పనులు పేరుకుపోతున్నా… చేతిలో ఫోన్!
కాల్ కరే సో ఆజ్ కర్, ఆజ్ కరే సో అబ్।
పల్ మే పరలయ్ హోయేగీ, బహురి కరేగా కబ్॥
కబీర్ పేరుతో ప్రసిద్ధమైన దోహా ఇది. “రేపు చేయాల్సిన పని ఇవాళే చేయ్. ఇవాళ చేయాల్సిన పని ఇప్పుడే చేయ్. క్షణంలో ప్రళయం వస్తే, ఆ తర్వాత ఇంకెప్పుడు చేస్తావు?” అని దాని అర్థం.
మన జీవితంలోనూ అంతే కదా! ఇవాళ ఉన్న అవకాశం రేపూ ఉంటుందో లేదో తెలియదు. పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పలేం. అయినా “రేపు చేద్దాంలే” అని ఎంత తేలిగ్గా అనేస్తామో!
రేపటి నుంచి వాకింగ్ మొదలుపెడదాం. రేపటి నుంచి పుస్తకాలు చదువుదాం. రేపు మిగిలిన పనులన్నీ పూర్తిచేద్దాం. రేపు మనవాళ్లతో తీరిగ్గా మాట్లాడదాం.
ఇలా మన రేపటి జాబితా పెరుగుతూనే ఉంటుంది. రేపు మనకు ఎక్కువ సమయం ఉంటుందని, మంచి ఉత్సాహం వస్తుందని అనుకుంటాం. ఇవాళ చేయలేకపోయినవన్నీ రేపు చేసేస్తామనే నమ్మకం. కానీ రేపు ఆ పనులన్నీ చేయాల్సింది ఎవరు?
మనమే! ఇవాళ మొదలుపెట్టడానికి వెనకాడుతున్న మనమే!
ఆ రేపు ఎప్పుడు వస్తుంది?
“రేపు చేస్తా” అనేవాడు ఆ పని గురించి ఆలోచించడనుకోకండి. ఆలోచిస్తూనే ఉంటాడు. రేపు ఎలా చేయాలో అనుకుంటాడు. పూర్తిచేశాక ఎంత బాగుంటుందో ఊహించుకుంటాడు. కానీ ఇవాళ మాత్రం మొదలుపెట్టడు. అలా పని చేయడం కంటే, చేయబోయే పని గురించి ఆలోచించడంలోనే సమయం గడిపేస్తాం.
ఇదీ.. ఆ భవిష్యత్తులో జీవించడమే.. బద్ధకం.
ఇవాళ్టి పనిని రేపటి మనకు అప్పగిస్తున్నాం. రేపు మనం ఎక్కువ ఓపికతో, ఉత్సాహంతో ఉంటామనుకుంటాం. కానీ రేపు వచ్చేసరికి అదీ ఇవాళే అవుతుంది. మనం మారకపోతే మళ్లీ అదే మాట—“రేపు చేద్దాం!”
రేపటి కోసం ప్లాన్ వేసుకోవడం మంచిదే. అయితే దాని కోసం ఇవాళ ఏం చేస్తున్నామన్నదీ చూసుకోవాలి. వ్యాయామం మొదలుపెట్టాలనుకుంటే ఇవాళ బూట్లు సిద్ధం చేసుకోవచ్చు. పుస్తకం చదవాలనుకుంటే ఇవాళ ఒక పేజీ చదవొచ్చు.
నిన్నటి డబ్బు ఖర్చయిపోయింది. రేపటి డబ్బు ఇంకా చేతికి రాలేదు. ఇవాళ చేతిలో ఉన్నదే మనది. సమయమూ అంతే. చేతిలో ఉన్నదాన్ని ఎంత సమర్థవంతంగా వాడుకుంటున్నామన్నదే మన ‘రేపటి’ని నిర్ణయిస్తుంది.
ఎందుకు వాయిదా వేస్తున్నాం?
ఇతరుల “బద్ధకా”న్ని వర్ణించడానికి మన వద్ద చాలా పదాలుంటాయి. మన బద్ధకానికి మాత్రం చాలా ‘కారణాలు’ ఉంటాయి.
