బతకడానికి ఎన్నో అవసరం. సంపాదన కావాలి. పని కావాలి. మనుషుల తోడు కావాలి. వాటికోసం కష్టపడతాం. కొన్నిసార్లు రాజీపడతాం. మరికొన్నిసార్లు మనకు నచ్చని పరిస్థితుల్లోనూ కొనసాగుతాం. కానీ ఈ ప్రయాణంలో కోల్పోకూడనిది ఒకటుంది—మన మీద మనకుండే గౌరవం.
ఆత్మగౌరవం అంటే మన మాటే నెగ్గాలనే మొండితనం కాదు. ఎవరూ మనల్ని ప్రశ్నించకూడదనుకోవడం కాదు. మనలోని లోపాలను అంగీకరిస్తూనే, మనిషిగా మన విలువను గుర్తించడం. ఎదుటివారికీ అదే విలువ ఉందని అర్థం చేసుకోవడం.
మన తప్పును సరిదిద్దుకోమని చెప్పొచ్చు. మన పనిని సమీక్షించొచ్చు. మన అభిప్రాయంతో విభేదించొచ్చు. కానీ మన అవసరాన్ని ఆసరాగా చేసుకుని మనల్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదు.
మనకు ఉద్యోగం అవసరమని తెలిసి అవమానించడం, మనం ఆర్థికంగా ఆధారపడ్డామని తెలిసి మన నిర్ణయాలను నియంత్రించడం, మనం బంధాన్ని కాపాడుకోవాలనుకుంటున్నామని తెలిసి మన భావాలను నిర్లక్ష్యం చేయడం—ఇవన్నీ ఎదుటి మనిషి పరిస్థితిని తమకు అనుకూలంగా వాడుకోవడమే.
ఈ తేడాను గుర్తించలేని చోటే సమస్యలు మొదలవుతాయి. అది మనం పనిచేసే ఇల్లు కావచ్చు. ఉద్యోగం చేసే కార్యాలయం కావచ్చు. ప్రేమించిన మనిషితో కలిసి నిర్మించుకున్న జీవితం కావచ్చు.
పగిలిన గ్లాసు
లక్ష్మి మూడు ఇళ్లలో పనిచేసేది. ఆమె సంపాదనలో ప్రతి రూపాయి వెనుక శ్రమ ఉంది. ఆ డబ్బుతోనే ఇంటి అద్దె, కూతురి చదువు, కిరాణా బాకీ. ఒక్క ఇంట్లో పని పోయినా నెల లెక్క తప్పుతుంది.
ఆమె పనిచేసే ఒక ఇంట్లో, వంటగది కిటికీ వెనుక, ప్రత్యేకంగా ఒక గ్లాసు ఉండేది. అంచు పగిలిన స్టీలు గ్లాసు. మొదట్లో తనకు అందుబాటులో ఉండేందుకు పెట్టారనుకుంది. ఒకరోజు మరో గ్లాసు తీసుకుంటే, “అది అక్కడ పెట్టేయ్. నీది వెనకాల ఉంది కదా!” అన్న మాట వినిపించింది.
అప్పుడు అసలు విషయం తెలిసింది. తాను తోమిన గిన్నెల్లో వాళ్లు తింటారు. తాను శుభ్రం చేసిన గ్లాసుల్లో నీళ్లు తాగుతారు. కానీ వాళ్ల గ్లాసును తాను ముట్టుకోకూడదు. మరుసటి రోజు నుంచి ఇంటినుంచే నీళ్ల సీసా తెచ్చుకోవడం మొదలుపెట్టింది. పని అవసరం కనుక కొనసాగింది. కానీ ఆ మాటను మరిచిపోలేదు.
ఒకరోజు ఆ ఇంట్లో పుట్టినరోజు వేడుక జరిగింది. ఉదయం నుంచి లక్ష్మి పనిలోనే ఉంది. అతిథులు వెళ్లాక, ఎవరో సగం తిని వదిలేసిన కేకుముక్కను ప్లేటులో పెట్టి, “మీ పాపకివ్వు” అంటూ అందించింది ఇంటావిడ.
లక్ష్మి చేతులు ముందుకు వెళ్లి ఆగిపోయాయి. మొన్ననే కూతురు అడిగింది—“అమ్మా, ఈసారి నా పుట్టినరోజుకి చిన్న కేకు కొనుక్కుందామా?” అని. ఆ కోరిక తీర్చాలనే ఉంది. కానీ బొటాబొటి ఖర్చుల మధ్య డబ్బు మిగలడం లేదు.
