దళితులు, వెనుకబడిన వర్గాల నిర్వచనం మారిపోతున్నట్టుంది. ఈ మధ్య కొన్నిరోజులుగా కాంగ్రెస్ మంత్రులు చేస్తున్న విచిత్ర వీధి నాటకాలను చూస్తుంటే చాలా అసహ్యంగా ఉంది. పాత్రధారులైన అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్, అఖరికి చెబుతున్నా, అన్నింట్లో ముందుంటే కొండా సురేఖ… వీరిని నాయకులు, మంత్రులుగా చూడాలంటే సిగ్గుగా ఉంటోంది.
వీళ్లలో ఎవరు నిజమైన దళితులు, అసలైన బీసీలు.?
పైన చెప్పబడిన అందరూ కోట్లకు పడగలెత్తిన నాయకులే. కొండా కుటుంబం తెలంగాణలో ఫ్యాక్షనిజాన్ని పుట్టించింది. ఆ ప్రయాణం, “నక్సలిజం టు ఫ్యాక్షనిజం”. దాన్లో భాగంగా జరిగిన ఎన్నో హత్యలు, దహనాలు, నడిరోడ్డు మీద నరకడాలు.. టికెట్ కావాలన్నా కత్తే, ఓటు కావాలన్నా కత్తే.. పైసలు కావాలన్నా కత్తే. ఆ కుటుంబానికి కత్తే కోట్లు సంపాదించిపెట్టింది. భర్త మున్నూరు కాపు, భార్య పద్మశాలి. మొత్తానికి బీసీలు.
పొన్నం ప్రభాకర్.. ఈయన కూడా ఒక బీసీ మంత్రి. ఆస్తులు, సంపాదనలు కోట్లలోనే. అడ్లూరి లక్ష్మణ్.. ఈయన పేరెవరికి తెలియకపోయినా, అందిన సమాచారం ప్రకారం, కోటీశ్వరుడే. ఇక గడ్డం వివేక్. ఇతని గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. దివంగత జి. వెంకటస్వామి కొడుకుల్లో ఒకడు. ఈ ‘జీ’ అనే అక్షరానికి హైదరాబాద్‌లో వేరే అర్ధం ఉందని విన్నాను. పెద్దగా తెలియదు. వీరి ఆస్తులు, ఆదాయం వేల కోట్లు. విశాఖ ఇండస్ట్రీస్, వి6 చానెల్, ప్రభాత వెలుగు పేపర్.. ఎక్కడ టికెట్ ఉంటే, అక్కడికే దుంకే నైజం.. వెరసి ఈయనే ఒక మాల మహామంత్రి.
వీళ్లందరూ కలిసి, ఎస్సీ మంత్రులను బీసీ మంత్రులు, బీసీ మంత్రులను రెడ్డి మంత్రులు అణగదొక్కుతున్నారని, పొర్లిపొర్లి, వెక్కివెక్కి, గుక్కపెట్టి ఏడుస్తున్నారు. సిగ్గుండాలి మనుషులైతే.. అఖరికి చిన్న వయసులో అన్నీ తెలుసుకున్న సుస్మితాపటేల్ కూడా పోలీసులను బెదిరించే స్థాయికి వెళ్లింది. పోలీసుల ముందే నిందితుడినికి కారెక్కించుకుని తీసుకెళ్లిన మంత్రిని అక్కడికక్కడే దించి, బెండు తీసి, అరెస్టు చేస్తే దిక్కెవరు? నిందితుడికి ఆశ్రయం కల్పించడం, చట్టానికి దొరక్కుండా తప్పించడం అసలు నేరం కంటే కూడా తీవ్రమైన నేరం. ఆ రకంగా కొండా సురేఖ మొదటి ముద్దాయి. ముందు తనను అరెస్ట్ చేసి, బోనులో నిలబెట్టాలి. ఎస్సీ మంత్రి పక్కన కూర్చోను అన్న బీసీ మంత్రిపై అట్రాసిటీ కేసు పెట్టి లోపలేయాలి. నేను మాల అన్న మల్టీ మిలియనీర్‌ను తొక్కి నారతీయాలి.
ఎవరు వీళ్లంతా..? ఎలా ఎస్సీలు? ఎలా బీసీలు? వీళ్లకి రిజర్వేషన్లేమిటి? వీళ్లకే కాదు, వీళ్ల తరతరాలకు కూడా రిజర్వేషన్ రద్దు చేయాలి. ఆ మాటకొస్తే, రిజర్వేషన్ పొంది పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధించిన వారి కుటుంబాలకు భవిష్యత్తులో ఇక రిజర్వేషన్ వర్తించకూడదు. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలి.