మూడ్ లేదు. కాస్త తీరిక దొరకాలి. ఇంకాస్త తెలుసుకుని మొదలుపెడతా. ఇప్పుడు సమయం బాగాలేదు.. ఇలా..
కొన్నిసార్లు ఇవి నిజమైన కారణాలే. కానీ రోజూ అదే మాట చెబుతున్నామంటే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి: నిజంగా చేయలేకపోతున్నామా? తప్పించుకుంటున్నామా?
పని వాయిదా వేయడానికి బద్ధకం ఒక్కటే కారణం కాదు. అలసట ఉండొచ్చు. పని చాలా పెద్దదిగా కనిపించొచ్చు. ఎక్కడ మొదలుపెట్టాలో తెలియకపోవచ్చు. “చేస్తే తప్పు అవుతుందేమో”, “బాగా చేయలేనేమో” అనే భయం కూడా ఉండొచ్చు. కొన్నిసార్లు బాగా చేయాలనే కోరికే మనల్ని ఆపేస్తుంది. మొదటి వాక్యమే గొప్పగా ఉండాలని రాయడమే మొదలుపెట్టం. అన్నీ అనుకూలంగా ఉంటేనే ప్రయత్నిద్దామనుకుంటాం.
కానీ రాస్తేనే కదా సరిదిద్దుకోగలం! ప్రయత్నిస్తేనే కదా నేర్చుకోగలం!
అందుకే “నేను బద్ధకస్తుణ్ని” అని తిట్టుకోవద్దు. ఈ పని ఎందుకు మొదలుపెట్టడం లేదని ఆలోచించండి. అలసిపోయి ఉంటే విశ్రాంతి తీసుకోండి. పని పెద్దగా ఉంటే చిన్న భాగాలుగా చేసుకోండి. భయంగా ఉంటే చిన్న ప్రయత్నంతో మొదలుపెట్టండి.
ఫోన్ చూస్తూ… పని మరిచిపోతూ

ఇప్పుడు పనిని వాయిదా వేయడానికి మన చేతిలోనే ఒక మార్గం ఉంది—ఫోన్.
ఒక్క మెసేజ్ చూద్దామని తెరుస్తాం. ఒక వీడియో వస్తుంది. తర్వాత మరోటి. మధ్యలో ఒక వార్త. దాని కింద కామెంట్లు. అలా ఒకదాని నుంచి ఇంకోదానికి వెళ్లిపోతాం. “ఐదు నిమిషాలే” అనుకున్నది గంట అవుతుంది. మనం ఫోన్‌తో యథావిధిగా బిజీ. చేయాల్సిన పని మాత్రం అక్కడే..
ఫోన్ వాడటం తప్పు కాదు. దానితో ఎన్నో పనులు చేస్తాం. కొత్త విషయాలు తెలుసుకుంటాం. మనవాళ్లతో మాట్లాడతాం. కానీ చేయాల్సిన పని గుర్తొచ్చినప్పుడల్లా ఓసారి ఫోన్ తీసుకుంటున్నామా అన్నది చూసుకోవాలి. పని మొదలుపెట్టకుండా ఫోన్ చూస్తే ఆ కాసేపు హాయిగా అనిపించొచ్చు. తర్వాత సమయం తగ్గిపోయిందని ఆందోళన మొదలవుతుంది. పని ఎలాగూ చేయాలి. పైగా ఇప్పుడు హడావుడిగా చేయాలి.
ముఖ్యమైన పని చేసేటప్పుడు ఫోన్‌ను కాస్త దూరంగా పెట్టి చూడండి. మొదలుపెట్టడం ఎంత సులభమవుతుందో మీకే తెలుస్తుంది.
పని చేయకపోయినా… దాని బరువు ఉంటుంది
వాయిదా వేసిన పని కొన్నిసార్లు మనసును ఏదోమూల కెలుకుతూనే ఉంటుంది.
