అభిప్రాయాలు… ఆలోచనలు… అక్షరాలు…

ఎల్లలు దాటిన గణపయ్య!

ఇండోనేషియా పాత నోటుపై గణపతి… జపాన్‌లో జంట రూపం… థాయ్‌లాండ్‌లో కళల దేవుడు… ప్యారిస్‌ వీధుల్లో ఊరేగింపు! మన ఇంటి పసుపు గణపతి ప్రపంచానికి ఎలా దగ్గరయ్యాడు? ‘మరోమాట’ తొలి అడుగున ఆ విశేషాల కథ.

చెర్మాల శ్రీనివాస్14 సెప్టెంబర్ 2026 · సవరణ: 12 అక్టోబర్ 2026 · 3 నిమిషాలు
ఐదు తలల గణపతి — ఆగ్నేయాసియా శైలిలో చెక్కిన కలప విగ్రహం

పసుపు ముద్దకు బొట్టు పెడితే మనకు గణపయ్య. మట్టితో చిన్న బొమ్మ చేసి, పత్రి వేసి, ఉండ్రాళ్లు పెడితే చాలు. ఇంటికొచ్చిన ఆత్మీయుడిలా కొలుచుకుంటాం. చదువు మొదలైనా, పెళ్లి తలపెట్టినా, కొత్త పని చేపట్టినా తొలి దండం ఆయనకే.

అంత పరిచయమైన వినాయకుడి గురించి మనకు అంతగా తెలియని కథ కూడా ఉంది. ఆ కథలో ఆయన సముద్రాలు దాటాడు. కొత్త పేర్లు తెచ్చుకున్నాడు. కొత్త రూపాల్లో కొలువుదీరాడు. మనం ఉండ్రాళ్లు సమర్పించే దేవుడికి జపాన్‌లో ముల్లంగి నైవేద్యమైంది!

ఈ ప్రయాణంలో భక్తితోపాటు చరిత్ర ఉంది. మనుషులు కొత్త నేలలకు తీసుకెళ్లిన ఆచారాలున్నాయి. స్థానిక సంప్రదాయాలతో కలిసిపోయిన రూపాలున్నాయి.

నోటు మీద చోటు

ఇండోనేషియా 1998 నాటి 20,000 రూపియా నోటు — గణపతి, కీ హజర్ దేవాంతర
ఇండోనేషియా 1998 నాటి 20,000 రూపియా నోటు. ఫోటో: బ్యాంక్ ఇండోనేషియా / వికీమీడియా కామన్స్

ఇండోనేషియా అనగానే గణపతి బొమ్మ ఉన్న నోటు చాలామందికి గుర్తుకొస్తుంది. అది నిజమే. 1998లో విడుదలైన 20 వేల రూపియా నోటు ముందు వైపున విద్యావేత్త కీ హజర్ దేవాంతర చిత్రంతోపాటు గణపతి విగ్రహం బొమ్మ ఉండేది. వెనుక వైపున తరగతి గదిలో చదువుకుంటున్న పిల్లలు కనిపించేవారు. అయితే ఆ నోటును 2008 డిసెంబరు 31 నుంచి చలామణి నుంచి ఉపసంహరించారు. ఇప్పుడు అది పాత నోట్ల సేకరణల్లో కనిపించే జ్ఞాపకం.

అక్కడ గణపతికి చదువుతో ఉన్న అనుబంధం నోటుకే పరిమితం కాలేదు. ప్రఖ్యాత బాండుంగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ చిహ్నంలోనూ ఆయనే. ఆ సంస్థ తన చిహ్నంలోని గణపతిని విజ్ఞానానికి, సాంకేతిక పరిజ్ఞానానికి ప్రతీకగా వివరిస్తుంది. ఆయన ముందు తెరిచి ఉన్న పుస్తకం కూడా కనిపిస్తుంది.

మన దగ్గర అక్షరాభ్యాసం నాడు తలుచుకునే గణపయ్యకు అక్కడా చదువుల దగ్గరే చోటు దక్కిందన్నమాట.

