అభిప్రాయాలు… ఆలోచనలు… అక్షరాలు…

తెలుగు సాహిత్యం: సీరియల్ కోసం ఆగిన సైకిల్

ఒకప్పుడు ‘తులసీదళం’ సీరియల్‌ కోసం రోడ్డు మీద సైకిళ్లు ఆగేవి. వారపత్రికలు, ఆదివారం అనుబంధాలు కథను ఇంటింటికీ మోసుకెళ్లాయి. ఆ దారులు మూసుకుపోతున్న వేళ, ఇప్పుడు తెలుగు సాహిత్యం ఎవరు చదువుతున్నారు?

చెర్మాల శ్రీనివాస్6 అక్టోబర్ 2026 · 8 నిమిషాలు
ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక కవర్‌, యండమూరి వీరేంద్రనాథ్‌ ‘తులసీదళం’ నవల కవర్‌

ఒకప్పటి ఆంధ్రభూమి వారపత్రిక, యండమూరి ‘తులసీదళం’

నాన్న ఒడిలో మొదలైన చదువు

నా చిన్నప్పుడు మా నాన్నగారు వరంగల్‌ ఆజంజాహీ బట్టల మిల్లులో జాబర్‌గా పనిచేసేవారు. మేం దగ్గర్లోని కాశిబుగ్గలో ఉండేవాళ్లం. చుట్టుపక్కలంతా మిల్లు కార్మికుల కుటుంబాలే.

నాన్నగారికి పొద్దటి డ్యూటీ ఉన్నప్పుడు రాత్రి ఆయన దగ్గరే పడుకునేవాడిని. పడుకునే ముందు నన్ను ఒళ్లో కూర్చోబెట్టుకుని శ్లోకాలు, మంత్రాలు, ప్రార్థనలు నేర్పించేవారు. అన్నం తినేముందు ఏది చదవాలి, తిన్న తర్వాత ఏది, పడుకునే ముందు ఏది—ఇలా చెప్పేవారు.

ఒళ్లో కూర్చోబెట్టుకుని కొడుకుకు పుస్తకం చదివి వినిపిస్తున్న తండ్రి
నాన్న ఒళ్లో మొదలైన తొలి పాఠాలు

నేర్పేటప్పుడు ఒళ్లో కూర్చోబెట్టుకునేవారు. అప్పజెప్పేటప్పుడు మాత్రం ఎదురుగా నిలబెట్టేవారు. సరిగ్గా వచ్చేంతవరకు వదిలేవారు కాదు. ఎక్కాలు కూడా అంతే. ఇరవయ్యో ఎక్కం దాకా నోటికి వచ్చేవి.

ఆయనకు దైవభక్తి ఎక్కువ. అందుకే మా ఇంట్లో రామాయణం, మహాభారతం, భగవద్గీత, భాగవతం, శివపురాణం, విష్ణుపురాణం వంటి పుస్తకాలు ఉండేవి. వాటిని చిన్నప్పటినుండే చదవడం మొదలుపెట్టాను. కథలుగా ఉండేవి కాబట్టి ఆసక్తిగా ఉండేవి. అలా చదవడం అలవాటైంది. ఏ రకం పుస్తకమైనా పరవాలేదు, తెలుగుదైతే చాలు. క్రమంగా అదో వ్యసనంగా మారిపోయింది.

పెద్దబాలశిక్ష: ఇంటింటి విజ్ఞాన సర్వస్వం

ఇక్కడ పెద్దబాలశిక్ష గురించి తప్పకుండా చెప్పాలి. పిల్లలకు తెలుగు నేర్పడంతో పాటు పెద్దలకూ ఎన్నో విషయాలు తెలిపిన పుస్తకం అది. అక్షరాలు, పదాలు, పద్యాలు, కథలు, లెక్కలు, సాధారణ విషయాలు—ఒకే పుస్తకంలో ఇన్ని ఉండేవి. తెలుగులో ఒక చిన్నపాటి విజ్ఞాన సర్వస్వంలా ఉపయోగపడేది. ఆఖరికి బల్లి పడితే ఏమవుతుందనే నమ్మకాల గురించిన వివరాలూ ఉండేవి. తెలియని విషయం కోసం పెద్దవాళ్లు కూడా ఆ పుస్తకం తిరగేసేవారు. పిల్లల చదువులో పెద్దబాలశిక్షకు అంత విలువ ఉండేది. దాన్ని ముందుపెట్టుకుని పలక మీద అక్షరాలు దిద్దినవారి రాత ముత్యాల్లా ఉంటుంది. చిన్నప్పుడే నేను పూర్తిగా చదివిన పుస్తకమది. ప్రతి తెలుగు ఇంట్లో ఉండదగిన పుస్తకం అనిపిస్తుంది. పిల్లలతో కలిసి తెరిచి చదివితే ఇప్పటికీ ఎన్నో విషయాలు మాట్లాడుకోవచ్చు.

