విజయవాడ నుంచి రాప్తాడు దాకా, ఇరవై రెండేళ్లుగా అదే రక్తం
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః ।
యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలాః క్రియాః ॥
ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు ఆనందంగా కొలువై ఉంటారు. ఎక్కడ అవమానించబడతారో, అక్కడ చేసే ఎంత గొప్ప కార్యమైనా నిష్ఫలమవుతుంది.
— మనుస్మృతి 3.56
మనుస్మృతిలోని ఈ శ్లోకాన్ని గర్వంగా వల్లెవేసే దేశం మనది. మరి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతోంది?
ఆడపిల్లలకు కనీసం బడిలో కూడా భద్రత లేదా? ఎవడు పడితే వాడు, ఎక్కడ పడితే అక్కడ, దేంతో పడితే దాంతో నరకడం, చంపడం. ఎక్కడున్నాం మనం? జనంలోనా? వనంలోనా? బరితెగించిన మృగాలు కత్తులు, రంపాలు పట్టుకుని తిరుగుతుంటే, అమ్మాయిలు బిక్కుబిక్కుమంటూ బతకాలా? పిల్ల ఇంటికి క్షేమంగా వస్తుందా రాదా అని తల్లిదండ్రులు రోజంతా వణుకుతూ ఉండాలా?
పట్టపగలు, బడిలో, రంపంతో
అక్టోబరు 31. అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. తరగతి గదిలో పాఠం జరుగుతోంది. 21 ఏళ్ల హేమంత్ లోపలికి వచ్చి, చెక్కలు కోసే యాంత్రిక రంపంతో పదో తరగతి విద్యార్థినిపై దాడి చేశాడని పోలీసులు తెలిపారు. అడ్డుపడిన మరో విద్యార్థిని కూడా గాయపడింది. ప్రేమ పేరుతో వేధించేవాడని కుటుంబం ఆరోపించింది. ఘటన తర్వాత పారిపోయిన నిందితుడి కోసం పోలీసులు పదికి పైగా బృందాలతో గాలించారు. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో పట్టుకునే సమయంలో తమపై తిరగబడ్డాడని, ఆరు రౌండ్లు కాల్పులు జరిపామని పోలీసులు చెబుతున్నారు. తీవ్ర గాయాలతో హేమంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

తీవ్రంగా గాయపడిన బాలికను గ్రీన్ ఛానెల్ ద్వారా ప్రత్యేక అంబులెన్స్‌లో బెంగళూరు మణిపాల్ ఆసుపత్రికి తరలించారు.
ఆ చిట్టితల్లి త్వరగా కోలుకోవాలి. స్నేహితురాలి కోసం రంపం ముందు నిలబడిన మరో పాప ధైర్యానికి వందనం. కానీ ఒక్క ప్రశ్న. ఘటన జరిగాక గ్రీన్ ఛానెల్ వేయగలిగిన ప్రభుత్వం, ఘటనకు ముందు ఆ బడి గేటు దగ్గర ఒక్క కాపలాదారుడిని ఎందుకు పెట్టలేకపోయింది?
పట్టపగలు క్లాస్‌రూమ్‌లోకి రంపంతో వెళ్లాడంటే, వాడికి “నాకేం కాదులే” అన్న ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఎవరిచ్చారు? చట్టమా? న్యాయమా? ఈ దేశపు పరిపాలనా?
ఇది ఒక్క రాప్తాడు కథ కాదు
విజయవాడ శారదా కళాశాల గుర్తుందా? 2004 జూన్ 21. ఎంసీఏ విద్యార్థులు వైవా కోసం తరగతి గదిలో ఎదురుచూస్తున్నారు. ప్రేమను తిరస్కరించిందన్న కక్షతో సహవిద్యార్థి మనోహర్, అందరూ చూస్తుండగానే శ్రీలక్ష్మిని కత్తితో పొడిచి చంపాడు. చదువుల తల్లి శారదాదేవి పేరున్న విద్యాలయంలో ఆడపిల్ల రక్తం చిందింది. ఆ రోజు నిందితుడు కత్తిని నడుముకు దోపుకోవడాన్ని పక్కనే ఉన్న ఓ కాపలాదారు చూశాడని హైకోర్టు తీర్పే పేర్కొంది. కత్తి కనిపించింది. ఆపేవాడు లేడు.