ఆమె ప్లేటువైపు చూసింది.
“ఎవరూ తిననిది ఉంటే తీసుకెళ్తానమ్మా. ఇది వద్దు.”
“మీకు సాయం చేసినా ఇలాగే ఉంటుంది. మరీ అంత ఆత్మగౌరవమైతే ఈ పనులెందుకు?” అంది ఇంటావిడ.
లక్ష్మి చేతిలోని తడి గుడ్డను మడిచింది. కాసేపు మౌనంగా ఉండిపోయింది.
“నేను నా కష్టం మీదే బతుకుతున్నానమ్మా..!”
ఆమె గొంతు కొద్దిగా వణికింది. అయినా ఈసారి మాటను మింగలేదు.
ఆ మాటలో ఆమె యాచించడానికి రాలేదనే నిజం ఉంది. తన శ్రమతో ఆ ఇంటి అవసరాలను తీరుస్తోంది. అందుకు జీతం తీసుకుంటోంది. గిన్నెలు తోముతున్నంత మాత్రాన తనకూ, తన బిడ్డకూ గౌరవం అక్కర్లేదని ఎవరు నిర్ణయించారు?
మిగిలిన పని పూర్తి చేసి, రావాల్సిన జీతం తీసుకుని, మరుసటి రోజు నుంచి రాలేనని చెప్పింది. బయటకు వచ్చాక డబ్బులు రెండుసార్లు లెక్కపెట్టుకుంది. ఇంకో పని దొరికేవరకూ ఎన్ని రోజులు గడుస్తాయో ఆలోచించింది. పని మానేయడం వల్ల కష్టాలు వస్తాయని ఆమెకు తెలుసు. అక్కడే కొనసాగడం వల్ల తన మనసుకు పడుతున్న గాయమూ తెలుసు.
దారిలో తన డబ్బుతో రెండు చిన్న కేకుముక్కలు కొనుక్కుని ఇంటికి వెళ్లింది.
“జీవనోపాధి కోసం చేసే పని ఏదైనా, మనిషి గౌరవం తగ్గదు.
సాయం చేయాలనుకుంటే, ఆ సాయంలోనూ ఎదుటివారి గౌరవాన్ని కాపాడే సంస్కారం ఉండాలి. మన సహాయాన్ని స్వీకరించాలంటే అవమానాన్నీ స్వీకరించాలనే షరతు పెట్టలేం.
నిర్ణయం ఒకరిది, నింద మరొకరిపై
లక్ష్మికి ఎదురైన చిన్నచూపు ఒక ఇంటికే పరిమితం కాదు. కార్యాలయాల్లో అది మరో రూపంలో కనిపిస్తుంది. అక్కడ పగిలిన గ్లాసు ఉండకపోవచ్చు. కానీ మాట్లాడే తీరు, బాధ్యతలు మోపే పద్ధతి, వివరణ వినడానికి నిరాకరించే ధోరణి మనిషిని చిన్నబుచ్చడానికి చాలు.
“ఈ పని ఎందుకు ఆలస్యమైంది?” అని అడగడానికీ, “నీకు ఏ పనీ చేతకాదు” అని అవమానించడానికీ చాలా తేడా ఉంది. మొదటి ప్రశ్న సమస్యను పరిష్కరించే అవకాశం ఇస్తుంది. రెండో మాట వ్యక్తి సామర్థ్యాన్నంతటినీ కొట్టిపారేస్తుంది.
బాధ్యతగల ఉద్యోగి తన పనిని ప్రశ్నించవద్దని కోరడు. తప్పు జరిగితే అంగీకరించి సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. అయితే తాను తీసుకోని నిర్ణయానికి తనను బాధ్యుడిని చేసినప్పుడు వివరణ ఇచ్చే హక్కు అతనికి ఉంది. ఆ వివరణను వినే బాధ్యత అధికారంలో ఉన్నవారికి ఉంది.
ఉద్యోగి జవాబు చెప్పాలి. అధికారి వినాలి. ఈ రెండూ ఉన్నప్పుడే సమీక్షకు న్యాయం ఉంటుంది.
