అభిప్రాయాలు… ఆలోచనలు… అక్షరాలు…

దుస్తులకు, సంస్కృతికి సంబంధం లేదా?

మనిషి మాట్లాడకముందే తన గురించి మాట్లాడేది తన వస్త్రధారణ. ఆ తర్వాత మాటతీరు. ఆ తర్వాత నడవడిక. మంచి వస్త్రధారణ, మంచి మాటతీరు, మంచి నడవడిక — హుందాతనంతో కూడిన వ్యక్తిత్వానికి బాహ్య లక్షణాలు.

చెర్మాల శ్రీనివాస్10 సెప్టెంబర్ 2026 · సవరణ: 28 సెప్టెంబర్ 2026 · 3 నిమిషాలు
kriti sanon in GIVA Ad

వస్త్రేణ వపుషా వాచా విద్యయా వినయేన చ ।

వకారైః పంచభిర్యుక్తో నరో భవతి పూజితః ॥

వస్త్రం — సముచితమైన వస్త్రధారణ
వపుః — శరీర సౌష్ఠవం/శుభ్రమైన వ్యక్తిగత రూపం
వాక్ — మంచి మాటతీరు
విద్య — జ్ఞానం
వినయం — నమ్రత, సత్ప్రవర్తన
ఈ ఐదు ‘వ’లతో కూడిన మనిషి సమాజంలో గౌరవాన్ని పొందుతాడు అనేది శ్లోక భావం. సముచితమైన వస్త్రాలు ధరించడం, ఆరోగ్యవంతమైన శరీరం, మధురమైన హితవచనం, విద్య, వినయపూర్వకమైన ప్రవర్తన కలిగిన వ్యక్తి లోకంలో గౌరవాన్ని పొందుతాడని వివరిస్తోంది.
అన్నట్లు.. దీనికే ఒక భేద శ్లోకం కూడా ఉంది.
వస్త్రేణ వపుషా వాచా విద్యయా వినయేన చ ।
వకారైః పంచభిహీన: నరో నాయాతి గౌరవం
అంటే — ఈ ఐదు ‘వ’లు లేని వ్యక్తి గౌరవాన్ని పొందడూ అని…
అందులో మొదటి మాటే — వస్త్రేణ!
ఇప్పుడు రక్షాబంధన్ సందర్భంగా GIVA రూపొందించిన ప్రకటనలో కృతి సనన్ ధరించిన దుస్తులపై విమర్శలు వస్తే ఆమె ఇచ్చిన సమాధానం ఆశ్చర్యం కలిగించింది.
“పండుగ సారాంశం మనం వేసుకునే దుస్తుల్లో ఉండదు. ఆ సంప్రదాయానికి మనం ఇచ్చే భావంలో ఉంటుంది. ఒక మహిళ సంస్కృతిని గౌరవిస్తుందా లేదా అన్నది ఆమె necklineతో కొలవకూడదు” అన్నది ఆమె వాదన.
నిజమే…
ఒక మహిళ వ్యక్తిత్వాన్ని కేవలం ఆమె necklineతో కొలవకూడదు. ఆమెకు నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ ఆమెకు ఉంది. కానీ దుస్తులకు సంస్కృతితోనే సంబంధం లేదనడం ఎలా సమర్థనీయం?
అసలు వస్త్రధారణ అంటే ఏమిటి? మనిషి మాట్లాడకముందే తన గురించి మాట్లాడేది తన వస్త్రధారణ. ఆ తర్వాత మాటతీరు. ఆ తర్వాత నడవడిక. మంచి వస్త్రధారణ, మంచి మాటతీరు, మంచి నడవడిక — హుందాతనంతో కూడిన వ్యక్తిత్వానికి బాహ్య లక్షణాలు. దుస్తులంటే కేవలం శరీరాన్ని కప్పే వస్త్రాలు కావు. అది ఒక భాష.
అవి సందర్భాన్ని వివరిస్తాయి. మన అభిరుచిని చెబుతాయి. మన సామాజిక స్పృహను చెబుతాయి. మన సంస్కృతిని, సంప్రదాయాన్ని కూడా ప్రతిబింబిస్తాయి.
అందుకే ప్రతీ సందర్భానికి ఒక వస్త్రధారణ ఉంటుంది. పూజకు ఒకటి ఉంటుంది. అంత్యక్రియలకు మరో హుందాతనం ఉంటుంది. కార్యాలయానికి ఒక హుందాతనం ఉట్టిపడే డ్రెస్ ఉంటుంది. బీచ్​ మరోటి ఉంటుంది. స్విమ్మింగ్ పూల్​కు స్విమ్​సూట్ ఉంటుంది. కానీ, అవే దుస్తులతో బోర్డు మీటింగుకు వెళ్లి “నా డ్రెస్ నా స్వేచ్ఛ” అంటే అది సందర్భోచితం ఎలా అవుతుంది?.