పది పైసల ప్రపంచం

క్లాస్‌ పుస్తకాలతో పాటు చందమామ, బాలమిత్ర చదివేవాడిని. కొంచెం పెరిగాక చిన్న జానపద కథల పుస్తకాలు అద్దెకు తెచ్చుకునేవాడిని. ఒక్కో పుస్తకానికి పది పైసలు కిరాయి. రాకుమారులు, రాకుమార్తెలు, మాంత్రికులు, దయ్యాలు, భూతాలు, అడవులు… అబ్బో, చదువుతుంటే ఎంత ఉత్కంఠో! తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆగకుండా చదివేవాడిని.

అక్కడి నుంచి డిటెక్టివ్‌ నవలలకు, తర్వాత పెద్ద నవలలకు వెళ్లాను. రకరకాల పుస్తకాలు చదివినా, నవలల విషయానికొస్తే యండమూరికి వీరాభిమానిని. మల్లాది ఆహ్లాదకరమైన రచనలు, కొమ్మూరి సాంబశివరావు గారి అపరాధ పరిశోధన పుస్తకాలు కూడా చాలా ఇష్టం. అన్నింటికంటే ఎక్కువగా ఇష్టపడే పుస్తకం మాత్రం భగవద్గీతే. మా ఇంట్లో మొదలైన ఆ అనుబంధం ఇప్పటికీ వీడలేదు. మనసు బాగాలేకపోతే భగవద్గీత చదువుకుంటాను. సాంత్వన దొరుకుతుంది.

ఈనాడులో ఉద్యోగం వచ్చిన తర్వాత పదవినోదం అలవాటైంది. అప్పట్లో ఆదివారం అనుబంధం మా ఆఫీసుకు రెండు రోజుల ముందే వచ్చేది. నైట్‌ డ్యూటీ అయిపోయాక కిందికి వెళ్లి, ప్యాకింగ్‌లో ఒక కాపీ తీసుకుని వచ్చేవాడిని. తీరిగ్గా కూర్చుని పదవినోదం నింపేవాడిని. ఇప్పటికీ ఆదివారం నా మొదటి పని అదే.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, నాకు చదివే అలవాటు ఒక్కరోజులో రాలేదు. మొదట నాన్న నేర్పించారు. తర్వాత ఇంట్లో పుస్తకాలు దొరికాయి. పిల్లల పత్రికలు వచ్చాయి. అద్దె పుస్తకాలు దొరికాయి. అలా ఒక్కొక్కటీ చదువుతూ ముందుకు వెళ్లాను.

ఇంటింటికీ తిరిగిన వారపత్రిక

అప్పట్లో చాలామందిని పాఠకులుగా మార్చింది వారపత్రికలే.

ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ఆంధ్రపత్రిక, తర్వాత స్వాతి—ఈ పత్రికలు ఇంటింటికీ వచ్చేవి. ఒకే పత్రికను అమ్మ, అక్క, నాన్న, పిల్లలు అందరూ వంతులవారీగా చదివేవాళ్లు. తర్వాత పక్కింటివాళ్లు అడిగి తీసుకెళ్లేవాళ్లు.

ఇంటాయన ఆఫీసుకు, పిల్లలు బడికి వెళ్లిపోయాక ఆడవాళ్లు ఇంటి పనులు ముగించుకుని తీరిగ్గా వీక్లీ పట్టుకునేవారు. సీరియళ్లు ఎంత శ్రద్ధగా చదివేవారో! ఎన్ని సీరియళ్లు ఉన్నా అన్నీ విడివిడిగా గుర్తుపెట్టుకునేవారు. ఏ కథలో ఎవరు ఉన్నారో, గతవారం ఏం జరిగిందో, ఎక్కడ ఆగిందో అన్నీ గుర్తుండేవి. చివర్లో ‘సశేషం’ కనిపిస్తే, వచ్చేవారం కోసం ఎదురుచూపు మొదలయ్యేది. పైగా ఇరుగుపొరుగు మాట్లాడుకుని తలా ఒక వీక్లీ కొనేవారు. తర్వాత ఆ పత్రికలన్నీ అన్ని ఇళ్లకూ వెళ్లేవి. ఎవరు ఏది కొనాలో ముందే అనుకునేవారు. తక్కువ ఖర్చుతో అందరికీ అన్ని పత్రికలూ చదివే అవకాశం ఉండేది.