పదవి రావడం ఒకటి. దాన్ని హుందాగా నిర్వహించడం మరొకటి. అధికారి ఖర్చులను ప్రశ్నించవచ్చు. నాణ్యత కోరవచ్చు. ఫలితాల కోసం ఒత్తిడి చేయవచ్చు. అదే బాధ్యతలో వాస్తవాలను తెలుసుకోవడం, తన అవగాహనలో పొరపాటు ఉంటే సవరించుకోవడం కూడా భాగమే.
సంస్కారం లోపించిన చోట ప్రశ్నను ధిక్కారంగా చూస్తారు. మంచి సూచనను అధికారానికి సవాలుగా భావిస్తారు. కొన్నిసార్లు దీనికి అభద్రతాభావం కారణమవుతుంది. సమర్థుడిని సంస్థకు బలంగా చూడాల్సిన చోట, తన కుర్చీకి ముప్పుగా చూస్తారు. అలాంటి వాతావరణంలో ఉద్యోగి పని చేయడంతోపాటు రోజూ తనను తాను కాపాడుకోవాల్సి వస్తుంది. మాట్లాడితే సమస్య. మౌనంగా ఉంటే ఆరోపణను ఒప్పుకున్నట్లు భావిస్తారు.
ఇది ఒక్క ఉద్యోగిని కాదు దెబ్బతీసేది, సంస్థ ఉనికిని. మాట్లాడగలిగేవాళ్లు మౌనంగా ఉంటారు. బాధ్యత తీసుకునేవాళ్లు తప్పుకుంటారు. ప్రతిభ ఉన్నవాళ్లు మరో చోటు వెతుక్కుంటారు. ప్రశ్నలకు చోటులేని సంస్థలో తప్పులు బయటపడవు. నేనేదైనా అనగలననే ఆధిపత్య ధోరణి అహంకారానికి నిదర్శనం.
“ఏ సంస్థకైనా అతివిలువైన ఆస్తి తన ఉద్యోగులే
— శివ్ ఖేరా, తన ప్రఖ్యాత పుస్తకం ‘యు కెన్ విన్’లో
ఉద్యోగుల మౌనాన్ని విధేయతగా పొరబడే యాజమాన్యం, ఆ మౌనం వెనుక కోల్పోతున్న నమ్మకాన్ని గుర్తించాలి. ఇక్కడ మిగిలిన బంధం కేవలం ఆర్థిక సంబంధమనే విషయాన్ని యాజమాన్యం ఎప్పటికీ గుర్తించలేదు.
దశాబ్దాల అనుభవం సమీక్ష నుంచి మినహాయింపు ఇవ్వదు. కానీ ఆ అనుభవాన్ని గౌరవించకుండా, వివరణ వినకుండా తీర్పు చెప్పడం న్యాయం కాదు. గౌరవం పొందడానికి ఏళ్ల తరబడి పనిచేయాల్సిన అవసరమూ లేదు. ఉద్యోగంలో మొదటి రోజు అడుగుపెట్టిన వ్యక్తికీ మర్యాద పొందే హక్కు ఉంది.
మంచి యజమాని ఉద్యోగి ప్రతిభకు చోటిస్తాడు. తనకు తెలియనిది తెలుసుకోవడానికి వెనుకాడడు. బాధ్యత తీసుకోవాల్సిన సమయంలో పక్కకు తప్పుకోడు. విభేదించిన వ్యక్తిని కూడా న్యాయంగా చూస్తాడు. అదే నాయకత్వానికి అవసరమైన సంస్కారం.
ఇద్దరూ తలెత్తి నిలబడే ఇల్లు

ఈ పరీక్ష ఇంట్లోనూ ఎదురవుతుంది. ఇద్దరు కలిసి జీవితాన్ని నిర్మించుకునేటప్పుడు, ఎవరి మాటకు ఎంత విలువ ఉందన్నది అక్కడే బయటపడుతుంది.
పెళ్లికి ముందు భార్యకూ ఒక జీవితం ఉంది. చదువు ఉంది. వృత్తి ఉంది. సాధించాలనుకున్న ఆశలు ఉన్నాయి. పెళ్లితో ఆ జీవితంలోకి ఒక భాగస్వామి వచ్చాడు. కలిసి బాధ్యతలు పంచుకోవాల్సిన జీవితం మొదలైంది. కానీ ఆమె వ్యక్తిత్వం, ఆశలు అక్కడితో ముగిసిపోలేదు.
