అభిప్రాయాలు… ఆలోచనలు… అక్షరాలు…

మరణాన్ని గెలిచే కీర్తి సంతకం

పాతికేళ్ల వయసులో ఓ యువకుడు తండ్రిలాంటి పెద్దాయనతో అన్న ఒక్క మాట.. ఎన్నో ఏళ్ల తర్వాత నన్ను ఆలోచనలో పడేసింది. మనిషి నిజంగా ఏం కోరుకోవాలి?

చెర్మాల శ్రీనివాస్25 సెప్టెంబర్ 2026 · సవరణ: 12 అక్టోబర్ 2026 · 7 నిమిషాలు
ఒక ప్రమిద నుంచి మరో ప్రమిదకు దీపం వెలిగిస్తున్న చేతులు

ఒక దీపం.. మరో దీపానికి వెలుగు

  • పాతికేళ్ల యువకుడు అన్న ఒక్క మాట.. స్థితప్రజ్ఞుడినే కదిలించింది
  • పేరు బతకడం వేరు.. మనం చేసిన మంచి బతకడం వేరు
  • ఆఫీస్‌ బాయ్‌ నుంచి బ్యాంక్‌ మేనేజర్‌ దాకా ఒక ప్రయాణం
  • మరణం తర్వాత కూడా జీవించడం ఎలా?

ఈరోజు నా ప్రాణస్నేహితుడితో మాట్లాడుతుండగా, మాటల సందర్భంలో తన యవ్వనంలో జరిగిన ఒక సంఘటన చెప్పాడు. యవ్వనం అన్నానని ఇప్పుడాయన వృద్ధుడని కాదు. అప్పటికి ఆయనకు సుమారు పాతికేళ్లు.

తాను దైవంలా భావించే, తండ్రిలాంటి ఒక పెద్దాయన అప్పుడు అస్వస్థతతో ఉన్నారు. ఈ యువకుడు ఎంతో ఇష్టంతో ఆయనకు సేవ చేస్తూ, కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. అలా పూర్తిగా రెండు నెలలు.

ఒకరోజు ఆ పెద్దాయన పుస్తకం చదువుతూ, ఆ యువకుడి వైపు చూసి, “ఏరా.. నిన్ను చాలా బాధపెడుతున్నట్లున్నాను కదా!” అన్నారు. దానికి అతను, “ఇది నా అదృష్టం. మీకు సేవ చేసుకునే భాగ్యం ఆ భగవంతుడు నాకు ప్రసాదించాడు” అని సమాధానమిచ్చాడు.

ఆ తరువాత ఏదో ఆలోచిస్తూ పెద్దాయన, “ఒరే బాబూ.. జీవితంలో నీకేం కావాలని ఉంది?” అని ప్రశ్నించారు. మరి ఆ పాతికేళ్ల యువకుడికి ఆ క్షణంలో ఏం అనిపించిందో తెలియదు. తన ఎదురుగా ఉన్న పెద్దాయన జీవనశైలి ప్రభావమో, అప్పటికే తనలో రూపుదిద్దుకుంటున్న ఆలోచనో… తను ఇచ్చిన సమాధానం…

“నాకు చనిపోయిన తర్వాత కూడా బతకాలని ఉంది.”

ఆ మాటకు పెద్దాయన నోట మాట రాలేదు. ఎంతో స్థితప్రజ్ఞుడైన ఆయన్ను సైతం కదిలించిన సమాధానం అది. ఎన్నో ఏళ్ల తర్వాత, ఈరోజు ఆ సంఘటన విన్న నన్నూ ఆ మాట కదిలించింది. మా మాటలు ముందుకు సాగినా, నా మనసు మాత్రం ఆ మాట దగ్గరే ఆగిపోయింది.

ఆ మాటకు రూపమిచ్చిన జీవితం

ఆనాటి యువకుడు ఈరోజు ఎంతో గొప్పవాడు. విద్యావంతుడు, ధనవంతుడు, అన్నిటికీ మించి వినయవంతుడు. ఎంతోమందికి సాయం చేసి, చేసిన సాయాన్ని మర్చిపోయినవాడు. ఈ తరానికే కాక, భవిష్యత్ తరాలకు కూడా ఊపిరిపోసే కార్యాన్ని తలపెట్టినవాడు.