జపాన్‌లో జంటగా…

జపాన్ కంగితెన్ — జంట గణపతి రూపం
జపాన్ బౌద్ధ సంప్రదాయంలో జంట కంగితెన్ రూపం. చిత్రం: వికీమీడియా కామన్స్

జపాన్‌ చేరేసరికి వినాయకుడి రూపం మనకు కొత్తగా కనిపిస్తుంది. అక్కడ బౌద్ధ సంప్రదాయంలో ఆయనకు ‘కంగితెన్‌’, ‘షోతెన్‌’ అనే పేర్లున్నాయి. ప్రసిద్ధమైన జంట రూపంలో ఏనుగు తలలున్న స్త్రీ, పురుష మూర్తులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఉంటారు. ఇటువంటి విగ్రహాలను భక్తులందరికీ కనిపించేలా ఉంచకుండా, ప్రత్యేక ఆవరణల్లో ఉంచే సంప్రదాయమూ ఉంది. సంపదను ప్రసాదించే దైవంగా కంగితెన్‌ను ఆరాధించిన చరిత్రను బ్రిటిష్‌ మ్యూజియం నమోదు చేసింది.

టోక్యో మత్సుచియామా షోడెన్ గుడిలో కంగితెన్ గుర్తు — ముల్లంగి
టోక్యో మత్సుచియామా షోడెన్ ఆలయంలో ముల్లంగి గుర్తు

టోక్యోలోని మత్సుచియామా షోడెన్‌ ఆలయంలో మరో విశేషం కనిపిస్తుంది. అక్కడ సమర్పించే ముఖ్యమైన నైవేద్యాల్లో ముల్లంగి ఒకటి. ఆలయ ప్రాంగణంలోనూ ముల్లంగి గుర్తులు కనిపిస్తాయి. శరీరం, మనసు పరిశుద్ధం కావడాన్ని సూచించే సమర్పణగా దాన్ని భావిస్తారు. నూనెతో చేసే ప్రత్యేక పూజ కూడా అక్కడి ఆచారంలో భాగమే.

మనకు ఉండ్రాళ్లు గుర్తుకొచ్చినంత సహజంగా అక్కడి భక్తులకు ముల్లంగి గుర్తుకొస్తుందేమో! ఒక ఆరాధన కొత్త నేలకు చేరినప్పుడు, ఆ నేల అలవాట్లూ అందులో చోటు చేసుకుంటాయి.

థాయ్‌లాండ్‌లో కళలకు అండ

బ్యాంకాక్ సెంట్రల్ వరల్డ్ దగ్గర గణపతి గుడి
బ్యాంకాక్ సెంట్రల్ వరల్డ్ దగ్గర గణపతి పూజాస్థలం

థాయ్‌లాండ్‌లో గణపతిని ‘ఫ్రా ఫికనేత్‌’ అని పిలుస్తారు. కళలు, విద్య, వ్యాపారంతో ఆయన ఆరాధనకు అనుబంధం ఉంది. ఆ దేశ లలిత కళల శాఖ చిహ్నంలోనూ గణపతి కనిపిస్తాడు. బ్యాంకాక్‌లో ఆయనకు ప్రత్యేక పూజాస్థలాలున్నాయి.

అక్కడి శిల్పాల్లో స్థానిక అలంకరణలు కనిపిస్తాయి. పేరు పలికే తీరు మారుతుంది. భక్తుడు తన పనిలో విజయం కోరుకునే చోట మాత్రం మనకు తెలిసిన వినాయకుడు కనిపిస్తాడు.

ఈ అనుబంధం ఇటీవల ఏర్పడింది కూడా కాదు. కంబోడియాలో ఏడో శతాబ్దం నాటి గణపతి శిల్పాలున్నాయి. న్యూయార్క్‌ మెట్రోపాలిటన్‌ మ్యూజియంలోని ఒక శిల్పంలో గణపతి స్థానిక వస్త్రధారణతో నిలబడి కనిపిస్తాడు. ఆగ్నేయాసియాలో ఆయనను ప్రధాన దైవంగా ప్రత్యేక ఆలయాల్లో ఆరాధించిన సందర్భాలున్నాయని మ్యూజియం వివరిస్తోంది.

