నీట్, జేఈఈ, యూపీఎస్‌సీ, ఎస్‌ఎస్‌సీ, రైల్వే, బ్యాంకింగ్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు—ప్రతి ఏడాది కోట్లాది మంది యువత భవిష్యత్తును నిర్ణయిస్తున్నాయి.
ఏళ్ల తరబడి చదివి, కుటుంబాల ఆశలను మోస్తూ పరీక్ష రాసిన అభ్యర్థికి “ప్రశ్నాపత్రం లీకైంది” అన్న వార్త పిడుగులా తాకుతుంది. పరీక్ష రద్దయితే తప్పు చేయని లక్షల మంది మళ్లీ సిద్ధం కావాలి. కొందరు విద్యా సంవత్సరం కోల్పోతారు. మరికొందరికి వయోపరిమితి లేదా ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.
అందుకే పేపర్ లీక్ అంటే ఒక ప్రశ్నాపత్రం బయటకు రావడం మాత్రమే కాదు. పరీక్షా వ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతినడం. డిజిటల్ ఇండియా అని జబ్బలు చరుచుకునే దేశం ఒక ప్రశ్నాపత్రాన్ని కాపాడుకోలేకపోతోందా?
ఈ ప్రశ్న సహజమే. కానీ మనకు సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం సమస్య కాదు. ఎన్‌క్రిప్షన్, బయోమెట్రిక్స్, సురక్షిత సర్వర్లు, డిజిటల్ సంతకాలు, ఫోరెన్సిక్ విశ్లేషణ—అన్నీ అందుబాటులో ఉన్నాయి.
అసలు సమస్య:
• ప్రశ్నలను ఎవరు రూపొందిస్తున్నారు?
• వాటిని ఎవరు చూడగలరు?
• పరీక్షను ఎవరు నిర్వహిస్తున్నారు?
• కాంట్రాక్టర్లను ఎవరు పర్యవేక్షిస్తున్నారు?
• తప్పు జరిగితే ఎవరు విచారిస్తున్నారు?
ఒక వ్యక్తి, ఒక విభాగం లేదా ఒక సంస్థ ఒంటరిగా మొత్తం పరీక్షను దెబ్బతీయగలిగితే, అది బలమైన వ్యవస్థ ఎలా అవుతుంది?
పరీక్షలన్నీ ఆన్‌లైన్ చేస్తే సరిపోతుందా?
పేపర్, ప్రింటింగ్, రవాణాలు లేకపోతే లీక్‌లు ఆగిపోతాయని అనిపించవచ్చు. కానీ కంప్యూటర్ ఆధారిత పరీక్షల్లోనూ బయట నుంచి కంప్యూటర్‌ను నియంత్రించడం, పరీక్షాకేంద్ర సిబ్బంది సహకారం, అభ్యర్థి స్థానంలో మరొకరు పరీక్ష రాయడం వంటి ఆరోపణలు వచ్చాయి. అంటే ఆన్‌లైన్ పరీక్ష ప్రమాదాన్ని తొలగించదు. కేవలం దాని స్థానాన్ని మాత్రమే మారుస్తుంది.
వాస్తవానికి పేపర్ పరీక్షలో ప్రింటింగ్, రవాణా, స్ట్రాంగ్‌రూమ్‌లు లీకేజికి హేతువులైతే, కంప్యూటర్ పరీక్షలో నెట్‌వర్క్, స్థానిక అడ్మినిస్ట్రేటర్, సాఫ్ట్‌వేర్, సర్వర్, కాంట్రాక్టర్, ఫలితాల డేటాబేస్‌లు ప్రమాదకరంగా మారతాయి.