“ఆ బిల్లు కట్టాలి.” “ఆ ఫోన్ చేయాలి.” “ఆ విషయం మాట్లాడాలి.”….
సినిమా చూస్తున్నా, భోజనం చేస్తున్నా, పడుకోబోతున్నా గుర్తొస్తుంది. పని చేయకుండా తప్పించుకున్నాం. కానీ దాని గురించి ఆలోచించడం నుంచి మాత్రం తప్పించుకోలేం.
కానీ, అదే పని పూర్తిచేస్తే ఎంత హాయిగా ఉంటుంది! రోజంతా ఆలోచించిన పని పది నిమిషాల్లో అయిపోతే, “దీనికే ఇంతసేపు వాయిదా వేశానా!” అనిపిస్తుంది. మనసు తేలికపడుతుంది. ఓస్.. ఇంతేనా.. హమ్మయ్య..
కొన్నిసార్లు పని చేయడం కంటే, చేయకుండా దాని గురించి ఆలోచించడమే ఎక్కువ అలసట తెస్తుంది.
పత్రికాఫీసులో “రేపు” ఉండదు
మూడు దశాబ్దాలకు పైగా పత్రికల్లో పనిచేసిన అనుభవంతో చెబుతున్నా—అక్కడ “రేపు” అంటే కుదరదు. రాత్రి కల్లా వార్త రావాలి. దాన్ని చదవాలి. తప్పులు సరిచూడాలి. శీర్షిక పెట్టాలి. పేజీ సిద్ధం చేయాలి. ముద్రణకు పంపాలి. ఒకరి పని పూర్తయితేనే మరొకరి పని ముందుకు వెళ్తుంది.
“కాసేపట్లో ఇస్తా” అని రిపోర్టరు ఆలస్యం చేస్తే, డెస్క్‌లో ఎదురుచూస్తుంటారు. చివరికి వార్త వచ్చినా తీరిగ్గా చదవడానికి వారికి సమయం ఉండదు. మంచి శీర్షిక ఆలోచించాలన్నా గడియారం తరుముతుంటుంది. అదే కొంచెం ముందే వస్తే ఎంత తేడా! సరిచూసుకోవచ్చు. మెరుగుపరచుకోవచ్చు. ప్రశాంతంగా పూర్తి చేయొచ్చు.
డెడ్‌లైన్ దగ్గరపడగానే మాత్రం మనలో ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. ఉదయం నుంచి మొదలుపెట్టని పని వేగంగా చేసేస్తాం. ఆ శక్తి అంతకుముందు లేదా? చాలాసార్లు ఉంది. కానీ, ఇక వాయిదా వేయలేమని తెలిసినప్పుడు మొదలుపెట్టాం. చివరి నిమిషంలో పని పూర్తి చేయగలగడం మంచిదే. కానీ ప్రతిసారీ ఆ చివరి నిమిషం కోసమే ఎదురుచూడటం ఎందుకు?
పత్రికా రంగం నాకు నేర్పిన మరో విషయం ఉంది. మన ఆలస్యం వల్ల ఇబ్బంది పడేది మనం ఒక్కరమే కాదు. మనతో పనిచేసేవాళ్లూ ఇబ్బంది పడతారు.
కొన్ని వాయిదాలు ఖరీదైనవి
అన్ని పనులూ ఒకేలా ఉండవు. కొన్ని ఆలస్యమైనా పెద్ద నష్టం ఉండదు. కొన్ని మాత్రం సమయానికి చేయకపోతే ఇబ్బంది పెరుగుతుంది.
ఉద్యోగంలో చిన్న సమస్యను “రేపు చూద్దాం” అని వదిలేస్తే అది పెద్ద సమస్య కావచ్చు. మన పని కోసం ఇంకొకరు ఎదురుచూస్తుంటే, మన మీదున్న నమ్మకమూ తగ్గొచ్చు.
ఆరోగ్యం విషయంలోనూ ఎప్పుడూ “తర్వాత చూద్దాం” అనుకోవద్దు. పదేపదే వచ్చే ఇబ్బందిని పట్టించుకోవాలి. అవసరమైన సలహా తీసుకోవడానికి సమయం కేటాయించాలి.
