అభిప్రాయాలు… ఆలోచనలు… అక్షరాలు…

జంతర్‌మంతర్‌కు కోట్లు.. ఝార్ఖండ్‌కు లక్షలే!

ఢిల్లీ విద్యార్థి ఉద్యమానికి ఇన్‌స్టాగ్రామ్‌లో 1.85 కోట్ల స్పందనలు; అదే పరీక్షల అక్రమాలపై పోరాడుతున్న ఝార్ఖండ్ విద్యార్థులకు 5.6 లక్షలే. ఇది సహజ స్పందనా, ప్రజాభిప్రాయ వక్రీకరణా? మెటా అల్గారిథమ్‌లు, రాజకీయ ప్రయోజనాలపై ఒక అనుమానం, ఒక డిమాండ్.

చెర్మాల శ్రీనివాస్14 ఆగస్ట్ 2026 · సవరణ: 28 సెప్టెంబర్ 2026 · 7 నిమిషాలు
జంతర్‌మంతర్ వద్ద విద్యార్థుల నిరసన — బొద్దింకల జంతర్‌మంతర్ అతిపెద్ద అంతర్జాతీయ కుట్ర
  • ఢిల్లీకి కోట్ల స్పందన.. ఝార్ఖండ్‌కు లక్షలే!
  • ఇది సహజ స్పందనా..? ప్రజాభిప్రాయ వక్రీకరణా..?
  • మెటా కుట్రలో దేశం బయటవారెవరు? లోపలివారెవరు?

ఈ రోజు NDTVలో చూసిన కొన్ని గణాంకాలు నాలో తీవ్రమైన అనుమానాలను రేకెత్తించాయి. ఇప్పటివరకు విడివిడిగా కనిపించిన సంఘటనలను ఒకదాని పక్కన మరొకటి పెట్టి చూస్తే.. ఇది కేవలం రెండు విద్యార్థి ఉద్యమాల మధ్య తేడాగా కనిపించడం లేదు. సోషల్ మీడియా అల్గారిథమ్‌ల ద్వారా భారతదేశంలో ప్రజాభిప్రాయాన్ని పథకం ప్రకారం మార్చే కుట్ర జరుగుతోందా..? అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఎన్డీటీవీ, Databricks అనే సంస్థ విశ్లేషణను ఉటంకిస్తూ చూపించిన ఇన్స్​టాగ్రామ్ గణాంకాలను ఒకసారి చూడండి.

ఢిల్లీ ఉద్యమం:
పోస్టులు — 5,239
ప్రత్యేకంగా పోస్టులు పెట్టిన ఖాతాలు — 3,100
ఒక్కో పోస్టుకు సగటు స్పందనలు — 3,547
మొత్తం స్పందనలు — 1.85 కోట్లకు పైగా

రాంచీ/ఝార్ఖండ్ ఉద్యమం:
పోస్టులు — 1,062
ప్రత్యేకంగా పోస్టులు పెట్టిన ఖాతాలు — 290
ఒక్కో పోస్టుకు సగటు స్పందనలు — 535
మొత్తం స్పందనలు — 5.6 లక్షలకు పైగా

1.85 కోట్లు ఎక్కడ..? 5.6 లక్షలు ఎక్కడ..?

ఇది కేవలం ప్రజల ఆసక్తిలో వచ్చిన తేడానేనా? లేక ఒక ఉద్యమానికి అసాధారణమైన వ్యాప్తి లభించి, మరో ఉద్యమం సోషల్ మీడియాలో అంతగా కనిపించకుండా పోయిందా?

అసలు కథ ఇక్కడే మొదలవుతోంది.

నీట్‌తో మొదలైన ఉద్యమం.. మంత్రి రాజీనామాతో ఎందుకు ముగిసింది?

నీట్ పేపర్ లీక్.. పరీక్షల నిర్వహణలో లోపాలు.. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం.. పరీక్షా వ్యవస్థలో జవాబుదారీతనం.. ఇవే కదా బొద్దింకల ఉద్యమానికి మూల కారణాలు? కానీ ఉద్యమం ముందుకు సాగుతున్న కొద్దీ అసలు సమస్య వెనక్కిపోయి.. “కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి” అనేదే ప్రధాన డిమాండ్‌గా మారింది. చివరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. వెంటనే ఉద్యమం విజయవంతమైందని ప్రకటించి, అదే రాత్రి మందు తాగుతూ, డ్యాన్సులు చేస్తూ పార్టీలు చేసుకున్నారు. ఎందుకని? ఏం సాధించారని..?


