అభిప్రాయాలు… ఆలోచనలు… అక్షరాలు…

స్పీకర్‌ను ‘చిన్న’బుచ్చింది ఎవరు?

తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సామాజిక నేపథ్యాన్ని గౌరవించడం వేరు; ఆయన అనుభవాన్నీ, పదవినీ ఆ ఒక్క గుర్తింపుకే పరిమితం చేయడం వేరు. మాటిమాటికీ ‘దళిత స్పీకర్’ అని అధికారపక్షమే ఎందుకు సంబోధిస్తోంది? అసలు ప్రశ్న ఇక్కడే.

చెర్మాల శ్రీనివాస్10 సెప్టెంబర్ 2026 · సవరణ: 28 సెప్టెంబర్ 2026 · 3 నిమిషాలు
జాతీయ పతాకం పక్కన కూర్చున్న వ్యక్తి చిత్రం; ‘ఎవరు అవమానించింది?’ అనే తెలుగు ప్రశ్నతో వ్యాసానికి ప్రధాన చిత్రం.

సామాజిక నేపథ్యాన్ని గౌరవించడం వేరు. ఒక నాయకుడి అనుభవాన్నీ, వ్యక్తిత్వాన్నీ, పదవినీ ఆ ఒక్క గుర్తింపుకే పరిమితం చేయడం వేరు.

గడ్డం ప్రసాద్‌కుమార్‌… వికారాబాద్‌ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు. ఎమ్మెల్యేగా ప్రజల ఆదరణ పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తన నియోజకవర్గంలో వివిధ వర్గాల ప్రజలతో మమేకమైన నాయకుడిగా గుర్తింపు పొందారు.

ఆయన తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ పదవిలో ఆయన మొత్తం సభకు ప్రతినిధి.

మరి ఆయనను మాటిమాటికీ ‘దళిత స్పీకర్‌’ అని అధికారపక్షమే ప్రత్యేకంగా సంబోధించాల్సిన అవసరం ఏమిటి? ఆయన రాజకీయ అనుభవం, నాయకత్వం, సభ విశ్వాసం కంటే ఆయన కుల గుర్తింపే ఎందుకు ముందుకు వస్తోంది?

ఇక్కడే అసలు ప్రశ్న.

సామాజికంగా అణచివేతకు గురైన వర్గం నుంచి ఒక వ్యక్తి ఉన్నత స్థానానికి ఎదగడం గర్వించాల్సిన విషయం. ఆ ప్రస్థానాన్ని గుర్తించడం తప్పు కాదు. అది సామాజిక ప్రాతినిధ్యానికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది. కులవివక్ష కారణంగా ఆయనకు అవమానం జరిగితే, ఆ వివక్షను స్పష్టంగా గుర్తించి ఖండించాల్సిందే.

కానీ ప్రతి సందర్భంలోనూ ఆయన పేరు ముందు ‘దళిత’ అనే విశేషణాన్ని ఉంచి, ఆయన పదవినీ వ్యక్తిత్వాన్నీ ఆ ఒక్క గుర్తింపులోనే బంధించడం ఎందుకు?

స్పీకర్‌కు అవమానం జరిగితే అది ఒక వ్యక్తికి జరిగిన అవమానం మాత్రమే కాదు. శాసనసభాపతి అనే రాజ్యాంగ పదవి గౌరవానికి సంబంధించిన విషయం. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా సభ మొత్తం స్పందించాలి. సభ్యులందరూ ఆ పదవి గౌరవాన్ని కాపాడాలి. అందులో కులవివక్ష ఉంటే, దానినీ అంతే స్పష్టంగా ప్రశ్నించాలి.

ఈ ఘటనలో అవమానకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్న ప్రతిపక్ష సభ్యుడు విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు ఎవరికైనా ఆపాదించబడి, వారు బాధపడి ఉంటే వాటిని ఉపసంహరించుకుంటున్నానని తెలిపారు. ఆ వివరణ సరిపోతుందా, లేదా అన్నది సభ పరిశీలించాల్సిన అంశం.

అయితే అధికారపక్షం స్పందించిన తీరు కూడా చర్చకు రావాలి.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, మంత్రి సీతక్కతోపాటు పలువురు అధికారపక్ష సభ్యులు స్పీకర్‌ సామాజిక నేపథ్యాన్ని పదేపదే ప్రస్తావించారు. ఆయనకు జరిగిన అవమానాన్ని ఖండించే క్రమంలో, ఆయన పదవి గౌరవం కంటే కుల గుర్తింపే చర్చలో ప్రధానంగా మారింది.

స్పీకర్‌గా ఆయనకు లభించాల్సిన గౌరవాన్ని సమర్థిస్తున్నామా? లేక ఆయన సామాజిక నేపథ్యాన్ని ముందుకు తెచ్చి, ఆయన సాధించిన స్థాయిని వెనక్కి నెడుతున్నామా?

స్పీకర్‌ పదవి ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల దక్కినదన్న భావనకు తావివ్వకూడదు. ఆయన సభ విశ్వాసంతో ఎన్నికైన సభాపతి. ఆయన గౌరవాన్ని కాపాడటం సభ్యుల బాధ్యత.