అంటే, విదేశాల్లో గణపయ్య కథకు శతాబ్దాల నేపథ్యం ఉందన్నమాట.

కొత్త ఊరిలో పాత బంధం

సింగపూర్‌లోని శ్రీ సెంపగ వినాయగర్‌ ఆలయ చరిత్రలో ఒక చిన్న చెరువు, దాని ఒడ్డున చెట్టు కనిపిస్తాయి. ఆలయ కథనం ప్రకారం, 1850లలో చెరువు పక్కన దొరికిన వినాయక విగ్రహానికి మొదట చిన్న ఆశ్రయం ఏర్పాటు చేశారు. శ్రీలంకకు చెందిన తమిళుడు ఎతిర్నాయగం పిళ్లై, భారతీయ కార్మికుల సహకారంతో ఆ పని చేపట్టారు. అదే క్రమంగా ఆలయమైంది.

కొత్త దేశంలో స్థిరపడే మనుషులకు ఇలాంటి గుడి ఒక కలయిక చోటు కూడా. పండగకు కలుసుకోవడానికి, పిల్లలకు ఇంటి ఆచారాలు పరిచయం చేయడానికి, సొంత ఊరిని తలుచుకోవడానికి ఒక చిరునామా.

అమెరికాలోని న్యూయార్క్‌ ఫ్లషింగ్‌లో శ్రీ మహావల్లభ గణపతి ఆలయానికి 1977 జులై 4న తొలి కుంభాభిషేకం జరిగింది. అప్పటి నుంచి అక్కడి ఆరాధనలో గణపతి ఒక భాగమయ్యాడు.

ప్యారిస్‌ వీధుల్లోనూ గణపతి ఉత్సవం జరుగుతుంది. శ్రీ మాణిక్య వినాయగర్‌ ఆలయం నుంచి బయలుదేరే ఊరేగింపులో సంగీతం, నృత్యం, ప్రసాదాల పంపిణీ ఉంటాయి. దారిపొడవునా కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుంటారు. ఫ్రెంచ్‌ వీధుల్లో మనకు పరిచయమైన పండగ దృశ్యం!

తొలి అడుగుకు…

ఒకచోట విద్యాసంస్థ చిహ్నం. మరోచోట బౌద్ధ ఆరాధనలో జంట రూపం. ఇంకోచోట వలస కుటుంబాలను కలిపే ఆలయం. దేశదేశాల్లో గణపతికి దక్కిన స్థానాలు ఇవి.

ఈ రూపాలన్నింటినీ చూస్తుంటే మన ఇంటి చిన్న పసుపు గణపతి వెనక ఎంత పెద్ద ప్రపంచం ఉందో అనిపిస్తుంది. మనకు తెలిసిన కథను కాస్త దాటి చూస్తే, తెలియని మరో కథ కనిపిస్తుంది.

అలాంటి కథలను మీతో పంచుకోవడానికి ‘మరోమాట’ తొలి అడుగు వేస్తోంది.

కొత్త విషయాన్ని తెలుసుకోవాలనే కుతూహలంతో. తెలిసిన విషయాన్నే మరోసారి పరిశీలించాలనే ఆసక్తితో. మీతో మాట్లాడాలనే ఆప్యాయతతో.

ఆ తొలి అడుగుకు తొలి దండం గణపయ్యకే.

విఘ్నేశ్వరా… దారి చూపు.

తర్వాత చదవండిఆధ్యాత్మికంగాయత్రి మంత్రం : మనసుకు సూర్యోదయం

ఈ కథనంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం. ఏదైనా తప్పు కనిపిస్తే contact@maromaata.comకు రాయండి — సరిచేస్తాను. సంపాదకీయ విధానం →

చెర్మాల శ్రీనివాస్

రచయిత

నా గురించి →

మరిన్ని కథనాలు

షేర్