కాబట్టి సమస్య “పేపర్ పరీక్షా? కంప్యూటర్ పరీక్షా?” అనేది కాదు. ఒకే వ్యక్తి లేదా సంస్థ పరీక్ష విశ్వసనీయతను దెబ్బతీయడాన్ని ఆపగలమా? లేదా అనేది…
ప్రశ్నాపత్రం ఎక్కువకాలం ‘బయట’ ఉండకూడదు
సంప్రదాయ పద్ధతిలో ప్రశ్నాపత్రం పరీక్షకు రోజుల లేదా వారాల ముందే ముద్రిత రూపంలో సిద్ధమవుతుంది. ప్రింటింగ్ ప్రెస్, ప్యాకింగ్, రవాణా, స్ట్రాంగ్‌రూమ్, పరీక్షా కేంద్రం—ఇలా అనేక దశలు దాటుకుంటూ నిర్ణీత తేదీని చేరుకుంటుంది. తాళాలు, సీలు, కెమెరాలు ఉన్నా ఫోన్‌తో ఫొటో తీయడానికి కొన్ని క్షణాలు చాలు. అందువల్ల ప్రశ్నాపత్రాన్ని ఎంత దృఢమైన గదిలో ఉంచామన్నదే కాదు; అది ఎంత ముందు నుంచి ‘అందుబాటు’లో ఉందన్నది ముఖ్యం.
అయితే అన్ని లీక్‌లు ప్రింటింగ్ తర్వాతే జరగవు. ప్రశ్నలు రూపొందించే దశలోనూ, వాటిని క్రోడీకరించే దశలోనూ అవినీతి జరగవచ్చు. ప్రస్తుత నీట్ లీక్ జరిగింది ఇక్కడే. అందుకే ఒక దశను మాత్రమే కాకుండా, ప్రశ్నలు రూపొందిన క్షణం నుంచి ఫలితం వచ్చే వరకు మొత్తం వ్యవస్థను అత్యంత సురక్షితంగా ఉంచాలి.
ఒకే పేపరా? వేర్వేరు పేపర్లా?
దేశవ్యాప్తంగా ఒకే ప్రశ్నాపత్రం ఇస్తే ఒక్క కాపీ బయటకు వచ్చినా మొత్తం పరీక్ష రద్దవుతుంది. తప్పు చేసింది కొద్దిమందే అయినా లక్షల మంది బలవుతారు. అయితే వేర్వేరు పేపర్లు ఇవ్వడం కూడా సముచితం కాదు. ఒకరికి సులభమైనవి, మరొకరికి కఠినమైనవి వచ్చాయనే అభ్యంతరం వస్తుంది. ఇది న్యాయపరమైన చిక్కులు తెచ్చే అవకాశం ఉంటుంది.
కాబట్టి ముందుగా విస్తృతమైన ప్రశ్నల నిధి నిర్మించాలి. ప్రతి ప్రశ్న కాఠిన్యం, స్పష్టత, నాణ్యత, భాషా సమానత్వాన్ని శాస్త్రీయంగా పరీక్షించాలి. పారదర్శకమైన నార్మలైజేషన్, స్వతంత్ర నిపుణుల ధ్రువీకరణ, చట్టబద్ధ ఆధారాలు ఏర్పడిన తర్వాతే వేర్వేరు ప్రశ్నాపత్రాల వైపు దృష్టి పెట్టొచ్చు.
దొంగే దొంగతనాన్ని విచారిస్తే..?
ఒకే సంస్థ ప్రశ్నలు రూపొందించి, కాంట్రాక్టర్లను ఎంపిక చేసి, పరీక్ష నిర్వహించి, ఫలితాలు ప్రకటించి, తప్పు జరిగితే విచారణ కూడా తానే చేయడం మంచిది కాదు. ఇదే ఇప్పటి ఎన్టీఏ దరిద్రం.
సక్రమమైన జాతీయ పరీక్షా విధానంలో కనీసం మూడు వేర్వేరు బాధ్యతలు ఉండాలి:
1. ప్రమాణాలు నిర్ణయించి మొత్తం వ్యవస్థను పర్యవేక్షించే స్వతంత్ర నియంత్రణ సంస్థ.
2. ప్రశ్నలను రూపొందించి, పరీక్షించి, ప్రశ్నల నిధిని నిర్వహించే ప్రత్యేక సంస్థ.
3. అభ్యర్థుల నమోదు, కేంద్రాలు, పరీక్ష నిర్వహణ, సమాధానాలను రికార్డు చేసే నిర్వహణ సంస్థ.