నీట్ సమస్యకు శాశ్వత పరిష్కారం వచ్చిందా? దేశంలో ఇక ప్రశ్నపత్రాలు లీక్ కావని చెప్పగల వ్యవస్థ ఏర్పడిందా? పరీక్షల నిర్వహణలో ఉన్న లోపాలు తొలగిపోయాయా? పేపర్ లీక్ జరిగితే ఎవరు బాధ్యత వహించాలో నిర్ణయించే పటిష్ఠమైన వ్యవస్థ వచ్చిందా? దేశవ్యాప్తంగా పరీక్షా సంస్కరణలు అమల్లోకి వచ్చాయా? లేదు.

ప్రభుత్వం హామీలు ఇవ్వడం వేరు. వ్యవస్థను మార్చి, ఫలితాలు చూపించడం వేరు. అందుకే ఇది నా సూటి ప్రశ్న:

పేపర్ లీక్‌పై మొదలైన పోరాటం.. పేపర్ లీక్‌కు శాశ్వత పరిష్కారం రాకుండానే ఒక మంత్రి రాజీనామాతో విజయవంతంగా ఎలా ముగిసింది?

ఇప్పుడు ఝార్ఖండ్‌ను చూద్దాం.
అక్కడ కూడా విద్యార్థులే. అక్కడ కూడా పోటీ పరీక్షలే. అక్కడ కూడా పరీక్షల నిర్వహణలో అక్రమాలు, ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణలే. JPSC, JSSC పరీక్షలపై అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. పరీక్షలు రద్దు చేయాలని కోరుతున్నారు. అక్రమాలపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తున్నారు. పరీక్షా వ్యవస్థను సరిచేయాలని కోరుతున్నారు. వేలాది మంది యువత రోడ్ల మీదకు వచ్చారు. పోలీసు చర్యలను ఎదుర్కొన్నారు. అయినా ఉద్యమం కొనసాగుతోంది.
అంటే..
ఢిల్లీలో విద్యార్థుల భవిష్యత్తు ఎంత ముఖ్యమో.. ఝార్ఖండ్ విద్యార్థుల భవిష్యత్తు కూడా అంతే ముఖ్యం కదా!
మరి ఢిల్లీలో వచ్చిన ఆ సోషల్ మీడియా ఉప్పెన ఝార్ఖండ్‌ను ఎందుకు ముంచెత్తలేదు? ఢిల్లీలో వేల పోస్టులు.. వేల మంది ప్రచారకులు.. కోట్లలో స్పందనలు.. రీళ్ల వరద..

ఇన్ఫ్లూయెన్సర్లు(ఇదొక విచిత్రమైన ప్రజాకంటక జాతి).. రాజకీయ నాయకులు.. దేశవ్యాప్త చర్చ.. ఇవన్నీ కనిపించాయి. ఝార్ఖండ్‌లో అదే స్థాయి స్పందన ఎందుకు లేదు..?

మరి బొద్దింకల పార్టీ ఎక్కడ? రాజు బొద్దింక అభిజిత్ దీప్కే ఝార్ఖండ్ విద్యార్థుల ఉద్యమానికి మద్దతు ప్రకటించాడు. ఆ పార్టీ(?) తరఫున కొందరు అక్కడికి వెళ్లినట్లు కూడా చెప్పాడు. కానీ ఎవరూ వెళ్లలేదు.. కారణం, నెల రోజుల కఠినాతి కఠిన ఉద్యమం వల్ల అందరికీ జ్వరాలు, రోగాలు వచ్చాయట. ఢిల్లీలో ఉద్యమానికి ముఖచిత్రంగా నిలిచి, దేశవ్యాప్తంగా బొద్దింకలను సమీకరించిన అభిజిత్ దీప్కే.. ఝార్ఖండ్‌లో అదే స్థాయిలో ప్రత్యక్షంగా ఎందుకు ముందుండలేదు..?
ఢిల్లీలో కనిపించిన ఉధృతి ఎక్కడ? ఆ స్థాయి జన సమీకరణ ఎక్కడ? ఆ కంటకజాతి ఎక్కడ? ఆ ఇన్స్టాగ్రామ్ ప్రచారాలెక్కడ?

