అభిప్రాయాలు… ఆలోచనలు… అక్షరాలు…

సొంత మనుషులకే దూరమైన మేడారం

ఎడ్లబండ్ల నుంచి కార్ల దాకా.. చిన్ననాటి మేడారం జ్ఞాపకాలు. మట్టివాసన, జంపన్నవాగు స్నానాలు, చెట్ల కింద అడ్డాలు. ఇప్పుడు కొత్త ‘బండ’ల మధ్య ఎవరూ గుర్తుపట్టని జాతర. నిశ్శబ్దంగా జరుగుతున్న సాంస్కృతిక విధ్వంసం.

చెర్మాల శ్రీనివాస్26 జనవరి 2026 · సవరణ: 28 సెప్టెంబర్ 2026 · 1 నిమిషాలు
సొంత మనుషులకే దూరమైన మేడారం

మేడారం జాతర… వరంగల్ వాసినైన నాకు ఎంతో ఆత్మీయమైన పండుగ. చిన్నప్పుడు ఎడ్లబండ్లల్లో పోయిన రోజుల నుండి కార్ల దాకా.. అన్నీ గుర్తున్నాయి. అప్పుడంతా అక్కడ మట్టివాసనే. జంపన్నవాగులో ఉండీలేని నీళ్లలోనే స్నానాలు.. చెట్ల కింద అడ్డాలు..బంగారం దెబ్బలు. అయినా చాలా బాగుండేది. సంతోషంగా కూడా ఉండేది.

చుట్టూ దట్టమైన చెట్లు, గతుకుల మట్టి రోడ్లు. తండ్రి భుజాలకెత్తుకుంటే పిల్లోడు అంగీ కట్టెపుల్లకు కట్టి పైకెత్తి పట్టుకునెటోడు. వాళ్లోళ్లు ఎక్కడున్నా దూరంనుండే గుర్తుబట్టేందుకు ఆనవాలన్నమాట.

ముందు బిడ్డ గద్దెనెక్కితే, తెల్లారి తల్లి.. ఇగ పండుగ షురూ..

కార్లతోటే దుమ్ముకూడా వచ్చింది. ఎవడూ ఎవర్ని గుర్తుపట్టకుండా తయారయ్యేది సాయంత్రానికి. ఇప్పుడు జాతర కూడా అలాగే.. అచ్చం. ఎవరూ గుర్తుపట్టకుండా..

తెలియకుండానే ఒక సాంస్కృతిక విధ్వంసం నిశ్శబ్దంగా పురుడుపోసుకుంది. మేడారం సమ్మక్కను మెల్లగా తనవాళ్లకు దూరం చేసే ‘ఆపరేషన్’ అతిమామూలుగా, వాళ్లకు నొప్పి తెలియకుండా జరిగిపోతోంది. చుట్టూ కొత్త ‘బండ’లను చూస్తే ఎక్కడో కొత్త ప్రదేశాన్ని చూసినట్లనిపిస్తోంది. మనది కాదనిపిస్తోంది.

పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే జరిగే పరిణామాలు ఇలాగే ఉంటాయి. బహుశా ఈ వేదనే నూర శ్రీనివాస్ కవర్ స్టోరీగా మారినట్లుంది.

తర్వాత చదవండిసమాజంఏఐ డేటా సెంటర్లు : కనిపించని జీవన విధ్వంసం

ఈ కథనంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం. ఏదైనా తప్పు కనిపిస్తే contact@maromaata.comకు రాయండి — సరిచేస్తాను. సంపాదకీయ విధానం →

చెర్మాల శ్రీనివాస్

రచయిత

నా గురించి →

మరిన్ని కథనాలు

షేర్