అభిప్రాయాలు… ఆలోచనలు… అక్షరాలు…

మీడియాపై అమానవీయ చర్య

జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులపై కొత్త నిబంధనలు రూపొందించినవారికి పత్రికాసంస్థల పనితీరే తెలియదు. డెస్క్, ఫీల్డ్ అంటూ విభజించడం సమంజసమా? అనుభవజ్ఞుడి మాట.

చెర్మాల శ్రీనివాస్26 డిసెంబర్ 2025 · సవరణ: 24 అక్టోబర్ 2026 · 3 నిమిషాలు
మీడియాపై అమానవీయ చర్య

ఈ ప్రభుత్వపు రీతి విచిత్రంగా ఉంది. జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల విషయంలో పెట్టిన కొత్త నిబంధనలు ఎవరు రూపొందించారో, ఎవరు ఆమోదించారో తెలియదు కానీ, వారికి పత్రికాసంస్థల పనితీరు అస్సలు తెలియదని మాత్రం ఖచ్చితంగా తెలిసింది.

పత్రికా కార్యాలయాల్లో వాస్తవానికి డెస్క్ జర్నలిస్టు(సబ్ఎడిటర్) అనీ, ఫీల్డ్ జర్నలిస్టు(రిపోర్టర్) అని ప్రత్యేకంగా ఉండరు. అవసరాన్ని బట్టి అటూ ఇటూ మారుతుంటారు. ఒక రిపోర్టర్ వార్త రాస్తే, దాన్ని సరిదిద్ది, పేజీలో దాని ప్రాధాన్యతకు అనుగుణంగా స్థానం కేటాయించేవాడే సబ్ఎడిటర్. ప్రతీ పత్రికాసంస్థ జర్నలిస్టులకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేప్పుడు రిపోర్టర్/సబ్ఎడిటర్ అని ఇస్తుంది. ఐడీ కార్డు కూడా అలాగే ఉంటుంది. పర్సనల్(హెచ్ఆర్) డిపార్ట్మెంట్ రికార్డులలో కూడా అలాగే ఉంటుంది. ఓ స్థాయి(చీఫ్ రిపోర్టర్/చీఫ్ సబ్ఎడిటర్) దాటేవరకు ఇదే సంప్రదాయం కొనసాగుతునేఉంటుంది. పోలీసుల్లో లా అండ్ ఆర్డర్/ట్రాఫిక్లా అన్నమాట. ఇది తెలియకుండానే ఈ రాష్ట్రంలో మీడియా అకాడెమీ అనేది ఒకటి పనిచేస్తుందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. బహుశా ఆ అకాడెమీలో ఉన్నవాళ్లకు పత్రికాసంస్థల పనితీరు తెలియకపోవచ్చు లేదా అటువంటి వ్యవస్థే లేని ఒక అత్యల్ప పత్రికలో పనిచేసుండొచ్చు.

విధుల ఆధారంగా జర్నలిస్టులను విభజించడం సమంజసం కాదు. జర్నలిస్టంటే జర్నలిస్టే.. అంతే. ఇందులో ఇంకో వాదనే లేదు. సాధారణంగా బిజినెస్, స్పోర్ట్స్, ఫీచర్స్ జర్నలిస్టులు రెండు పనులూ వారే చేసుకుంటారు. బయటకెళ్లి రిపోర్టు తెచ్చుకోవడం, ఆఫీసుకొచ్చి ఎడిటింగ్ చేసుకుని,పేజీలో పెట్టుకోవడం.. మరి, వీరినేమనాలి?

విభజనే కావాలంటే మీడియా ఆధారంగా మాత్రమే చేయొచ్చు. ప్రింట్, డిజిటల్, ఎలక్ట్రానిక్, ఫ్రీలాన్స్/ఇండిపెండెంట్ .. ఇలా . అయితే ఇది ఇప్పటికే ఉందనుకుంటా.

ఎలాగూ గత ప్రభుత్వం కంటే తామే గొప్పవాళ్లమనీ, జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడిఉన్నామని ముఖ్యమంత్రి, సమాచార శాఖ మంత్రి పదేపదే ఊదరగొట్టారు కదా. మరి వాళ్ల కంటే ఎక్కువివ్వాలి కదా. వాళ్లు ఆఫ్టరాల్ 25వేలే ఇచ్చారు, మేం 50వేలిస్తాం అనాలి గానీ, ఇదేం కొంచెపుతనం.? అయినా, నాకు తెలియకడుతున్నానూ, దీనివల్ల రాష్ట్ర ఖజానాకు ఎన్ని వందల కోట్ల భారం పడుతుంది.? అడగకుండానే ఆడవాళ్లకు బస్సు ఫ్రీ అన్నారు. ఉత్తిపుణ్యానికి అది కాస్తా వందల కోట్ల ఖర్చయి కూర్చుంది. తాళంచెవి మర్చిపోయి వచ్చి, మళ్లీ తీసుకురావడానికి కూడా రెండు గంటలు బస్సులో కూర్చుని ప్రయాణిస్తున్నారు మన మహిళామణులు. ఆ మాత్రం తీసిపోయారా జర్నలిస్టులు?