ఇంటి గడప దగ్గర కూర్చుని వారపత్రిక చదువుతున్న గృహిణి
ఇంటి పనులు ముగిశాక, చేతిలో వీక్లీ

పత్రిక తిరిగి ఇచ్చేటప్పుడు కథ గురించి మాట్లాడుకునేవారు. “ఈ వారం చదివావా?”, “ఆమె అలా చేస్తుందనుకోలేదు!”, “వచ్చేవారం ఏం జరుగుతుందో?” అంటూ కబుర్లు సాగేవి. కథలోని మనుషుల గురించి తెలిసినవాళ్ల గురించి మాట్లాడినట్టే మాట్లాడుకునేవారు. వాళ్ల కష్టాలకు బాధపడేవారు. వాళ్లు తప్పు చేస్తే కోప్పడేవారు. ఆ మాటల్లో తమ జీవితాల సంగతులూ వచ్చేవి. ముఖ్యంగా ఇంట్లో ఉండే చదువుకున్న మహిళలకు వారపత్రిక మంచి తోడుగా ఉండేది. ఇంటి పనుల మధ్య తమకంటూ కొంత సమయం దొరికేది. కథలు చదివి బయటి ప్రపంచం గురించి తెలుసుకునేవారు. తమలాంటి వాళ్లు ఇంకెక్కడో ఉన్నారని అనుకునేవారు. ఒక్క పత్రికను ఎంతమంది చదివేవారో అమ్మకాల లెక్కల్లో తెలిసేది కాదు.

తులసీదళం కోసం ఆగిన సైకిల్

నా చిన్నప్పుడు యండమూరి రాసిన ‘తులసీదళం’ ఆంధ్రభూమి వారపత్రికలో వచ్చేది. ఎంత పెద్ద సంచలనమంటే, బస్టాపులో ఎవరి చంకలోనైనా భూమి బుక్‌ కనిపిస్తే సైకిల్‌ మీద వెళ్తున్నవారు కూడా ఆగిపోయేవారు.

సార్‌… ఒకసారి ‘భూమి’ ఇస్తారా? ఈ వారం ‘తులసీదళం’ చదివి ఇచ్చేస్తాను.

అని అడిగి, అక్కడే చదివి ఇచ్చేసేవారు. ఇద్దరికీ పరిచయం లేదు. కానీ అతని దగ్గర చదవాలనుకున్న కథ ఉంది. అప్పట్లో కథలన్నా, నవలలన్నా అంత ఇష్టం ఉండేది.

నవలలు చదవడం తెలుగు ఇళ్లలో ఒక ట్రెండ్‌గా ఉండేది. యువతులు తమ గదుల్లో అర్థరాత్రి దాకా నవలలు చదివేవారు. అమ్మగానీ నాన్నగానీ వస్తే నవలను పక్కన పడేసి క్లాస్‌ పుస్తకం తీసుకునేవారు. వాళ్లు వెళ్లిపోయాక మళ్లీ నవల తెరిచేవారు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోకుండా పుస్తకం మూయలేకపోయేవారు.

హీరోలను మించిన రచయితలు

రచయితలకూ, రచయిత్రులకూ సినిమా హీరోహీరోయిన్లకున్నంత ఫాలోయింగ్‌ ఉండేది. నా జ్ఞాపకాల్లో యండమూరికి చిరంజీవికున్నంత అభిమానగణం కనిపిస్తుంది. నవలా ప్రపంచానికి ఆయనే మెగాస్టార్‌. రచయితలను ప్రేమించి, ప్రేమలేఖలు రాసిన అమ్మాయిలూ ఎందరో. వాళ్లను చూడకపోయినా, వాళ్లు రాసిన పుస్తకాలు చదివి అంతగా అభిమానించేవారు.

