అభిప్రాయాలు… ఆలోచనలు… అక్షరాలు…

తెలుగుదేశం విషం ఇంకా పొగలు కక్కుతూనే ఉంది

లోక్‌సభలో స్పీకర్‌పై అవిశ్వాస చర్చలో తెలంగాణపై విషం చిమ్మిన టీడీపీ ఎంపీ. తెలంగాణ ఏర్పడి 13 ఏళ్లయినా తగ్గని ఏడుపు. తెలంగాణ ద్వేషం తెలుగుదేశం డీఎన్‌ఏలోనే ఉందా?

చెర్మాల శ్రీనివాస్11 మార్చి 2026 · సవరణ: 24 అక్టోబర్ 2026 · 2 నిమిషాలు
తెలుగుదేశం విషం ఇంకా పొగలు కక్కుతూనే ఉంది

నిన్న లోక్​సభలో ఎవరో లావు శ్రీకృష్ణదేవరాయలట.. ఎంపీ. మోకాలికీ బోడిగుండుకీ ముడేసే ప్రయత్నం చేసాడు. స్పీకర్​పై అవిశ్వాస తీర్మానం పెట్టి చర్చలు చేయమంటే, తెలంగాణపై విషం చిమ్మాడు. ఇతనెవరో బహుశా నరసరావుపేట ప్రజలకైనా తెలుసో లేదో నాకు తెలియదు. తెలుగుదేశం అభ్యర్థి కాబట్టి “షరామామూలు”గా ఓటేసి ఉంటారు. ఇంకోసారి గెలవడనుకోండి.. అది వేరే విషయం.

సాధారణంగా ఏదైనా గొప్ప గుణాలు కలిగిఉన్న వ్యక్తులనుద్దేశించి, అవి వారి రక్తంలోనే ఉన్నాయని, జీన్స్​లోనే ఉన్నాయని పొగుడుతుంటారు. విచిత్రమేమిటంటే, తెలంగాణపై ద్వేషం కూడా అధినేతతో సహా తెలుగుదేశం పార్టీ భక్తుల రక్తంలోనే ఉంది. చంద్రబాబు పార్టీ డిఎన్ఏలోనే ఉంది. అవకాశం లేకపోయినా, అవసరం రాకపోయినా, తెలంగాణపై విషం కక్కడానికి ఎప్పుడూ వెనుకాడరు.

తెలంగాణ ఏర్పడి 13ఏళ్లయినా ఏడుపు తగ్గకపోవడానికి కారణం, అప్పనంగా దొబ్బేయడానికి అందుబాటులో లేకపోవడమే. నిజంగానే… తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, భక్తులు, సేవకులు, అభిమానులు అందరిలో (కొందరు తెలంగాణలో కూడా ఉన్నారు..) ఇదే కలుషిత రక్తం ప్రవహిస్తుంటుంది. కడుపు నిండా తెలంగాణ ద్వేషమే నిండిఉంటుంది. బహుశా ఈ శ్రీకృష్ణదేవరాయలి ‘లావు’కు కూడా అదే కారణమైఉండొచ్చు. కళ్లు కూడా బాగా ‘పచ్చ’బడ్డాయి. కామెర్లు కూడా వచ్చినట్లున్నాయి. కానీ, పాపం..వయసు చిన్నది. ఇప్పుడే ఇంత ఊబకాయమైతే ముందుముందు ఇంకా కష్టం మరి.!