మంత్రి సీతక్క తన సామాజిక నేపథ్యాన్నీ, స్పీకర్‌ నేపథ్యాన్నీ ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఆవేదన వ్యక్తం చేయడం సహజమే. అవమానాన్ని తీవ్రంగా ఖండించడమూ అవసరమే. అయితే ఆ ఆవేదనను వ్యక్తం చేసే భాష కూడా ఆత్మగౌరవాన్ని నిలబెట్టేదిగా ఉండాలి. వివక్షను ప్రశ్నించే క్రమంలో, వివక్ష మోపిన తక్కువతనపు భావననే తిరిగి పలికించకూడదు.

ఆ చర్చలో చివరికి ప్రసాద్‌కుమార్‌ కూడా కన్నీళ్లు తుడుచుకోవాల్సి రావడం బాధాకరం. ఆయనకు అండగా నిలిచే ప్రయత్నం, ఆయనను మరింత వేదనకు గురిచేసిందా అన్న ప్రశ్ననూ విస్మరించలేం.

ఇక ఈ ఘటనపై 2026 సెప్టెంబర్‌ 8 నాటి ‘వెలుగు’ దినపత్రికలో ఇచ్చిన “దళిత స్పీకర్‌కు అవమానం” అనే బ్యానర్‌ శీర్షిక కూడా అదే ప్రశ్నను ముందుకు తెస్తోంది.

ఒక ఘటనలో కులవివక్ష ఉంటే దానిని పత్రికలు తప్పకుండా వెలుగులోకి తేవాలి. అయితే ఆ వివక్ష ఏ మాటలో, ఏ చర్యలో వ్యక్తమైందో పాఠకులకు స్పష్టంగా వివరించాలి. కేవలం బాధితుడి కుల గుర్తింపునే శీర్షికలో ముందుకు తేవడం సరిపోదు. అది వివక్షను బయటపెడుతోందా, లేక వ్యక్తిని మరోసారి కుల గుర్తింపుకే పరిమితం చేస్తోందా అన్న సంపాదకీయ విచక్షణ అవసరం.

ప్రజాప్రతినిధుల సామాజిక నేపథ్యం అప్రధానమని కాదు. ప్రాతినిధ్యం, అవకాశాలు, వివక్ష గురించి చర్చించేటప్పుడు దానికి ప్రాధాన్యం ఉంటుంది. కానీ ప్రతి సందర్భంలోనూ బీసీ మంత్రి, రెడ్డి మంత్రి, బ్రాహ్మణ ఎమ్మెల్యే, దళిత స్పీకర్‌ అంటూ పదవులకు కుల విశేషణాలు జోడించాల్సిన అవసరం ఏమిటి?

వాళ్లందరూ ప్రజాప్రతినిధులు. స్పీకర్‌ అయితే మొత్తం సభకు అధ్యక్షుడు. ఆయన నిర్వహించే పదవికి దక్కాల్సిన గౌరవం, ఆయన ఏ కులంలో జన్మించారన్న దానిపై ఆధారపడకూడదు.

సామాజికంగా వెనుకబడిన వర్గాల నుంచి ఉన్నత స్థానాలకు ఎదిగినవారిని చూసి సమాజం గర్వించాలి. సమాన అవకాశాలు కల్పించడం సామాజిక న్యాయానికి, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన బాధ్యత. వారి ప్రస్థానాన్ని గౌరవించాలి. వారి అనుభవాన్నీ, నాయకత్వాన్నీ, సామర్థ్యాన్నీ గుర్తించాలి.

కానీ వారు ఆ స్థాయికి చేరిన తర్వాత కూడా, సందర్భంతో సంబంధం లేకుండా వారి కులాన్నే ముందుకు తెస్తూ ఉండటం—

గౌరవించడమా? లేక చిన్నబుచ్చడమా?

గడ్డం ప్రసాద్‌కుమార్‌ గారి సామాజిక నేపథ్యాన్ని గుర్తించవచ్చు. ఆయనపై కులవివక్ష జరిగితే నిస్సందేహంగా ఖండించాలి. అదే సమయంలో, ఆయనను ‘దళిత స్పీకర్‌’ అనే ఒక్క గుర్తింపుకే పరిమితం చేయకుండా తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా గౌరవిద్దాం.

అదే ఆయన వ్యక్తిత్వానికీ, పదవికీ ఇచ్చే నిజమైన గౌరవం.

తొలి ప్రచురణ: 8 సెప్టెంబర్‌ 2026, Facebook.

తర్వాత చదవండి'Election Commission of India' నేమ్‌ప్లేట్ ఉన్న పగిలిన టేబుల్, వెనక మూడు ఖాళీ కుర్చీలు, ఫైళ్లు, బ్యాలెట్ బాక్స్ (ప్రతీకాత్మక చిత్రం)అతిథి మాటసీఈసీ రగడ: వ్యవస్థ వైఫల్యమా? రాజకీయ రణరంగమా?

ఈ కథనంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం. ఏదైనా తప్పు కనిపిస్తే contact@maromaata.comకు రాయండి — సరిచేస్తాను. సంపాదకీయ విధానం →

చెర్మాల శ్రీనివాస్

రచయిత

నా గురించి →

మరిన్ని కథనాలు

షేర్