అభిప్రాయాలు… ఆలోచనలు… అక్షరాలు…

కూర్చున్న కొమ్మనే నరకబోతున్న రేవంత్

ఖమ్మం సభలో గురువు చంద్రబాబును తెలంగాణకు ఆహ్వానించిన రేవంత్. కేసీఆర్‌ను బొంద పెట్టడానికి తెలుగుదేశం రావాలా? ఇది ఎవరికి మరణశాసనం — కాంగ్రెస్‌కే అని చెప్పే విశ్లేషణ.

చెర్మాల శ్రీనివాస్19 జనవరి 2026 · సవరణ: 28 సెప్టెంబర్ 2026 · 3 నిమిషాలు
కూర్చున్న కొమ్మనే నరకబోతున్న రేవంత్

ఖమ్మంలో నిన్నటి రేవంత్ ప్రసంగం యావత్తెలంగాణవాసులను నిశ్చేష్టులను చేసింది. ఇప్పటిదాకా కేసీఆర్, ఆయన మంత్రులను విమర్శించే రేవంత్, ఇప్పుడు ఏకంగా గురువు చంద్రబాబును తెలంగాణకు ఆహ్వానించి మరోసారి తెలంగాణను ఆగం చేసే వికృతచర్యకు ఒడిగట్టాడు.

ఇది ఏరకమైన రాజకీయం? రాష్ట్రాన్ని సాధించి, కోట్లమంది ప్రజల ఆశలను సాకారం చేసిన కేసీఆర్​ను, ఆయన పార్టీని బొంద పెట్టడానికి రెండుకళ్ల చంద్రబాబు రావాలా? తన అనితరసాధ్య గురుభక్తిని చాటుకోవడానికి రేవంత్​కు ఇంకే మార్గం దొరకలేదా? గురుదేవుడి ఆదేశాల మేరకు బ్రోకర్ పనులు చేసే నీచస్థాయికి దిగజారిన ఈ మనిషి తెలుగుదేశాన్ని తిరిగి తెలంగాణకు ఆహ్వానించి మరోసారి మరణశాసనం రాయాలనుకుంటున్నాడా? నిజానికి ఇది ఎవరికి మరణశాసనం? ఎవరిని బొందపెట్టడానికి? అర్థం అవుతోంది కదా.. కాంగ్రెస్​నే.

తెలుగుదేశం పార్టీ అధికార కోవర్టుగా కాంగ్రెస్​లో చేరిన రేవంత్​ను అక్కునచేర్చుకున్న రాహుల్​గాంధీ అందరూ అంటున్నట్లు నిజంగా “మేధావే”. లేకపోతే, ఒక వీధి వాచాలుడిని రాష్ట్ర నాయకుడిగా చేయడమేంటి? ఇప్పుడు నిజమైన రేవంత్ నగ్నంగా నడిఖమ్మంలో నిలబడ్డాడు. ఇప్పుడు తేల్చుకోవాల్సింది నిజమైన కాంగ్రెస్ నాయకులే.

నాడు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు అడ్డం, నిలువుగా అడ్డం పడ్డ చంద్రబాబు, ప్రజల తీవ్ర ఆవేశానికి, కేసీఆర్ నేతృత్వంలోని ఉద్యమ జ్వాలలకు భయపడి రెండు కళ్ల సిద్ధాంతం ఎత్తుకున్నాడు. ఎప్పటికీ చంద్రబాబు తెలంగాణకు ఆగర్భశత్రువే. ప్రతీ చిన్న చర్యా తెలంగాణకు వ్యతిరేకమే. రేవంత్, చంద్రబాబుల ఉద్దేశ్యం.. దేశాల మధ్య నడిచే గూఢచార వ్యవస్థల పనితీరును ప్రతిబింబిస్తోంది. ఒక దేశం తన గూఢచారిని వేరే దేశపు అత్యున్నత పదవిలో ఉండేలా ఆదేశిస్తుంది. దాన్ని తూచా తప్పకుండా ఆ గూఢచారి పాటిస్తాడు. దానికి కొన్నేళ్లు పట్టొచ్చు. లేదా కొన్ని దశాబ్దాలు కూడా. ఆ ప్రక్రియకు సంబంధించిన నిధుల ఏర్పాటు కూడా స్వదేశమే చేస్తుంది. వాళ్లను ప్లాంటర్స్ అంటారు. ఇప్పుడు అచ్చం అలాగే జరుగుతోంది. రేవంత్​రెడ్డి అలాంటి చంద్రబాబు ప్లాంటరే. ఈ ఇద్దరికీ ఇప్పుడు అసలు శుక్రాచార్యుడు రాధాకృష్ణ.

దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా రేవంత్ నోట రామాయణ ప్రస్తావన వింటే, చాలా అసహ్యంగా ఉంది. ఎవరో చెబితే అరువు తెచ్చుకున్న పేర్లను పదేపదే వల్లిస్తే వాల్మీకి అయిపోడు. ఖమ్మంలో, హైదరాబాద్లో తెలుగుదేశం బలంగా ఉందని నమ్మితే ఎన్టీఆర్ అయిపోడు. హైదరాబాద్లో అన్ని సీట్లూ బీఆర్ఎస్​వే అన్న విషయం మర్చిపోతే ఎలా.? ఖమ్మంలో కూడా ఆంధ్రాకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఇంకా కొన్ని కమ్మని కొమ్మలు ఉన్నయనేది వాస్తవమే కావచ్చు. కానీ అవేవీ వేర్లు కాదు, తిరిగి మొలవడానికి. తెలంగాణ ప్రజలు అవివేకులేమీ కారు. మరోసారి చంద్రబాబు తెలంగాణలో అడుగుపెడితే అప్పుడు ప్రతీ తెలంగాణ పౌరుడూ ఓ ఫణికర మల్లయ్య అవుతాడు.

తన కేబినెట్ మంత్రులపైనే విషం కక్కుతున్న ఈ కర్కోటకుడు, రేపు తన సొంత పార్టీని కూడా కాటేసే ప్రమాదం పొంచిఉంది. ఇప్పుడేదో ధనప్రవాహం పొంగిపొర్లుతోందని ఉపేక్షిస్తే, రేపు తన హాలహలజ్వాలలకు మాడిమసైపోయేది కాంగ్రెసే. ఈ విషయం అసలు కాంగ్రెస్ నేతలు హైకమాండ్​కు చేరవేయకపోతే అసలే అంతంతమాత్రంగా ఉన్న ఉనికి ఏమాత్రం లేకుండా పోతుంది.

నిజానికి రేవంత్ మతిభ్రమణలో ఉన్నాడు. తెలంగాణలో పాత టీడీపీని పున:ప్రతిష్టిస్తే, అప్పటి తెలుగుదేశం ఉత్పత్తులన్నీ తన చుట్టూ చేరతాయనే చిత్త భ్రమలో బతుకుతున్నాడు. ఇవేవీ ప్రాక్టికల్​గా సాధ్యమయ్యేవి కావు. అంత వెర్రివాళ్లెవరూ లేరు కూడా.

బిఆర్ఎస్ అంటే ఎందుకింత భయం? కేసీఆర్ ఒక్క ప్రెస్​మీట్​కే ఇంతగా వణికిపోతే, రేపు ప్రజాక్షేత్రంలో కనిపిస్తే పరిస్థితి ఏంటి? తాను రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతగా చేయలేనిది చంద్రబాబు చేస్తాడని నమ్మకమా? అంటే, తాను చేతగానివాడినని ఒప్పుకున్నట్లేగా..! బిఆర్ఎస్​ను కదిలించే శక్తి తనకు లేదని తెలిసినట్లే కదా.! రేవంత్ పిచ్చి కాకపోతే, ఆ శక్తి చంద్రబాబుకు కూడా లేదు. ఈ విషయం ఆ రెండు కళ్ల బాబుకు బాగా తెలుసు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయముంది. అందుకని ఇప్పటినుండే ప్రజల మనసులోంచి కేసీఆర్​ను తుడిచేయాలనే పిచ్చి వ్యూహాన్ని అమలు చేస్తున్నాడు. రెండేళ్లు కాదు కదా, వందేళ్లైనా కేసీఆర్ రూపాన్ని ప్రజల మదిలోంచి చెరిపేయడానికి అది మరక కాదు. మెరుపు. నివురుగప్పిన నిప్పు.

ఇటువంటి సలహాలివ్వడానికి అప్పట్లో చంద్రబాబుకు రామోజీ ఉన్నట్లు, ఇప్పుడు రేవంత్​కు రాధాకృష్ణ. ఈయనేదో పత్తిత్తయినట్లు, మిగతావాళ్లంతా రెడ్​లైట్ ఏరియావాసులైనట్లు ప్రొజెక్ట్ చేస్తుంటాడు. కనీస వృత్తిధర్మం ఏనాడు పాటించని రాధాకృష్ణ నేటి తన చెత్తపలుకులో వేదాలు వల్లించడం నవ్వు తెప్పిస్తోంది.

ఈ మారీచ, సుబాహు, రావణుల(అన్నట్లు.. నేను రామాయణాన్ని అనేకసార్లు చదివాను) రెండు లక్ష్యాలు, కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయడం, చంద్రబాబును తెలంగాణకు తెచ్చుకోవడం ఆ ముగ్గురి వచ్చే జన్మల్లో కూడా నెరవేరేవి కావు. ఎందుకంటే, తెలంగాణ ప్రజలకు.. ఎవరు కావాలో, ఎవరు పోవాలో బాగా తెలుసు.

తర్వాత చదవండి'Election Commission of India' నేమ్‌ప్లేట్ ఉన్న పగిలిన టేబుల్, వెనక మూడు ఖాళీ కుర్చీలు, ఫైళ్లు, బ్యాలెట్ బాక్స్ (ప్రతీకాత్మక చిత్రం)అతిథి మాటసీఈసీ రగడ: వ్యవస్థ వైఫల్యమా? రాజకీయ రణరంగమా?

ఈ కథనంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం. ఏదైనా తప్పు కనిపిస్తే contact@maromaata.comకు రాయండి — సరిచేస్తాను. సంపాదకీయ విధానం →

చెర్మాల శ్రీనివాస్

రచయిత

నా గురించి →

మరిన్ని కథనాలు

షేర్