2009లోనే “ద న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్” ఓ జాబితా ప్రచురించింది. శ్రీలక్ష్మి, లక్ష్మీ సుజాత, ఆయేషా మీరా, భార్గవి, స్వప్నిక, సమీర. ప్రేమ పేరుతో వెంటపడేవాళ్లో, డబ్బు కోసం ఆశపడేవాళ్లో ఆడపిల్లల్ని బలి తీసుకుంటున్నారని రాసింది. ఆ జాబితాకు ఇప్పటిదాకా ఎన్ని పేర్లు చేరాయో లెక్కపెట్టే ధైర్యం కూడా లేదు.
అప్పుడు శ్రీలక్ష్మి. ఇప్పుడు రాప్తాడులో మరో చిట్టితల్లి. అప్పుడు కత్తి, ఇప్పుడు రంపం. ఆయుధం మారింది, తరగతి గది మారలేదు. ప్రభుత్వాలు మారాయి, పాలకులు మారారు, రాష్ట్రాలు విడిపోయాయి. ఆడపిల్లను వెంటాడే భయం మాత్రం మారలేదు. తరగతి గది తలుపు దాకా వచ్చే మృగాన్ని ఆపే ఒక్క మనిషిని నియమించడానికి ఇరవై రెండేళ్లు సరిపోలేదా?
అక్టోబరు 28న హర్యానా పంచకుల ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదేళ్ల బాలుడు ఆరేళ్ల చిన్నారి తలను బల్లకు కొట్టి, ఇటుకతో దాడి చేశాడని వార్తలు వచ్చాయి. ప్రిన్సిపల్, తరగతి ఉపాధ్యాయుడు, కాపలాదారుపై నిర్లక్ష్యం కేసు నమోదైంది. ఒకచోట బయటివ్యక్తి రంపంతో తరగతి గది దాకా వచ్చాడు. మరోచోట ఆరేళ్ల పాపపై దాడిని ఆపే పర్యవేక్షణే లేదు. కెమెరాలో దాడి కనిపించడం సరే, పిల్లల్ని కాపాడే మనిషి ఎక్కడ?
గేటే లేని బడుల్లో భద్రతా ప్రమాణాలా?
భద్రతా ప్రమాణాలంటూ పెద్దలు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతుంటారు. గేటు కూడా లేని స్కూళ్లు ఎన్నో. సెక్యూరిటీ సిబ్బంది అనే మాటే వినపడదు. ఏఎస్ఈఆర్–2024 గ్రామీణ సర్వే పరిశీలించిన ప్రభుత్వ పాఠశాలల్లో, బాలికల మరుగుదొడ్లు వాడుకోగలిగే స్థితిలో ఉన్నవి 72 శాతమే. అంటే దాదాపు ప్రతి నాలుగు బడుల్లో ఒకదాంట్లో ఆడపిల్లకు మరుగుదొడ్డి లేనట్టే. ఆమెను బయటకు వెళ్లే పరిస్థితిలోకి నెట్టి, పైగా “జాగ్రత్తగా ఉండు” అని నీతులు ఒకటి.
ఒక్కపూటైనా కడుపు నిండుతుందని, నాలుగక్షరాలు నేర్చుకుంటారని, రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు పిల్లల్ని బడికి పంపిస్తాయి. చాలా బడుల్లో టీచర్లు సమయానికి రారు. అంకితభావంతో పనిచేసే మంచి ఉపాధ్యాయులూ ఉన్నారు, అలాంటివాళ్లు నాకూ తెలుసు. కానీ ఈ వ్యవస్థలో వాళ్లూ ఒంటరివాళ్లే. తిండీ, చదువూ సంగతి దేవుడెరుగు, అసలు ప్రాణానికే రక్షణ లేదు.