మనవాళ్లతో మాట్లాడటాన్నీ వాయిదా వేస్తుంటాం. పలకరించాలి అనుకుంటాం. క్షమాపణ చెప్పాలి అనుకుంటాం. కలిసి కూర్చుని మాట్లాడాలి అనుకుంటాం.
కానీ రోజులు గడిచిపోతాయి. తర్వాత ఆ మాట మొదలుపెట్టడం కూడా కష్టమవుతుంది. చిన్న ఫోన్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? “ఎలా ఉన్నావు?” అని అడగడానికి కూడా మంచి మూడ్ కావాలా?
పొదుపు మొదలుపెట్టడం, అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోవడం, కుటుంబ పనులు చూసుకోవడం కూడా “వచ్చే నెల” జాబితాలోనే ఉండిపోతాయి. వాటికోసం మనమే ఒక రోజు నిర్ణయించుకోవాలి. అన్నీ ఇప్పుడే చేయలేం. కానీ ఏది ముందు చేయాలో నిర్ణయించుకోవచ్చు. ఒక్కొక్కటిగా పూర్తి చేసుకోవచ్చు.
“ఈ వయసులో ఇంకేం చేస్తాం?”
ఈ మాట అనగానే మనమే మనకు ఒక హద్దు పెట్టుకుంటాం. కొత్తది నేర్చుకోవాలని ఉన్నా ఆపేస్తాం. ఒకప్పుడు ఇష్టంగా చేసిన పనిని మళ్లీ చేయాలనుకున్నా వెనకాడతాం.
వయసును వెనక్కి తిప్పలేం. కానీ మన రోజులో ఉత్సాహం పెంచుకోవడానికి ప్రయత్నించవచ్చు. మనకు నచ్చిన చిన్న పని చేయొచ్చు. కొత్త విషయం నేర్చుకోవచ్చు. పాత స్నేహితుడితో మాట్లాడొచ్చు. చిన్న పని పూర్తయినా “నేను చేయగలిగాను” అనే ఉత్సాహం వస్తుంది. అది మరో పని మొదలుపెట్టడానికి ధైర్యం ఇవ్వొచ్చు.
అయితే అందరికీ ఒకే శక్తి ఉండదు. ఆరోగ్యం, బాధ్యతలు, పరిస్థితులు వేర్వేరు. ఎవరితోనో పోల్చుకుని బాధపడాల్సిన అవసరం లేదు.
మన శక్తికి తగ్గట్టు మనం ముందుకు కదిలితే చాలు.
విశ్రాంతి కూడా అవసరమే

ఇంత చెప్పానని రోజంతా పని చేస్తూనే ఉండాలని కాదు. అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. నిద్రపోవాలి. కాసేపు ఏమీ చేయకుండా కూర్చోవచ్చు. నచ్చిన పాట వినొచ్చు. తీరిగ్గా టీ తాగొచ్చు. విశ్రాంతి తీసుకున్నందుకు మనల్ని మనం తిట్టుకోవాల్సిన అవసరం లేదు.
“ఇప్పుడే చేయ్” అంటే అలసటను పట్టించుకోకుండా పని చేయమని కాదు. చేయగలిగిన పనిని రోజూ కారణం లేకుండా వాయిదా వేయొద్దని. విశ్రాంతి తీసుకుని మళ్లీ పనికి వస్తున్నామా? లేక అదే పని నుంచి రోజూ తప్పించుకుంటున్నామా? ఈ తేడా మనకు తెలిసి ఉండాలి.
చిన్నగా మొదలుపెడదాం
బద్ధకాన్ని తగ్గించుకోవడానికి పెద్ద పెద్ద నిర్ణయాలు అవసరం లేదు. మనం చేయగల చిన్న మార్పులు చాలు.
రెండు నిమిషాల్లో అయిపోయే పని అయితే చేసేయండి. చిన్న మెసేజ్‌కు జవాబివ్వడం, తీసిన వస్తువును తిరిగి దాని స్థానంలో పెట్టడం లాంటివి వెంటనే చేయొచ్చు. అయితే ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు ప్రతి చిన్న పనికీ లేవాల్సిన అవసరం లేదు.