అసలు ఎస్సీలు..అంటే దళితులు ఎలా ఉంటారో తెలుసా? కనీసం ఎలా బతుకుతున్నారో తెలుసా? బీసీలలో కటిక దారిద్ర్యం అనుభవిస్తున్న వారెందరో, ఎక్కడున్నారో ఎంతమందికి తెలుసు.? ఇలాంటి నీచులను ప్రోత్సహించే రాజకీయపార్టీలను కూడా క్షమించకూడదు. వాడుకుని వదిలేసే రాజకీయాల్లో కాంగ్రెస్‌ది అందె వేసిన చెయ్యి. దళితుల అభ్యున్నతి పట్ల నిబద్ధత ఉన్న పార్టీ అయితే, డిగ్రీ చదువుకుని, ఉద్యోగాల్లేక, అల్లాడుతున్న దళిత, బీసీ బిడ్డలు వేలల్లో ఉన్నారు. వారిని పిలిచి టికెట్లివ్వండి. గెలిపించుకోండి. వారికి తెలుస్తాయి, అసలు సమస్యలు ఎక్కడున్నాయో. అంబేద్కర్ ఆశించింది ఇదీ.
స్వాతంత్ర్యం వచ్చి 79 యేళ్లయినా, ఎక్కడున్నవారు, అక్కడే ఉన్నారు. పదేళ్లకు పరిమితి విధించిన అంబేద్కర్, దాన్ని మన నాయకులు 80 ఏళ్ల తర్వాత కూడా ఇలా వాడుకుంటారని అస్సలు ఊహించిఉండరు. ఇది ఈ దేశం చేసుకున్న పాపం. మొట్టమొదటి రోజునుంచీ దేశానికి కాంగ్రెస్ చేస్తున్న ద్రోహం. నెహ్రూ నుండి రాహుల్ గాంధీ వరకు ఈ దేశానికి చేసిన అన్యాయాలు అన్నీఇన్నీ కావు. ఇవాళ భారత్ అనుభవిస్తున్న సకల దరిద్రాలకు వారే మూలకారణం. కాంగ్రెస్ పార్టీ ఘనంగా చెప్పుకునే అంతర్గత ‘ప్రజాస్వామ్యమే’ అన్ని అనర్థాలకు అసలు కారణం.
ఉక్కుమనిషిని కాదన్న కాంగ్రెస్, ‘ఉక్కుమహిళ’కు మాత్రం పట్టం కట్టి, దేశాన్ని చీకటి కొట్లోకి నెట్టేసింది. కొమ్మకు, రెమ్మకు తేడా తెలియని రాహుల్ గాంధీ రాజకీయ నాయకుడు ఎలా అవుతాడో నాకు అర్థం కాదు. ఓ అమెరికా నటి, గాయని అన్నట్లు ప్రధానికి కావాల్సిన చతురత రాహుల్‌కు లేదు. పరాయి గడ్డపై మాతృభూమిని కించపరిచే ఈయన నాయకుడెలా అవుతాడు? కాంగ్రెస్‌లో ఉన్న నిజమైన నాయకులు ఎప్పుడో చచ్చిపోయారు. ఇప్పుడు ఆ పార్టీ ఈ దేశాన్ని ఆవహించిన పిశాచం.
రిజర్వేషన్లనేవి ఒక ప్రత్యేక ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టబడినవి. వాటిని సంపూర్ణంగా అర్హులైనవారికే అందించాలి. గొడవలైనప్పుడల్లా, అహం దెబ్బతిన్నప్పుడల్లా తమ కులం అడ్డుపెట్టి, వర్గాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ఇటువంటి దుష్ట నాగుల పన్నాగంలో ఎవరూ పడకూడదు. అందరం మనుషులమే అన్న సమాన భావన ముందు అన్నీ విలువలూ దిగదుడుపే. మానవత్వమే అసలైన రిజర్వేషన్. దాని ముందు డబ్బు, అధికారం, కీర్తిప్రతిష్టలు, పరువుమర్యాదలు పిపీలికంతో సమానం. మానవత్వం లేనివాడు ఈ భూమ్మీద జీవించడానికి కూడా అర్హత లేనివాడు.








One response to “ఈ నేతలు దళితులూ, బీసీలా?”
[…] అనే కార్డు గురించి మొన్నే రాశాను. వందల కోట్ల ఆస్తులతో బీసీనంటే ఎలా […]