బతకలేక డెస్క్​ జర్నలిస్టులు

ఏదో ఒకట్రెండు పేపర్లు, టీవీలు తప్ప, అందరివీ జీవితం గడవని జీతాలే. నెల జీతానికి కనీసం 10వేలైనా తేడా కొడుతుంటుంది నెలాఖరుకు. దానికి అప్పులు చేసి, క్రెడిట్​కార్డులు గీకి, వాటి బిల్లులు కట్టడానికి మళ్లీ అప్పులు చేసి అందరూ అప్పులకుప్పలయ్యారు తప్ప ఒక్క ఒప్పులకుప్పా లేడు.

మహా అయితే 30 వేలుంటారేమో.. అయితే ఏమైంది.? వాళ్లకు ఎంత ఖర్చుపెడుతుంది ఈ ప్రభుత్వం? అయినా వాళ్లకు కావాల్సింది ఏంటి? బస్సు పాసు, ఆరోగ్యశ్రీ కార్డు. ఎంతవుతుందేంటి? ఈ దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ ఇంతకంటే ఘనంగానే చూసుకుంటున్నాయి మరి.. జర్నలిస్టులను. అదేం ఖర్మో.. అన్ని దరిద్రాలూ తెలంగాణకే చుట్టుకుంటున్నాయి.

అంతే కాకుండా, తమిళనాడు ప్రభుత్వం, నాన్–జర్నలిస్టులకు కూడా గుర్తింపునిచ్చింది. ఐటీ, ప్రింటింగ్, ఎలక్ట్రికల్, అడ్వర్టయిజ్మెంట్, సర్క్యులేషన్ సిబ్బందిని కూడా తగినరీతిన గౌరవించింది అప్పటి జయలలిత ప్రభుత్వం. అదే ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతోందక్కడ. ఎందుకంటే, ఎంత గొప్పగా రాసినా, ఎంతందంగా తీర్చిదిద్దినా, ప్రింటింగ్ కాకపోతే, పంపిణీ జరగకపోతే, ఆదాయం రాకపోతే.. అది వారి పెన్నుల్లోనే ఇంకిపోతుంది. అంతెందుకు? పేపరు ఓ గంట లేటైతే, వేయడానికి ఒక్క బాయ్ కూడా ఉండడు.

ఇదే విషయమై, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాన్–జర్నలిస్టులకు కూడా గుర్తింపు ఇవ్వాల్సిందే అని అన్నారు. సరే.. కారణాలేమైనా ఇవ్వలేదనుకోండి.. అది వేరే విషయం.

మీడియా అంటేనే టీమ్​వర్క్​కు ప్రపంచంలోనే అతిపెద్ద ఉదాహరణ. ఇక్కడ ఏ ఒక్కరు పనిచేయకపోయినా, పేపరు బయటికి రాదు. అలాగే ఎంత పెద్ద సమస్య వచ్చినా, రాత్రికి రాత్రే పరిష్కరింపబడాలి. సరే… ఓ రెండు రోజులు ఉత్పత్తి ఆపి, మెషీన్ బాగుచేసుకున్నాక, మళ్లీ ప్రారంభిద్దాం అనుకోవడానికి ఇదేం బట్టల మిల్లో, బోళ్లు తయారుచేసే ఫ్యాక్టరీనో కాదు. ఏం జరిగినా, తెల్లవారి పేపర్ బయటికి రావాల్సిందే.

నిజానికి ప్రభుత్వోద్యోగుల కంటే ఎక్కువ పనిచేసేదీ, తక్కువ జీతం తీసుకునేదీ మీడియా ఉద్యోగులే. వారిని తక్కుచేసి చూడటం వల్ల ప్రభుత్వానికే నష్టం తప్ప, ఇసుమంతైనా లాభం లేదు. ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం ఏదైనా పెద్ద మంచిపని చేసినా, రాయడానికి వారన్న ఫీల్డ్ జర్నలిస్టుకు పెన్ను కదలదు, మంచిగా అలంకరిద్దామని డెస్క్ జర్నలిస్టుకు మనసొప్పదు. మరెందుకీ కంచి గరుడ సేవ.?

ఇప్పటికే పాపం.. ఇళ్ల స్థలాల విషయంలో వాళ్లే కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా మళ్లీ కట్టె పెట్టి, దాన్ని ఇంకా పెద్దది చేయడం ఎందుకు? ఇస్తే బాగుంటుంది కదా. నేననుకోవడం మన మనవడాడిన ఫుట్​బాల్ కంటే తక్కువే అవుతుంది ఖర్చు. ఒకవేళ ఎక్కువవుతోందనుకుంటే, మీడియా అకాడెమీని రద్దు చేయండి. పనికిరానివి ఎలాగూ అక్కర్లేదు కదా..

తర్వాత చదవండి'Election Commission of India' నేమ్‌ప్లేట్ ఉన్న పగిలిన టేబుల్, వెనక మూడు ఖాళీ కుర్చీలు, ఫైళ్లు, బ్యాలెట్ బాక్స్ (ప్రతీకాత్మక చిత్రం)అతిథి మాటసీఈసీ రగడ: వ్యవస్థ వైఫల్యమా? రాజకీయ రణరంగమా?

ఈ కథనంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం. ఏదైనా తప్పు కనిపిస్తే contact@maromaata.comకు రాయండి — సరిచేస్తాను. సంపాదకీయ విధానం →

చెర్మాల శ్రీనివాస్

రచయిత

నా గురించి →

మరిన్ని కథనాలు

షేర్