యద్దనపూడి, యండమూరి, మల్లాది, సూర్యదేవర, మధుబాబు లాంటి పేర్లు ఇంట్లో అందరికీ తెలిసేవి. వాళ్ల సీరియళ్లు తర్వాత నవలలుగా వచ్చాయి. కొన్ని సినిమాలుగా మారాయి. అప్పటికే ఆ కథలను చదివి ఇష్టపడినవాళ్లు ఎంతోమంది ఉండేవారు.

మనసును తడిమిన నవలలు

అదే సమయంలో జీవితాన్ని లోతుగా చూపించిన నవలలూ పాఠకులను ఆకట్టుకున్నాయి. చలం ‘మైదానం’, వడ్డెర చండీదాస్‌ ‘అనుక్షణికం’, బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’, గోపీచంద్‌ ‘అసమర్థుని జీవయాత్ర’, నవీన్‌ ‘అంపశయ్య’ వంటి రచనలు తెలుగు సాహిత్యంలో నిలిచిపోయాయి.

ఈ పుస్తకాలు చదివాక మనసులో ఎన్నో ప్రశ్నలు మిగిలేవి. మనిషి ఎందుకు ఇలా ప్రవర్తిస్తాడు? తనకు కావాల్సిన జీవితాన్ని ఎందుకు గడపలేకపోతాడు? కుటుంబం, సమాజం అతని నిర్ణయాలను ఎంతవరకు ప్రభావితం చేస్తాయి? పాత్రల గురించి ఆలోచిస్తూ మన జీవితాన్ని కూడా చూసుకునేవాళ్లం. చాలామంది జీవితాల్లో పుస్తకాలు గొప్ప ప్రభావం చూపించాయి, ఇప్పటికీ చూపిస్తున్నాయి. నిజానికి పుస్తకాన్ని మించిన స్నేహితుడు లేడు. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మనిషికి సాంత్వన కలిగించేది తనకు నచ్చిన పుస్తకమే.

ఒక్కో వయసులో ఒక్కో పుస్తకం మరింత దగ్గరగా అనిపించేది. మళ్లీ చదివితే అంతకుముందు గమనించని విషయం కనిపించేది. అందుకే చదవడం పూర్తయినా ఆ పుస్తకాలతో అనుబంధం ముగిసేది కాదు. వాటి గురించి మాట్లాడుకునేవాళ్లు ఉండేవారు. “ఇది తప్పకుండా చదువు” అని మరొకరి చేతిలో పెట్టేవాళ్లు ఉండేవారు.

కొత్త రచయితలకూ వారపత్రికలే అవకాశం ఇచ్చేవి. కథల పోటీలు పెట్టేవి. కథ అచ్చయితే రచయితకు ఎంత సంతోషమో! పాఠకులు ఉత్తరాలు రాసేవారు. నచ్చిందని చెప్పేవారు. నచ్చకపోతే అదీ చెప్పేవారు. ఆ స్పందనతో రచయిత మరో కథ రాసేవాడు. యండమూరి, మల్లాది వంటి వారికి ఇప్పటికీ ఉన్న పేరుప్రఖ్యాతుల వెనుక వారపత్రికల పాత్ర చాలా పెద్దది.

మరి ఇప్పుడు ఎవరు చదువుతున్నారు?

చదివే ఆసక్తి తగ్గిపోయిందా? ఈ తరం పిల్లలు ఇంగ్లీషు పుస్తకాలు చదివినంతగా తెలుగు పుస్తకాలు చదవడం లేదా? నా చుట్టూ చూస్తే అలా అనిపిస్తోంది. అయితే అందరూ చదవడం లేదని చెప్పలేం.

హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో జరిగే పుస్తక ప్రదర్శనకు వచ్చే జనాన్ని చూస్తే సంతోషమేస్తుంది. తెలుగు పుస్తకాలూ బాగానే అమ్ముడవుతున్నాయని ప్రచురణకర్తలు చెబుతున్నారు. ఇతర భాషల మంచి పుస్తకాలు ఇప్పుడు తెలుగులోనూ దొరుకుతున్నాయి. ఆధ్యాత్మిక పుస్తకాలు, విజ్ఞాన పుస్తకాలు, ఆత్మకథలు, వామపక్ష, ఉదారవాద రచనలు చదివేవాళ్లూ ఉన్నారు.