అలాంటి వ్యక్తి నోట ఈరోజు ఆ మాట విన్నప్పుడు నాకు విచిత్రంగా, ఆశ్చర్యంగా అనిపించింది. ఇన్ని సాధించినా ఆ కోరిక ఇంకా ఎందుకు? అప్పుడే నా మనసులో ఒక ప్రశ్న మెదిలింది.

మనిషి నిజంగా ఏం కోరుకోవాలి?

పాతికేళ్ల వయసులో ఎవరైనా చదువు, ఉద్యోగం, సంపాదన, కుటుంబం గురించే కలలు కంటారు. కానీ ఆ వయసులోనే ఈ యువకుడు తన జీవితకాలాన్ని దాటి ఆలోచించాడు. ఆ రోజు ఆ మాటకు ఆయన ఎంత స్పష్టమైన అర్థం ఇచ్చుకున్నాడో నాకు తెలియదు. కానీ ఈరోజు ఆయన జీవిస్తున్న తీరు చూస్తే, ఆ మాటకు నిలువెత్తు రూపం కనిపిస్తోంది. ఒక పెద్దాయనకు సేవ చేయడాన్ని భాగ్యంగా భావించిన ఆ మనసే, ఈరోజు ఎంతోమందికి ఉపయోగపడే పనుల్లో కనిపిస్తోంది.

సేవ నేర్పిన కోరిక

ఈ సంఘటనలో ఆ సమాధానం ఎంత ఆలోచింపజేసిందో, అది పుట్టిన క్షణం కూడా అంతే కదిలించింది. సేవను భారంగా కాక భాగ్యంగా భావించిన మనసులోంచే ఆ సమాధానం వచ్చింది. ఒకరికి నిస్వార్థంగా సేవ చేయగలిగినవాడికి, తన తర్వాత కూడా మంచి మిగలాలనే కోరిక కలగడం సహజమేనేమో. తీసుకోవడం కంటే ఇవ్వడంలో ఆనందం దొరికినవాడు, ఇంకేం కోరుకుంటాడు?

మనం గౌరవించే మనుషులు మనకు మాటలతో మాత్రమే నేర్పరు. వాళ్ల జీవనశైలే మనకు పాఠం. అనారోగ్యంలోనూ పుస్తకం వదలని ఆ పెద్దాయన జీవితం, ఆ యువకుడిలో ఒక విలువను నాటింది. ఆ యువకుడి జీవితంలో ఆ విత్తనం ఈరోజు మహావృక్షమైంది.

మరణం తరువాత కూడా జీవించడం బహుశా అక్కడే మొదలవుతుంది.

కీర్తి వెంటపడితే రాదు

చరిత్రను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఒక విచిత్రమైన నిజం కనిపిస్తుంది. “నన్ను గుర్తుపెట్టుకోవాలి” అని తాపత్రయపడుతూ పెద్ద పెద్ద విగ్రహాలు చెక్కించుకున్న, శాసనాలు రాయించుకున్న చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు. వాళ్ల విగ్రహాలు మిగిలినా, వాళ్లెవరో ఈరోజు ఎవరికీ గుర్తులేదు.

కానీ సమాజం దశాబ్దాల తరబడి టీ బంకుల దగ్గరో, కుటుంబ శుభకార్యాల్లోనో ఎంతో ఆప్యాయంగా గుర్తుచేసుకునే మనుషులు వేరే. వాళ్ల గురించి మాటలు ఇలా వినిపిస్తాయి:

“ఆయన ఆ రోజు ఆదుకోకపోతే నా చదువు ఆగిపోయేది.”

“మా కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా నిలబడ్డారు.”

“నాకు పని నేర్పింది ఆయనే.”

ఆ మాటలు చెప్పేవాళ్ల ముఖంలో కృతజ్ఞత కనిపిస్తుంది, గొంతులో ఆత్మీయత వినిపిస్తుంది. ఆ మనుషులు తమ పేరు నిలవాలని బతకలేదు. సమాజానికి మంచి చేయడమే ధ్యేయంగా బతికారు. కీర్తి వాళ్ల వెంట తనంతట తానే వచ్చింది.