కొంతమంది భర్తలు మాత్రం పెళ్లయిన క్షణం నుంచీ ఆమె జీవిత నిర్ణయాలన్నీ తమ చేతుల్లోకి వచ్చాయని భావిస్తారు. ఉద్యోగం చేయాలా, పైచదువులు చదవాలా, సంపాదనను ఎలా ఖర్చు చేయాలి, అమ్మానాన్నలతో ఎప్పుడు మాట్లాడాలి—అన్నిటికీ తమ అనుమతి కావాలన్నట్లు వ్యవహరిస్తారు. ఆమె అభిప్రాయం చెబితే చర్చగా కాకుండా ఎదురుతిరగడంగా చూస్తారు.
“నేను సంపాదిస్తున్నాను కదా, నువ్వు పనిచేయాల్సిన అవసరం ఏముంది?” అని అడగవచ్చు. కానీ ఆమె సమాధానం వినడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఏ విషయమైనా నిర్భయంగా, భరోసాగా చెప్పుకునే వీలుండాలి. తనకు చెబితే సమస్యకు పరిష్కారం దొరకకపోయినా, సాంత్వన దొరుకుతుందనే నమ్మకాన్ని ఇవ్వగలగాలి. ఆ అనుబంధం ఆమెకు పుట్టింటితో ఉన్న బంధానికీ చోటిచ్చేలా ఉండాలి.
ఆమెకు ఉద్యోగం ఆదాయం కోసమే కాకపోవచ్చు. చదువుకున్నది ఉపయోగించుకోవాలనుకోవచ్చు. తన కాళ్లపై తాను నిలబడాలనుకోవచ్చు. తన వృత్తిలో ఎదగడమే ఆమెకు తృప్తి కావచ్చు. సమాజానికి సేవ చేయాలనే తలంపు కావచ్చు. తన ఆశలను ఆమె తరఫున మరొకరు నిర్వచించలేరు.
ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు ఇద్దరూ కూర్చుని ఆలోచించాలి. ఉద్యోగ సమయాలు ఎలా సర్దుకోవాలి? కుటుంబ బాధ్యతలు ఎలా పంచుకోవాలి? ఇద్దరి వృత్తులకు ఎలా చోటివ్వాలి? కష్టపడి సంపాదించిన డబ్బు ఎలా పొదుపు చేసుకోవాలి? ఒకవేళ అవసరమైతే ఒకరు వదులుకోవచ్చు. కానీ అది ఇద్దరి నిర్ణయమై ఉండాలి. అలా కాకుండా ఆమె మాట వినకుండానే “వద్దు” అని తీర్పు చెప్పేస్తే, ఆ నిర్ణయంలో ఆమె స్థానం ఎక్కడ? అదే అవకాశం అతనికి వస్తే కుటుంబమంతా సర్దుకోవాలని, ఆమెకు వస్తే ఆమే వదులుకోవాలని ఆశించడం ఆమె ఆశలకు విలువ ఇవ్వకపోవడమే.
వయసు, చదువు, ఎంతకాలం ప్రేమించుకున్నామన్నది ఈ అవగాహనకు హామీ ఇవ్వవు. యువకుడైనంత మాత్రాన ఆలోచనల్లో ఆధునికత ఉంటుందని చెప్పలేం. భార్య తన అడుగుజాడల్లోనే నడవాలని భావించే చాందస ధోరణి ఈ తరం అబ్బాయిల్లోనూ కనిపిస్తుంది.
పదేళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నవారి మధ్య కూడా సమస్యలు రావచ్చు. ప్రేమలో ఉన్నప్పుడు నచ్చిన స్వతంత్రత, పెళ్లయ్యాక కొందరికి అసౌకర్యంగా అనిపించవచ్చు. పెద్దలు కుదిర్చిన సంబంధంలో ఒకరికొకరు తెలియనివారైనా, ఒకరి మాట ఒకరు వింటూ అన్యోన్యంగా బతుకుతున్నవారూ ఉన్నారు. బంధం దృఢత్వాన్ని నిర్ణయించేది పరస్పర గౌరవాన్ని ఆచరణలో చూపే మనస్తత్వం.