హైదరాబాద్‌ 37వ జాతీయ పుస్తక ప్రదర్శనలో పుస్తకాల స్టాళ్ల మధ్య పాఠకుల రద్దీ
హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శనలో పాఠకుల సందడి

ఇది మంచి విషయమే. కానీ పుస్తక ప్రదర్శనకు వెళ్లని వాళ్ల సంగతి ఏమిటి?

ఒకప్పుడు పుస్తకం కొనని ఇంట్లో కూడా కథ చదివేవాళ్లు ఉండేవారు. వారపత్రిక ద్వారా కథలు, సీరియళ్లతో పాటు ఆరోగ్యం, వంటింటి ముచ్చట్లు, రాజకీయాలు వచ్చేవి. దినపత్రిక ఆదివారం అనుబంధంలో కూడా నచ్చే విషయాలే ఉండేవి. వార్తల కోసం పత్రిక కొన్న మనిషి కూడా కథ చదివేవాడు. నచ్చితే ఆ రచయిత మరో కథ కోసం ఎదురుచూసేవాడు. అలా చదివే అలవాటు పెరిగేది. రాయడమూ అలవాటయ్యేది.

తెలుగుకు వారధి దినపత్రిక

వారపత్రికలు తగ్గిపోయిన బాధ ఒకవైపు ఉంటే, దినపత్రికల పరిస్థితి మరోవైపు కలవరపెడుతోంది. తెలుగు భాషకు దినపత్రికలు వారధులుగా నిలిచాయి. రోజూ ఉదయం ఇంటికి వచ్చి, మనతో తెలుగు చదివించాయి. పుస్తకం చదివే అలవాటు లేనివాడు కూడా పత్రిక చదివేవాడు. వార్తలతో పాటు కొత్త మాటలు తెలుసుకునేవాడు. వాటిని తన మాటల్లో వాడేవాడు.

ఒకప్పుడు ఉదయం లేవగానే పత్రిక కోసం చూసేవాళ్లు. రాకపోతే ఇంట్లోకీ బయటికీ తిరుగుతూ ఉండేవారు. ఇంట్లో ఒకరు చదివాక మరొకరు తీసుకునేవాళ్లు. టీ బంకుల్లో, పనికి వెళ్లేముందు—ఎక్కడో ఒకచోట పత్రిక తెరిచి చదివే మనుషులు కనిపించేవారు. ఇక బస్సులు, రైళ్ల గురించి అందరికీ తెలుసు. తలా ఓ పేజీ చింపుకుని మరీ చదివేవారు. కొన్నవాడికి ఆఖరికి ఓ ముక్క కూడా మిగిలేది కాదు. అలా దినపత్రిక మన రోజులో భాగమైంది. ఆదివారం అనుబంధం వస్తే కథలు, కవితలు, సాహిత్య పరిచయాలు దొరికేవి. కొత్త రచయిత పేరు తెలిసేది.

మూసుకుపోతున్న దారులు

ఇప్పుడు వార్త ఫోనులో వెంటనే కనిపిస్తోంది. అందుకు అనుగుణంగా మన అలవాట్లూ మారుతున్నాయి. కానీ వార్త తెలుసుకోవడంతోపాటు, కాసేపు కూర్చుని తెలుగు చదివే అలవాటు కూడా కొనసాగుతోందా? ఇంటికి పత్రిక రావడం ఆగిపోతే, ఆ ఇంట్లో రోజూ తెలుగు చదివే సందర్భమూ పోతుందేమో. పత్రికల్లో సాహిత్యానికి చోటు తగ్గినప్పుడల్లా ఒక కథో, కవితో పాఠకుడి ఇంటికి చేరే అవకాశం పోతుంది. ఒక కొత్త రచయిత పరిచయం ఆగిపోతుంది. నాకు కలిగే దిగులు అదే.

కథలను ఇంటికి తీసుకొచ్చిన దారులు ఒక్కొక్కటిగా మూసుకుపోతున్నాయి. దారులన్నీ మూసేసి, ఇప్పుడు పాఠకుడు ఎక్కడని వెతుకుతున్నాం.