తోలుమందం మందలు
సంఘటన జరిగిన రెండు రోజులు హడావుడి. అరెస్టులు, ప్రకటనలు, పరామర్శలు. మూడో రోజు అంతా మామూలే. అగ్నిప్రమాదం జరిగితేనే ఫైర్ సేఫ్టీ గుర్తొస్తుంది. బిల్డర్‌ను అరెస్టు చేస్తారు, లంచాలు తీసుకుని అనుమతులిచ్చిన అధికారులు మాత్రం బలాదూర్‌గా తిరుగుతుంటారు. మొత్తం తోలుమందం మందలు.
రాప్తాడు ఘటనలో ప్రధానోపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు. మరి కాపలాదారును నియమించాల్సింది ఎవరు? భద్రతకు నిధులు ఇవ్వాల్సింది ఎవరు? గత తనిఖీల్లో అధికారులు ఏం చేశారు? ఒక్కరిపై వేటు వేసి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది.
ఇతర దేశాల బడుల్లో ఏం చేస్తున్నారు?
భద్రత అంటే బ్రహ్మపదార్థమేం కాదు. ఎవరు వస్తున్నారు? ఎందుకు? ఎక్కడికి? పిల్లలు ప్రమాదంలో ఉన్నారంటే ఎవరు స్పందిస్తారు? ఈ నాలుగు ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు ఉండటమే భద్రత.
అబుదాబిలో సందర్శకుడు గేటు దగ్గర గుర్తింపు కార్డు చూపించి, విజిటర్ పాస్ ధరించాలి. ఆహ్వానం లేకుండా తరగతి గదుల్లోకి వెళ్లడానికి వీల్లేదు. ప్రతి విద్యాసంస్థలో బాలల రక్షణ బాధ్యుడు, సిబ్బంది నేపథ్య పరిశీలన, గోప్యంగా ఫిర్యాదు చేసే మార్గం తప్పనిసరి.
సింగపూర్‌లో తల్లిదండ్రులైనా సరే గేటు దగ్గర గుర్తింపు చూపించి పాస్ తీసుకోవాలి. టీచర్‌ను కలవాలంటే ముందే సమయం తీసుకోవాలి.
ఇంగ్లండ్‌లో పిల్లలతో నేరుగా పనిచేయని సిబ్బంది కూడా బాలల రక్షణ నిబంధనలు చదవాల్సిందే.
మన దగ్గర చట్టాలు లేవని కాదు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి బడికి వేర్వేరు మరుగుదొడ్లు, తాగునీరు, ప్రహరీగోడ ఉండాలి.
“చట్టాలున్నాయి, శిక్షలూ ఉన్నాయి. ఎక్కడ? కాగితాల్లోనే. అమలు మాత్రం ఊహల్లోనే.
పిల్లలకు రక్తం కారాకే బాధ్యత గుర్తుకు రావాలా? మర్చిపోవడానికి మరో రోజు సరిపోతుందా?
బతకొద్దా అమ్మాయిలు?
బతకొద్దా అమ్మాయిలు? చదువుకోవద్దా? ఉద్యోగాలు చేసుకోవద్దా? క్లాసులో ఒకడు, రోడ్డు మీద ఒకడు, బంధువంటూ ఒకడు, భర్తంటూ ఇంకొకడు. జీవితాంతం ఎవడో ఒకడి హింసకు గురికావాల్సిందేనా? ఈ భయంతో బతకలేక తనువు చాలిస్తున్న పిల్లలకు ఈ దేశం ఏం సమాధానం చెబుతుంది?
ఏం సమాజమిది? ఏం స్వాతంత్ర్యమిది? నిజమైన స్వేచ్ఛ ఎవరికి దక్కింది? నేరస్థులకు, దోపిడీదారులకు, కబ్జాకోరులకు, హంతకులకు, సైకోలకు. వాళ్లకు మాత్రమే.
ఓ శ్రీలక్ష్మి. ఓ స్వప్నిక. ఓ నిర్భయ. ఓ దిశ. డ్యూటీలోనే బలైన కోల్‌కతా డాక్టరమ్మ. కరీంనగర్‌లో ఓ అమ్మాయి. ఇప్పుడు రాప్తాడులో ఓ పదో తరగతి పాప. ఈ లిస్టు ఎక్కడ ఆగుతుంది?