తన మాటకు చోటులేని ఇంట్లో ఆమె మాట్లాడటం తగ్గించుకోవచ్చు. గొడవ రాకుండా కోరికలను వాయిదా వేసుకోవచ్చు. బయటివాళ్లకు ఆ ఇల్లు ప్రశాంతంగా కనిపించవచ్చు. ఆ ప్రశాంతత కోసం ఆమె ఎంతగా మౌనాన్ని ఆశ్రయిస్తోందో వారికి తెలియదు. ఒకే ఇంట్లో అపరిచితుల్లా జీవించడం నరకప్రాయం.
“ఈ మాట నన్ను బాధించింది” అని చెప్పడం గొడవకు ఆహ్వానం కాదు. తన చదువును, వృత్తిని, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలనుకోవడం స్వార్థం కాదు. ఇదే గౌరవం భర్తకూ అవసరం. అతని కష్టాలను, ఆకాంక్షలను ఆమె కూడా అర్థం చేసుకోవాలి. పరస్పర గౌరవం ఉన్న చోట సర్దుబాటు ఉంటుంది. కానీ అది ఎప్పుడూ ఒక్కరి వంతుగానే మిగిలిపోదు.
గొడవలు రాని దాంపత్యం మంచి దాంపత్యమని కాదు. విభేదించినప్పుడు కూడా ఒకరినొకరు కించపరచుకోకుండా మాట్లాడగలగాలి. కోపంలో అన్న మాటకు బాధ్యత తీసుకోగలగాలి. నిర్ణయాల్లో ఇద్దరికీ చోటుండాలి. క్షమాపణ కోరేందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అనురాగం, నమ్మకం పెరిగినప్పుడు చూపుల్లోనూ భావాలు అర్థమవుతాయి. అయినా ముఖ్యమైన విషయాల్లో స్పష్టంగా మాట్లాడుకోవడం అవసరమే. మనసు తెలుసుననే నమ్మకంతో, ఎదుటివారి మాట వినడం మానేయకూడదు.
కలిసి నడిచే జీవితంలో ఒకరి నీడలో మరొకరి వ్యక్తిత్వం కనుమరుగైపోకూడదు. ఇద్దరూ తలెత్తి నిలబడగలిగే ఇల్లే ఇద్దరికీ సొంతమవుతుంది.
మూడు చోట్లా ఒకటే ప్రశ్న
లక్ష్మి పనిచేసే ఇల్లు, ఉద్యోగి పనిచేసే సంస్థ, భార్యాభర్తలు నిర్మించుకునే కుటుంబం—మూడు చోట్లా ఒకటే ప్రశ్న. ఎదుటి మనిషి శ్రమను, అవసరాలను, ఆశలను మనం గుర్తిస్తున్నామా? లేక మనకు అనుకూలంగా ఉన్నంతవరకే ఆ మనిషికి విలువ ఇస్తున్నామా? అధికార దర్పం ప్రదర్శిస్తున్నామా?
“జీతం ఇచ్చినంత మాత్రాన మనిషిపై పెత్తనం చేసే హక్కు రాదు. పదవి ఉన్నంత మాత్రాన అవమానించే స్వేచ్ఛ రాదు. పెళ్లి చేసుకున్నంత మాత్రాన జీవిత భాగస్వామి నిర్ణయాధికారం మనకు బదిలీ కాదు.
సంస్కారం మనం ధరించే దుస్తుల్లో ఉండదు. పెద్దవాళ్ల ముందు ప్రదర్శించే వినయంలోనూ పూర్తిగా కనిపించదు. మనకు ఎదురు మాట్లాడలేని స్థితిలో ఉన్న వ్యక్తి పట్ల మన ప్రవర్తనలో అది బయటపడుతుంది.
ఇంటి పనివారు, డ్రైవర్, చిన్న ఉద్యోగి, ఆర్థికంగా మనపై ఆధారపడిన కుటుంబ సభ్యుడు—వారి మాటను వినగలుగుతున్నామా? వారి అవసరాలను గౌరవిస్తున్నామా? మన వల్ల వారికి కలిగిన బాధను అంగీకరించగలుగుతున్నామా? మన విలువలకు సాక్ష్యం ఈ ప్రవర్తనే.
హోదాలు వేరు కావచ్చు. జీతాలు వేరు కావచ్చు. మనిషిగా గౌరవం పొందే హక్కు మాత్రం అందరికీ సమానం.