అప్పుడు నా మిత్రుడి మాటకు అసలు అర్థం నాకు తెలిసింది. చనిపోయాక బతకాలనే కోరిక రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, నా పేరు బతకాలి అనే కోరిక. రెండు, నా వల్ల జరిగిన మంచి బతకాలి అనే కోరిక. మొదటిది రాతి మీద చెక్కిన అక్షరాల్లా కాలానికి అరిగిపోతుంది. రెండోది మనుషుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

ఆ పాతికేళ్ల యువకుడు కోరింది రెండోదే. అందుకే ఈరోజు ఆయన జీవితం ఆ మాటకు సాక్ష్యంగా నిలుస్తోంది.

“

మన పేరు గుర్తుండాలని మనం కోరుకోవచ్చు. కానీ ఆ పేరును ప్రేమగా పలకడానికి కారణం మాత్రం మన జీవితమే ఇవ్వాలి.

కీర్తి వెంటపడితే రాదు. మనం మంచి వెంట నడిస్తే, అదే మన వెనకాల వస్తుంది.

ఒక పిల్లాడు.. ఒక అవకాశం

మిత్రుడి మాట నాలో ఆలోచనను రేపి, నా జీవితంలోని ఒక సంఘటనను గుర్తుకుతెచ్చింది.

పదో తరగతి చదివిన ఒక అబ్బాయి, ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల మా ఆఫీసులో బాయ్‌గా చేరాడు. ఒకరోజు ఏం చదివావని అడిగితే చెప్పాడు. కాలేజీలో చేరడానికి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల చదువు కొనసాగించలేనన్నాడు. “చదువుకోగలను కానీ, అది నా శక్తికి మించిన పని సర్..” అన్నాడు.

అప్పుడు పట్టుబట్టి అతన్ని ఓపెన్ యూనివర్సిటీలో చేర్పించాను. పుస్తకాలు, చదువుకు అవసరమైన డబ్బు ఇచ్చాను. ఆఫీసులో పని లేనప్పుడు చదువుకోమని ప్రోత్సహించాను. పనిచేసే మనిషిని చదువుకోమని చెబితే సరిపోదు. చదువుకునే సమయం, పుస్తకాలు, ఖర్చు గురించి కాస్త ధైర్యం కూడా ఇవ్వాలి. నాకు చేతనైనంతలో అవి కల్పించాను.

అతను ఆ అవకాశాన్ని వదులుకోలేదు. పనిచేస్తూనే చదివాడు. పరీక్షలు రాశాడు. పట్టభద్రుడయ్యాడు. తరువాత ఒక పేరున్న బ్యాంకులో మేనేజర్ స్థాయికి ఎదిగాడు.

నేను పుస్తకాలు ఇచ్చాను, చదివింది అతనే. ఫీజు కట్టాను, పరీక్షలకు సిద్ధమైంది అతనే. ప్రోత్సహించాను, రోజూ పట్టు వదలకుండా ప్రయత్నించింది అతనే. మన సాయానికి అవతలి మనిషి పట్టుదల కలిస్తే, ఒక జీవితం ఎంతగా మారుతుందో అతను నాకు చూపించాడు.

ఆనందబాష్పాలు

తనతో కలిసి పనిచేసే ఒక అమ్మాయిని అతను ప్రేమించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆమెను నా దగ్గరకు తీసుకొచ్చాడు. ఇద్దరూ నా పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. నా కళ్లలో నీళ్లు… అవెందుకో నాకు తెలుసు.

ఆ క్షణంలో అతని ప్రయాణం అంతా కళ్లముందు మెదిలింది. ఆఫీసులో చేరిన రోజులు, మళ్లీ మొదలుపెట్టిన చదువు, అతని కష్టం, ఉద్యోగంలో ఎదుగుదల.. ఒకప్పుడు పరిస్థితుల వల్ల చదువు ఆపేసిన కుర్రాడు, ఈరోజు తన జీవిత భాగస్వామితో నా ముందు నిలబడ్డాడు. తన జీవితంలోని ఆ సంతోషంలో నాకూ చోటిచ్చాడు. ఎన్నో ఏళ్ల ఉద్యోగంలో, ఎన్నో విజయాల్లో దొరకని తృప్తి ఆ ఒక్క క్షణం ఇచ్చింది.