డబ్బు, పలుకుబడులే నేరస్థులకు ధైర్యం
ఒడిశా నుంచి బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి, మాల్‌లో పనిచేస్తూ ఇంటిని పోషిస్తున్న 26 ఏళ్ల భారతి ముఖి, ఆగస్టు 16న రోడ్డు దాటుతుండగా ఐదు కోట్ల ఆస్టన్ మార్టిన్ కింద నలిగిపోయింది. కారు నడిపింది ఏపీ రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేశ్ కొడుకని ఆరోపణ. ఆ పేరు బయటకు రావడానికే రోజులు పట్టాయి. పెట్టిన సెక్షన్ “నిర్లక్ష్యం వల్ల మరణం”. ఇచ్చింది ఒక నోటీసు, ఒక స్టేషన్ బెయిల్.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై ఒక బాలిక పోక్సో కేసు పెట్టింది. అరెస్టుకు పోలీసులకు రోజులు పట్టాయన్న ఆరోపణలు వచ్చాయి. బెదిరింపులు వస్తున్నాయని ఆ బాలిక తల్లి వేడుకోవాల్సి వచ్చింది. అతను నిర్దోషో, దోషో కోర్టు తేలుస్తుంది. కానీ సామాన్యుడి కొడుకుపై ఇదే ఫిర్యాదు వస్తే, పోలీసులు అన్ని రోజులు ఆలోచిస్తూ కూర్చునేవారా? ఫిర్యాదు చేసిన తల్లి భయపడాల్సి వచ్చేదా?
“ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వమైనా ఇదే కథ. జెండాలు మారతాయి, అజెండా మాత్రం మారదు.
భయం లేకపోవడమే అసలు కారణం
ఇలాంటి నరరూప రాక్షసులకు ఈ దేశం స్వర్గధామం ఎందుకైంది? ఒకే ఒక్క కారణం. భయం లేకపోవడం. తప్పు చేయాలనే ఆలోచన రాగానే వెన్నులో భయం జరజరా పాకాలి. అది ఇక్కడ లేదు.
ఎందుకు ఉంటుంది? ఎన్‌సీఆర్‌బీ “క్రైమ్ ఇన్ ఇండియా–2024” ప్రకారం, విచారణ ముగిసిన అత్యాచార కేసుల్లో శిక్ష పడింది 24.4 శాతంలోనే. 2024లో కోర్టుల ముందున్న రెండు లక్షలకు పైగా అత్యాచార కేసుల్లో దాదాపు 90 శాతం ఏడాది చివరికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. శిక్ష పడింది కేవలం 5,032 కేసుల్లో. ఆలోపు సాక్షులు బెదిరిపోతారు. బాధిత కుటుంబం అలసిపోతుంది. నిందితుడు దర్జాగా తిరుగుతుంటాడు.

కారణం ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యాన్ని డబ్బుకు అమ్మేసిన వ్యవస్థ. జైల్లో ఖైదీలకూ టీవీలు, మొబైళ్లు, రాజవైభోగాలు. పైసలుంటే ఏ పనైనా జరిగిపోతుంది. వందల కోట్ల భూకబ్జాలు చేసినవాడు తెల్లబట్టలేసుకుని పెద్దల సభలో కూర్చుంటాడు.
నిందితుడి హక్కుల కోసం గొంతెత్తే సంఘాలకు ఒక్క ప్రశ్న. క్లాస్‌రూమ్‌లో ప్రాణాలతో కూర్చునే హక్కు ఆ పాపకు లేదా? నిర్భయకు, దిశకు ఏ హక్కులు దక్కాయి? మందుపాతరల్లో చనిపోయిన పోలీసులకు హక్కులు లేవా? హక్కులు అందరివీ. కానీ వాటి కోసం లేచే గొంతులు మాత్రం కొందరి కోసమే.
తుపాకీ న్యాయం కాదు, తక్షణ న్యాయం కావాలి
యూఏఈ, ఖతార్ లాంటి దేశాల్లో తీవ్రమైన లైంగిక నేరాలకు చట్టంలోనే మరణశిక్ష ఉంది. కానీ అక్కడ కూడా ఆ శిక్ష కోర్టులో నేరం రుజువైన తర్వాతే.