మన విలువను కాపాడే అడుగు

ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం ప్రతిసారీ తేలిక కాదు. ఇంటి అద్దె, పిల్లల చదువు, తల్లిదండ్రుల మందులు మన నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. అవమానం ఎదురైన క్షణంలోనే అందరూ ఉద్యోగం మానేయలేరు. బంధంలో సమస్య వచ్చిందని వెంటనే బయటకు రాలేరు.
కొంతకాలం కొనసాగాల్సి వచ్చినంత మాత్రాన వారికి ఆత్మగౌరవం లేదని చెప్పలేం. ఆ మౌనం వెనుక ప్రేమ ఉండవచ్చు. బాధ్యత ఉండవచ్చు. మరో దారికి సిద్ధపడే ప్రయత్నం ఉండవచ్చు.
అలాగని అవసరాలున్నాయి కాబట్టి ఎంతైనా భరించాల్సిందేనని ఎవరికీ చెప్పకూడదు. ఉండాల్సి వచ్చినవాడు తనను తాను తక్కువగా భావించకూడదు. వెళ్లగలిగినవాడు అక్కడే ఉన్నవారిని పిరికివాళ్లుగా చూడకూడదు.
ఆత్మగౌరవాన్ని ఒక్క రాజీనామాతో కొలవలేం.
ముందుగా జరిగినదాన్ని నిజాయతీగా చూసుకోవాలి. అది ఒక్కసారి వచ్చిన అపార్థమా? మాట్లాడితే సరిదిద్దుకునే సమస్యా? లేక పదేపదే కొనసాగుతున్న అవమానమా? మన మాట చెప్పాక ఎదుటివారి ప్రవర్తనలో మార్పు ఉందా?
ధైర్యం ఎప్పుడూ గొంతు పెంచడంలోనే ఉండదు.
“పని గురించి మాట్లాడండి. నన్ను వ్యక్తిగతంగా కించపరచవద్దు” అని నిశ్చలంగా చెప్పడంలో ధైర్యం ఉంది. జరిగినదాన్ని, మన దగ్గరున్న రుజువులను నమోదు చేసుకోవడంలో ధైర్యం ఉంది. నమ్మకమైన మనిషితో బాధను పంచుకోవడంలో, కొత్త నైపుణ్యం నేర్చుకోవడంలో, మరో అవకాశానికి సిద్ధపడటంలో ధైర్యం ఉంది.
పరిస్థితి మారడం లేదని స్పష్టమైనప్పుడు, మన బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని బయటకు వచ్చే దారిని నిర్మించుకోవడంలోనూ ధైర్యం ఉంది.
అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఇంకోటి.. అవమానించినవాడి మాటను పట్టుకుని మన మీద మనం నమ్మకం కోల్పోకుండా ఉండటం.
ఒక అధికారి చులకనగా మాట్లాడినంత మాత్రాన మన అనుభవం చెరిగిపోదు. జీవిత భాగస్వామి పట్టించుకోలేదని మన ఆశలు విలువలేనివి కావు. ఎవరో చిన్నచూపు చూశారని మన పని గౌరవం కోల్పోదు.
లోపాలుంటే సరిదిద్దుకుందాం. బలాలను పెంచుకుందాం. కానీ మరొకరి అసహనాన్ని, అధికారాన్ని మన విలువకు, గౌరవానికి కొలమానంగా చేసుకోవద్దు.
అవమానాన్ని ప్రశ్నించడం వల్ల మనం కృతఘ్నులం కాబోము. గౌరవం కోరడం వల్ల అహంకారులం కాబోము. మన జీవితానికి మేలు చేసే నిర్ణయం తీసుకోవడం వల్ల బాధ్యతలేని మనుషులం కాబోము.
పరిస్థితిని అర్థం చేసుకుంటూ, మన విలువను కాపాడే అడుగు వేయాలి. ఆ అడుగు చిన్నదైనా, మనల్ని ముందుకు తీసుకెళ్లగలదు.
తీర్పు కాదు, తోడు కావాలి
ఆ సాయంత్రం లక్ష్మి కొన్న కేకుముక్కలను కూతురు ఒకే ప్లేటులో పెట్టి ఇద్దరికీ మధ్యగా జరిపింది.