ఇక్కడ మరో ఆసక్తికరమైన పరిణామం కూడా జరిగింది.
ఢిల్లీ ఉద్యమంలో ప్రముఖంగా కనిపించిన AISA అధ్యక్షురాలు నేహా బోరా ఝార్ఖండ్ ఉద్యమ వేదిక వద్దకు వెళ్లినప్పుడు అక్కడి విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఆ తర్వాత మరో ఘటనలో ఆమెపై ఇంక్ చల్లారు. ఇక్కడ ఇంక్ ఘటన కంటే ముందు జరిగిన పరిణామమే నాకు ముఖ్యం. ఆమెను తమ ఉద్యమ వేదిక వద్దకు రానివ్వడానికి అక్కడి విద్యార్థులు ఎందుకు నిరాకరించారు..? బయటి రాజకీయ, విద్యార్థి సంఘాలు తమ ఉద్యమాన్ని ఆక్రమించుకుంటాయనే అనుమానం వారిలో ఉందా? లేక ఢిల్లీ ఉద్యమ అనుభవంపై వారికి సందేహాలున్నాయా? తమ సమస్యను రాజకీయ లక్ష్యాలకు ఉపయోగించవద్దనే భావన ఉందా?

ఈ ప్రశ్నలకు సమాధానం కావాలా? వద్దా…?

మొదటి పోరాటం పూర్తికాకుండానే కొత్త యుద్ధం ఎందుకు?

నీట్, పేపర్ లీక్‌లు, పరీక్షా సంస్కరణలు.. ఇవన్నీ పూర్తిగా పరిష్కారం కాకముందే అభిజిత్ దీప్కే ఇప్పుడు “Public Kya Bolti Hai” అంటూ దేశవ్యాప్తంగా ప్రజల సమస్యలు తెలుసుకునే కార్యక్రమం మొదలుపెడుతున్నాడు. ప్రజల సమస్యలు తెలుసుకోవడం మంచిదే. దేశమంతా తిరగడమూ తప్పు కాదు.
కానీ..
ముందు మొదలుపెట్టిన పోరాటం ఏమైంది..?
పరీక్షా వ్యవస్థను మార్చేవరకు పోరాడతామన్న ఉద్యమం.. మంత్రి రాజీనామా చేయగానే ఎందుకు చల్లారిపోయింది? అదే సమయంలో ఝార్ఖండ్ విద్యార్థులు పరీక్షల అక్రమాలపై రోడ్ల మీద పోరాడుతుంటే.. కొత్త దేశవ్యాప్త కార్యక్రమం వైపు ఎందుకు మళ్లుతున్నారు? అందుకే మరో ప్రశ్న..

అసలు లక్ష్యం పరీక్షా వ్యవస్థలో సంస్కరణలా..? లేక ఒక నిర్దిష్ట రాజకీయ లక్ష్యాన్ని సాధించడమా..? ఈ ప్రశ్న అడగకూడదా?

ఇక కాంగ్రెస్ పాత్ర..
ఇక్కడే నా అనుమానం మరింత పెరుగుతోంది.

ఢిల్లీలో జరిగిన ఉద్యమం ప్రధానంగా ఎవరిని నిలదీసింది? బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని. చివరకు దాని ప్రత్యక్ష రాజకీయ ఫలితం ఏమిటి? కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా. ఆ ఉద్యమానికి కాంగ్రెస్ నాయకుల నుంచి కూడా రాజకీయ మద్దతు లభించింది.

మరి ఝార్ఖండ్‌లో అధికారంలో ఉన్నది ఎవరు? జేఎంఎం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం. అందులో కాంగ్రెస్ కూడా భాగస్వామి.

ఢిల్లీలో విద్యార్థుల కోసం రోడ్డెక్కిన రాహుల్ గాంధీ.. ఝార్ఖండ్ విద్యార్థుల దగ్గరకు ఎందుకు వెళ్లలేదు?

ఢిల్లీలో పోలీసు చర్య జరిగితే ప్రధాని నివాసం వైపు వెళ్లి ధర్నా చేశారు. అరెస్టయ్యారు. నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులను కలిశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని బహిరంగంగా డిమాండ్ చేశారు. మరి ఝార్ఖండ్‌లో వేలాది మంది విద్యార్థులు పరీక్షల అక్రమాలపై రోడ్లెక్కారు. లాఠీ దెబ్బలు తిన్నారు. బాష్పవాయు గోళాలు, జల ఫిరంగుల దెబ్బలూ తిన్నారు నిరాహార దీక్షలు చేస్తున్నారు.
మరి..వారి దగ్గరకు రాహుల్ గాంధీ ఎందుకు వెళ్లలేదు?

ఎందుకంటే — కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తనకు శత్రువు. ఝార్ఖండ్‌లో అధికారంలో ఉన్నది స్వయంగా తానే..