తప్పు జరిగితే విచారించే ఫోరెన్సిక్ బృందం పరీక్ష నిర్వహించిన సంస్థ కింద ఉండకూడదు.
చివరి 20 నిమిషాల్లో కేంద్రంలోనే ప్రింటింగ్ సాధ్యం కాదు
ప్రశ్రాపత్రాల ముద్రణ స్థానిక పరీక్షాకేంద్రంలోనే పరీక్షకు కొద్దసేపు ముందే ప్రింట్ చేయాలనే ఆలోచన కొంతమందికి వచ్చింది. కానీ, ఒక కేంద్రంలో 500 మంది అభ్యర్థులు, ఒక్కో ప్రశ్నాపత్రం 40 పేజీలు అనుకుంటే 20 వేల పేజీలు ముద్రించాలి. ఆ తర్వాత పేజీల క్రమం, పిన్నింగ్, భాషలవారీ విభజన, గదులవారీ ప్యాకింగ్ చేయాలి. ప్రింటర్ జామ్‌లు, విద్యుత్ అంతరాయం వంటి సమస్యలు అదనం. కాబట్టి సాధారణ పరీక్షా కేంద్రాల్లో చివరి క్షణంలో పూర్తి పేపర్ ముద్రించడం ఆచరణాత్మకం కాదు.
అత్యంత భద్రత, ప్రత్యామ్నాయ యంత్రాలు, ఇద్దరు అధికారుల పర్యవేక్షణ, నిరంతర వీడియో రికార్డింగ్ ఉన్న ప్రాంతీయ ముద్రణ కేంద్రాల్లో పరీక్షకు కొద్ది గంటల ముందు ముద్రించాలి. కేంద్రాలవారీగా ప్యాక్ చేసి, తెరిస్తే తెలిసిపోయేలా గుర్తులు కలిగిన కవర్లలో జీపీఎస్ వాహనాలలో పంపాలి.
అభ్యర్థి చేతిలో తన సమాధానాల ఆధారం ఉండాలి
అయితే, ఒక పని మాత్రం కేంద్రంలోనే జరగాలి. పరీక్ష ముగిసిన వెంటనే ఓఎంఆర్ షీట్‌ను అక్కడికక్కడే స్కాన్ చేసి వాల్యుయేట్ చేయాలి. కంప్యూటర్ పరీక్ష అయితే సమాధానాలు అప్పటికప్పుడే రికార్డవుతాయి కాబట్టి బాధలేదు.
ఆ సమాధానాలకు ఏదైనా మార్పు జరిగితే గుర్తించగల డిజిటల్ సీల్ను రూపొందించి అభ్యర్థికి రసీదు ఇవ్వాలి. 24 గంటల్లో తన సమాధానాలు సరిగ్గా నమోదయ్యాయో పోర్టల్‌లో చూసుకునే అవకాశం ఉండాలి.
రికార్డును ఎవరూ మార్చలేరని చెప్పడం కంటే, అసలు రికార్డు ఏమిటో అభ్యర్థికే ఇవ్వడం బలమైన రక్షణ.
తక్షణం తీసుకోవాల్సిన పది చర్యలు:
1. పరీక్షా కేంద్రాలను మళ్లీ తనిఖీ చేసి గుర్తింపు ఇవ్వాలి.
2. కోచింగ్ సంస్థలతో సంబంధమున్న కేంద్రాలను తొలగించాలి.
3. కేంద్రాలు, ఇన్విజిలేటర్లు, పరిశీలకులను రాండమ్గా కేటాయించాలి.
4. పరీక్ష ముగిసిన వెంటనే సమాధానాలను స్కాన్ లేదా డిజిటల్‌గా దిద్దాలి.
5. అభ్యర్థికి సమాధానాల డిజిటల్ రసీదు ఇవ్వాలి.
6. 24 గంటల్లో సమాధానాలు చూసుకునే పోర్టల్ ఏర్పాటు చేయాలి.
7. ప్రతి పరీక్ష తర్వాత ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలి.
8. అనుమానాస్పద మొబైల్, వై-ఫై, బ్లూటూత్ సంకేతాలను గుర్తించే పరికరాలను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలి.