సరే.. చంద్రబాబంటే వయసుతో బాటు, మెదడు కూడా బాగా పెరిగి.. ఇప్పుడు ఆంధ్రను దాటి, అంతర్జాతీయ స్థాయికి, ఐఎంఎఫ్ స్థాయికి వెళ్లాడు కాబట్టి, అమెరికా జీడీపీ కూడా పెంచగలిగాడు. ప్రస్తుతం ఆయనా, కేఏ పాల్ కలిసి ఇరాన్ యుద్ధాన్ని ఆపడానికి ఇటు ట్రంప్​తో​​, అటు చిన్న ఖమేనీతో ఎడతెరిపిలేని చర్చలు జరుపుతున్నారు. చంద్రబాబు వల్లే ఇంకా మన దేశంలో బండి నూనె, వంటగ్యాస్ ఆరిపోలేదు. హర్ముజ్ జలసంధి నుండి నేరుగా మచిలీపట్నానికి పైపులేసాడు కదా. అటువంటప్పుడు మరి వాళ్ల ఎంపీలింకా స్థానిక స్థాయిలోనే ఉంటే ఎట్లా.? ఎదగాలి కదా.. చూసి నేర్చుకోవాలి కదా.. తండ్రిని చూసి చినబాబు కూడా అంతోఇంతో నేర్చుకుని, కర్ణాటక స్థాయికి ఎదిగాడు.

“దేశభాషలందు తెలుగు లెస్స” అన్న శ్రీకృష్ణదేవరాయలి పేరు పెట్టుకుని ఆ తెలుగుకే పుట్టినిళ్లయిన తెలంగాణను అవమానించడం ఈ మూర్ఖుడి అజ్ఞానానికి పరాకాష్ట. అంతెందుకు? ఈ విషయం తెలియక చంద్రబాబు పార్టీ పేరుని ఇంకా తెలుగుదేశం అని కొనసాగిస్తున్నాడు. లేకపోతే ఎప్పుడో ఆంధ్రదేశం అని పెట్టేవాడు.

ఇలా పక్కోడి మీదపడి ఏడవడం కంటే, మోదీ మీద పడి ఏడిస్తే ఏమైనా రాలతాయి. అప్పుడు ఎన్ని సినిమాలైనా చూపించొచ్చు. బాబు బాహుబలి చూపిద్దామనుకుంటే, ఆంధ్రా అంతా “మాయాబజార్” చూస్తున్నారు. 4 లేన్ల రోడ్లు కాస్తా 12 లేన్ల గ్రీన్​ఫీల్డ్ ఎక్స్​ప్రెస్ హైటెక్ హైవేలయ్యాయి. ఆ రోడ్లెక్కితే చాలు.. మనం ఏం నడపక్కర్లేదు. నిమిషాల్లో ఢిల్లీలో ఉంటాం, లేకపోతే బెంగళూరు, ముంబైలో ఉంటాం. కొంచెం ఓపిక పట్టండి.. త్వరలో అమరావతి నుండి ఆమ్​స్టర్​డ్యామ్​కు అరవై లేన్ల ఏఐ ఎనేబుల్డ్ ఎలివేటెడ్ కారిడార్ రాబోతోంది. వైజాగ్​కు గూగుల్ వచ్చింది కాబట్టి, తిరుపతికి స్పేస్ఎక్స్, అనంతపురానికి ఆంథ్రోపిక్, బందరుకు టైటానిక్ వస్తాయి. ఈలోపు 2029 వస్తుంది. అప్పుడు.. ఆంధ్రాలో తెల్లారుతుంది. ప్రజలు నిద్రలేస్తారు. చంద్రబాబు మాయాబజార్​ నుండి బయటకొస్తారు. చూస్తే..? అంతా అస్సాం..

తర్వాత చదవండి'Election Commission of India' నేమ్‌ప్లేట్ ఉన్న పగిలిన టేబుల్, వెనక మూడు ఖాళీ కుర్చీలు, ఫైళ్లు, బ్యాలెట్ బాక్స్ (ప్రతీకాత్మక చిత్రం)అతిథి మాటసీఈసీ రగడ: వ్యవస్థ వైఫల్యమా? రాజకీయ రణరంగమా?

ఈ కథనంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం. ఏదైనా తప్పు కనిపిస్తే contact@maromaata.comకు రాయండి — సరిచేస్తాను. సంపాదకీయ విధానం →

చెర్మాల శ్రీనివాస్

రచయిత

నా గురించి →

మరిన్ని కథనాలు

షేర్