నిజానికి అతను నా దగ్గరకు రాకపోయినా, అతని ఎదుగుదల విలువ ఏమాత్రం తగ్గేది కాదు. ఆ సాయం సార్థకమైంది అతని జీవితంలో వచ్చిన మార్పుతోనే. ఆ మార్పును కళ్లారా చూసే అదృష్టం మాత్రం నాకు దక్కింది.

ఇదేదో నేను గొప్ప పని చేశానని చెప్పడంలేదు. మునుపెన్నడూ ఎరగని తృప్తినిచ్చిన ఆ క్షణం గురించి చెబుతున్నాను.

నేలలో ఇంకిన నీరు

దోసిట్లోంచి లేత మొక్కకు నీళ్లు పోస్తున్న పెద్దవారి చేతులు
ఇంకిన నీరు.. పెరిగే మొక్క

ఆ రోజు నాకు ఒక విషయం అర్థమైంది. మనం చేసే సాయం ఎంత దూరం వెళుతుందో, చేస్తున్న క్షణంలో మనకు తెలియదు.

కొన్ని పుస్తకాలు, కొంత డబ్బు, చదువుకోవడానికి కొంత సమయం. అంతే. వాటితో అతను తన జీవితాన్ని కట్టుకున్నాడు. అతని చదువు, ఉద్యోగం ఇప్పుడు అతని కొత్త కుటుంబానికి పునాది. రేపు అతని పిల్లలు ఎంత ఎత్తుకు ఎదిగినా, ఆ ఎదుగుదలలో ఆ రోజు ఆఫీసులో మొదలైన ప్రయాణం కూడా ఉంటుంది. ఏదో ఒకరోజు అతను కూడా చదవాలనుకునే మరో కుర్రాడికి అలాగే తోడుగా నిలవచ్చు. వ్యాపారం చేసి ఎదగాలనుకునే అర్హుడైన యువకుడికి లోన్ ఇప్పించవచ్చు. తనకు ఒకప్పుడు అందిన నమ్మకాన్ని ఇంకొకరికి అందించవచ్చు.

మనం చేసిన సాయాన్ని మనం మర్చిపోవచ్చు. అందుకున్నవారికీ కాలం గడిచేకొద్దీ ఆ జ్ఞాపకం మసకబారవచ్చు. అయినా ఆ సాయం వల్ల వచ్చిన మార్పు వాళ్ల జీవితంలో భాగంగా ఉండిపోతుంది.

“

నేలలో ఇంకిన నీరు కంటికి కనిపించదు. కానీ మొక్క పెరిగి చెట్టవుతుంది. ఆ చెట్టే ఓ అరణ్యానికి కారణమవుతుంది.

ఎదగడం అంటే ఇదే

వ్యక్తిత్వ వికాసం అంటే ఆత్మవిశ్వాసం, మాట తీరు, నాయకత్వం మాత్రమే కాదు. మనిషిని మనిషిగా చూసే మనసు కూడా.

మనతో పనిచేసే మనిషిని అతను చేస్తున్న పనికి మించి చూడగలగాలి. అతనిలో ఇంకా బయటపడని సామర్థ్యం ఉండొచ్చు. మనకు తెలియని కష్టాలు ఉండొచ్చు. ఒక్క అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఆశ ఉండొచ్చు. అది తెలుసుకోవడానికి మనం పెద్దగా ఏమీ చేయక్కర్లేదు. ఒక ప్రశ్న అడిగే ఆసక్తి, సమాధానం వినే ఓపిక చాలు. ఆ కుర్రాడి విషయంలో నా మొదటి అడుగు కూడా అదే.

సాయం చేసేటప్పుడు పొందేవాడు మనకు లోకువ కాకూడదు, తన గౌరవం తగ్గకూడదు. చేసిన సాయాన్ని జీవితాంతం అతని మీద రుణంగా మోపకూడదు. అతను సాధించిన విజయం పూర్తిగా అతనిదే అని మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. మన తోడ్పాటుతో ముందుకు సాగి, తన కాళ్ల మీద తాను నిలబడితే, అదే మన సాయానికి అసలైన ఫలితం.

మనం ఎదిగేకొద్దీ ఇంకో పరీక్ష ఎదురవుతుంది. పేరు, ప్రతిష్ఠ వచ్చినప్పుడు భజనలు పెరుగుతాయి. డబ్బు వచ్చినప్పుడు ప్రలోభాలు పెరుగుతాయి. మన చుట్టూ ఆహా.. ఓహో.. అనేవాళ్లు చేరతారు. ఒక్క క్షణం ఏమరుపాటుగా లొంగిపోతే, ఇక అంతే.. అలాంటప్పుడే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.