పని మానేసిన సంగతి చెప్పగానే, “మరి ఇప్పుడు?” అని అడిగింది.
“ఇంకోటి చూసుకోవాలి” అంది లక్ష్మి.
“రేపు నేనూ వస్తాను నీతో” అంది కూతురు.
లక్ష్మి సమస్యలు ఆ సాయంత్రంతో తీరిపోలేదు. అద్దె కట్టాలి. ఇంకో పని దొరకాలి. కానీ తన నిర్ణయాన్ని ఒంటరిగా మోయాల్సిన అవసరం లేదని ఆమెకు తెలిసింది.
అవమానం ఎదురైన మనిషికి ఇలాంటి తోడు ఎంతో అవసరం. “సర్దుకుపో” అని చెప్పడం తేలిక. “ఎందుకంత పట్టింపు?” అని అడగడమూ తేలికే. అతని మాట వినడం, ఎంతకాలంగా భరిస్తున్నాడో తెలుసుకోవడం, అతని శ్రమను గుర్తించడం, మరో దారి కనిపించేలా సాయపడటం అసలైన మానవత్వం.
మనకు జరిగిన అన్యాయం మన సంస్కారాన్ని దెబ్బతీయకూడదు. రేపు మనకు అధికారం వస్తే, అదే అవమానాన్ని మరొకరికి పంచకూడదు. మన మాట వినలేదని బాధపడ్డ మనం, మన దగ్గరకు వచ్చినవారి మాట వినగలగాలి. మన కృషిని గుర్తించలేదని వేదన చెందిన మనం, ఇతరుల శ్రమను గుర్తించగలగాలి.
అప్పుడే ఆత్మగౌరవానికి విలువలు తోడవుతాయి.
హోదా మారవచ్చు. ఉద్యోగం మారవచ్చు. ఆదాయం తగ్గి మళ్లీ పెరగవచ్చు. ఆ మార్పుల మధ్య మనం కాపాడుకున్న విలువలు మనతోనే ఉంటాయి. అవే తిరిగి నిలబడటానికి బలమిస్తాయి.
భగవద్గీతలోని ఒక శ్లోకం ఈ సందర్భంలో గుర్తుచేసుకోదగినది:
ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ।
ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః ॥
మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. మనల్ని మనం కుంగదీసుకోకూడదు. మనకు మనమే బంధువుగా, మనకు మనమే శత్రువుగా మారగలం అనే భావం ఇందులో ఉంది. అవమానం ఎదురైనప్పుడు మనల్ని మనమే తక్కువ చేసుకోకుండా నిలబడటానికి ఈ భావం స్ఫూర్తినిస్తుంది.
లక్ష్మి మరో పని వెతుక్కోగలదు. అన్యాయమైన నిందను ఎదుర్కొన్న ఉద్యోగి తన అనుభవానికి విలువిచ్చే చోటు కోసం ప్రయత్నించగలడు. తన మాట వినిపించని భార్య, తన ఆశలకూ ఈ జీవితంలో చోటుందని చెప్పగలదు.
వారి దారి సులభం కాకపోవచ్చు. కానీ వారు తక్కువవారు కారు. వారి అవసరాలు వారి విలువను తగ్గించవు. వారి గౌరవం మరొకరి దయపై ఆధారపడదు.
ఆత్మగౌరవమే అన్నింటికన్నా మిన్న. దాన్ని కాపాడుకోవడం అంటే మన శ్రమను, మన ఆశలను, మన జీవితాన్ని గౌరవించడం. ఇతరులకూ అదే గౌరవాన్ని అందించడం.
మనకూ తలెత్తి నిలబడే చోటు ఉండాలి. దాన్ని కోరే హక్కు మనకుంది. దాన్ని నిర్మించుకునే ధైర్యమూ మనలోనే ఉంది.
అక్టోబర్ 10 · ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
అవమానం, చిన్నచూపు మనసుపై కనిపించని గాయాలు చేస్తాయి. మనసు బాగోలేనప్పుడు ఎవరితోనైనా మాట్లాడాలనిపిస్తే, కేంద్ర ప్రభుత్వ ఉచిత హెల్ప్‌లైన్ Tele-MANAS: 14416 కు కాల్ చేయండి. 24 గంటలూ అందుబాటులో ఉంటుంది, తెలుగులోనూ మాట్లాడొచ్చు.