నాకు కావాల్సింది తుపాకీ న్యాయం కాదు. ఎందుకో వరంగల్‌ను అడగండి. 2008 డిసెంబర్‌లో కిట్స్ విద్యార్థినులు స్వప్నిక, ప్రణీతలపై యాసిడ్ పోశారు. దాడికి మూడు వారాల ముందే, వాడు వేధిస్తున్నాడని స్వప్నిక కుటుంబం ఫిర్యాదు చేసింది. పట్టించుకోలేదన్న ఆరోపణలు వచ్చాయి. దాడి జరిగిన మూడు రోజుల్లోనే ముగ్గురు నిందితులు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. ఊరంతా చప్పట్లు కొట్టింది. ఇరవై రోజులు నరకయాతన పడి స్వప్నిక కన్నుమూసింది. పదకొండేళ్ల తర్వాత దిశ నిందితులకూ అదే ముగింపు. మళ్లీ చప్పట్లు. ఇప్పుడు రాప్తాడులో రంపం. రెండు ఎన్‌కౌంటర్లు ఒక్క మృగాన్నీ భయపెట్టలేదు. బతికిబయటపడిన ప్రణీతే, ఆ తుపాకీ తనకు న్యాయం ఇవ్వలేదని చెప్పింది.
ఇప్పుడు రాప్తాడులోనూ అదే కథ వినిపిస్తోంది. అడవిలో పట్టుకోబోతే తిరగబడ్డాడు, కాల్పులు జరపాల్సి వచ్చింది. వరంగల్‌లో విన్నాం, షాద్‌నగర్‌లో విన్నాం, ఇప్పుడు ఆత్మకూరు అడవిలో. ఈసారి నిందితుడు బతికే ఉన్నాడు. అదే మంచిది. వాడు కోర్టులో నిలబడాలి, సాక్ష్యాలతో దోషిగా తేలాలి, చట్టం విధించే అత్యంత కఠిన శిక్ష పడాలి. పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ప్రతి కేసులో స్వతంత్ర విచారణ జరగాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలే చెబుతున్నాయి. ఆ విచారణ కూడా జరగాలి. ఎందుకంటే తుపాకీకి ఈరోజు చప్పట్లు కొడితే, రేపు అది ఎవరి వైపు తిరుగుతుందో మనకు తెలియదు.
స్వప్నిక ప్రాణం తీసింది తుపాకీ లేకపోవడం కాదు. మూడు వారాల ముందు అందిన ఫిర్యాదును పట్టించుకోకపోవడం. పోలీసులకు ఎవరినైనా చంపే అధికారం ఇస్తే, ఆ తుపాకీ డబ్బున్నవాడి వైపు కాదు, పేదవాడి వైపే తిరుగుతుంది.
“దిశ నిందితులు పలుకుబడి ఉన్నవారైతే ఎన్‌కౌంటర్‌లో చనిపోయేవారా?
ఆ ఎన్‌కౌంటర్ బూటకమని సుప్రీంకోర్టు నియమించిన కమిషనే తేల్చింది.

నాకు కావాల్సింది కోర్టు తీర్పే ఉరితాడులా పనిచేయడం. నెలల్లోనే విచారణ, శిక్ష ఖరారు. ఏళ్లు కాదు. ఎంపీ కొడుక్కీ, మంత్రి కొడుక్కీ, కూలివాడి కొడుక్కీ ఒకే దర్యాప్తు, ఒకే వేగం, ఒకే శిక్ష. ఇంకోసారి పండ్లు కోసే కత్తి పట్టుకోవాలన్నా ప్రతీవాడి చెయ్యి వణకాలి.
ఇప్పుడైనా చేయాల్సింది ఇది
- ప్రతి ప్రభుత్వ బడికి ప్రహరీగోడ, గేటు, కాపలాదారుడు. వచ్చే బడ్జెట్‌లో కాదు, ఈ నెలలోనే.
- బయటివారికి గుర్తింపు తనిఖీ, ఎంట్రీ రిజిస్టర్. అనుమతి లేకుండా ఎవరూ తరగతి గది దాకా రాకూడదు.