పెద్ద పనిని చిన్న భాగాలుగా చేసుకోండి. “ఇల్లంతా సర్దాలి” అనుకుంటే కష్టంగా ఉంటుంది. “ఇవాళ ఈ అల్మారా సర్దుదాం” అంటే మొదలుపెట్టడం సులభం.
మొదటి అడుగుపై దృష్టి పెట్టండి. కథనం మొత్తం రాయలేకపోతే మూడు వాక్యాలు రాయండి. పుస్తకం చదవడానికి ఒక పేజీతో మొదలుపెట్టండి. ఆ కొద్దిపాటి ప్రయత్నం కూడా ముందడుగే.
పని చేసే సమయం నిర్ణయించుకోండి. “సాయంత్రం చేస్తా” అనకుండా “సాయంత్రం ఆరింటికి చేస్తా” అనుకోండి. కావాల్సినవి ముందే సిద్ధం చేసుకోండి.
ఫోన్‌ను కాస్త దూరంగా పెట్టండి. పని మధ్యలో పదేపదే చూడాల్సిన అవసరం లేకపోతే నోటిఫికేషన్లు ఆపండి. కొద్దిసేపు పని చేసి చిన్న విరామం తీసుకోండి.
మూడ్ కోసం ఎదురుచూడొద్దు. చేయాలని లేకున్నా, చేయగల చిన్న పని ఎంచుకోండి. మొదలుపెట్టాక ఆసక్తి రావచ్చు.
చేసిన పనులనూ గుర్తించండి. ఇంకా ఎంత మిగిలిందో మాత్రమే చూడొద్దు. ఇవాళ ఏం పూర్తిచేశామో కూడా చూడండి. అది మనకు ఉత్సాహాన్నిస్తుంది. ఒక రోజు అనుకున్నట్టు జరగకపోతే ప్రయత్నాన్ని వదిలేయొద్దు. మళ్లీ మొదలుపెట్టండి.
జీవితాన్నీ వాయిదా వేస్తున్నామా?
“అనుకుంటే నేను ఏదైనా చేయగలను” అని మనం చెప్పుకుంటాం. అనుకోవడమే మొదటి అడుగు. చేసినప్పుడే మన మీద మనకు నమ్మకం పెరుగుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నప్పుడు, ఒక పని పూర్తి చేసినప్పుడు, చిన్న ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు మనకు మనమే ధైర్యం ఇచ్చుకుంటాం.
ఒక పని వాయిదా పడితే పెద్ద నష్టం లేకపోవచ్చు. కానీ నేర్చుకోవాలనుకున్నదాన్ని, చేయాలనుకున్నదాన్ని, మాట్లాడాలనుకున్న మనిషిని పదేపదే వాయిదా వేస్తూ పోతే? అప్పుడు పనులతో పాటు మనం కోరుకున్న జీవితమూ వాయిదా పడుతుంది.
అందుకే బద్ధకం ప్రమాదకరం. “రేపు” అనే చిన్న మాటతో మన సమయాన్ని కొద్దికొద్దిగా మింగేస్తుంటుంది.
ఇప్పుడు మీరెప్పటినుంచో వాయిదా వేస్తున్న ఒక పని గుర్తుచేసుకోండి. అన్నీ కాదు. ఒక్క పని.
అది పూర్తిచేయడానికి ఇప్పుడు సమయం లేకపోవచ్చు. కానీ మొదలుపెట్టడానికి ఐదు నిమిషాలు దొరుకుతాయేమో చూడండి.
ఒక ఫోన్ చేయండి. ఒక పేజీ చదవండి. ఒక వాక్యం రాయండి. ఒక చిన్న పని పూర్తిచేయండి.
ఆ చిన్న అడుగే మీ రోజును మార్చవచ్చు.
రేపటి పని ఇవాళే చేయ్.. ఇవాళ్టి పని ఇప్పుడే చేయ్..!