ఢిల్లీలో విద్యార్థుల కన్నీళ్లు జాతీయ సమస్య అయితే.. ఝార్ఖండ్ విద్యార్థుల రక్తం మాత్రం రాష్ట్ర సమస్యా..? ఈ ప్రశ్నలకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సమాధానం చెప్పాలి కదా…

ఎంపిక చేసుకున్న అంశంపైనే ఆగ్రహం.. ఎంపిక చేసుకున్న చోటే జన సమీకరణ.. ఎంపిక చేసుకున్న ఉద్యమానికే సోషల్ మీడియాలో అసాధారణ ప్రచారం.. చివరకు ఒక నిర్దిష్ట రాజకీయ పక్షానికి ప్రయోజనం.. మరి ఇవన్నీ ఒకే క్రమంలో కనిపిస్తున్నప్పుడు అనుమాన పడాలా.. వద్దా? అందుకే కాంగ్రెస్ పాత్రపైనా నాకు అనుమానం ఉంది.

కానీ బొద్దింకల ఉద్యమం, దానికి లభించిన రాజకీయ మద్దతు, సోషల్ మీడియా ప్రచారం, చివరకు వచ్చిన రాజకీయ ఫలితం, ఆ తర్వాత ఝార్ఖండ్ విషయంలో కనిపిస్తున్న భిన్న స్పందనలు..
వీటి మధ్య సంబంధం ఏమైనా ఉందా..? అనేది తేలాలి.

ఇప్పుడు అసలు పెద్ద ప్రశ్న — META.
ఎన్డీటీవీలో చూపించిన DataBricks గణాంకాల ప్రకారం.. ఢిల్లీకి 1.85 కోట్లకు పైగా స్పందనలు. ఝార్ఖండ్‌కు 5.6 లక్షలు.
ఎందుకు?
ఇన్స్​టాగ్రామ్ అల్గారిథమ్ రెండు ఉద్యమాల విషయంలోనూ ఒకే విధంగా పనిచేసిందా? ఢిల్లీ ఉద్యమానికి వచ్చిన ప్రచారం పూర్తిగా సహజమైందేనా? కొన్ని ప్రత్యేక ఇన్ఫ్లూయెన్సర్ ఖాతాలు ‘సమన్వయం’తో ప్రచారం చేశాయా? ఒకే తరహా సందేశాన్ని భారీ స్థాయిలో గ్లోరిఫై చేసే వ్యవస్థ ఏదైనా పనిచేసిందా?

Meta పాత్రపై నాకు తీవ్రమైన అనుమానం ఉంది. అందుకే దర్యాప్తు కావాలి.
Meta సాధారణ విదేశీ కంపెనీ కాదు. Facebook, Instagram, WhatsApp ద్వారా కోట్లాది భారతీయుల సమాచార ప్రపంచంలోకి ప్రవేశించిన సంస్థ. కేవలం పిచ్చ భారతీయుల వల్లే వేలాది కోట్ల డాలర్లను సంపాదిస్తున్న కంపెనీ. విదేశాల్లో తీవ్ర నిరసనను ఎదుర్కొంటున్న మీడియా మాడ్యూల్స్ ఓనర్. టీనేజర్లలను సోషల్​మీడియా వ్యసనానికి బానిసలను చేస్తుందనే ఆరోపణలు, సాక్ష్యాలతో బోనులో ఉన్న ముద్దాయి. మరిది మనకెందుకు?

ఒకప్పుడు ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి పత్రికలు కావాలి. తర్వాత టెలివిజన్ వచ్చింది. కానీ ఇప్పుడు.. ఒక ప్రణాళికబద్ధమైన అల్గారిథం చాలు.
ఏ వార్త ఎక్కువ మందికి కనిపించాలి..? ఏ రీల్ కోట్లాది మందికి చేరాలి..? ఏ ఉద్యమం దేశవ్యాప్తంగా పాపులర్ కావాలి..? ఏ అంశం ప్రజల దృష్టికి పెద్దగా రాకూడదు..? లాంటి వాటిని ప్రభావితం చేయగల శక్తి సోషల్ మీడియా అల్గారిథంలకు ఉంది. అందుకే ఇది కేవలం రెండు ఉద్యమాల మధ్య పోలిక కాదు.

ఇందువల్లే భారతదేశంలో ప్రజాభిప్రాయ వక్రీకరణకు సోషల్ మీడియాను ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నారా.. అనే తీవ్రమైన అనుమానం నాకు కలుగుతోంది.
విదేశీ టెక్నాలజీ సంస్థలు.. దేశీయ రాజకీయ ప్రయోజనాలు..రాజకీయ పార్టీలు, ఇన్ఫ్లూయెన్సర్ వ్యవస్థలు.. ఇంకొన్ని ఉద్యమ సంస్థలు.. వీటి మధ్య ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఏదైనా సంబంధం ఉందా? నాకైతే తెలియదు. అలాగని ఇంత అసాధారణమైన తేడాను చూసి ప్రశ్నించకుండా కూడా ఉండలేం కదా..