ఇప్పుడు పుస్తకం గురించి పాఠకుడే తెలుసుకోవాలి. ఎక్కడ దొరుకుతుందో వెతకాలి. కొనాలి. ఇప్పటికే చదివే అలవాటు ఉన్నవాడు ఆ పని చేస్తాడు. ఇక అలవాటు లేనివాడికి పుస్తకాన్ని ఎవరు పరిచయం చేయాలి? కాగితపు పుస్తకాలు కాకపోయినా, ఈ తరం వారికి కిండిల్, పీడీఎఫ్ పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఎంతమంది తెలుగు పుస్తకాలు చదువుతున్నారు?

పిల్లల చేతికి తెలుగు పుస్తకం

పిల్లలు తెలుగు చదవడం లేదని బాధపడేముందు, వాళ్లకు తెలుగు పుస్తకాలు అందిస్తున్నామా అని చూసుకోవాలి. ఇంట్లో పుస్తకాలు ఉన్నాయా? పెద్దవాళ్లు చదువుతున్నారా? చదివిన కథ గురించి పిల్లలతో మాట్లాడుతున్నారా?

బల్ల మీద పేర్చిన పంచతంత్రం, భాగవతం వంటి తెలుగు పుస్తకాలు
పంచతంత్రం నుంచి భాగవతం దాకా, తెలుగు పుస్తకాలు

తెలుగు మాట్లాడటం తగ్గిపోవడం కూడా బాధ కలిగిస్తోంది. ఇంట్లో, బడిలో, స్నేహితులతో మాట్లాడేటప్పుడు తెలుగు తగ్గితే, తెలుగు పుస్తకం చదవడం మరింత కష్టంగా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి వింటూ, మాట్లాడుతూ ఉన్న భాషలో పుస్తకం చదవడం సులభం. పుస్తకాలు చదివితే కొత్త మాటలు తెలుస్తాయి. వాటిని మనం మాట్లాడేటప్పుడూ వాడతాం.

అందుకే ఇంట్లో తెలుగు మాట్లాడాలి. పిల్లలకు తెలుగు కథల పుస్తకాలు ఇవ్వాలి. వాళ్లతో కలిసి చదవాలి. పత్రికలు మళ్లీ కథలకు చోటివ్వాలి. ఫోన్లలోనూ మంచి తెలుగు రచనలు సులభంగా దొరకాలి. ఒకప్పుడు మనకు ఎవరో అందించిన మంచి పుస్తకాన్ని, ఈ రోజు మనం ఏదో రూపంలో ఇంకొకరికి అందించాలి.

అమెరికా నుంచి పదవినోదం

మా నాన్నగారు నాకు నేర్పిన మాటలు, ఇంట్లో ఉన్న పుస్తకాలు, పది పైసలకు తెచ్చుకున్న కథలు నన్ను పాఠకుడిని చేశాయి. ఈ తరం పిల్లలకు కూడా అలాంటి అవకాశాలు కల్పించాలి. ఈ విషయంలో నాకు తృప్తి ఉంది. నా పిల్లలిద్దరూ పెద్ద చదువులు చదువుకున్నా, తెలుగు పట్ల మమకారం ఉంది. వారూ చిన్నప్పుడు ఇంట్లో ఉన్న చాలా తెలుగు పుస్తకాలు చదివారు. మీడియం ఇంగ్లీషే అయినా, అనర్గళంగా తెలుగు మాట్లాడతారు, చదువుతారు, రాస్తారు. అమెరికాలో ఉన్న మా అబ్బాయికి ఆదివారం పదవినోదం ఫోటో తీసి వాట్సప్ చేస్తే, నేనిక్కడ, తనక్కడ నింపుతుంటాం. నాకు తట్టనివి కూడా అప్పుడప్పుడు చెబుతాడు.

ఒకప్పుడు ఒక తెలుగు కథ కోసం రోడ్డుమీద సైకిల్‌ ఆగింది.

మళ్లీ అంత ఇష్టంగా చదివే పాఠకుడు రావాలంటే, అతనికి మళ్లీ కథ అందాలి.

తర్వాత చదవండిsymbloic alphabets of telugu languageసమాజంతెలుగు మాట్లాడటమే అవమానమా?

ఈ కథనంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం. ఏదైనా తప్పు కనిపిస్తే contact@maromaata.comకు రాయండి — సరిచేస్తాను. సంపాదకీయ విధానం →

చెర్మాల శ్రీనివాస్

రచయిత

నా గురించి →

మరిన్ని కథనాలు

షేర్