- ఆడపిల్లలకు నీళ్లు, తలుపు, గడియ ఉన్న మరుగుదొడ్లు. కట్టడమే కాదు, నిర్వహణకు నిధులు, సిబ్బంది.
- ప్రతి బడిలో బాలల రక్షణ బాధ్యుడు, గోప్యంగా ఫిర్యాదు చేసే మార్గం.
- వేధింపుల ఫిర్యాదును పట్టించుకోని పోలీసులపై చర్య. ఫిర్యాదు బుట్టదాఖలైన రోజే నేరానికి బీజం పడుతుంది.
- మహిళలు, పిల్లలపై దాడుల కేసుల్లో నిర్ణీత గడువులో తీర్పిచ్చే ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు.
- నిధులు ఇవ్వని, తనిఖీ చేయని పై అధికారులనూ బాధ్యులను చేయాలి. సంతకం పెట్టినవాడూ ముద్దాయే.
- ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల, కళాశాలలో భద్రతా ప్రమాణాలపై విధిగా తనిఖీ.
- బాధితురాలి చికిత్స, చదువు, భవిష్యత్తు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే.
తనిఖీ అధికారులు యాజమాన్యంతో కుమ్మక్కైతే, రేపటి బాధితురాలు ఎవరింటి బిడ్డైనా కావచ్చు. మీ ఇంటి బిడ్డ కూడా ఆ బడికే వెళ్తోందని మర్చిపోకండి.
క్షమించమ్మా
అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నిర్భయంగా తిరగగలిగిన రోజే నిజమైన స్వాతంత్ర్యం అని మహాత్ముడు అన్నారంటారు. అర్ధరాత్రి సంగతి పక్కన పెట్టండి. పట్టపగలు, బడిలో, క్లాస్‌రూమ్‌లో కూర్చున్న పిల్లకే రక్షణ లేదు.
మా ఇంటి మహాలక్ష్మి అంటాం. ఇంటి దీపం అంటాం. ఆదిశక్తి, జగన్మాత అని కొలుస్తాం. నవరాత్రుల్లో బాలికల కాళ్లు కడిగి పూజిస్తాం. అదే బాలిక తరగతి గదిలో రక్తపు మడుగులో కొట్టుకుంటుంటే, రెండు రోజులు బాధపడి మర్చిపోతాం.
ఈ దేశంలో పుట్టకండమ్మా. ఇంకెక్కడైనా పూలమొక్కగా పుట్టి నచ్చినట్టు పరిమళించండి. పక్షుల్లా పుట్టి స్వేచ్ఛగా ఎగరండి. ఆడపిల్లను దేవతగా కాదు, కనీసం మనిషిగా చూసే చోటే పుట్టండి. ఇక్కడెవరికీ భయం, బాధ్యత ఉండవు. అనుభవిస్తాం. ఆడపిల్లలు లేని దేశంలో దిక్కులేని జీవితాన్ని హాయిగా అనుభవిస్తాం. తల్లీ చెల్లీ లేని ఇంట్లో తలుపుచెక్కల్లా బతుకుతాం…
ఇలా చెప్పాలనిపిస్తోంది. గుండె అలాగే ఘోషిస్తోంది. కానీ చెప్పను. ఎందుకంటే ఈ దేశం మీది కూడా. ఇక్కడి నుంచి పారిపోవాల్సింది మీరు కాదు, ఆ రాక్షసులు. మారాల్సింది మీరు కాదు, మేము.
శ్రీలక్ష్మీ, స్వప్నికా, మిమ్మల్ని కాపాడుకోలేకపోయాం. బెంగళూరు ఆసుపత్రిలో కోలుకుంటున్న ఓ చిట్టితల్లీ, నిన్నూ కాపాడలేకపోయిన ఈ సమాజంలో నేనూ ఒకడిని. సిగ్గుపడుతున్నాను. క్షమించమ్మా. కానీ ఈ సిగ్గును మౌనంగా భరించను. నీలాంటి ఏ పాపకూ ఇది మళ్లీ జరగని రోజు వచ్చేదాకా ప్రశ్నిస్తూనే ఉంటాను. రాస్తూనే ఉంటాను.