అందుకే భారత ప్రభుత్వం దర్యాప్తు చేయాలి. ఢిల్లీ కాక్రోచ్​ల ఉద్యమం, ఝార్ఖండ్ విద్యార్థుల ఉద్యమానికి సంబంధించిన ఇన్​స్టాగ్రామ్​ ప్రచారాన్ని సాంకేతికంగా పరిశీలించాలి.
సహజంగా ఎంతమందికి చేరింది? అల్గారిథంల ద్వారా ఎంతమందికి ‘రికమెండ్​’ అయింది? రీళ్లు ఎంతమందికి చూపించారు? ఏ ఖాతాల ద్వారా అత్యధికంగా వ్యాప్తి చెందింది? ఒకే సమయంలో సమన్వయంతో పోస్టులు చేసిన ఖాతాలు ఉన్నాయా? పెయిడ్​ ప్రమోషన్ల మాటేమిటి? ఏదైనా కంటెంట్​ను తగ్గించడంగానీ, అన్​పాపులర్​ చేసారా?

ఇటువంటి అనుమానాలున్నప్పుడు మనకీ మెటా మీడియాలెందుకు? సొంతంగా చైనాలా మనమే ఒక సమగ్రమైన సోషల్ మీడియాను తయారుచేసుకోలేమా? ఇదెలా ఉందంటే.. డబ్బులిచ్చి మరీ వినాశనాన్ని కోరి తెచ్చుకోవడమే(దీనికి తెలుగులో సమానార్థకమైన బూతు సామెత కూడా ఉంది..తెలుసు కదా).

ఒక విషయం మాత్రం స్పష్టం.
ఇది బీజేపీని సమర్థించే వాదన కాదు. నీట్ పేపర్ లీక్ జరిగితే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిందే. మంత్రి బాధ్యత ఉంటే నిలదీయాల్సిందే. విద్యార్థులకు అన్యాయం జరిగితే ప్రభుత్వం ఏ పార్టీదైనా పోరాడాల్సిందే.

కానీ.., అదే సూత్రం ఢిల్లీకి ఒకలా.. ఝార్ఖండ్‌కు మరోలా ఉంటే…
ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉంటే పరీక్షల అక్రమం దేశవ్యాప్త ఉద్యమమై.. ఝార్ఖండ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే మాత్రం అదే విద్యార్థుల సమస్యకు అతి తక్కువ స్పందన.. ఎందుకు అని అడగాల్సిందే.
ఈ రోజు బాధితురాలు బీజేపీ కావచ్చు. రేపు కాంగ్రెస్ కావచ్చు. ఎల్లుండి మరో పార్టీ కావచ్చు. ఇక్కడ ప్రశ్న పార్టీలది కాదు.

భారత ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయాన్ని నిర్ణయించేది భారత ప్రజలా..? లేక ప్రజలకు ఏది కనిపించాలో నిర్ణయించే సోషల్ మీడియా కంపెనీలా..?
ఎందుకంటే…
ఇది కాక్రోచ్​ల కథ మాత్రమే కాదు. ఇది విద్యార్థుల కథ మాత్రమే కాదు.. ఇది నీట్ కథ మాత్రమే కాదు. ఇది ఝార్ఖండ్ కథ మాత్రమే కాదు.
ఇది అంతకంటే పెద్ద ప్రశ్న.

భారతదేశంలో మనం ఏం ఆలోచించాలో నిర్ణయించుకుంటున్నది మనమేనా..? లేక సోషల్​ మీడియా అల్గారిథంలా..?

తర్వాత చదవండి'Election Commission of India' నేమ్‌ప్లేట్ ఉన్న పగిలిన టేబుల్, వెనక మూడు ఖాళీ కుర్చీలు, ఫైళ్లు, బ్యాలెట్ బాక్స్ (ప్రతీకాత్మక చిత్రం)అతిథి మాటసీఈసీ రగడ: వ్యవస్థ వైఫల్యమా? రాజకీయ రణరంగమా?

ఈ కథనంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం. ఏదైనా తప్పు కనిపిస్తే contact@maromaata.comకు రాయండి — సరిచేస్తాను. సంపాదకీయ విధానం →

చెర్మాల శ్రీనివాస్

రచయిత

నా గురించి →

మరిన్ని కథనాలు

షేర్