సమస్య స్వేచ్ఛలో కాదు — సందర్భౌచిత్యంలో..

మరీ విచిత్రమేమిటంటే…
రక్షాబంధన్‌ను చూపించడానికి రాఖీ కావాలి. తిలకం కావాలి.పూలూ పళ్లెం కావాలి, పండుగ అలంకరణ కావాలి, ఆ సందర్భానికి తగిన ఆభరణాలు కావాలి.
ఇవన్నీ భారతీయ సంస్కృతికి ప్రతీకలవుతాయి గానీ, వస్త్రధారణ ఒక్కటే సంస్కృతికి ప్రతీక కాదా? అందులోనూ ఇది కృతి సనన్ తన ఇంట్లో వ్యక్తిగతంగా జరుపుకున్న రక్షాబంధన్ కాదు. ఒక వ్యాపార సంస్థ భారతీయ పండుగను వాడుకుని, భారతీయుల భావోద్వేగాలను ఉపయోగించుకొని, తన ఆభరణాలను అమ్ముకోవడానికి రూపొందించిన వాణిజ్య ప్రకటన.
మన రాఖీ కావాలి. మన పండుగ కావాలి. మన సంప్రదాయం కావాలి. మన భావోద్వేగాలు కావాలి. కానీ వస్త్రధారణ గురించి ప్రశ్నిస్తే మాత్రం —
“Culture is not in clothes!”
ఇదేం వాదన?
మహిళ ఏం చదవాలో, ఏ ఉద్యోగం చేయాలో, ఎవరిని పెళ్లి చేసుకోవాలో, ఎలా జీవించాలో నిర్ణయించుకునే సంపూర్ణ స్వేచ్ఛ ఆమెకు ఉండాలి. అలాగే తనకు నచ్చిన దుస్తులు ఎంచుకునే హక్కూ ఆమెదే.
కానీ…
వ్యక్తిగత స్వేచ్ఛ వేరు. సందర్భౌచిత్యం వేరు. సభ్యత వేరు. సాంస్కృతిక స్పృహ వేరు.
“నా దుస్తులు నా ఇష్టం” అనడం ఒక వ్యక్తి హక్కు. కానీ “నా దుస్తులకు ఎలాంటి సామాజిక ఔచిత్యం లేదు; అవి ఎలాంటి అభిప్రాయాలను కలిగించవు; సందర్భంతో వాటికి సంబంధమే లేదు” అన్నంత మాత్రాన వాస్తవం మారదు.
మనిషి తన దుస్తులను ఎంచుకుంటాడు కానీ, ఆ దుస్తులు ఎదుటివారిలో కలిగించే అభిప్రాయాన్ని ఎంచుకోలేడు.
అందుకే స్వేచ్ఛకు సామాజిక స్పృహ తోడవ్వాలి. ఆధునికతకు హుందాతనం తోడవ్వాలి. ఫ్యాషన్‌కు సమయం సందర్భం తోడవ్వాలి. ముఖ్యంగా మన పండుగలు, సంప్రదాయాలు, సంస్కృతికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఆ బాధ్యత మరింత ఎక్కువ.
సంస్కృతి మనసులో మాత్రమే ఉండేది కాదు… మన మాటలో వినిపిస్తుంది. మన నడవడికలో కనిపిస్తుంది. మన వస్త్రధారణలోనూ ప్రతిబింబిస్తుంది.
దాన్ని అంగీకరించడం మహిళా స్వేచ్ఛకు వ్యతిరేకం కాదు.
అది సందర్భానికి ఇచ్చే గౌరవం.
సభ్యతకు ఇచ్చే విలువ.
సంస్కృతికి ఇచ్చే మర్యాద.
తర్వాత చదవండిసమాజంఏఐ డేటా సెంటర్లు : కనిపించని జీవన విధ్వంసం

ఈ కథనంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం. ఏదైనా తప్పు కనిపిస్తే contact@maromaata.comకు రాయండి — సరిచేస్తాను. సంపాదకీయ విధానం →

చెర్మాల శ్రీనివాస్

రచయిత

నా గురించి →

మరిన్ని కథనాలు

షేర్