నా మిత్రుడిలో నాకు ఎక్కువ గౌరవం కలిగించేది ఆ నిగ్రహమే. ఎంత ఎదిగినా ఆయన వినయం తగ్గలేదు. తామరాకు మీద నీటిబొట్టులా, రకరకాల ఆకర్షణలు చుట్టూ ఉన్నా వాటిని తాకకుండా నిలబడ్డాడు. సేవను భాగ్యంగా భావించిన ఆనాటి యువకుడే ఈనాటి నా ప్రియమిత్రుడిలోనూ కనిపిస్తున్నాడు.

“

నిజమైన ఎదుగుదల అంటే మనం ఎంత ఎత్తుకు చేరుకున్నామన్నది కాదు, మనతో పాటు ఎంతమందిని తీసుకెళ్లామన్నది.

ఆ ప్రశ్న మనకూ ఎదురైతే..

అందుకు ప్రతి ఒక్కరూ కోటీశ్వరులు కావాల్సిన పనిలేదు. ముందుగా కష్టంలో ఉన్న మనిషి మాటను శ్రద్ధగా వినగలగాలి. ఆపదలో ఉన్నవారికి మాటసాయం చేసినా చాలు. మనకు తెలిసింది నేర్పొచ్చు. ఒకరి చదువుకు తోడవ్వచ్చు. అర్హుడికి అవకాశం ఇవ్వొచ్చు. మన పనిని నిజాయితీగా చేస్తూ కూడా ఎంతోమందికి ఉపయోగపడవచ్చు. పెద్ద పనులు తలపెట్టగలిగినవాళ్లు, తమ తర్వాత కూడా ఆ పని ఆగకుండా నలుగురిని సిద్ధం చేయవచ్చు. అప్పుడు ఒక్కరి సంకల్పం ఎంతోమంది చేతుల్లో కొనసాగుతుంది.

మన సామర్థ్యం ఎంతైతే, అంత మంచి చేయగలం.

అనారోగ్యంలోనూ పుస్తకం చదువుతున్న ఒక పెద్దాయన, తనకు ఇష్టంగా సేవ చేస్తున్న యువకుడిని ఓనాడు అడిగిన ప్రశ్న, ఎన్నో ఏళ్ల తర్వాత ఈరోజు నా ముందుకు వచ్చింది. ఇప్పుడు ఆ ప్రశ్నను నాకు నేనే వేసుకుంటున్నాను. మీరూ ఒకసారి వేసుకోండి.

“జీవితంలో నీకేం కావాలని ఉంది?”

సమాధానం అందరికీ ఒకేలా ఉండక్కర్లేదు. మనకు ఆనందం కావాలి, ప్రేమ, ప్రశాంతత కావాలి, మన కష్టానికి ఫలితం రావాలి. వీటితో పాటు మన వల్ల ఎవరికైనా కొంత మేలు జరగాలనే కోరికకు కూడా మనసులో చోటివ్వండి.

మనల్ని ఎంతకాలం గుర్తుంచుకుంటారో మనకు తెలియదు. కానీ మన ముందున్న మనిషికి ఈరోజు ఏం ఇవ్వగలమో మనకు తెలుసు. ఒక అవకాశం. కొంత సమయం. అవసరమైనప్పుడు నేనున్నాననే భరోసా. “నువ్వు చేయగలవు” అనే ధైర్యం.

మరణాన్ని గెలిచే అసలైన సంతకం మన కీర్తి కాదు, మనం ఇంకొకరి జీవితంలో నింపిన వెలుగు!

తర్వాత చదవండిచీరలో, ఒట్టికాళ్లతో 1,600 మీటర్ల ట్రయల్ పరుగులో కవితఆలోచనలుకాళ్లకు బూట్లు లేవు… కలలకు హద్దులు లేవు!

ఈ కథనంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం. ఏదైనా తప్పు కనిపిస్తే contact@maromaata.comకు రాయండి — సరిచేస్తాను. సంపాదకీయ విధానం →

చెర్మాల శ్రీనివాస్

రచయిత

నా గురించి →

మరిన్ని కథనాలు

షేర్