9. కాంట్రాక్టర్ల పనితీరు, ఉల్లంఘనలు, నిషేధాలను పబ్లిక్ రిజిస్టర్‌లో ఉంచాలి.
10. ప్రతి ముఖ్య ఘటనపై స్వతంత్ర నివేదికను ప్రచురించాలి.
రాజీనామాతో సమస్య ముగుస్తుందా?
భారీ వైఫల్యం జరిగినప్పుడు మంత్రి లేదా ఉన్నతాధికారి రాజీనామా చేయాలని డిమాండ్ రావడం సహజం. అది రాజకీయ బాధ్యత మాత్రమే అవుతుంది. కానీ ఒక రాజీనామాతో ప్రశ్నల తయారీ, ముద్రణ, రవాణా, కేంద్రాల ఎంపిక, కాంట్రాక్టర్ పర్యవేక్షణ, ఫలితాల భద్రత మారిపోవు.
మంత్రి మారవచ్చు. అధికారి సస్పెండ్ కావచ్చు. పరీక్షను మళ్లీ నిర్వహించవచ్చు. కానీ అదే వ్యవస్థ కొనసాగితే మరో రూపంలో అదే సంక్షోభం తిరిగి వస్తుంది. అందువల్ల విద్యార్థులు అడగాల్సింది కేవలం రాజీనామా కాదు. ప్రభుత్వం చేయాల్సింది కేవలం అరెస్టులు కాదు. పార్లమెంట్‌లో జరగాల్సింది కేవలం పరస్పర ఆరోపణలు కాదు.
మళ్లీ మళ్లీ లీక్ జరగకుండా వ్యవస్థలో ఏ మార్పులు తీసుకొస్తున్నారన్నదే అసలు ప్రశ్న.
సరే.. ఇప్పుడు దాన్ని అరికట్టేందుకు ఓ బిల్లు తెచ్చారు, చట్టంగా మార్చారు.. బాగానే ఉంది. నీలేకని కమిటీ ఏర్పాటు చేసారు.. ఇదీ బాగానే ఉంది. కానీ, కమిటీ సిఫార్సులను విస్తృత ప్రజామోదం తర్వాత వెంటనే అమలు చేసే చిత్తశుద్ధి ప్రభుత్వానికుండాలి.ఎందుకంటే గత రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులను చెత్తబుట్టలో వేసింది ఈ ప్రభుత్వమే కదా.
అసలు పరీక్ష.. వ్యవస్థకే
భయంకరమైన కోచింగ్ మాఫియా బారి నుంచి పరీక్షను రక్షించే చిత్తశుద్ధి కూడా అవసరం. ఎందుకంటే, కోచింగ్ సెంటర్లు, భారీ ప్రైవేట్ కాలేజీలలో రాజకీయ నేతల యాజమాన్యంలో ఉన్నవే ఎక్కువ కాబట్టి.
ప్రశ్నలు ముందే కొందరికి అందితే, మరొకరి స్థానంలో ఇంకొకరు పరీక్ష రాస్తే, సమాధానాల రికార్డు తర్వాత మారితే—అక్కడ విఫలమైనది అభ్యర్థి కాదు. ఈ దేశపు వ్యవస్థ.
నిజానికి “లీక్ ఎప్పటికీ జరగదు” అని హామీ ఇచ్చే వ్యవస్థ అవసరం లేదు. లీక్ చేయడం అత్యంత కష్టంగా, చేసినా దాన్ని గుట్టుగా ఉంచడం దాదాపు అసాధ్యంగా, జరిగిన నష్టాన్ని ప్రాంతాలవారీగా పరిమితం చేయగలిగేలా, బాధ్యులను ఆధారాలతో గుర్తించగలిగేలా వ్యవస్థను తయారుచేయాలి.
ఈ దేశపు యువత ప్రభుత్వాన్ని ర్యాంక్ గ్యారెంటీనో లేక ఉద్యోగ గ్యారెంటీనో అడగడం లేదు. తాము కష్టపడి నిజాయితీగా రాసిన పరీక్ష తమకు సరైన ఫలితం ఇస్తుందనే నమ్మకాన్ని మాత్రమే అడుగుతోంది.









