అన్న మాట…
ఇప్పుడు నిజంగానే… బాక్స్ రావడం లేదు!
ఫిల్మ్ రీళ్ల బాక్సులు కనుమరుగయ్యాయి. సినిమా ప్రదర్శన డిజిటల్ ప్రపంచంలోకి వెళ్లిపోయింది. అప్పట్లో ఒక సాంకేతిక మార్పుగా కనిపించిన విషయం… ఆ తర్వాత మొత్తం సినిమా ప్రదర్శన వ్యవస్థనే మార్చేసింది.
అప్పటి ఫీచర్స్ ఇన్చార్జి వసంతలక్ష్మి మేడమ్ ఇలాంటి సాంకేతిక అంశాలపై కథనాలు రాయమని నన్ను బాగా ప్రోత్సహించేవారు. అవడానికి టెక్నికల్ ఇంజనీర్నే అయినా, కడుపులో నాలుగు తెలుగు ముక్కలున్నాయని గుర్తించిన మేడమ్ నాతో మరికొన్ని కథనాలు కూడా రాయించారు.
అలాంటిదే మొబైల్ ఫోన్లపై రాసిన మరో కథనం—

“రోటీ, కపడా ఔర్ మొబైల్”
ప్రపంచంలో మొబైల్ ఫోన్ల సంఖ్య 200 కోట్ల మైలురాయిని దాటిన సందర్భంగా 2006 జూలైలో రాసిన వ్యాసం అది. అప్పట్లో మొబైల్ వినియోగదారులు ప్రపంచ జనాభాలో దాదాపు 30 శాతం.
ఇప్పుడు, సరిగ్గా 20 ఏళ్ల తర్వాత ఆ సంఖ్య దాదాపు 580 కోట్లకు… అంటే ప్రపంచ జనాభాలో 70 శాతానికి చేరుకుంది.
ఒకప్పుడు విలాస వస్తువుగా కనిపించిన మొబైల్… ఇప్పుడు మనిషి జీవితంలో విడదీయలేని భాగమైపోయింది. అప్పట్లో పెట్టిన “రోటీ, కపడా ఔర్ మొబైల్” అనే హెడ్డింగ్ ఇప్పుడు మరింత నిజమనిపిస్తోంది!
అలా మొదలైన నా రచనా ప్రయాణానికి ఎంతోమంది పెద్దల ప్రోత్సాహం తోడైంది.
ఎడిటర్ రామచంద్రమూర్తి గారు, అసోసియేట్ ఎడిటర్ కే.శ్రీనివాస్ సర్, సెంట్రల్ డెస్క్ ఇన్చార్జి, అసిస్టెంట్ ఎడిటర్ వర్ఢెల్లి మురళి సర్, Allam Narayana సర్, కట్టా శేఖర్‌రెడ్డి సర్… ఇలా ఎంతోమంది నన్ను రాయడానికి ప్రోత్సహించారు.
ఆ తర్వాత ఎన్నో కథనాలు రాశాను. ఆంధ్రజ్యోతిలో బ్యానర్ స్టోరీ రాసే అవకాశం కూడా వచ్చింది. సూర్య దినపత్రిక ఆదివారం అనుబంధానికి 2012 యుగాంతంపై రాశాను. ఆ తర్వాత నమస్తే తెలంగాణలోనూ అనేక వ్యాసాలు వచ్చాయి.
అల్లం సర్, శేఖర్‌రెడ్డి సర్ కొన్ని అంశాలను ప్రత్యేకంగా నా చేతిలో పెట్టి— “ఇది నువ్వే రాయాలి” అనేవారు.
ముఖ్యంగా కట్టా శేఖర్ రెడ్డి సర్ అందించిన సహకారం, ప్రోత్సాహం మరువలేనివి. ఆయనే నా పాలిటి ద్రోణాచార్యుడు. నా అక్షరానికి దైవం. ‘నువ్వు నీ ఆత్మకథ రాయాలి.. నీ జీవితంలో ఎన్నో మలుపులున్నాయి. పత్రికా ప్రపంచాన్ని నువ్వు చూసిన కోణంలో రాయి శ్రీనూ..’ అని ఇప్పటికీ అంటుంటారు.
వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు ఒక విషయం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
నేను జర్నలిస్టును కాను.
కానీ తెలుగు భాష మీద నాకున్న ప్రేమ నన్ను జర్నలిస్టుగా కూడా మార్చింది.
నా చదువు, వృత్తి సాంకేతిక రంగం. కానీ తెలుగు మీదున్న మమకారం అప్పుడప్పుడు నన్ను పత్రిక పేజీల మీదకు తీసుకొచ్చింది. నా కథనాలను చదివి ఎంతోమంది జర్నలిస్టు మిత్రులు అభినందించారు. ఇప్పటికీ అదే అభిమానంతో పలకరిస్తుంటారు.
అయితే ఈ ప్రయాణం నాది మాత్రమే కాదు…
నాలో రాయగలిగే శక్తి ఉందని గుర్తించినవారిది.
రాయమని ప్రోత్సహించినవారిది.
రాసినప్పుడు భుజం తట్టినవారిది.
తప్పుంటే సరిదిద్దినవారిది.
ఎందుకంటే…
మనకు అక్షరాలు నేర్పినవారే కాదు… మనలోని అక్షరాలను గుర్తించినవారు కూడా గురువులే! మనసులో గురువుగా మౌనంగా మననం చేసుకున్నవారు కూడా విద్య నేర్పినవారే. నాకు అక్షరాలు దిద్దించిన వెంకటయ్య గారు(వీరు నిజంగా అయ్యగారే.. వరంగల్ గోవిందరాజస్వామి ఆలయంలో పూజారి.. మా ఏకోపాధ్యాయ పాఠశాలకు అన్నీ తానే) మా ఓరుగల్లుకే గురుతుల్యులు, పుంభావ సరస్వతి ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య, ఆచార్య రామా చంద్రమౌళి, వరవరరావు సర్(వీరిద్దరూ కాలేజీల్లో నాకు పాఠాలు చెప్పిన గురువులు).. ఈనాడు దినపత్రికలో మా విభాగాధిపతులు రామ్మోహన్ సర్, మహేందర్ సర్… స్వయంగా మా మామయ్య ఉపాధ్యాయుడు. తెలుగు భాషాభిమాని. నేను ఒక ఫాదర్స్ డే రోజున ‘నమస్తే జిందగీ’లో మా నాన్నకు నివాళిగా రాసిన కథనాన్ని చదివి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కళ్లవెంట ధారపాతంగా నీళ్లు.. అప్పుడనిపించింది. నేను కూడా పాఠకులు స్పందించేంతగా రాయగలనా అని..
ఇలా.. ఎందరో మహానుభావులు.
అందుకే ఈ గురుపూజోత్సవ వేళ వారందరూ గుర్తుకొస్తున్నారు…
నాకు ప్రత్యక్షంగా పాఠాలు చెప్పకపోయినా… నా రచనా ప్రయాణంలో ఏదో ఒక మలుపులో చేయిపట్టి నడిపించిన వీరందరూ నాకు గురుతుల్యులే.
వారందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ…
గురుభ్యో నమః 🙏
అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.









