అభిప్రాయాలు… ఆలోచనలు… అక్షరాలు…

ఒక చిన్న ‘మేల్’కొలుపు

నటుడు శివాజీ భాష తప్పే. కానీ ఆ పదాల కారణంగా భావన మొత్తాన్ని కొట్టిపారేయడం న్యాయమా? వస్త్రధారణ ‘నా ఇష్టం’ మాత్రమేనా? భాష వేరు, భావన వేరు అని చెప్పే అసౌకర్యమైన నిజాలు.

చెర్మాల శ్రీనివాస్24 డిసెంబర్ 2025 · సవరణ: 28 సెప్టెంబర్ 2026 · 2 నిమిషాలు
ఒక చిన్న ‘మేల్’కొలుపు

గత కొన్ని రోజులుగా నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై రేగిన దుమారం కొత్తది కాదు. ఆడవారి వస్త్రధారణపై వాదనలు, ఆగ్రహాలు, ఆరోపణలు—ఇవన్నీ ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి.

ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి.
శివాజీ తన ప్రసంగంలో కొన్ని అసభ్య పదాలు వాడాడు.అది తప్పే. ఆ భాషను ఖండించాల్సిందే. సభ్య సమాజంలో అటువంటి నీచస్థాయి మాటలకు చోటు లేదు.

కానీ, ఆ తప్పుడు పదాల కారణంగా అతను చెప్పాలనుకున్న భావన మొత్తాన్ని దారుణంగా విమర్శించడం కూడా న్యాయం కాదు. భాష వేరు… భావన వేరు. ఈ రెండింటిని కలిపి కొట్టడం వల్ల, మనం అసలు చర్చించాల్సిన విషయాన్నే వదిలేస్తున్నాం. ముందుగా తమను తాము సెలబ్రిటీలుగా భావిస్తూ స్పందించిన “కొంతమంది”ని అసలు లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. వారికి ఆ మానసిక స్థాయి కూడా లేదు.

వస్త్రధారణ అనేది కేవలం “నా ఇష్టం” అనే వ్యక్తిగత ప్రకటన మాత్రమే కాదు. అది మానవ సమాజం తన అనుభవంతో, అవసరంతో, భద్రతతో ముడిపడి క్రమంగా ఏర్పరచుకున్న ఒక క్రమశిక్షణ. ఇది పురాణాల వల్లనో, శాస్త్రాల వల్లనో కాదు— మానవజాతిలో సహజంగా ఉండే ఫిజిక్స్, కెమిస్ట్రీల దుష్ప్రభావం నుండి సమాజం తనను తాను కాపాడుకోవడానికి ఏర్పరచుకున్న అవగాహన.

ఇక్కడ ఒక అసౌకర్యమైన నిజం ఉంది. మగవాడిలో కోరికలు సహజం. అవి అదుపులో ఉండటం సంస్కారం. అలాగే బయట కనిపించే రూపం ఆధారంగా అభిప్రాయాలు ఏర్పడతాయన్నది కూడా మనందరికీ తెలిసిన వాస్తవం. ఈ నిజాన్ని అంగీకరించకపోవడం వల్ల అది మారదు, కేవలం మౌనంగా పెరుగుతుందంతే.

ఈ మాటలు చెప్పడం అంటే ఆడవారిపై నింద వేయడం కాదు. వారి స్వేచ్ఛను హరించడం కాదు. వారిని తక్కువగా చూడడం కూడా కాదు. అలాగే ఇది ఒక హెచ్చరిక కూడా కాదు… ఒక ఆలోచన మాత్రమే.

ఈ ఇంటర్నెట్, ఇన్స్​స్టాల యుగంలో మన దేశం, సమాజం దానికి తగ్గట్టుగా ఉండాల్సిన క్రమశిక్షణను ఇంకా రూపొందించుకోలేదు. అందుకే ఆడామగా తేడా లేకుండా విచ్చలవిడితనం రాజ్యమేలుతోంది. అందువల్లే అన్ని చూపులూ పవిత్రంగా ఉండలేవు. అన్ని ఆలోచనలూ సంస్కారవంతంగా ఉండలేవు. ఈ వాస్తవాన్ని విస్మరించి, “ఇది నీ సమస్య కాదు” అని చెప్పడం వల్ల భద్రత పెరగదు—భ్రమ మాత్రమే పెరుగుతుంది.
ఇక్కడ “నేరం మాది కాదు – వారి ఆకలిది” అంటే కుదరదు. ఇద్దరూ నేరస్థులే. ఇద్దరూ శిక్షార్హులే.

ఒక మాట… స్వేచ్ఛ మహిళల హక్కు. ఎవ్వరూ దాన్ని ప్రశ్నించకూడదు. కానీ అదే సమయంలో, వారి గౌరవం, భద్రత, వారిపై ఏర్పడే అభిప్రాయాలు—ఇవన్నీ వారి జీవితానికే సంబంధించిన అంశాలు. వాటిని పూర్తిగా విస్మరించడం స్వేచ్ఛ కాదు… నిర్లక్ష్యం. స్వేచ్ఛ కూడా బాధ్యతాయుతంగా ఉండాలి. హక్కులు ఆలోచనాత్మకంగా ఉండాలి.
అదే నిజమైన శక్తి…

ఈ చర్చ మొత్తం తప్పుదారి పడుతున్నది ఇక్కడే. అసభ్య పదాలపై చర్చ జరగాల్సిన చోట, ఆలోచనల్ని కూడా నియంత్రించాలనుకోవడం తీవ్ర ఆక్షేపణీయం. మగవాడిని మాత్రమే విలన్‌గా చూపిస్తూ, సమాజంలోని సంక్లిష్టతను విస్మరించడం సరికాదు. ఇటువంటి దిక్కుతోచని స్థితిలో “వల్నరబుల్”గా మారుతోంది మహిళలు కాదు. మగాళ్లే.

మంచీ–చెడూ రెండూ ప్రతి చోటా ఉన్నాయి. ఇది ఒప్పుకోకుండా ముందుకు వెళ్లలేం.

కావాల్సింది ఆగ్రహం కాదు. వ్యక్తిగత దూషణలు కాదు. నిజాయితీగల చర్చ. స్వాతంత్ర్యం ప్రసాదించిన భావప్రకటనా స్వేచ్ఛకు నిర్వచనం, భావనల్లో కూడా సమాజం పట్ల నిజాయితీ, బాధ్యత ఉండాలని.

భాష తప్పు కావచ్చు.
కానీ భావనపై మాట్లాడే హక్కును కూడా చంపేస్తే, రేపు మన మౌనమే మనల్ని గాయపరుస్తుంది.

(అన్నట్లు శివాజీ తన అసభ్యపదాల వాడుకపై క్షమాపణ కోరుతూ, తన భావనకు మాత్రం కట్టుబడే ఉన్నట్లు ప్రకటించాడు. సంతోషం)


– గురుతుల్యులు, దివంగత అరుణ్​సాగర్​ సర్​ పుస్తకం పేరు వాడుకోగలిగినందుకు గర్వంగా ఉంది.

తర్వాత చదవండిసమాజంఏఐ డేటా సెంటర్లు : కనిపించని జీవన విధ్వంసం

ఈ కథనంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం. ఏదైనా తప్పు కనిపిస్తే contact@maromaata.comకు రాయండి — సరిచేస్తాను. సంపాదకీయ విధానం →

చెర్మాల శ్రీనివాస్

రచయిత

నా గురించి →

మరిన్ని కథనాలు

షేర్